Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌గా జనరల్ మునీర్
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మునీర్‌ని కొత్త చీఫ్‌గా నియమించారని వెల్లడించారు. నవంబర్ 29తో ప్రస్తుత ఆర్మీ చీఫ్ బజ్వా పదవీకాలం ముగుస్తుంది. అదే రోజు కొత్త చీఫ్‌గా జనరల్ మునీర్ బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. మిలటరీ తిరుగుబాట్లు ఎక్కువగా జరిగే పాక్‌లో సైనిక చీఫ్ పదవి అత్యంత శక్తిమంతమైనది. భద్రత, విదేశాంగ విధానంలో ఆర్మీ చీఫ్‌కు విశేష అధికారాలుంటాయి.
ఎవరీ మునీర్?
లెఫ్టినెంట్ జనరల్ మునీర్ ఐఎస్‌ఐ చీఫ్‌గా, మిలటరీ ఇంటెలిజెన్స్ హెడ్‌గా పని చేశారు. పాక్ ఆర్మీలో ఈ రెండు పదవుల్ని నిర్వహించిన ఏకైక వ్యక్తి. ప్రస్తుతం రావలి్పండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలో క్వార్టర్ మాస్టర్ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు.
ఇమ్రాన్ ఆగ్రహానికిలోనై..
మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు, జనరల్ మునీర్‌కు మధ్య తీవ్ర విభేదాలున్నాయని గతంలోనే వెల్లడైంది. 2017లో పాక్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా మునీర్ వ్యవహరించారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్‌ఎస్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇమ్రాన్ భార్య బష్రా బీబీపై జనరల్ మునీర్ అవినీతి ఆరోపణలు చేశారు. ఆ పదవిలో 8 నెలలు ఉన్న తర్వాత అప్పటి ప్రధాని ఇమ్రాన్ మునీర్‌ను ఆ పదవి నుంచి తొలగించి బజ్వాను నియమించారు. ఇమ్రాన్ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న వేళ ఆయనతో విరోధం ఉన్న మునీర్‌ను ఆర్మీ చీఫ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ దూకుడుకు మునీర్ కళ్లెం వేస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పుల్వామా దాడికి కుట్ర
2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి దాడి సమయంలో ఐఎస్‌ఐ చీఫ్‌గా మునీర్ ఉన్నారు. భారత్‌లో ఉగ్ర ఆపరేషన్లు నిర్వహించడంలో మునీర్ సిద్ధహస్తుడంటూ పేరుంది. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో రెండు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయన్న చర్చ కూడా మొదలైంది.
➤ పాక్ ఆర్మీ చీఫ్‌కు.. వేల కోట్ల అక్రమాస్తులు!