Skip to main content

Twitter Logo: పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్‌ లోగోను మార్చిన మస్క్!

ఎలాన్ మస్క్ ట్విటర్ లోగోను మార్పు చేశాడు. ఏప్రిల్‌ 3న ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్‌) లోగోకు బ‌దులుగా కుక్క (డాగీ) లోగోను పెట్టాడు.
Twitter New logo

అయితే ఇది మొబైల్‌ యాప్‌లో కాదు. డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మాత్రమే.. ట్విటర్‌ వెబ్‌సైట్‌లో హోం బటన్‌గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్‌ (Dogecoin) క్రిప్టోకరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్‌ ప్రత్యక్షమైంది. దీన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్‌ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్‌లో కనిపిస్తోంది. 

ట్విటర్‌ లోగో మార్పుపై ఎలాన్‌ మస్క్‌ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్‌ను జోడిస్తూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. అలాగే 2022 మార్చి 26 నాటి తన ట్విటర్‌ చాట్‌ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్‌ ట్విటర్‌ బర్డ్ లోగోను ‘డాగ్’గా మార్చమని అడగ్గా దానికి మస్క్‌ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. 

Elon Musk: మ‌రోసారి నంబ‌ర్ 1 స్థానానికి చేరుకున్న మ‌స్క్‌... అదానీ స్థానం ఎక్క‌డో తెలుసా..?

క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారని ఎలాన్‌ మస్క్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్‌ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత డాగీకాయిన్‌ విలువ 20 శాతం వరకు పెరిగింది.

 

Published date : 04 Apr 2023 04:26PM

Photo Stories