Reserve Bank of India: ఇక రీ–కేవైసీ కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు..
చెల్లుబాటు అయ్యే పత్రాలను ఖాతాదారులు ఇప్పటికే బ్యాంక్‌కు సమర్పించి తమ చిరునామాను మార్చుకోనట్లయితే.. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇకపై వారి బ్యాంక్ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కేవైసీ సమాచారంలో ఎటువంటి మార్పు లేకుంటే కస్టమర్లు నమోదిత ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా స్వీయ డిక్లరేషన్‌ను సమర్పించవచ్చు.
కేవైసీ అప్‌డేషన్ కోసం కస్టమర్లు శాఖల సందర్శన కోసం బ్యాంకులు పట్టుబట్టరాదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్న నేపథ్యంలో.. రిజర్వ్ బ్యాంక్ జనవరి 5న దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం కేవైసీ సమాచారంలో ఎటువంటి మార్పు లేకుంటే.. తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారు నుండి సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. ఇందుకు తగు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. చిరునామాలో మార్పు మాత్రమే ఉన్నట్లయితే వినియోగదార్లు ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సవరించిన/నవీకరించిన చిరునామాను అందించవచ్చు.