ఆగస్టు 2017 జాతీయం
Sakshi Education
ప్రధానికి సలహాలు ఇవ్వనున్న సీఈవో గ్రూప్‌లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నీతి ఆయోగ్ సీఈవో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరు బృందాలుగా ఏర్పడిన 200 మంది సీఈవోలు.. ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సరళ వ్యాపారం, పరిపాలన తదితర అంశాల్లో ప్రధాని, కేంద్ర మంత్రివర్గానికి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 2022 నాటికి సరికొత్త భారత్, మేక్ ఇన్ ఇండియా, రేపటి నగరాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంశాలపై ఈ ఆరు బృందాలు పనిచేస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరు సీఈవో బృందాల ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : నీతిఆయోగ్
ఎందుకు : అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు
మెంటార్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభం
దేశవ్యాప్తంగా 900కుపైగా ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లోని విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన మెంటార్ ఇండియా క్యాంపెయిన్‌ను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆగస్టు 23న ప్రారంభించారు. ఇందులో భాగంగా నీతిఆయోగ్ ఎంపిక చేసిన వివిధ రంగాల్లోని నాయకులు(లీడర్స్) వారంలో రెండు గంటల పాటు విద్యార్థులతో సమావేశమవుతారు. తద్వారా విద్యార్థుల్లో డిజైన్, కంప్యూటేషనల్ నైపుణ్యాలు పెంపొందిస్తారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఇన్నోవేషన్ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే ఆలోచనలకు రూపు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెంటార్ ఇండియా కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సివిల్స్ అధికారుల కేటాయింపునకు జోనల్ విధానం
సివిల్ సర్వీసెస్ అధికారులకు కేడర్ల కేటాయింపులో నూతన విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఓఎస్) అధికారులు ఇకపై రాష్ట్రాలకు బదులుగా జోన్ల కేడర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో జాతీయ సమగ్రత భావనను పెంపొందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
నూతన విధానం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 26 కేడర్లను 5 జోన్లుగా విభజించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం ప్రకారం అభ్యర్థి ప్రతి జోన్‌లోనూ ఒక రాష్ట్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఇకపై ఒకే జోన్‌లో రెండు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇవ్వడం కుదరదు.
ఏ జోన్లో ఏ రాష్ట్రాలు...
జోన్-1: అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్తాన్, హరియాణా, కేంద్రపాలిత ప్రాంతాలు
జోన్-2: ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా
జోన్-3: గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
జోన్-4: పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్
జోన్-5: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ
ఓబీసీ వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్
రిజర్వేషన్ ఫలాలను ఓబీసీలకు మరింత సమర్థవంతంగా అందేలా ఓబీసీ వర్గీకరణ చేపట్టేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిషన్ ఓబీసీ కేటగిరీల్లో (కేంద్ర జాబితాలోని)ని కులాలు, వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లను పరిశీలించి 12 వారాల్లో వర్గీకరణకు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలను ఖరారు చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఓబీసీల వర్గీకరణ జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓబీసీ వర్గీకరణకు ప్రత్యేక కమిషన్
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఓబీసీలకు మరింత సమర్థవంతంగా రిజర్వేషన్లను అందించేందుకు
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే
వ్యక్తిగత గోప్యతపై దేశ అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం ‘రైట్ టు ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విసృ్తత ధర్మాసనం ఆగస్టు 24న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే.. ఆధార్‌పై ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది.
ఉల్లంఘనే అంటూ పిటిషన్లు..
కేంద్ర ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్ అనుసంధానించడం వ్యక్తిగత హక్కును ఉల్లంఘించడమేనని ఆందోళన వ్యక్తంచేస్తూ 2015లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్‌పై విచారించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది. ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు జులై 18న సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు ఉందా, లేదా అనే దానిపై చర్చించాలని, వీటిపై స్పష్టత వచ్చాకే ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణను చేపడుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇప్పుడే తొలిసారి కాదు..
వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టులో చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. 1954లో ఎంపీ శర్మ కేసులో భాగంగా వ్యక్తిగత గోప్యతపై చర్చ జరిగింది. ఆ తర్వాత 1963లో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ రెండు కేసుల్లో కూడా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని ధర్మాసనం తేల్చింది. ఆ తర్వాత 1970, 80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చినా.. సంఖ్యాపరంగా అవి చిన్న ధర్మాసనాలు కావడంతో.. 1954, 63లో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆధార్ అనుసంధానం చేయడంతో మరోసారి ఈ ప్రశ్న తలెత్తింది. అయితే గతంలో పరస్పర విరుద్ధ తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విసృ్తతమైన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. దీంతో తొమ్మిది మంది న్యాయమూర్తులతో విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. గతంలో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఏకగ్రీవంగా తేల్చింది.
తదుపరి తీర్పే కీలకం..
ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులకు, మొబైల్ కంపెనీ సిమ్‌లకు ఆధార్ కార్డును అనుసంధానించడంపై సందిగ్ధత ఏర్పడింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, ఆధార్‌పై అభ్యంతరాలను ప్రస్తావించలేదు. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికి తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు, వ్యక్తిగత గోప్యత కిందకే వస్తాయని పలువురు న్యాయవాదులంటున్నారు. అయితే ఇప్పటికే ఆధార్ అనుసంధానం ప్రక్రియ 80 శాతం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడేం చేస్తారనే విషయమై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ అనుసంధాన ప్రక్రియ వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుందా? వస్తే ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ పీటముడిపై ఏర్పడిన సందిగ్థతను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ‘గోప్యత’ అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? లేదా అనే దానిపై తీర్పు చెప్పనుంది.
గోప్యత అంటే!
వ్యక్తిగత అన్యోన్యత, కుటుంబ జీవితం, వివాహం, సంతానం, ఇల్లు, లింగ నేపథ్యం వంటి అంశాలన్నీ గోప్యత కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ‘తన జీవితం ఎలా ఉండాలో కోరుకోవటం గోప్యత అవుతుంది. భిన్నత్వాన్ని కాపాడుతూ.. మన సంస్కృతిలోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గోప్యత సూచిస్తుంది. గోప్యతపై న్యాయపరమైన అంచనాలు సన్నిహితం నుంచి వ్యక్తిగతంలో, వ్యక్తిగతం నుంచి బహిరంగ అంశాల్లో వేర్వేరుగా ఉంటాయి. అయితే బహిరంగ వేదికపై వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకుండా చేయటం చాలా ముఖ్యం’ అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.
సముద్ర గర్భ మిషన్‌ను ప్రారంభించనున్న భారత్
సముద్రం అడుగన ఉన్న సహజ వనరులను సరైన రీతిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సముద్ర గర్భ మిషన్ (డీప్ ఓషన్ మిషన్)ను చేపట్టనుంది. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వశాఖ (Ministry of Earth Sciences) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2018 జనవరిలో ప్రారంభించనున్నారు.
భారత్‌కు 7,500 కి.మీ. తీర ప్రాంతం.. 2.4 మిలియన్ చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) ఉంది. భారత్‌కు చెందిన సముద్ర జలాల్లో అపారమైన శక్తి, ఆహారం, ఔషధ వనరులు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీప్ ఓషన్ మిషన్
ఎప్పుడు : 2018 జనవరి
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : భారత సముద్ర జలాల్లో
ఎందుకు : సహజ వనరులను వెలికితీసేందుకు
కేసుల సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ: నీతిఆయోగ్
న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించవచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. దీంతో పాటు ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారానే న్యాయవ్యవస్థలో నియామకాలను చేయాలని ప్రతిపాదించింది. కోర్టు పనితీరులో ప్రపంచశ్రేణి ప్రమాణాలను పాటించేందుకు ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్, ది ఫెడరల్ జ్యుడీషియల్ సెంటర్ (యూఎస్), ది నేషనల్ ఆఫ్ కోర్ట్్స (యూఎస్), సింగపూర్‌లోని సబా ర్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలని సూచించింది.
ఒకేసారి ఎన్నికలకు నీతి ఆయోగ్ సిఫార్సు
దేశంలో 2024 నాటికల్లా లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో, తగ్గించడమో చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. 2017-18 నుంచి 2019-20 కోసం రూపొందించిన త్రైవార్షిక ప్రణాళికలో ఈ విషయాలను ప్రస్తావించింది. అలాగే దేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్య కాదని, అర్హతలు, నైపుణ్యాలు ఉన్న వారికి ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు, వేతనాలు లభించకపోవడమే తీవ్ర సమస్యని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తీరప్రాంత ఉపాధి మండళ్ల (సీఈజడ్)ను ఏర్పాటు చేస్తే కొన్ని బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తరలి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిఫార్సు
ఎప్పుడు : 2024 నాటికి
ఎవరు : నీతి ఆయోగ్
ఎందుకు : ఎన్నికల వ్యయాన్ని తగ్గించేందుకు
వైవాహిక అత్యాచారం నేరం కాదు : కేంద్రం
భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని, అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. భర్తలను వేధింపులకు గురిచేయడానికి భార్యలకు అది ఒక సులభమైన ఆయుధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని (మారిటల్ రేప్)ను నేరంగా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్రం ఆగస్టు 29న అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 498 ఏ (గృహ హింస వ్యతిరేక చట్టం) దుర్వినియోగమవుతున్న సంగతి సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైవాహిక అత్యాచారం నేరం కాదు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్
దక్షిణాది రాష్ట్రాల మధ్య ‘విద్యుత్’ సహకారం
దక్షిణాది రాష్ట్రాలు విద్యుత్‌ను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆగస్టు 22న ముగిసిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది.
ఛత్తీస్‌గఢ్‌లో ఉచితంగా స్మార్ట్ ఫోన్లు
ఛత్తీస్‌గఢ్‌లో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. ఈ పథకానికి సంచార్ క్రాంతి యోజన అని పేరు పెట్టారు.
దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభం
ముంబైలో ఏర్పాటుచేసిన విదేశ్ భవన్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 27న ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కార్యాలయం ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి మహారాష్ర్టలో ఉన్న అన్ని కీలక కార్యాలయాలు విదేశ్ భవన్‌లో ఉంటాయి.
కృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గింపు
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు వైద్యశాలలు వాస్తవ వెల కన్నా లక్ష రూపాయకుల పైగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి... రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మోకాలి మార్పిడి చికిత్సలు అవసరమైనవారు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, వారిలో ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్ష మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విసృ్తతంగా వాడే కోబాల్ట్-క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ.1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. ఇంతకుముందు దీనికి ఆసుపత్రులు గరిష్టంగా దాదాపు 9 లక్షల వరకు వసూలు చేసేవి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపు
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునేందుకు
యూపీలో ఆన్‌లైన్‌లో మదరసాల నమోదు
ఇస్లాం విద్యా సంస్థలు మదరసాల్లో అక్రమాలు నిరోధించేందుకు, వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. మదరసాల్లో అక్రమాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటి నమోదును ఆన్‌లైన్ చేయడం వల్ల మదరసాల నిర్వహణ, ఉపాధ్యాయులు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని వక్ఫ్ మంత్రి మోహసిన్ రాజా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న డిజిటల్ విధానంలో ఈ చర్య ఓ భాగం.
మధ్యప్రదేశ్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్
మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే.. అటవీ శాఖకు మాత్రం ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. 12వ తరగతిలో 75 శాతం లేదా, సీబీఎస్‌ఈలో 85 శాతం పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య ఖర్చును బీజేపీ భరిస్తుందని చౌహాన్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మధ్యప్రదేశ్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్
ఎందుకు : వివిధ ప్రభుత్వ విభాగాల్లో అమలు
తమిళనాడులో ఒక్కటైన ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు
ఆర్నెల్ల విభేదాల అనంతరం ఏఐఏడీఎంకే లోని పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనమయ్యాయి. అధికార మార్పిడి విషయంలో రెండు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం, ప్రభుత్వ బాధ్యతలు పళని స్వామి నిర్వర్తించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా పన్నీరు సెల్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలతోపాటు మరికొన్ని శాఖలను పన్నీర్ వర్గానికి ఇచ్చేందుకు కూడా సీఎం పళనిస్వామి అంగీకరించారు. ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఏంకే సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
డిప్యూటీగా పన్నీర్ ప్రమాణం
అనంతరం గవర్నర్ విద్యాసాగర్‌రావు పన్నీర్‌సెల్వంతో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ చేయించారు. డిప్యూటీ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం.. ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శాఖలను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విలీనమైన పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఏఐఏడీఎంకే లోని రెండు వర్గాలు
ఎక్కడ : తమిళనాడు
2018 నాటికి ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
2018 మార్చి నాటికి పాస్‌పోర్టుల జారీ కోసం పోలీసులు భౌతికంగా వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్టు(సీసీటీఎన్‌ఎస్)ను విదేశాంగ శాఖ నేతృత్వంలోని పాస్‌పోర్టు సేవలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పోలీసులు భౌతికంగా వెరిఫికేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే వ్యక్తుల వివరాలు (గతంలో నేరచరిత్ర ఏమైనా ఉంటే) తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో భాగంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 21న న్యూఢిల్లీలో డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను ఆవిష్కరించారు.
దేశంలోని మొత్తం 15,398 పోలీస్ స్టేషన్లలో 13,775 స్టేషన్లను సీసీటీఎన్‌ఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
ఎప్పుడు : 2018 నాటికి
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో జాప్యాన్ని నివారించేందుకు
రవాణా సేవలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి
తెలంగాణలో రవాణా శాఖ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 23 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్సుల జారీ, యాజమాన్య హక్కు బదలాయింపు, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ తదితర సేవలకు ఆధార్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.
ట్రిపుల్ తలాక్ చెల్లదు : సుప్రీంకోర్టు
ముస్లింలు అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ చెల్లదనీ, ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు చెప్పింది. పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్ తలాక్ ఖురాన్ సూక్తులకు వ్యతిరేకమనీ, అంగీకారయోగ్యం కాదని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్‌లు ఇచ్చిన మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తేలుస్తూ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్ విడివిడిగా తీర్పులివ్వగా... జస్టిస్ లలిత్ మాత్రం నారిమన్ తీర్పుతో ఏకీభవించారు. అలా వీరిది మెజారిటీ తీర్పు అయి్యంది. కాగా మైనారిటీ తీర్పునిచ్చిన జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం విరుద్ధ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ట్రిపుల్ తలాక్ దీర్ఘకాలంగా వాడుకలో ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని... షరియా చట్టాలు కూడా ఆమోదిస్తున్నందున అది మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్-25 కిందకు వస్తుందన్నారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, ఆలోగా రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి ఈ అంశంలో చట్టం చేయడానికి ఏకతాటిపైకి రావాలని కోరారు.
సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ 16న సుమోటోగా ఓ పిల్‌ను చేపట్టింది. సుప్రీం పిల్‌కు షాయరా భానోతోపాటు మరో నలుగురు బాధిత మహిళల పిటిషన్లూ తోడయ్యాయి. మరో రెండు పిటిషన్లను ఇతర సంస్థలు వేశాయి. మొత్తం ఈ ఏడు పిటిషన్లను సుమోటో పిల్‌తో కలిపి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి ఈ తీర్పునిచ్చింది.
‘ఇన్‌స్టంట్’కే నో
సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది... ఉన్నపళంగా మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం (ఇన్‌స్టంట్) చెల్లదని మాత్రమే. అంతేకాని మొత్తం ట్రిపుల్ తలాక్ విధానాన్ని నిషేధించలేదు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు మూడురకాలు.
తలాక్-ఎ-అహ్‌సాన్: ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవడానికి సరైన మార్గంగా దీన్ని పరిగణిస్తారు. అహ్‌సాన్ అనే పదానికి అర్థం... అత్యుత్తమ లేదా సరైన. దీని ప్రకారం... భార్య రుతుక్రమంలో లేనప్పుడు... భర్త ఏకవాక్యంలో విడాకులు ఇస్తున్నట్లు చెప్పాలి. తర్వాత భార్య నిర్దేశిత కాలంపాటు నిరీక్షించాలి. ఈ కాలాన్ని ఇద్దత్ అంటారు. మూడు నెలసరులు ‘ఇద్దత్’గా ఉంటుంది. ఒకవేళ భార్య గర్భంతో ఉంటే శిశువు జన్మించేదాకా ఇద్దత్ కాలం ఉంటుంది. ఈ సమయంలోపు భర్త మనసు మార్చుకుంటే... తలాక్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఇద్దత్ కాలం ముగిస్తే మాత్రం విడాకులు మంజూరైనట్లే.
తలాక్-ఎ-హసన్: పునరాలోచనకు తగినంత సమయం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంతవరకు మంచి పద్ధతిగానే పరిగణిస్తారు. ఈ విధానంలో మూడునెలల వ్యవధిలో నెలకోమారు చొప్పున భర్త మూడుసార్లు భార్యకు తలాక్ చెబుతాడు. తర్వాత విడాకులు మంజూరవుతాయి. ఒకవేళ ఆలోపు మనసు మార్చుకుంటే... వైవాహిక బంధాన్ని కొనసాగించవచ్చు.
తలాక్-ఎ-బిద్దత్: ‘తలాక్... తలాక్... తలాక్’ అని వరుసగా మూడుసార్లు చెప్పేసి విడాకులు తీసుకోవడమే తలాక్-ఎ-బిద్దత్. షరియా చట్టం ప్రకారం ఇది చెల్లుబాటవుతోంది. ఒమేయద్ రాజులు విడాకులకు సులభమార్గంగా దీన్ని పరిచయం చేశారు. ఒక్కసారిగా మూడు పర్యాయాలు భర్త తలాక్ చెప్పాడంటే ఇక అంతే. విడాకులే. నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
క్షణికావేశంలో, అనాలోచితంగా నిర్ణయం తీసుకుని జీవిత భాగస్వామిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ... క్షణాల్లో విడాకులిచ్చేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తలాక్‌ను 22 ముస్లిం మెజారిటీ దేశాలు నిషేధించడం గమనార్హం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్ చెల్లదు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : సుప్రీంకోర్టు
డిజిటల్ పోలీస్ పోర్టల్సేవలు ప్రారంభం
డిజిటల్ పోలీస్ పోర్టల్(డీపీపీ)ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగస్టు 21న ప్రారంభించారు. నేరాలు, నేరస్థులపై నిఘా నెట్‌వర్క్ వ్యవస్థలు (సీసీటీఎన్‌ఎస్) అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. నేరాలు, నేరస్థుల వివరాలతో జాతీయ సమాచార నిధి ఏర్పాటే సీసీటీఎన్‌ఎస్ లక్ష్యం. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు, వివరాల ధ్రువీకరణ, అభ్యర్థనలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 11 శోధన సదుపాయాలను, 46 నివేదికలను రాష్ట్ర పోలీస్ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, పరిశోధన సంస్థలు పొందొచ్చు. సీసీటీఎన్‌ఎస్ సమాచార నిధిలో ఇప్పటివరకు ఏడు కోట్ల నేరాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు.
ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో22 మంది మృతి
ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖత్‌లి వద్ద ఆగస్టు 19న పట్టాలు తప్పడంతో 22 మంది మరణించారు. 156 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
బిహార్ వరదల్లో 98 మంది మృతి
బిహార్‌లో వరదల వల్ల ఆగస్టు 18 నాటికి 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాలకు చెందిన 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.13 లక్షల మంది 504 సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జాతీయ రహదారులతోపాటు 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. 70 మంది ఆర్మీ సిబ్బంది, 114 ఎన్‌డీఆర్‌ఎఫ్, 92 ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
బెంగళూరులో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2017
భారత్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆగస్టు 9, 10 తేదీల్లో బెంగళూరులో భారత సాంకేతిక సదస్సు జరిగింది. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది ‘పారిశ్రామిక విప్లవం 4.0’ పేరుతో సదస్సు నిర్వహించారు.భారత్ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు 10 అంశాలు కీలకమని భావించిన నిర్వాహకులు కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై చర్చలు జరిపారు.
సదస్సులో భాగంగా వ్యవసాయంపై 200 మందితో వర్క్‌షాపు నిర్వహించారు. ఇక్రిశాట్, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్న ఈ వర్క్‌షాపులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, కూలీలు, సాగులో జాగ్రత్తలపై చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9, 10
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : సాంకేతికతతో పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతిపై చర్చించేందుకు
రిజర్వేషన్ల కోసం మరాఠాల భారీ ర్యాలీ
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సహా పలు డిమాండ్లతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠాలు ఆగస్టు 9న భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది మరాఠా ప్రజలు కాషాయ టోపీలు, జెండాలతో ముంబైలో ‘మరాఠా క్రాంతి మోర్చా’ పేరుతో మౌన ప్రదర్శన నిర్వహించారు. 12 కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారు.
ర్యాలీతో వెంటనే స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తుతం ఓబీసీలకు 605 కోర్సుల్లో ఇస్తున్న ఉపకారవేతనాలు, సౌకర్యాలను మరాఠా విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, బీసీలకు మాదిరిగానే మరాఠా విద్యార్థులకు హాస్టళ్లు నిర్మిస్తామన్నారు. మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పించడాన్ని 2014లోనే బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2003-04లోనూ మరాఠాలను ఓబీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ తిరస్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మరాఠా క్రాంతి మోర్చా ర్యాలీ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : మరాఠాలు
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం
ఐటీఐలకు బోర్డు ఏర్పాటు చేస్తాం: కేంద్రం
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆగస్టు 9న వెల్లడించారు. ఐటీఐల్లో ప్రాక్టికల్‌కు 70 శాతం, ఎంచుకున్న సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు ఉండేలా జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు తరహాలో సర్టిఫికెట్లు జారీచేయడం వీలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీఐలకు జాతీయ బోర్డు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : సీబీఎస్‌ఈ తరహాలో ఐటీఐ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు
సైగలతో జాతీయ గీతాలాపన
సైగలతో జాతీయ గీతం ఆలపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఆగస్టు 10న విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలని.. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నామని మంత్రి అన్నారు.
గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైగలతో జాతీయ గీలాపన వీడియో
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతో
మదర్సాలు ‘పంద్రాగస్టు’ను చిత్రీకరించాలి: యూపీ ప్రభుత్వం
ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడమేకాక, కార్యక్రమాన్ని ఫొటోలు తీసి, వీడియోలో చిత్రీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతపై సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించాలని పేర్కొంది. ఆదేశాల్ని పాటించని మదర్సాలపై చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమ సహాయ మంత్రి బల్‌దేవ్ హెచ్చరించారు.
వితంతువుల పరిస్థితుల అధ్యయనానికి కమిటీ
ఆవాస కేంద్రాల్లోని నిరుపేద వితంతువులకు తగిన గౌరవం దక్కడంలేదని సుప్రీం కోర్టు ఆగస్టు 11న ఆవేదన వ్యక్తం చేసింది. అసలు వారికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రద్దయిపోయినట్లు మనం ప్రవర్తిస్తున్నామని విస్మయం వ్యక్తం చేసింది. వితంతు పునర్వివాహం ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ అభిప్రాయపడింది. వితంతువులపై మూస ఆలోచనా ధోరణులకు వారి పునర్వివాహాలతో అడ్డుకట్ట వేయొచ్చంది. వితంతువుల పరిస్థితిపై కోర్టుకు చేరిన పలు నివేదికలను అధ్యయనం చేసి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సూచించాలని ఆదేశిస్తూ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వితంతువుల పరిస్థితుల అధ్యయనానికి కమిటీ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : సుప్రీంకోర్టు
10 ప్రాజెక్టులకు క్లీన్ గంగా మిషన్ ఆమోదం
బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లతో చేపట్టే 10 ప్రాజెక్టులకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆమోదం తెలిపింది. వీటిలో 8 ప్రాజెక్టులు మురుగు నీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించినవి. మిగతా రెండు.. ఘాట్ల అభివృద్ధి, గంగా జ్ఞాన కేంద్రానికి సంబంధించినవి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గంగా నది శుద్ధికి 10 ప్రాజెక్టులు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా
ఎక్కడ : బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్
బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం
బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు - 2017కు రాజ్యసభ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఇంతకముందే ఈ బిల్లుని ఆమోదించింది. రుణ ఎగవేతదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేస్తూ సవరణ బిల్లు తీసుకొచ్చింది.
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) విలువ రూ.6.41 లక్షల కోట్లు కాగా మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిపి ఈ మొత్తం రూ. 8.02 లక్షల కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు - 2017కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : రుణ ఎగవేతదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు
2022 నాటికి 60 గిగావాట్ల పవన విద్యుదుత్పత్తి
కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశవ్యాప్తంగా 60 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆగస్టు 10న వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరాలంటే ఏటా 5,500 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 32.5 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2022 నాటికి 60 గిగావాట్ల పవన్ విద్యుత్ ఉత్పత్తి
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఓడీఎఫ్ ఆవాసాలుగా గంగా నది తీరంలోని గ్రామాలు
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది తీరం వెంట ఉన్న 4,480 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత ఆవాసాలుగా(ఓడీఎఫ్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నిర్వహించిన "గంగా గ్రామ్ సమ్మేళన్" లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ మేరకు ప్రకటన చేశారు. నమామి గంగా కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. అలాగే... గంగా నది తీర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల పరిరక్షణ-పునరుజ్జీవం, సేంద్రీయ వ్యవసాయం వంటి కోసం "గంగా గ్రామ్" అనే కార్యక్రమాన్ని తోమర్ ప్రారంభించారు. తొలి దశలో 24 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓడీఎఫ్ ఆవాసాలుగా గంగా నది తీరంలోని 4,480 గ్రామాలు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
ఎక్కడ : బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్
ఏనుగుల రక్షణకు గజ్ యాత్ర ప్రారంభం
ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12న) సందర్భంగా దేశంలో ఏనుగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ''గజ్ యాత్ర'' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. వేటగాళ్ల బారి నుంచి ఏనుగులను రక్షించడం, అడవిలో నిఘా వ్యవస్థలను మరింత మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఏటా ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గజ్ యాత్ర ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : 12 రాష్ట్రాల మీదుగా
ఎందుకు : ఏనుగుల సంరక్షణ కోసం
గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఇందుకోసం రూ.85 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నామని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ వైద్య కళాశాలలో వారం రోజుల వ్యవధిలో 60కిపైగా చిన్నారులు చనిపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు : బీఆర్‌డీ వైద్య కళాశాలలో చిన్నారుల మరణాల నేపథ్యంలో
రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 35ఏ
జమ్మూ కశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ ‘35ఏ’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ఆర్టికల్ లింగ వివక్షకు అనుకూలంగా ఉందా? రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందా? అన్న అంశాల్ని ఆ ధర్మాసనం పరిశీలించవచ్చని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 35ఏ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను.. అదే తరహా పెండింగ్ పిటిషన్‌లకు జతచేస్తూ వాటన్నింటిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 35ఏ
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : సుప్రీంకోర్టు
"భారత్ కే వీర్" పై లైవ్ ట్వీటర్ వాల్
భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా "భారత్ కే వీర్" (Bharat Ke Veer) పోర్టల్‌ను ప్రచారం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లైవ్ ట్వీటర్ వాల్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం న్యూఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో అమరులైన సైనికులకు వందనాలు సమర్పిస్తూ hashtag Bharat Ke Veerతో చేసే ట్వీట్లు ఈ ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శితమవుతాయి.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సీఏపీఎఫ్ అమరుల కుటుంబాలకు సహాయం చేసేందుకు 2017 ఏప్రిల్‌లో Bharat Ke Veer పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా విరాళాలు సమీకరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ కే వీర్‌పై లైవ్ ట్వీటర్ వాల్
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : భారత్ కే వీర్ పోర్టల్ ప్రమోషన్ కోసం
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
కల్లోల కశ్మీర్‌ను మరొకసారి భూలోక స్వర్గంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కశ్మీర్ సమస్య దూషణలతోనో, తూటాలతోనో పరిష్కారం కాదని.. అందుకు కశ్మీరీలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, వారితో మమేకం కావడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. సంప్రదాయ కుర్తా, పైజామా, రాజస్తానీ తలపాగాతో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ప్రధాని ఆగస్టు 15న ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రధానిగా నాలుగోసారి ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. గత మూడేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక నిర్ణయాల్ని ప్రస్తావించారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సాహసోపేత నిర్ణయాలని అభివర్ణించారు. చైనాతో డోక్లాం వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సముద్రం, సరిహద్దులు ఎక్కడైనా సరే, ఎలాంటి భద్రతా సవాలునైనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందన్నారు. విశ్వాసాల పేరిట జరిగే హింస ఆమోదయోగ్యం కాదని, మతవాదం, కులతత్వం విషంతో సమానమని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొన్న ప్రకృతి విపత్తులను, యూపీ ఆస్పత్రిలో ఇటీవలి చిన్నారుల మరణాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.
‘బ్లూవేల్’ లింక్‌లను తొలగించాలని కేంద్రం ఆదేశం
ప్రమాదకర ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్‌లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేంద్రం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆగస్టు 11న గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్‌లకు ఓ లేఖ రాసింది. 50 రోజులపాటు సాగే బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో లీనమై ఇటీవల మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్‌లో ఒకరు పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆన్‌లైన్ గేమ్ బ్లూవేల్ లింకుల తొలగింపునకు ఆదేశం
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : విద్యార్థులు, యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నందున
75 ఏళ్ల ‘క్విట్ ఇండియా’పై తీర్మానం
క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 9న లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఉభయసభల్లో సంబంధిత తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
కేరళ, హరియాణాలో 100 శాతం పారిశుద్ధ్యం
కేంద్రం నిర్వహించిన గ్రామీణ పారిశుద్ధ్య సర్వేలో కేరళ, హరియాణా ముందుండగా బిహార్ చివరి స్థానంలో నిలిచింది. సర్వే వివరాలను తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 8న విడుదల చేసింది. సర్వేలో భాగంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016 మే-జూన్ మధ్యన దేశవ్యాప్తంగా 4,626 గ్రామాల్లోని 1.4 లక్షల గ్రామీణ గృహాలను పరిశీలించింది. కేరళ, హరియాణాల్లో దాదాపు అన్ని గ్రామీణ గృహాలకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. బిహార్‌లో 30 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37 శాతం ఇళ్లలోనూ, దేశంలో 62.45 శాతం ఇళ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.
గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం: సుప్రీంకోర్టు
వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా? లేదా? అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం ఆగస్టు 2న తన తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు.
మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ అభిప్రాయపడింది. భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 130 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే, దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోప్యత హక్కుపై విచారణ
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : తీర్పుని రిజర్వులో ఉంచిన సర్వోన్నత న్యాయస్థానం
రత్లే, క్రిష్ణగంగ ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు అనుమతి
జమ్మూ కశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న క్రిష్ణగంగ, రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే 1960నాటి సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి కొన్ని పరిమితులకు లోబడి ఆనకట్టల నిర్మాణాలు ఉండాలంది. పాకిస్తాన్, భారత్ నుంచి కార్యదర్శి స్థాయి అధికారులు తన వద్ద చర్చలు జరిపిన అనంతరం ఓ ప్రకటనను ప్రపంచ బ్యాంకు ఆగస్టు 1న విడుదల చేసింది.
సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ నుంచి పాక్‌కు ప్రవహిస్తున్న పశ్చిమ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారత్... ఈ వ్యవహారంతో సంబంధంలేని ఇతర వ్యక్తి/సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. సింధునది ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై భారత్ 330 మెగావాట్ల సామర్థ్యంగల క్రిష్ణగంగ, 850 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాలను ఇప్పటికే ప్రారంభించగా, వీటిపై పాకిస్తాన్ అభ్యంతరాలు తెలుపుతూ వస్తోంది. ఈ ప్రాజెక్టుల ఆకృతులు సాంకేతికంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లం ఘిస్తున్నాయని పాక్ వాదిస్తోంది. వివాదాన్ని పరిష్కరించాలంటూ పాక్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. తాజాగా పాక్, భారత్ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఈ వారంలో భేటీ అయ్యారు. తదుపరి దఫా చర్చలు సెప్టెంబరులో జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రత్లే, క్రిష్ణగంగ ప్రాజెక్టులకు అనుమతి
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎక్కడ : జమ్ముకాశ్మీర్
అన్ని రంగాల్లోనూ అవినీతి జాఢ్యం: సుప్రీం
దేశవ్యాప్తంగా అన్ని కీలక రంగాల్లోనూ అవినీతి వేళ్లూనుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశాభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇది తీవ్ర అవరోధంగా మారిందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విధులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసమే తాము పనిచేస్తున్నామన్న సృ్పహ అధికారుల్లో ఉన్నప్పుడే అవినీతిని అరికట్టగలమని కోర్టు అభిప్రాయపడింది.
20 ఏళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ నీరా యాదవ్, ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్‌లకు విధించిన శిక్షను సమర్థించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ప్రజలు లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించనంతవరకు ఈ జాఢ్యం నుంచి సమాజం విముక్తి పొందలేదని అభిప్రాయపడింది. అంతేకాకుండా బంధుప్రీతితో అనర్హులకు లబ్ధి చేకూర్చడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్ని రంగాల్లో అవినీతి జాఢ్యం ఉందని వ్యాఖ్య
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : సుప్రీంకోర్టు
రహదారులపై 50 కి.మీ.కు ఓ వసతి కేంద్రం
జాతీయ రహదారులపై ప్రతి 50 కి.మీ.కు ఒక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కారీ ఆగస్టు 3న చెప్పారు. ఆ వసతి కేంద్రాల్లో ఆహార శాలలు, విశ్రాంతి గదులు, స్థానిక ఉత్పత్తుల విక్రయాలు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. జాతీయ రహదారుల గుండా వెళ్లే ప్రయాణికులు, డ్రైవర్లు సేద తీరేందుకు వసతి కేంద్రాలు ఉపయోగపడటంతోపాటు, స్థానిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కూడా ఉపకరిస్తాయని గడ్కారీ వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రహదారులపై 50 కి.మీ.కు ఓ వసతి కేంద్రం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ప్రయాణికులు, డ్రైవర్లు సేద తీరేందుకు
విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు- 2017ను లోక్‌సభ ఆగస్టు 4న ఆమోదించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఇప్పటికే విశాఖలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్‌కార్పొరేట్ చేసేందుకు గానూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐపీఈ బిల్లు - 2017కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిచ్చేందుకు
హెలీ ట్యాక్సీ సేవలని ప్రారంభించిన బీఐఏఎల్
దేశంలో తొలిసారిగా హెలీ ట్యాక్సీ సేవల్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) అందుబాటులోకి తెచ్చింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆగస్టు 4న ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. బెంగళూరులోని పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలనుంచి ఎయిర్‌పోర్టుకు చేరాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. దీంతో తుంబీ ఏవియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో బీఐఏఎల్ హెలీట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒక హెలికాప్టర్‌లో ఐదుగురు, మరో హెలికాప్టర్‌లో 13 మంది ప్రయాణించవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి హెలీ ట్యాక్సీ సేవలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : బీఐఏఎల్
ఎక్కడ : బెంగళూరు
మరణ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి 2017 అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు మినహా దేశమంతటా ఇది వర్తించనుంది. ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై రకరకాల డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ విషయమై తమ అభిప్రాయాలను అక్టోబర్ 1 కల్లా తెలియజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మరణ ధృవీకరణకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : 2017 అక్టోబర్ 1 నుంచి
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
‘అయోధ్య’ పిటిషన్ల విచారణకు బెంచ్
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఆగస్టు 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభిస్తుంది.
అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయోధ్య-బాబ్రీ పిటిషన్లపై విచారణకు బెంచ్
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు
‘సంకల్ప్ పర్వం’గా ఆగస్టు 15
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న దేశప్రజలు ‘సంకల్ప్ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషిచేస్తామని పౌరులు ఆ రోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ ఏడాది ఆగస్టు 15న ‘సంకల్ప్ పర్వం’ నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తాజా ఉత్తర్వులో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంకల్ప్ పర్వ్ దినోత్సవం
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
మసీదు నిర్మాణంపై షియా వక్భ్‌బోర్డు అఫిడవిట్
అయోధ్యలో రామ మందిరం-బాబ్రీ మసీదు సమస్యకు పరిష్కారంగా వివాదాస్పద స్థలానికి కొంచెం దూరంలో మసీదును నిర్మించవచ్చని ఉత్తరప్రదేశ్ షియా కేంద్ర వక్ఫ్‌బోర్డు ఆగస్టు 8న సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే బాబ్రీ మసీదు స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు తమదని చెప్పుకుంటుండటాన్ని షియా వక్ఫ్‌బోర్డు వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దీనిని ప్రస్తావిస్తూ మసీదు స్థలం తమదేననీ, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపే హక్కు తమకే ఉందని షియా వక్ఫ్‌బోర్డు పేర్కొంది. కొత్తగా నిర్మించే మసీదు, ఆలయం తగినంత దూరంలో ఉండాలనీ, ప్రార్థనా స్థలాల్లో ఒకమతం వారు వాడే లౌడ్ స్పీకర్ల వల్ల మరో మతం వారికి ఇబ్బంది ఉండకూడదని వక్ఫ్‌బోర్టు కోర్టుకు విన్నవించింది.
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ మందిరాలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ పిటిషన్లను త్వరగా విచారించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును గతంలో కోరారు. దీంతో పిటిషన్లపై విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నియమించారు.
పశువులకు ఆరోగ్య కార్డులు
పశువుల సంఖ్య, ఆరోగ్య వివరాల సేకరణ కోసం కేంద్రం చేపట్టిన ‘యానిమల్ హెల్త్ కార్డ్’ కార్యక్రమాన్ని ఆగస్టు 8న తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాల మేరకు తమిళనాడులో వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు తదితర 105 కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా కోవై, సేలం, వేలూరు, విల్లుపురం, మదురై సహా ఏడు జిల్లాల్లో వీటిని అందజేస్తారు.
మూడు రంగుల్లో కార్డులు
పశువుల ఆరోగ్యాన్ని పరిశీలించడం, వాటి సంఖ్య, సంతానోత్పత్తి, వ్యాధులు తదితర వివరాలను సేకరించి ప్రతి పశువుకు 12 అంకెలు గల సిరీస్‌తో కార్డులో నమోదు చేస్తారు. సంకరజాతి, నాటు పశువు, బర్రె అని మూడు రకాలతో వేర్వేరు రంగుల్లో ఈ కార్డులను అందిస్తారు. పశువుల యజమానుల వద్ద పశువు ఫోటో, గుర్తులు, వయసు, గుర్తింపు నంబర్, పశువులకు వేసిన ఇంజెక్షన్ల వివరాలన్నీ ఉంటాయి. ఈ వివరాలన్నీ పశు సంరక్షణ విభాగ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. పశువులకు ప్రత్యేక కార్డులు ఇవ్వడం ద్వారా చోరీ సంఘటనలు, మాంసం కోసం అక్రమంగా తరలించడం వంటివి అడ్డుకోవచ్చునని పశు సంరక్షణ విభాగ అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యానిమల్ హెల్త్ కార్డ్ కార్యక్రమం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : కేంద్ర పశు సంవర్ధక శాఖ
ఎక్కడ : కోయంబత్తూరు, తమిళనాడు
ఎందుకు : పశువుల సమగ్ర వివరాలతో 12 అంకెల గుర్తింపు కార్డుల జారీకి
ఆక్రమణలో 33 లక్షల ఎకరాల అటవీ భూమి
దేశంలో 33.21 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ ఆగస్టు 1న లోక్‌సభకు తెలిపారు. గోవా, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. తెలంగాణలో 7,551 ఎకరాలు, ఏపీలో 4,177 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 13 లక్షల ఎకరాలు, అసోంలో 7 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు.
భారత్‌లో వ్యవసాయం ప్రమాదకరం
భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయం చేయడం ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒక నివేదికలో పేర్కొంది. పంట ఎదిగే కాలంలో 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ప్రతి డిగ్రీకి 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగస్టు 1న ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన జర్నల్‌లో వెల్లడించింది. 2050 నాటికి దేశంలో భూతాపోన్నతి మరో మూడు డిగ్రీలు పెరుగుతుందని, అప్పుడు రైతుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. వారిలో 58 శాతం మంది రైతులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, పంటలు దెబ్బతిని ఏటా లక్షా 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Published date : 17 Aug 2017 12:48PM