Boat Accident: అసోం దు:ఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
Sakshi Education
బ్రహ్మపుత్ర నదిలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 8న ఎదురెదురుగా వస్తున్న రెండు బోట్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఒకరు మరణించగా 33 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అస్సాంలోని జొరాత్ జిల్లాలోని నిమాటి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొని 40 మంది ప్రయాణికులను రక్షించింది.
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
- టిబెట్‌లోని మానస సరోవరం వద్ద గల ‘షమ్‌యంగ్ డమ్’ అనే హిమానీ నదం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మించింది.
- చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్‌లో ఈ నది ప్రయాణిస్తుంది.
- బంగ్లాదేశ్‌లో గంగానదితో కలిసి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
- భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.
- ప్రపంచంలోని అతి పెద్ద సుందర్‌బన్స్ డెల్టా... బ్రహ్మపుత్ర, గంగా నదుల కలయిక వల్ల ఏర్పడింది.
- భారతదేశంలో గల ఏకైక నదీ ఆధారిత దీవి మాజులీ (అసోం) ఈ నది వల్లే ఏర్పడింది.
- బహ్మప్రుత్ర నదిని అసోం దు:ఖదాయని అని పిలుస్తారు.
- బ్రహ్మపుత్ర నదికి వచ్చే వరదలతో అధికంగా నష్టపోతున్న రాష్ట్రం అసోం.
- ఈ నది ప్రయాణించే మార్గంలో దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. టిబెట్‌లో త్సాంగ్ పో అని, అరుణాచల్‌ప్రదేశ్‌లో దిహాంగ్, సియాంగ్ అని, అసోంలో సైడాంగ్, ఉత్తర బంగ్లాదేశ్‌లో పద్మా నది (గంగానది)ని కలవక ముందు జమున అని, దక్షిణ బంగ్లాదేశ్‌లో (పద్మా నదిని కలిసిన తర్వాత) మేఘన అనే పేర్లతో పిలుస్తారు.
- అసోంలోని ఎర్ర నేలల మీదుగా ప్రవహించడం వల్ల దీన్ని ఎర్ర నది అని కూడా పిలుస్తారు.
బ్రహ్మపుత్ర ఉప నదులు:
- దన్‌సిరి, సబన్‌సిరి, సంకోష్, రైడాక్, అమొచు, మనస్, భరేలి, లోహిత్, సుర్మ, తీస్తా, గంగాధర్, బేల్‌సిరి, దిబ్రు, డిక్కు, దిబాంగ్, లోహిత్ మొదలైనవి.
- తీస్తా నది టిబెట్‌లోని చితము సరస్సు వద్ద జన్మిస్తుంది. తీస్తా 1887 వరకు గంగా నది ఉపనదిగా ఉండేది. కానీ 1887లో వచ్చిన భూకంపం వల్ల దీని ప్రవాహ దిశ మారి బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారింది.
Published date : 09 Sep 2021 06:43PM