Nobel Peace Prize: అమ్మకానికి నోబెల్ పురస్కారం
యుద్ధం కారణంగా శరణార్థులుగా మారిన ఉక్రెయిన్ చిన్నారుల సంక్షేమం కోసం రష్యా పాత్రికేయుడు దిమిత్రి మురతోవ్ చేసిన ప్రయత్నానికి అనూహ్య స్పందన లభించింది. నోబెల్ శాంతి విశిష్ట పురస్కారాన్ని వేలం వేసి.. ఆ సొమ్మును యూనిసెఫ్ ద్వారా చిన్నారుల కోసం ఖర్చు చేస్తానని మురతోవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లో.. ‘హెరిటేజ్ ఆక్షన్స్’ నిర్వహించిన వేలంలో 10.35 కోట్ల డాలర్ల(సుమారు రూ.800 కోట్లు)కు దీనిని ఒకరు సొంతం చేసుకున్నారు. 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ పురస్కారాన్ని వేలం వేసినప్పుడు 47.6 లక్షల డాలర్ల ధర పలికింది. ఇప్పటివరకు ఆ పురస్కారాలకు వేలంలో దక్కిన అత్యధిక ధర అదే. తాజా వేలంతో కొత్త రికార్డు నమోదైంది. 175 గ్రాముల బరువైన 23 క్యారెట్ల బంగారు పతకం వాస్తవ విలువ 10,000 డాలర్లే. అయినా ఇది నోబెల్ పురస్కారానికి లభించింది కావడంతో వేలం పాటలో అనేకమంది పోటాపోటీగా పాల్గొన్నారు. చిన్నారులకు వారి భవిష్యత్తును తిరిగి ఇవ్వాలనే తపనతోనే పతకాన్ని వేలం వేసినట్లు మురతోవ్ చెప్పారు.