Telangana GSDP: తెలంగాణ జీఎస్‌డీపీలో 19.37% వృద్ధిరేటు
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ప్రస్తుత ధరల ప్రకారం 19.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే తలసరి ఆదాయంలో 19.19 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,48,115 కోట్లు, తలసరి ఆదాయం రూ.2, 75,443 గా తేలింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం సవరించిన అంచనాలను ప్రస్తుత, స్థిర ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ(ఎంఓఎస్‌పీఐ) విడుదల చేసింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో కరోనా నేపథ్యంలో తక్కువ వృద్ధిరేటు నమోదు కాగా 2021-22లో వృద్ధిరేటు పెరిగింది.
ఈ గణాంకాల ముఖ్యాంశాలు:
- జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల్లో ఒడిశా 20.55% వృద్ధిరేటుతో మొదటి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ 19.74%, తెలంగాణ 19.37% వృద్ధిరేటుతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తర్వాత స్థానాల్లో త్రిపుర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి.
- జీఎస్‌డీపీ స్థిర ధరల్లో 11.43 శాతం వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్ 11.04 శాతంతో రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో బీహార్, తెలంగాణ, ఒడిశా, దిల్లీ, మధ్యప్రదేశ్‌ఉన్నాయి
- తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో ఒడిశా 22.82% వృద్ధి రేటుతో ముందుంది. తెలంగాణ 19.19 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, త్రిపుర ఉన్నాయి. ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం సిక్కింలో రూ.4,72,543,కర్ణాటకలో రూ.2,78,786, తెలంగాణలో రూ.2,75,443 నమోదైంది. తర్వాత స్థానాల్లో హరియాణా, దిల్లీ, తమిళనాడు, ఏపీ ఉన్నాయి.
- తలసరి ఆదాయం స్థిర ధరల్లో రూ.2,63,477తో దిల్లీ మొదటి స్థానంలో, రూ.2,56,507తో సిక్కిం రెండో స్థానంలో, తర్వాత స్థానాల్లో హరియాణా(రూ.1,79,267),కర్ణాటక(రూ.1,68,050), తెలంగాణ(రూ.1,58,561), తమిళనాడు (రూ.1,54,427) ఉన్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 02 Sep 2022 05:37PM