Skip to main content

మే 2017 అంతర్జాతీయం

ఆక్స్‌ఫర్డ్ పాఠాల్లో గాంధీ, లూథర్ కింగ్
Current Affairs
భారత్‌తో పాటు ఆసియాలోని పలు చారిత్రక అంశాలతో కూడిన చరిత్ర పేపర్‌ను తప్పనిసరి చేస్తూ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గాంధీతో పాటు 1960లో అమెరికా నల్లజాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్‌కింగ్ గురించి పాఠ్యాంశాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ చరిత్రపై ఉన్న రెండు పేపర్లకు అదనంగా డిగ్రీ (హిస్టరీ) విద్యార్థులు దీన్ని చదవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ‘మా పాఠ్యాంశాలు జాతివివక్షతో ఎందుకున్నాయి’ అనే నినాదంతో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఆక్సఫర్డ్ పాఠాల్లో ఆసియా చారిత్రక అంశాలు
ఎవరు : ఆక్సఫర్డ్ యూనివర్సిటీ
ఎందుకు : పాఠ్యాంశాల్లో జాతి వివక్షకు తావులేకుండా 

ఇటలీలో జీ-7 దేశాల వార్షిక సదస్సు
జీ-7 దేశాల వార్షిక సదస్సు ఇటలీలోని టావోర్మినాలో మే 26, 27 తేదీల్లో జరిగింది. ఈ సదస్సు ప్రధానంగా విదేశీ విధానం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అసమానతల తగ్గింపు, వలస సమస్యలపై దృష్టిసారించింది. లింగ సమానత్వం, ఇన్నోవేషన్, నైపుణ్యం, శ్రామికుల సమస్యలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు నేతలు ఆమోదం తెలిపారు. ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ పాల్గొన్నాయి.

అతి పెద్ద విమాన ప్రయాణం విజయవంతం
ప్రపంచంలోనే అతి పెద్ద(92 మీటర్ల పొడవైన) విమాన(ఎయిర్ ల్యాండర్ 10) ప్రయాణం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని లండన్‌లో మే 23న నిర్వహించారు. దీంతో ఈ విమానాన్ని వాణిజ్య సేవలకు వినియోగించే విషయంలో మరో ముందడుగు పడింది. హీలియం వాయువుతో నిండిన ఈ విమానం మానవ సహితంగా 6,100 మీటర్ల ఎత్తులో ఐదు రోజుల పాటు ఎగరగలదు. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సంస్థ దీన్ని తయారు చేసింది.

ఇరాన్ అధ్యక్షుడిగా రౌహానీ తిరిగి ఎన్నిక
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ ఘన విజయం సాధించారు. ఈ మేరకు మే 19న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 57 శాతం, సమీప ప్రత్యర్థి ఇబ్రహీం రైసీకి 38.3 శాతం ఓట్లు వచ్చాయి. రెండో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రౌహానీ ముందు ద్రవ్యోల్బణం, చమురు అమ్మకాల తగ్గుదల వంటి అనేక సవాళ్లున్నాయి.
రౌహానీకి ముందు అధ్యక్షుడిగా ఉన్న అహ్మదీ నెజాద్ అమెరికాతో కయ్యానికి కాలుదువ్వేవారు. అణ్వస్త్ర కార్యక్రమం నిలిపివేతకు నిరాకరించారు. దీంతో పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించాయి. దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పాలనలో ఆపార అనుభవమున్న రౌహానీ 2013లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పరిస్థితులను చక్కదిద్దారు.
1948లో జన్మించిన రౌహానీ 1972లో టెహ్రాన్ వర్సిటీ నుంచి న్యాయవిద్యలో పట్టా పుచ్చుకున్నారు. ఇస్లామిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న ఆయన నిఘావర్గాలు వెంటాడడంతో ప్రవాసానికి వెళ్లారు. 1979లో ఇరాన్ విప్లవం తర్వాత రౌహానీ సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. క్రమశిక్షణను నెలకొల్పి ఆర్మీ బేస్‌లను పటిష్టపరిచారు.1980-2000 మధ్య ఇరాన్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 1989-2005 మధ్య సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎన్‌ఎస్‌ఎసీ) కార్యదర్శిగానూ పనిచేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై పాశ్చాత్య దేశాలతో చర్చల్లో ముఖ్యభూమిక పోషించారు. యురేనియం శుద్ధిని నిలిపివేసేందుకు 2005లో అంగీకరించారు. 2013 అధ్యక్ష ఎన్నికల్లో రౌహానీ యువత, మధ్యతరగతి మద్దతుతో ఘన విజయం సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు
ఎప్పుడు : మే 20
ఎవరు : మరోసారి ఎన్నికైన హసన్ రౌహానీ

సౌదీ అరేబియాతో అమెరికా భారీ ఆయుధ ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన సౌదీ అరేబియాలో మే 20న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో 110 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.1 లక్షల కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందాన్ని అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా రక్షణ పరికరాలు, సేవలను సౌదీ కొనుగోలు చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సౌదీ అరేబియాతో అమెరికా ఒప్పందం
ఎప్పుడు : మే 20
ఎవరు : అమెరికా - సౌదీ అరేబియా
ఎందుకు : ఆయుధాల సరఫరా కోసం

మాంచెస్టర్‌లో ఆత్మాహుతి దాడి
లండన్‌లోని మాంచెస్టర్‌లో మే 23న ఆత్మాహుతి దాడి జరిగింది. యూరప్‌లోని అతిపెద్ద ఇండోర్ ఎరీనా అయినా మాంచెస్టర్ ఎరీనాలో పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా దుండగుడు సల్మాన్ అబేదీ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 20కిపైగా యువతీ యువకులు, చిన్నారులు మృత్యువాత పడగా మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దాడికి పాల్పడింది తామే అని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ప్రకటించింది. క్విక్ రివ్యూ:
ఏమిటి :
మాంచెస్టర్ మ్యూజిక్ కన్సర్ట్‌పై ఆత్మాహుతి దాడి
ఎప్పుడు : మే 23
ఎవరు : ఐఎస్‌ఐఎస్
ఎక్కడ : లండన్

1888 విలయం ‘అత్యంత ఘోరం’
1888లో యూపీలోని మొరాదాబాద్‌లో సంభవించిన వడగండ్ల వాన అత్యంత ప్రమాదకర విలయమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ విపత్తులో దాదాపు 246 మంది మృత్యువాతపడ్డట్లు తెలిపింది. ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించినఈ తరహాప్రకృతి వైపరీత్యాల్లో దీన్నే అత్యంత ఘోరమైన విపత్తుగా గుర్తించింది.

Current Affairs పార్లమెంటులో బిడ్డకు పాలిచ్చిన ఆస్ట్రేలియా సెనేటర్
ఆస్ట్రేలియా సెనేటర్ లారిసా వాటర్స్ (గ్రీన్ పార్టీ) పార్లమెంటులోనే తన చంటి బిడ్డకు చనుపాలిచ్చి చరిత్ర సృష్టించారు. ఈ మేరకు మే 9న సభలో జరిగిన ఓటింగ్‌కు పాపతో సహా హాజరయ్యారు. తద్వారా ఆస్ట్రేలియా పార్లమెంటులో బిడ్డకు పాలిచ్చిన తొలి సెనేటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన నిబంధనల్లో ఇటీవల చేసిన మార్పుల వల్లే వాటర్స్ తన పాపను పార్లమెంట్‌కు తీసుకు రావడానికి వీలు కలిగింది.

2003లో ఆస్ట్రేలియాలోనే క్రిస్టీ మార్షల్ అనే విక్టోరియా ఎంపీ తన 11 రోజుల బిడ్డకు పార్లమెంట్‌లో పాలిచ్చినందుకు, సభ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. 2016లో ఐస్‌ల్యాండ్ పార్లమెంట్‌లో ఓ సభ్యురాలు తన బిడ్డకు పాలిస్తూనే మాట్లాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పార్లమెంటులో బిడ్డకు పాలిచ్చిన ఎంపీ
ఎప్పుడు : మే 9
ఎవరు : లారిసా వాటర్స్
ఎక్కడ : ఆస్ట్రేలియా

అమెరికాపై అణు బాంబు వేస్తాం: ఉత్తర కొరియా
అమెరికా తన వైఖరి మార్చుకోకపోతే ఆ దేశంపై ఏ క్షణమైనా అణు బాంబులతో దాడి చేస్తామని ఉత్తర కొరియా మే 11న హెచ్చరించింది. అమెరికా చర్యల వల్ల తలెత్తే ఎలాంటి విపత్కర ఫలితాలకైనా ఆ దేశమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధి ‘రోడాంగ్ సిన్మన్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మరోవైపు ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే అణ్వాయుధ, క్షిపణి పరీక్షల ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా కేంద్ర నిఘా ఏజెన్సీ (సీఐఏ) ‘కొరియా మిషన్ సెంటర్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాపై అణుబాంబును వేస్తాం అని హెచ్చరిక
ఎప్పుడు : మే 11
ఎవరు : ఉత్తర కొరియా
ఎందుకు : కొరియా పట్ల అమెరికా వైఖరికి బదులుగా

శ్రీలంకలో అంతర్జాతీయ వెసాక్ వేడుకలు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 14వ అంతర్జాతీయ వెసాక్ (బుద్ధ జయంతి) వేడుకలు (మే 12 - 14) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగాయి. ఈ మేరకు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 12న సంబరాలను ప్రారంభించి ప్రసంగించారు.
ఈ వేడుకల్లో మోదీతో పాటు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
14వ అంతర్జాతీయ వెసాక్ వేడుకలు
ఎప్పుడు : మే 12 - 14
ఎక్కడ : శ్రీలంక రాజధాని కొలంబోలో
ఎవరు : ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్రమోదీ

Current Affairs భారత రాష్ట్రాలపై అమెరికా వెబ్‌పోర్టల్
భారత్‌లోని ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, విధివిధానాలపై అవగాహన కల్పించేందుకు అమెరికా అత్యున్నత స్థాయి మేధోవర్గం ‘ఎంగేజింగ్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్‌ఐఎస్) ఆధ్వర్యంలో అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్‌ను ఇంధన సహాయ మంత్రి గ్రిఫిన్ థాంప్సన్, భారత్-అమెరికా విధాన అధ్యయన కేంద్రం సీనియర్ సలహాదారుడు రిచర్డ్ రొసౌ మే 12న ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత రాష్ట్రాలపై వెబ్‌పోర్టల్
ఎప్పుడు : మే 12
ఎవరు : అమెరికాలోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్

చైనాలో బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సదస్సు
చైనా రాజధాని బీజింగ్‌లో రెండు రోజుల పాటు (మే 14 - 15) బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ (బీఆర్‌ఎఫ్) సదస్సు జరిగింది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలను రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా అనుసంధానించే ఉద్దేశంతో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టును చేపట్టింది. ఈ అంశంపై జరిగిందే బీఆర్‌ఎఫ్ సదస్సు. గతంలో ఈ ప్రాజెక్టుకు వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) అని పేరు పెట్టగా అనంతరం బీఆర్‌ఐగా మార్పు చేశారు.

ఈ సదస్సుకి గైర్హాజరైన భారత్.. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలపై తమ ఆందోళనలను చైనా పట్టించుకోనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. చైనా చేపడుతున్న బీఆర్‌ఐ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) కు వ్యతిరేకంగానే భారత్ ఈ నిర్ణయానికి వచ్చింది. సీపీఈసీ పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళ్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సదస్సు
ఎప్పుడు : మే 14 - 16
ఎక్కడ : చైనాలో

బ్రిటన్ పార్లమెంట్ రద్దు
బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ ‘హౌస్ ఆఫ్ కామన్స్’ మే 3న అధికారికంగా రద్దయింది. 2017 జూన్ 8న సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం సాధారణ ఎన్నికలకు కనీసం 25 పనిదినాల ముందే పార్లమెంట్‌ను రద్దు చేయాలి. దీంతో పార్లమెంట్ సభ్యులు తమ విశేష అధికారాలు కోల్పోతారు. మంత్రి పదవిలో ఉన్న ఎంపీలు మాత్రం ఎన్నికలు పూర్తయ్యే దాకా తమ విధులు నిర్వర్తిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బ్రిటన్ పార్లమెంట్ రద్దు
ఎప్పుడు : మే 3
ఎందుకు : 2017 జూన్ 8న సాధారణ ఎన్నికల నేపథ్యంలో

రాచరిక విధులకు ప్రిన్స్ ఫిలిప్ స్వస్తి
Current Affairs బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ (95) రాచరిక విధులకు దూరమవనున్నారు. 2018 నవంబర్ నుంచి ఆయన ప్రిన్స్ హోదాలో బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ మే 4న అధికారిక ప్రకటన చేసింది. అయితే అంతకుముందే నిర్ణయించిన కార్యక్రమాల్లో 2017 ఆగస్టు వరకు పాల్గొంటారని.. ఇకపై కొత్త ఆహ్వానాలను మాత్రం స్వీకరించరని పేర్కొంది. రాణి ఎలిజబెత్ మాత్రం యథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాచరిక విధులకు ప్రిన్స్ ఫిలిప్ స్వస్తి
ఎప్పుడు : 2018 నవంబర్ నుంచి
ఎవరు : బకింగ్‌హామ్ ప్యాలెస్
ఎక్కడ : బ్రిటన్‌లో

ఒబామా కేర్ రద్దుకు ఆమోదం
ఒబామా కేర్‌ను రద్దు చేస్తూ, కొత్త వైద్య విధానానికి ఆమోదం తెలుపుతూ అమెరికా ప్రతినిధుల సభ మే 4న అనుకూలంగా ఓటేసింది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్‌కు 217-213 ఓట్ల తేడాతో సభ ఆమోదం తెలిపింది. డెమోక్రాట్ సభ్యులంతా కొత్త బిల్లును వ్యతిరేకించగా రిపబ్లికన్లు అనుకూలంగా ఓటేశారు. ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒబామా కేర్ రద్దుకు ఆమోదం
ఎప్పుడు : మే 4
ఎవరు : అమెరికా ప్రతినిధుల సభ
ఎక్కడ : అమెరికాలో
ఎందుకు : అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్‌ను తెచ్చేందుకు

కులభూషణ్ జాధవ్‌కు మరణశిక్షపై ఐసీజే స్టే
భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) మే 9న స్టే విధించింది. పదవీ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాధవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
గూఢచర్య ఆరోపణలపై జాధవ్‌కు పాక్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్ ఆయనను ఉరితీస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దౌత్యసంబంధాలు దెబ్బతింటాయని పాక్‌ను హెచ్చరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కులభూషణ్ జాధవ్‌కు మరణశిక్షపై స్టే
ఎప్పుడు : మే 9
ఎవరు : ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్
ఎక్కడ : హేగ్

ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మేక్రన్‌కు ఆధిక్యం
ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవికి జరిగిన తొలి విడత ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుకూల అభ్యర్థి, ఎన్ మార్చే పార్టీకి చెందిన ఇమ్మాన్యుయెల్ మేక్రన్ ఆధిక్యంలో ఉన్నారు. మే 7న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. 39 ఏళ్ల మేక్రన్ గెలిస్తే ఫ్రాన్స్‌కు అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడు అవుతారు. లిపెన్ (48) విజయం సాధిస్తే ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందుతారు.
Published date : 13 May 2017 02:20PM

Photo Stories