Skip to main content

సెప్టెంబర్ 2017 ఎకానమీ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పెంపు
Current Affairs
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాల(ఎంఐజీ)కు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద అందిస్తున్న రూ.2.60 లక్షల వడ్డీ సబ్సిడీ గడువును 2019 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రధాని మోదీ ప్రారంభించిన రుణ అనుసంధానిత సబ్సిడీ పథకానికి(సీఎల్‌ఎస్‌ఎస్) తుదిగడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుండటంతో ప్రభుత్వం మరో 15 నెలలు పొడిగించింది.
2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ సొంతిళ్లు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. రూ.6-12 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలు 20 ఏళ్ల కాలపరిమితితో రూ.9 లక్షల వరకు తీసుకునే రుణాలపై కేంద్రం ప్రస్తుతం సీఎల్‌ఎస్‌ఎస్ కింద 4% సబ్సిడీని అందిస్తోంది. వార్షికాదాయం రూ.12-18 లక్షలు ఉండే మధ్య తరగతి కుటుంబాలకు 3% వడ్డీ సబ్సిడీని అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పెంపు
ఎప్పుడు : 2019 వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణం కోసం

"సౌభాగ్య" పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకాన్ని (ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన) ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రూ. 16,320 కోట్లతో డిసెంబర్ 2018 నాటికి దేశంలో విద్యుత్ సదుపాయం లేని కుటుంబాలకు కనెక్షన్లను అందచేస్తారు.
‘సౌభాగ్య’ పథకం వివరాలు
  • ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 16,320 కోట్లు..
  • గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణకు రూ. 14,025 కోట్లు
  • పట్టణాల్లో విద్యుదీకరణకు రూ. 2,295 కోట్లు
  • ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులు సమకూరుస్తాయి. మిగతా మొత్తం రుణాల రూపంలో సేకరిస్తారు.
  • సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్‌ఈసీసీ)- 2011 సమాచారం ఆధారంగా ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎస్‌ఈసీసీ కిందకు రాని వారికి కూడా విద్యుత్ కనెక్షన్లు లేకపోతే ఈ సదుపాయం కల్పిస్తారు. అయితే వారి నుంచి 500 రూపాయల్ని 10 వాయిదాల్లో విద్యుత్ బిల్లుల ద్వారా డిస్కంలు వసూలు చేస్తాయి.
  • గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఈసీ) ఈ పథకానికి దేశమంతా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌభాగ్య పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు

బాలకార్మిక రహిత సమాజానికి ‘పెన్సిల్’
బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ‘పెన్సిల్’ అనే పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 26న ఆవిష్కరించారు. ప్లాట్‌ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ దీని పూర్తి పేరు. బాలకార్మిక వ్యవస్థ రహిత సమాజ స్థాపనకు కేంద్రం, రాష్ట్రం, జిల్లా యంత్రాంగం, పౌరుల భాగస్వాములయ్యేందుకు ఈ ఫోరం వేదిక అవుతుందని రాజ్‌నాథ్ తెలిపారు. చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థ, ఫిర్యాదు విభాగం, జిల్లా యంత్రాంగ సమన్వయం, తదితర వ్యవస్థలు ఇందులో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెన్సిల్ పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు

బ్రాండ్జ్ ఇండియా నివేదికలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్
Current Affairs
దేశంలోని గొప్ప బ్రాండ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నంబర్ 1 గా తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ మేరకు దేశంలో అత్యంత విలువైన మొదటి 50 బ్రాండ్ల వివరాలను ‘బ్రాండ్‌‌జ ఇండియా టాప్ 50’ పేరుతో ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ, పరిశోధనా సంస్థ కంటార్ మిల్‌వర్డ్ బ్రౌన్ సంస్థలు సెప్టెంబర్ 14న ప్రకటించాయి.
ఈ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని నాలుగేళ్ల నుంచి కాపాడుకుంటు వస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. 2014 నుంచి తన బ్రాండ్ విలువను 9.4 బిలియన్ డాలర్ల నుంచి 18 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. కాగా కొత్తగా జాబితాలో 7 సంస్థలకు చోటు దక్కింది. టెలికంలోకి కొత్తగా ప్రవేశం చేసిన రిలయన్‌‌స జియో 11వ స్థానం సంపాదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రాండ్జ్ ఇండియా టాప్ 50
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : మొదటి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ
ఎక్కడ : భారత్‌లో

జీవనకాల గరిష్ఠానికి విదేశీ మారక నిల్వలు
విదేశీ మారక నిల్వలు జీవిత కాల గరిష్ఠానికి చేరాయి. గత వారం నిల్వలు 398.122 బిలయన్ డాలర్లతో పోలిస్తే, ఈ వారం 2.604 బిలియన్ డాలర్లు పెరిగి 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న తాజా గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు 2.568 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 376.209 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల్లో మార్పులు లేకుండా 20.691 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
విదేశీ మారక నిల్వలు 400 బిలియన్ డాలర్లకు చేరడం వల్ల, ఏడాది పాటు మన దిగుమతులకు సరిపోతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 400.726 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.
2015-16 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

బీపీసీఎల్‌కు మహారత్న హోదా
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 12న ‘మహారత్న’ హోదా ప్రకటించింది. నవరత్న కంపెనీ అయి ఉండి గత మూడేళ్లలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ.25,000 కోట్లకుపైగా సగటు వార్షిక టర్నోవర్ నమోదు చేసిన వాటికి ఈ హోదా ఇస్తారు. గత మూడేళ్లలో రూ.15,000 కోట్ల సగటు నికర విలువ, రూ.5000 కోట్ల సగటు వార్షిక నికర లాభం ఆర్జించి ఉండాలి. మహారత్న హోదా వచ్చిన ప్రభుత్వ కంపెనీలకు రూ.1000-5000 కోట్ల వరకు పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవ డానికి స్వేచ్ఛ ఉంటుంది. నవరత్న హోదా ఉన్నవాటికి ఈ పరిమితి రూ.1000 కోట్లు.

సుస్థిర ఆరోగ్య లక్ష్యాల సాధనలో128వ స్థానం
ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని ఆరోగ్య సంబంధ గమ్యాలను చేరుకోవడంలో భారత్ వెనకబడుతోందని ‘ది లాన్సెట్’ వైద్య పత్రిక సెప్టెంబర్ 12న తెలిపింది. ఈ లక్ష్యాలను 2030లోగా చేరుకోవాలి. ఈ దిశగా సాధించిన ప్రగతిలో వాయు కాలుష్యం, పారిశుద్ధ్యం, హెపటైటిస్-బి, పిల్లల్లో పోషకాహార లోపం వంటి అంశాల్లో బాగా వెనకబడిందని వివరించింది. 1990-2014లోని ధోరణులను విశ్లేషిస్తూ వాషింగ్టన్ వర్సిటీ అనుబంధ సంస్థ జరిపిన అధ్యయన ఫలితాలను ‘ది లాన్సెట్’ పేర్కొంది. 180 దేశాలకు సంబంధించి 2030 నాటికి ఉండబోయే పరిస్థితిపై అంచనాలు రూపొందించింది.

ఉద్యోగ కల్పనకు నీతిఆయోగ్ టాస్క్‌ఫోర్స్
దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ దీనికి నేతృత్వం వహిస్తారు. పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెంచడం, సంఘటిత రంగంలో సవాళ్లను అధిగమించడం ద్వారా ఉద్యోగ అవకాశాల పెంపుదలపై నిపుణులతో కూడిన ఈ టాస్‌్టఫోర్స్ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఉద్యోగ కల్పనకు నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చేందుకు

2020 నాటికి తట్టు రహిత దేశంగా భారత్
భారత్‌తో పాటు ఆగ్నేయాసియాలోని మరో నాలుగు దేశాలను(బంగ్లాదేశ్, మయన్మార్, తైమూర్, ఇండోనేషియా) 2020 నాటికి తట్టు(మీసెల్స్) రహిత ప్రాంతాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్యో సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అలాగే.. 2018 నాటికి ఈ దేశాల్లోని 400 మిలియన్ల చిన్నారులకు తట్టు నిరోధక టికాలను సరఫరా చేయనుంది.
డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం వైరస్ కారణంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా యేటా 1,34,200 మంది చిన్నారులు మరణిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
తట్టు రహిత దేశంగా భారత్
ఎప్పుడు : 2020 నాటికి
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రత్యేక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ విభాగం
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన మొబైల్ టవర్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సెప్టెంబర్ 12న ఆమోదముద్ర వేసింది. దేశీయంగా ప్రస్తుతం 4,42,000 మొబైల్ టవర్స్ ఉండగా, వీటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందినవి 66,000 పైచిలుకు ఉన్నాయి. టవర్స్ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని టెల్కోలకు అద్దెకివ్వడం ద్వారా కొత్త కంపెనీ మరింత ఆదాయం ఆర్జించగలిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ప్రత్యేక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ విభాగం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్

పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ' స్కూల్ చలో అభియాన్'
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కూల్ చలో అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది. సెప్టెంబర్ 8న 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో పాల్గొన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా పాఠశాలలకు దూరంగా ఉన్న 70లక్షల నుంచి 80 లక్షల మంది చిన్నారులను బడుల్లో చేర్పిస్తారు.

రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయి : ఆర్‌బీఐ
Current Affairs
నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ.1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99% బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికను ఆగస్టు 30న విడుదల చేసిన ఆర్‌బీఐ.. నోట్ల రద్దు తదనంతర ఫలితాలను ఇందులో వివరించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
  • రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు.
  • నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో 98.6% నోట్లు బ్యాంకుల్లో జమకాగా కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోనికి రాలేదు.
  • కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు భారీగా పెరిగింది. 2015-16లో రూ. 3,421 కోట్లు ఖర్చు కాగా, 2016-17లో అది రెండింతలు దాటి రూ. 7,965 కోట్లకు చేరింది.
  • చలామణిలో ఉన్న నగదు విలువ 2017 మార్చి నాటికి 13.1 లక్షల కోట్లు. గత సంవత్సరం కన్నా ఇది 20.2% తక్కువ.
  • ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3%గా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకులకు తిరిగొచ్చిన 99 శాతం రద్దయిన నోట్లు
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

2017-18 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతం
2017-18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి- మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తరవాత అత్యంత తక్కువ ఇదే. ఈ మేరకు ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం(CSO) ఆగస్టు 31న విడుదల చేసింది. జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్) 5.6 శాతంగా నమోదైందని వెల్లడించింది.
గతేడాది ఇదే కాలంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతం
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : కేంద్ర గణాంకాల కార్యాలయం

ఆధార్-పాన్ అనుసంధానం గడువు పెంపు
ఆధార్-పాన్ అనుసంధానం గడువుని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 31న ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువునిచ్చింది.
పన్ను చెల్లింపుదారులు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు ఆగస్ట్ 31తో ముగిసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ - పాన్ అనుసంధానం గడువు పెంపు
ఎప్పుడు : డిసెంబర్ 31 వరకు
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ

వ్యవసాయ పథకాల్లో మహిళా రైతులకు 30 శాతం నిధులు
వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే మహిళా రైతుల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మహిళా స్వయం సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాలని భావిస్తోంది. అలాగే.. 2016లో నిర్ణయించిన విధంగా ఏటా అక్టోబర్ 15వ తేదీని మహిళా రైతు దినోత్సవంగా పాటించాలని స్పష్టంచేసింది.
దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారేనని జాతీయ నమూనా సర్వే తేల్చింది. ఆ 80 శాతం మందిలో 33 శాతం మహిళలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. 48 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి కలిగిన మహిళా రైతులున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యవసాయ పథకాల్లో మహిళా రైతులకు 30 శాతం నిధులు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 16 Sep 2017 02:54PM

Photo Stories