సెప్టెంబర్ 2020 అంతర్జాతీయం
కోవిడ్-19 టీకా ఉత్పత్తిలో భారత్ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాల కోసం కూడా వినియోగిస్తుందంటూ హామీ ఇచ్చినందుకు భారత ప్రధాని మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 75వ సమావేశాన్ని ఉద్దేశించి సెప్టెంబర్ 26న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..‘ఈ సంక్షోభ సమయంలో భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా తనకున్న ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలను కోవిడ్‌పై పోరులో అంతర్జాతీయ సమాజానికి సాయపడుతుంది. టీకా నిల్వ, పంపిణీకి అవసరమైన మౌలిక వనరుల కల్పనలో కూడా తోడుగా నిలుస్తుంది’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సెప్టెంబర్ 27న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అన్ని దేశాలు కలిసికట్టుగా తమ వనరులను సమీకరించి పోరాడినప్పుడే కరోనాపై విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఐరాస చీఫ్ ఆంటోనియో గుటై కూడా ప్రధాని మోదీ ప్రకటనను ‘వెల్‌కమ్ న్యూస్’గా అభివర్ణించారని ఆయన ప్రతినిధి వెల్లడించారు.
నగొర్నొ-కరబక్ ప్రాంతంపై కోసం ఏ రెండు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి?
వివాదాస్పద నగొర్నొ-కరబక్ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య సెప్టెంబర్ 27, 28వ తేదీలలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఘర్షణలకు నువ్వంటే నువ్వు కారణమని ఇరు దేశాలు దుమ్మెత్తి పోసుకున్నాయి. దాదాపు చిన్నపాటి యుద్ధాన్ని తలపించే ఈ ఘర్షణల్లో ఇరుపక్షాల్లో కలిపి దాదాపు 20-30 వరకు మరణాలు సంభవించాయని తెలుస్తోంది. ఘర్షణలకు దిగుతున్న ఆర్మేనియా, అజర్‌బైజాన్ రెండింటితో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి.
అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య ఎన్నో ఏళ్లుగా నగర్నొ-కబరక్ ప్రాంత ఆధిపత్యంపై ఘర్షణ జరుగుతూనే ఉంది. దట్టమైన అడవులు, పర్వతాలుండే ఈ ప్రాంతం ఇరుదేశాలకు మధ్యన ఉంది. పేరుకు ఈ ప్రాంతం అజర్‌బైజాన్ ఆధీనంలో ఉన్నట్లు చెబుతున్నా, పాలన రిపబ్లిక్ ఆఫ్ అర్ట్‌సక్ ప్రభుత్వం జరుపుతుంది.
ఆర్మేనియా రాజధాని: యెరెవాన్
కరెన్సీ: ఆర్మేనియన్ డ్రామ్
అజర్‌బైజాన్ రాజధాని: బాకు
కరెన్సీ: అజర్‌బైజానీ మానట్
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య తీవ్ర ఘర్షణలు
ఎప్పుడు : సెప్టెంబర్ 27, 28
ఎందుకు : వివాదాస్పద నగొర్నొ-కరబక్ ప్రాంతంపై పట్టు కోసం
చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఏ దేశ రాజధానిలో జరగనుంది?
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్ కోయెలిషన్) దేశాల విదేశాంగ మంత్రులు 2020, అక్టోబర్ 6న జపాన్ రాజధాని టోక్యోలో సమావేశం కానున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డా. సుబ్రమణ్యం జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
1959 నాటి చైనా వాదనను అంగీకరించం
1959 నాటి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు కట్టుబడి ఉంటామంటూ చైనా లేవనెత్తిన సరికొత్త వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ‘చైనా ఏకపక్షంగా నిర్వచించిన 1959 ఎల్‌ఏసీని భారత్ ఎన్నడూ ఆమోదించలేదు. ఈ విషయం చైనా సహా అందరికీ తెలుసు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ సెప్టెంబర్ 29న తెలిపారు. 1959లో అప్పటి చైనా ప్రధాని చౌఎన్‌లై, భారత ప్రధాని నెహ్రూకు రాసిన లేఖలో పేర్కొన్న ఎల్‌ఏసీని తాము గుర్తిస్తామంటూ చైనా విదేశాంగ శాఖ తెలపడంపై శ్రీవాస్తవ ఈ మేరకు స్పందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, అక్టోబర్ 6న చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎక్కడ : టోక్యో, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : పలు విషయాల్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో
టిక్‌టాక్, వీ చాట్‌లపై నిషేధం విధించిన ఉత్తర అమెరికా దేశం?
జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్‌లను నిషేధిస్తూ సెప్టెంబర్ 18న ఉత్తర అమెరికా దేశం యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 20 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్‌బుర్ రాస్ తెలిపారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు రాస్ పేర్కొన్నారు.
ఆగస్టులోనే సంతకం...
2020, సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టిక్‌టాక్, వీ చాట్‌లపై నిషేధం విధించిన ఉత్తర అమెరికా దేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
ఎందుకు : జాతీయ భద్రతను కాపాడటానికి
ప్రపంచ స్మార్ట్ సిటీల్లో తొలి స్థానంలో నిలిచిన నగరం?
ఐఎండీ, ఎస్‌యూటీడీలు సర్వే చేసి రూపొందించిన ‘ప్రపంచ స్మార్ట్ సిటీ సూచీ-2020’లో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 2019 ఏడాదితో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు దిగజారాయి. జాబితాలో హైదరాబాద్ 85, న్యూఢిల్లీ 86, ముంబై 93, బెంగళూరు 95వ స్థానాల్లో నిలిచాయి. 2019లో ఈ నగరాలు వరుసగా 67, 68, 78, 79 స్థానాలు దక్కించుకున్నాయి.
అంతర్జాతీయంగా చూస్తే...
అంతర్జాతీయంగా చూస్తే స్మార్ట్ సిటీల జాబితాలో సింగపూర్ తర్వాత హెల్సిన్కి, జ్యూరిచ్, ఆక్‌లాండ్, ఓస్లో, కోపెన్‌హాగెన్, జెనీవా, తైపీ, ఆమ్‌స్టర్‌డామ్, న్యూయార్క్‌లు ఉన్నాయి.
కరోనా ప్రభావం...
స్మార్ట్ సిటీల జాబితా రూపొందించడం కోసం ప్రతి నగరంలో వందలాదిమందిని సర్వే చేశారు. సర్వే కోసం 15 సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం, భద్రత, రవాణా, అవకాశాలు, పాలన తదితర అంశాల్లో సాంకేతికత వినియోగంపై సర్వేలో ఎక్కువ దృష్టి పెట్టారు. స్మార్ట్‌సిటీలపై కరోనా ప్రభావం తీసివేయలేనిదని, సాంకేతికత బాగా ఉన్న చోట్ల ప్రభావం తక్కువని ఐఎండీ ప్రొఫెసర్ అర్టురోబ్రిస్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ స్మార్ట్ సిటీల్లో సింగపూర్‌కు తొలి స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ఐఎండీ, ఎస్‌యూటీడీ
ఎక్కడ : ప్రపంచంలో
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు పునరుద్ధరణ
ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టుగా అగ్రరాజ్యం అమెరికా సెప్టెంబర్ 20న ప్రకటించింది. 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ)లో నిబంధనల్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపించింది. భద్రతా మండలి చట్టాల ప్రకారం ఇరాన్ చేస్తున్న పనులు సరైనవి కావంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరాన్‌కు నోటీసులు పంపారు. ఆ నోటీసుల గడువు నెల పూర్తి కాగానే ఆంక్షల్ని విధిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాల నిషేధం సహా అన్ని రకాల ఆంక్షల్ని పునరుద్ధరించామని, యూఎన్ సభ్యదేశంగా తమకి ఆ హక్కు ఉందని అగ్రరాజ్యం పేర్కొంది.
యూఎస్‌కు హక్కు లేదు
2018లో అమెరికా అణు ఒప్పందం నుంచి ఎప్పుడైతే వైదొలిగిందో అప్పుడే ఇరాన్‌పై ఆంక్షలు విధించే హక్కు కోల్పోయిందని ఫ్రాన్‌స, బ్రిటన్, జర్మనీ అంటున్నాయి. అమెరికా నిర్ణయాలను చైనా, రష్యా ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నాయి.
అణు పరీక్షల విషయమై...
అణు పరీక్షల విషయమై 2015లో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం శుద్ధి చేసిన యురేనియం, భార జలాలను ఎగుమతి చేసి, ఇరాన్ తన వద్ద ఉన్న నిల్వలను తగ్గించుకోవలసి ఉంది. ఆ ఒప్పందం కారణంగానే అప్పట్లో ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్లో కొన్నింటిని ఎత్తివేశారు. ఈ అణు ఒప్పందం నుంచి 2018 మే 8న అమెరికా వైదొలిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్‌పై ఆంక్షలు పునరుద్ధరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : అమెరికా
ఎందుకు : జేసీపీఓఏలో నిబంధనల్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని
రష్యా విడుదల చేయనున్న రెండో కరోనా వ్యాక్సిన్ పేరు?
కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రష్యా ‘స్పుత్నిక్ వీ’ తర్వాత మరో వ్యాక్సిన్‌ను 2020, అక్టోబర్ 15 నాటికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సైబీరియాకి చెందిన వెక్టార్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ‘ఎపివాక్ కరోనా వ్యాక్సిన్’ను 2020, అక్టోబర్ 15 నాటికి రిజిస్టర్ చేసుకోవచ్చునని రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ సెప్టెంబర్ 22న వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన మొదటి దశ ప్రయోగాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
భారత్‌లో స్పుత్నిక్ వీ ప్రయోగాలు...
రష్యా మొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మూడో దశ ప్రయోగాలు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఆసియా, దక్షిణ అమెరికా, మధ్య ప్రాచ్యానికి చెందిన 10 దేశాలు రష్యాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌కు సైతం దాదాపు కోటి డోసుల్ని పంపిణీ చేయడానికి రష్యన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రయోగాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ త్వరలో ప్రారంభించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : రష్యా, వెక్టార్ ఇన్‌స్టిట్యూట్
ఎందుకు : కరోనా వైరస్ ఎదుర్కోవడానికి
ఐక్యరాజ్యసమితి తొలి ఆన్‌లైన్ సమావేశం ప్రారంభం
కోవిడ్-19 నేపథ్యంలో ప్రధాన దేశాధినేతల ముందుగా రికార్డు చేసిన ఉపన్యాసాలతో ఐక్యరాజ్యసమితి ప్రపంచాధినేతల తొలి ఆన్‌లైన్ సమావేశం సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 21న ప్రారంభ సమావేశం జరిగింది. 193 సభ్య దేశాల ఉపన్యాసాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల సందర్భంగా ఐరాస జనరల్ అసెంబ్లీ సభ్యదేశాలన్నీ కలిపి ఒక తీర్మానాన్ని విడుదల చేశాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరముందని, మరింత ఎక్కువ దేశాలకు, ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పించేలా ఐరాసలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ఈ తీర్మానం పేర్కొంది. కోవిడ్-19 లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉండాలని తెలిపింది.
మోదీ ప్రసంగం...
ఐరాస 75వ వార్షికోత్సవ సమావేశాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... ఐరాసలో మరింత మందికి ప్రాతినిధ్యం కల్పించేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కాలపు సవాళ్లను ఎదుర్కొనేందుకు పురాతన కాలం నాటి వ్యవస్థలు ఉపయోగపడవని తెలిపారు. సమగ్రమైన సంస్కరణలు తీసుకురాకపోతే ఐరాస వ్యవస్థ విశ్వసనీయత సంక్షోభంలో పడుతుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి తొలి ఆన్‌లైన్ సమావేశం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎందుకు : ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని
ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 10న రష్యా రాజధాని మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ యి సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు.
భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీ
తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సెప్టెంబర్ 10న మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న 2020 మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్‌లో చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా, భారత్, చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ యి
ఎక్కడ : మాస్కో, రష్యా
ఎందుకు : త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై చర్చించేందుకు
2020, నవంబర్ నాటికి చైనా కరోనా వ్యాక్సిన్
చైనా తయారు చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్ 2020, నవంబర్ నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి రానుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చీఫ్, బయోసేఫ్టీ ఎక్స్‌పర్ట్ గ్విన్‌జెన్ వూ వెల్లడించారు. చైనాలో మానవప్రయోగ తుది దశలో ఉన్న నాలుగు కోవిడ్ వ్యాక్సిన్‌లలో మూడింటిని ఇప్పటికే అత్యవసర కార్యక్రమం కింద, అత్యవసర సిబ్బందికి ఉపయోగించారు. చైనా ఔషధ దిగ్గజ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్(సినోఫార్మ్), సినోవా బయోటెక్ అత్యవసర కార్యక్రమం కింద మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధిచేస్తున్నాయి. కాన్‌సినో బయోలాజిక్స్ డెవలప్ చేసిన నాల్గో వ్యాక్సిన్‌ని చైనా సైన్యానికి ఉపయోగించేందుకు 2020, జూన్‌లో అనుమతి లభించింది.
చైనాను ఓడించి ఐరాస మహిళా సమానత్వ కమిషన్‌కి ఎంపికైన దేశం?
ప్రపంచ వ్యాప్తంగా లింగ సమానత్వం, మహిళా సాధికారతలపై పనిచేసే ‘యూఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ వుమెన్’ అనే అంతర్జాతీయ సంస్థలో చైనాను ఓడించి, భారత్ సభ్య దేశంగా ఎంపికైంది. 54 సభ్య దేశాల ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌కి ఏషియా పసిఫిక్ దేశాల కోటాలో జరిగిన ఎన్నికల్లో, చైనాపై భారత్ విజయం సాధించింది. ఐరాస ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీవోఎస్‌వోసీ)కి అనుబంధ సంస్థ అయిన ఈ కమిషన్ మహిళా హక్కులను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా స్త్రీల జీవన చిత్రాన్ని డాక్యుమెంట్ చేయడం, అంతర్జాతీయ స్థాయిలో సమానత్వం, మహిళా సాధికాతలకు ప్రమాణాలు నిర్దేశించడం లక్ష్యంగా పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనాను ఓడించి ఐరాస మహిళా సమానత్వ కమిషన్‌కి ఎంపికైన దేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : భారత్
ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి వేదికైన నగరం?
రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగు, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెన్‌ఘీ పాల్గొన్నారు. ఎస్‌సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40 శాతం ఉంటుంది.
భేటీలో రాజ్‌నాథ్ ప్రసంగం-ముఖ్యాంశాలు
- పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే ఎస్‌సీఓ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయి.
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టైజానికి వ్యతిరేకంగా ఎస్‌సీఓ ‘రీజనల్ యాంటీ టైజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను భారత్ ప్రశంసిస్తోంది.
- ‘పీస్ మిషన్’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు కృతజ్ఞతలు.
- అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది.
ఏమిటి : షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎక్కడ : మాస్కో, రష్యా
2021 జూన్ తర్వాతే వ్యాక్సిన్: డబ్ల్యూహెచ్‌వో
2021 ఏడాది జూన్ వరకు కరోనా వ్యాక్సిన్ విసృ్తతంగా అందుబాటులోకివచ్చే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. అన్ని ప్రయోగాలను దాటుకొని వ్యాక్సిన్ ఎంత సమర్థంగా ఎంత సురక్షితంగా పని చేస్తుందో తేలడానికి సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ సెప్టెంబర్ 4న పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం ఇప్పటివరకు తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్‌లన్నీ 50 శాతం కూడా సురక్షితం కాదని మార్గరెట్ చెప్పారు.
రష్యా వ్యాక్సిన్ సురక్షితమే..
రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ సురక్షితమేనని లాన్సెట్ జర్నల్ ఓ పరిశోధనను వెలువరించింది. మొత్తం 76 మందిపై జరిపిన ట్రయల్స్‌లో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులేమీ కనపడలేదని తెలిపింది.
ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు
ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు సెప్టెంబర్ 8న వర్చువల్‌గా జరిగింది. అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్‌ఏ) నిర్వహించిన ఈ సదస్సులో దాదాపు 149 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. చౌకై న, సుస్థిరమైన శుద్ధ ఇంధనాలను వేగవంతం చేయడంపై, సోలార్ విద్యుత్తులో తదుపరి తరం టెక్నాలజీలను ఆవిష్కరించడంపై ఈ సదస్సు దృష్టి సారించింది. ఐఎస్‌ఏ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా కేంద్ర పునురుత్పాదక ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్ వ్యవహరించారు. ఆయనతోపాటు, సహ ప్రె సిడెంట్‌గా ఉన్న ఫ్రాన్స్ మంత్రి బార్బరా పొంపిలి, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లేటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల తరఫున ఐఎస్‌ఏ ఉపాధ్యక్షులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో ప్రధాని మోదీ సందేశాన్ని పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్ చదివి వినిపించారు.
మోదీ సందేశం...
- భారత్ పర్యావరణ అనుకూల ఇంధన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 134 గిగావాట్ల నుంచి 2022 నాటికి 220 గిగావాట్లకు పెంచుకుంటుంది.
- సోలార్ ఇంధన వినియోగాన్ని పెంచుకునే విషయంలో సాంకేతిక పురోగతి ద్వారా టారిఫ్‌లు మరింత తగ్గాల్సిన అవసరం ఉంది.
- శుద్ధ ఇంధనాలను దేశాల మధ్య సరఫరాకు ‘ఒకే ప్రపంచం, ఒకటే సూర్యుడు, ఒకటే గ్రిడ్‘ అనే నినాదాన్ని మోదీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు నిర్వహణ
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్‌ఏ)
ఎక్కడ : ఆన్‌లైన్
శిశు మరణాలపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక పేరు?
ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు అనే అంశంపై ‘చైల్డ్ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్‌స 2020’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను విడుదల చేసింది. 1990-2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లో సంభవిస్తున్నాయని ఈ నివేదికలో ఐరాస పేర్కొది.
ఐరాస నివేదికలోని ప్రధానాంశాలు...
- భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయి.
- ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి తగ్గింది.
- భారత్‌లో 1990లో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతీ వెయి్య మందిలో 126 మంది మరణిస్తే, 2019 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34కి తగ్గింది.
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా మధ్య, దక్షిణాసియా దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పట్టాయి.
- అత్యధికంగా శిశు మరణాలు సంభవిస్తున్న దేశాల్లో సబ్ సహారా ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియా దేశాలే ఉన్నాయి.
- సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్‌స 2020 పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ఐక్యరాజ్యసమితి
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల వివరాలపై
సగటు జీతాల గ్లోబల్ లిస్ట్‌లో భారత్‌కు 72 ర్యాంకు
ప్రపంచవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్ లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. తాజాగా 106 దేశాల్లో సగటు నెలవారీ జీతాలు, వేతనాలు ఎలా ఉన్నాయన్న దానిపై అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం పికొడి.కామ్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్విట్జర్లాండ్ రూ.4.49 లక్షల (5,989 యూఎస్ డాలర్లు) సగటు జీతంతో ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్
ర్యాంకు | దేశం | అంకెలు (అమెరికా డాలర్లలో..) |
1 | స్విట్జర్లాండ్ | 5,989 |
2 | లగ్జెంబర్గ్ | 4,014 |
3 | అమెరికా | 3,534 |
4 | డెన్మార్క్ | 3,515 |
5 | సింగపూర్ | 3,414 |
6 | ఆస్ట్రేలియా | 3,333 |
7 | ఖతార్ | 3,232 |
8 | నార్వే | 3,174 |
9 | హాంకాంగ్ | 3,024 |
10 | ఐస్‌లాండ్ | 2,644 |
72 | భారత్ | 437 |
106 | క్యూబా | 36 |
ఆసియాలో దక్షిణ కొరియా...
ఆసియాలోని దేశాల్లో దక్షిణ కొరియా రూ.1,72,900 సగటు నెలసరి ఆదాయంతో ఉన్నత స్థానంలో ఉండగా, చైనా రూ.72,100, మలేసియా రూ.62,700, థాయ్‌లాండ్ రూ.46,400 ఆ తర్వాత ర్యాంకుల్లో నిలిచాయి. ఇక వియత్నాం రూ.30,200, ఫిలిప్పీన్స్ రూ.23,100, ఇండోనేసియా రూ.22,900, పాకిస్తాన్ రూ.15,700 నెలసరి సగటు జీతాలు, వేతనాలతో అథమస్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్‌సలో భారత్‌కు 72వ ర్యాంకు
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం పికొడి.కామ్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
అమెరికాలో అత్యధిక ఆదాయం పొందుతున్న విదేశీయులు?
వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉంది. ఏటా అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తున్న అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో నమోదు చేస్తారు. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు.
సర్వే వివరాల ప్రకారం...
అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ల సగటు ఆదాయం ఏటా అందరికంటే ఎక్కువగా 1,00,500 డాలర్లుగా నమోదైంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలిచారు.
అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల సగటు ఆదాయం ఏటా..
స్థానం దేశం | దేశం | ఆదాయం(డాలర్లలో...) |
1 | ఇండియన్ | 1,00,500 |
2 | ఫిలిప్పో | 83,300 |
3 | తైవానీస్ | 82,500 |
4 | శ్రీలంకన్ | 74,600 |
5 | జపనీస్ | 72,300 |
6 | మలేసియన్ | 70,300 |
7 | చైనీస్ | 69,100 |
8 | పాకిస్తాన్ | 66,200 |
9 | వైట్-అమెరికన్లు | 59,900 |
10 | కొరియన్ | 59,200 |
11 | ఇండోనేసియన్ | 57,500 |
12 | స్థానిక-అమెరికన్లు | 56,200 |
13 | థాయ్‌లాండ్ | 55,000 |
14 | బంగ్లాదేశీ | 50,000 |
15 | నేపాలీ | 43,500 |
16 | లాటినో | 43,000 |
17 | ఆఫ్రికన్ -అమెరికన్లు | 35,000 |
అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారిలోనూ భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు.
ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.
దేశం | శాతం |
ఇండియన్ - అమెరికన్లు | 70 |
కొరియన్ - అమెరికన్లు | 53 |
చైనీస్ - అమెరికన్లు | 51 |
ఫిలిప్పో - అమెరికన్లు | 47 |
జపనీస్ - అమెరికన్లు | 46 |
సగటు అమెరికన్లు | 28 |
ఏమిటి : అత్యధిక ఆదాయం పొందుతున్న విదేశీయులు
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : భారతీయలు
ఎక్కడ : అమెరికా
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో భారత్ ర్యాంకు?
2020 సంవత్సరానికిగాను ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా రూపొందించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2020లో భారత్‌కు 48వ ర్యాంకు లభించింది. విద్యా సంస్థలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ తదితర అంశాలపై 131 దేశాల్లో అధ్యయనం చేసి జీఐఐ-2020ను రూపొందించారు. జీఐఐ-2019లో భారత్ 52 ర్యాంకును పొందగా... తాజాగా నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచింది.
జీఐఐ-2020లోని ముఖ్యాంశాలు
- జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్‌స నిలిచాయి.
- నవకల్పనలకు సంబంధించి టాప్ 50 దేశాల జాబితాలో భారత్ తొలిసారి స్థానం దక్కించుకుంది.
- నవకల్పనల్లో టాప్ దేశాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ క్రమంగా చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా దేశాల స్థానాలు మెరుగుపడుతున్నాయి.
- వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
- ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సర్వీసుల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్‌లైన్ సర్వీసులు వంటి విభాగాల్లో టాప్ 15 దేశాల్లో చోటు దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2020లో భారత్‌కు 48వ ర్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్
ఎక్కడ : ప్రపంచంలో