Hyderabad Population: జనాభాలోనూ హైదరాబాద్ గ్రేటరే.. 140 దేశాల కన్నా జనాభా ఎక్కువ..!
చాలా దేశాల జనాభా కోటికి లోపు ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం లెక్కల మేరకు 2020లో కోటి కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 90 లక్షలపైన కోటి లోపు జనాభా ఉన్న దేశాలు ఆరు ఉన్నాయి. లక్ష జనాభా కంటే తక్కువగా జనాభా దేశాలు 35 ఉన్నాయి. మన దేశానికి వస్తే.. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే కూడా హైదరాబాద్ జనాభాయే ఎక్కువ.
ఏదైనా రాష్ట్రం జనాభా అంటే కోట్లలో.. జిల్లా జనాభా అంటే లక్షల్లో ఉంటుందనేది మామూలే. కానీ మన గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా లక్షలనే కాదు.. కోటిని కూడా దాటేసింది. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా మేరకు గ్రేటర్ హైదరాబాద్ జనాభా ప్రస్తుతం 1.05 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి ఇది 1.08 కోట్లకు చేరనుంది.
దేశంలో జనా భా లెక్కల గణాంకాల మేరకు.. వందేళ్ల క్రితం అంటే 1921లో హైదరాబాద్ జనాభా 4.05 లక్షలు. 2011 నాటి లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 67.31 లక్షలకు చేరింది. కరోనా కారణంగా 2021లో జనగణన నిర్వహించలేదు. అయినా సుమారు 82 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం తీసుకుంటే జన సంఖ్య కోటికి పైనే ఉంటుందని తేల్చారు.