World Health Organisation: కృత్రిమ తీపి పదార్థాలు ప్రమాదకరం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
పైగా వీటితో టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులతోపాటు పెద్దల్లో ఆకస్మిక మరణాల ముప్పు పొంచి ఉందని కూడా తన తాజా సిఫారసుల్లో హెచ్చరించింది. శాకరిన్, సుక్రలోజ్ వంటి వివిధ కృత్రిమ తీపి పదార్థాలను ప్యాకేజ్డ్ ఆహార పానీయాల్లో వాడుతుంటారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా వీటిని విడిగానూ విక్రయిస్తారు. అయితే, చిన్నారుల్లో బరువు నియంత్రణలో ఈ కృత్రిమ తీపి పదార్థాలు ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించవని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
అందుకే, చక్కెర పదార్థాలను తీసుకోవడాన్ని తగ్గించుకునేందుకు కృత్రిమ తీపి పదార్థాలు(ఎన్‌ఎస్‌ఎస్)లకు ఇతర ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సూచించింది. సహజ చక్కెరలు కలిగి ఉండే పండ్లు, చక్కెర లేని ఆహార పానీయాలను తీసుకోవడం మంచిదని డబ్ల్యూహెచ్‌వో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ ఫ్రాన్సెస్కో బ్రాంకా తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి తక్కువ తీపి ఆహారం తీసుకోవాలన్నారు. ‘‘మందులు, స్కిన్‌క్రీమ్స్ వంటి ఉత్పత్తుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ను ఉపయోగించవచ్చు. తక్కువ కేలరీలుండే తీపి పదార్థాలు, షుగర్ ఆల్కహాళ్లకు కూడా ఈ సిఫారసు వర్తించదు. కేలరీలుండే ఇవి కృత్రిమ తీపి పదార్థాల జాబితాలోకి రావు’’ అని డబ్ల్యూహెచ్‌వో వివరించింది.