GSTకి ఐదేళ్లు పూర్తి
వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్‌టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్‌టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్‌టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్‌టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్‌టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్‌టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం.
Also read: Mahaveer Chakra కల్నల్ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారం