నివేదికలు – సూచీలు
ఐపీసీసీ ‘సింథసిస్ రిపోర్ట్’:
పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న కీలక లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు అందుకోలేకపోవచ్చని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస కమిటీ–ఐపీసీసీ హెచ్చరించింది. ఈ దశాబ్దంలో శరవేగంగా చేపట్టే ఉపశమన చర్యలతో ఈ పరిస్థితిని నివారించొచ్చని తన తాజా ‘సింథసిస్ రిపోర్ట్’లో పేర్కొంది. 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్య సాధనకు అన్ని రంగాల్లోనూ గ్రీన్హౌస్ ఉద్గారాల తగ్గింపు వేగంగా, నిరంతరంగా సాగాలని తేల్చిచెప్పింది. ‘ఇప్పుడు మనం చర్యలు చేపడితే.. అందరికీ ఆవాసయోగ్య పరిస్థితులను కల్పించొచ్చు‘ అని ఐపీసీసీ చైర్‌పర్సన్ హోసంగ్ లీ పేర్కొన్నారు. మానవాళి చాలా పలుచటి హిమఫలకం పై ఉందని, అది కూడా వేగంగా కరిగిపోతోందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. ‘ఇది ఒక టైమ్ బాంబ్ లాంటిది. సమయం వాతావరణ కార్యాచరణలో పెద్ద ముందడుగు వేస్తే.. 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాన్ని సాధించొచ్చు‘ అని పేర్కొన్నారు. ధనిక దేశాలు 2040 నాటికి ’నెట్ జీరో’ ఉద్గార స్థాయిని సాధించాలన్నారు. వర్ధమాన దేశాలు 2050లో ఈ లక్ష్యాన్ని అందుకోవాలని కోరారు. ‘ఓఈసీడీ’ దేశాలు 2030 కల్లా బొగ్గు వినియోగాన్ని ఆపేయాలని, మిగతా దేశాలు 2040 కల్లా ఆ లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. ఈ నివేదికను భారత్ స్వాగతించింది.
నివేదికలోని అంశాలు:
- ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కుటుంబాల తలసరి కర్బన ఉద్గారాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని కుటుంబాలు వెలువరించే ఉద్గారాల్లో వీరి వాటా 35–45 శాతంగా ఉంది. ఈ జాబితాలో కింది స్థాయిలో ఉన్న 50 శాతం కుటుంబాలు కేవలం 13–45 శాతం ఉద్గారాలను వెలువరిస్తున్నాయి.
- భూతాపంలో పెరుగుదలకు శిలాజ ఇంధనాల వినియోగమే ప్రధాన కారణం. 2019లో ప్రపంచ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో 79 శాతం ఇంధనం, పరిశ్రమలు, రవాణా, భవనాల నుంచే వచ్చాయి. వ్యవసాయం, అడవులు, ఇతర రంగాల వాటా 21 శాతం.
- వాస్తవ అవసరాలకు అనుగుణంగా వర్ధమాన దేశాలు, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సమూహాలకు వాతావరణ కార్యాచరణ నిధులను ధనిక దేశాలు అందించాలి. 1.5 డిగ్రీల లక్ష్యాన్ని సాధించాలంటే 2030 నాటికి కర్బన ఉద్గారాలను సగానికి తగ్గించాలి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP