Syria: సిరియాపై ఇజ్రాయెల్ దాడులు
ఈ ఘటనలో ఇద్దరు సిరియా సైనికులు, ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది మరణించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకవైపు రన్‌వే దెబ్బతింది. రెండు టర్మినళ్లలో నిర్వహణ వ్యవస్థ ధ్వంసమైంది. జనవరి 1 అర్ధరాత్రి దాటాక ఈ దాడి ఘటన జరిగింది. గత ఏడు నెలల్లో డమాస్కస్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించడం ఇది రెండోసారి. బషర్ అల్ అసద్‌కు మద్దతు పలుకుతున్న స్థానిక ఉగ్రవాదులకు ఇరాన్, లెబనాన్ హిజ్‌బుల్లాల నుంచి ఆయుధాల సరఫరాను అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌తోపాటు డమాస్కస్ దక్షిణాన ఉన్న సిరియా ఆయుధాగారంపైనా ఇజ్రాయెల్ క్షిపణులను ఎక్కుపెట్టింది.
వెస్ట్‌బ్యాంక్‌లో కాల్పులు
ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యంతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పాలస్తీనియన్లు చనిపోయారు. జెనిన్‌లోని కాఫిర్‌దాన్‌లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ఆర్మీని పాలస్తీనియన్లు అడ్డుకున్నారు. దీంతో ఆర్మీ వారిపైకి కాల్పులకు దిగింది. కాల్పుల్లో సమెర్ హౌషియెహ్(21), ఫవాద్ అబెద్(25) అనే వారు మృతి చెందారు.