Skip to main content

డిసెంబర్ 2017 ఎకానమీ

టెక్స్‌టైల్స్ నైపుణ్యాభివృద్ధికి రూ.1300 కోట్లు
Current Affairs
వ్యవస్థీకృత టెక్స్‌టైల్స్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన పెంచేందుకు రూ.1300 కోట్ల వ్యయంతో కొత్త పథకానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’ పేరిట టెక్స్‌టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్ది సర్టిఫికెట్లు ఇస్తారు. వారిలో కనీసం 70 శాతం మందికి స్థిర వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘టెక్స్‌టైల్స్’లో నైపుణ్యాభివృద్ధికి ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : టెక్స్‌టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు

దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు
దేశంలో వ్యక్తిగత ఆదాయం రూ.కోటికి పైగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తమకు మొత్తం మీద రూ.కోటి, అంతకు మించి ఆదాయం ఉందంటూ 59,830 మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. వీరు ప్రకటించిన ఉమ్మడి ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు. ఆదాయపన్ను శాఖ ఈ గణాంకాలను డిసెంబర్ 20న విడుదల చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటికిపైగా ఆదాయం ఉందంటూ రిటర్నులు వేసిన వ్యక్తుల సంఖ్య 48,417 కాగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.2.05 లక్షల కోట్లు. అంటే ఏడాది తిరిగేసరికి ఆదాయ లెక్కలు చూపించిన కోటీశ్వరుల సంఖ్య పెరగ్గా, వీరి ఉమ్మడి ఆదాయం మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ
భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5-7 ట్రిలియన్ డాలర్ల (6.5-7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ డిసెంబర్ 21న పేర్కొన్నారు. 2035-40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏడవది. ఇక తలసరి ఆదాయం సైతం 2030 నాటికి 4,000 డాలర్లకు (ప్రసుతం 1,709 డాలర్లు)చేరే అవకాశం ఉందని స్కోచ్ సదస్సులో పాల్గొన్న వివేక్ దేబ్రాయ్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్

దేశీ ఈ-కామర్స్ మార్కెట్ - 50 బిలియన్ డాలర్లు
దేశీ ఈ-కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. ఇంటర్నెట్ వినియోగం, ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు తోడ్పడనుంది. దేశీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచామ్-కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2013లో 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 2015లో 19.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్స్.. ఇంటర్నెట్ వినియోగం, ఎం-కామర్స్ అమ్మకాలు పెరగడం, రవాణా.. చెల్లింపులకోసం అత్యాధునిక ఆప్షన్‌‌స అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మొదలైనవి ఈ-కామర్స్ అసాధారణ వృద్ధికి ఊతమిస్తున్నాయని నివేదిక వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 50 బిలియన్ డాలర్ల స్థాయికి దేశీ ఈ - కామర్స్ మార్కెట్
ఎప్పుడు : 2018 నాటికి
ఎవరు : అసోచామ్-డెలాయిట్ నివేదిక

ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 జిల్లాల గుర్తింపు
Current Affairs
దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 జిల్లాలను నీతి ఆయోగ్ గుర్తించింది. వెనుకబాటుతనం, పేదరికం, తీవ్రవాద ప్రాబల్యంతో పాటు అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, తాగునీరు, విద్యుత్ వసతి వంటి కీలకమైన మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని ఈ జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో 35 జిల్లాలు వామపక్ష తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2022 న్యూ ఇండియా లక్ష్య సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ఈ జాబితాలో తెలంగాణ నుంచి జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలు స్థానం పొందాయి.
రాష్ట్రాల వారీగా గుర్తించిన జిల్లాల జాబితా కోసం క్లిక్ చేయండి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 వెనుకబడిన జిల్లాల గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు

2018 జూన్ నుంచి ఈ-వే బిల్లింగ్
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం 2018 జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ-వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్‌వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ-వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ-వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ - వే బిల్లింగ్
ఎప్పుడు : 2018 జూన్ 1 నుంచి
ఎవరు : జీఎస్టీ మండలి
ఎక్కడ : దేశవ్యాప్తంగా

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు
పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలకు ఊతమివ్వడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో భాగంగా రోడ్ ట్యాక్స్ తగ్గింపు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశ జీడీపీ వృద్ధి, ఉపాధి కల్పనలో ఆటోమొబైల్ రంగం కీలకపాత్ర పోషించడం కొనసాగేలా తోడ్పాటు అందించనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంలో ఆటోమొబైల్స్, బ్యాటరీల తయారీ హబ్‌గా మారాలని పరిశ్రమల సమాఖ్య అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు.

4.88 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.88 శాతంగా నమోదైంది. ఇది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం కంటే అధికం. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్రం డిసెంబర్ 12న విడుదల చేసింది.
3.93 శాతంగా టోకు ధరల ద్రవ్యోల్బణం
నవంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదైంది. కాగా, గత ఎనిమిది నెలల కాలంలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి.

డీబీటీ భారత్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
Current Affairs
కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు ‘డీబీటీ భారత్’ పేరుతో కేంద్రం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో డీబీటీ సెల్‌లు ఏర్పాటు చేసింది.
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం వల్ల కేంద్రానికి తొలి ఏడాదిలోనే రూ.29 వేల కోట్లు ఆదా అయింది. దీంతో ఇతర పథకాలైన వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి శిక్షణ, ఉపాధి హామీ నిధులు, అంగన్ వాడీ పథకాల్లో సబ్సిడీని నేరుగా వినియోగదారులకే అందిస్తోంది. డీబీటీతో 2016-17లో రూ.57,029 కోట్లు ఆదా అయినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 395 కేంద్ర పథకాలు అమలవుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీబీటీ భారత్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : లబ్ధిదారుల వివరాల్లో పారదర్శకత కోసం

వృద్ధి రేటును 6.7 శాతానికి కుదించిన ఏడీబీ
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఈ అంచనాను ఇంతకు ముందు 7 శాతంగా పేర్కొన్న ఏడీబీ.. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ తొలి దశ ప్రతికూలాంశాలు, రుతుపవనాలు, వ్యవసాయంపై సంబంధిత ప్రభావం వంటి అంశాలను కారణంగా చూపుతూ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2018-19 వృద్ధి అంచనాలను కూడా 7.4 శాతం నుంచి 7.3 శాతానికి కుదించింది. క్రూడ్ ధరల పెరుగుదల, ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. 2017-18 ద్రవ్యోల్బణం ఇంతకు ముందు ఉన్న 4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించింది.
భారత వృద్ధిరేటుపై వివిధ సంస్థల అంచనాలు
  • ప్రపంచబ్యాంక్ 2017-18 వృద్ధి అంచనాను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20 నాటికి 7.4 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది.
  • 2017-18కి ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) వృద్ధి అంచనా 6.7 శాతం.
  • ఫిచ్ రేటింగ్స్ కూడా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018-19కి 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.
  • మూడీస్ 2017-18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
  • 2017-20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్స్ విశ్లేషించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
భారత్ వృద్ధి రేటు 6.7 శాతానికి కుదింపు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్
ఎందుకు : డీమోనిటైజేషన్, జీఎస్‌టీ ప్రతికూలాంశాలు, వ్యవసాయంపై రుతుపవనాల ప్రభావం

7.2 బిలియన్ డాలర్లకు క్యాడ్
2017-18 రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారత కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 7.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇదే త్రైమాసికం జీడీపీ విలువలో ఇది 1.2 శాతం. గతేడాది ఇదే త్రైమాసికంలో క్యాడ్ విలువ 3.4 బిలియన్లు మాత్రమే. అప్పటి త్రైమాసిక జీడీపీ విలువలో ఇది 0.6 శాతం.
దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం నుంచి దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్యాన్ని తీసేస్తే మిగిలే నికర విలువను కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అంటారు. వీటి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి వచ్చే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) మినహాయిస్తారు. ఒకదేశ ఎగుమతుల విలువ కన్నా- దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడమే (వాణిజ్యలోటు) ఆ దేశ క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణం. 2017-18 మొదటి 6 నెలల కాలంలో భారత్ వాణిజ్యలోటు 49.4 బిలియన్ డాలర్ల నుంచి 74.8 బిలియన్ డాలర్లకు పెరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7.2 బిలియన్ డాలర్లు పెరిగిన క్యాడ్
ఎప్పుడు : 2017-18 రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)
ఎందుకు : దిగుమతుల విలువ ఎక్కువగా ఉండటం వల్ల

రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
Current Affairs
పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్), వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలానికి వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్రీయ గణాంకాల విభాగం (సీఎస్‌ఓ) నివేదిక నవంబర్ 30న ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతంతో పోలిస్తే క్యూ2లో ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబర్చింది.
నివేదిక ముఖ్యాంశాలు
  • క్యూ2లో తయారీ రంగం 7 శాతం వృద్ధి నమోదు చేయగా సేవల రంగం వృద్ధి 7.1 శాతానికి పెరిగింది.
  • మైనింగ్ రంగంలో వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదైంది.
  • నిర్మాణ రంగం 2.6 శాతం; ఫైనాన్షియల్, బీమా, రియల్ ఎస్టేట్ ఇతర ప్రొఫెషనల్ సేవల రంగానికి సంబంధించి 5.7 శాతం వృద్ధి నమోదైంది.
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతరత్రా విభాగాల వృద్ధి రేటు 6 శాతంగా ఉంది.
  • వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల రంగం క్యూ2లో 1.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
  • స్థూల విలువ ఆధారిత(గ్రాస్ వేల్యూ యాడెడ్-జీవీఏ) వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్ కాలంలో 6.1 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 6.8% కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 5.6 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
ఎప్పుడు : జులై - సెప్టెంబర్
ఎవరు : కేంద్ర గణాంకాల విభాగం

రూపాయి నోటుకి వందేళ్లు పూర్తి
భారత కాగితపు కరెన్సీలో అతి తక్కువ విలువ కలిగిన రూపాయి నోటు నవంబర్ 30 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నోటును 1917 నవంబర్ 30న అప్పటి ప్రభుత్వం బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది.
మొదట నోటును ముద్రించినపుడు ఒక్క రూపాయికి 10 గ్రాముల వెండి నాణెం విలువ ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయుధాల విడిభాగాల తయారీకి రూపాయి వెండి నాణేలను కరిగించడంతో రూపాయి నోట్లను ముద్రించాల్సి వచ్చింది.
రూపాయి నోటు - ఆసక్తికర అంశాలు
  • 1917 నవంబర్ 30న అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జి-5 బొమ్మతో విడుదల చేశారు. 1926లో దాన్ని ఉపసంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా కింగ్‌జార్జి-6 బొమ్మతో మళ్లీ ప్రవేశ పెట్టారు.
  • రూపాయి నోటును ఉస్మానియా, హైదరాబాద్ రాష్ట్రంలో 1919, 1943, 1946లలో విడుదల చేశారు.
  • 1949లో 4 సింహాలు, అశోక చక్రం బొమ్మలతో కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టారు.
  • అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్‌కే మీనన్ సంతకంతో వెలువడ్డ కొత్త డిజైన్ నోట్లు పాకిస్తాన్‌లోనూ చెలామణి కాగా 1949లో రద్దు చేశారు.
  • భారత్ గణతంత్ర దేశంగా మారిన తర్వాత విడుదల చేసిన అన్ని ఒక్క రూపాయి నోట్లపై దేశ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాలు ఉండగా, మిగతా అన్ని కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకాలున్నాయి.
  • రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వం అని ముద్రిస్తుండగా, మిగతా కరెన్సీ నోట్లపై భారతీయ రిజర్వ్‌బ్యాంక్ అని ముద్రించి ఉంటుంది.
  • 1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా ఆయన బొమ్మతో ఉన్న రూపాయి నోటు విడుదలైంది.
  • ఉత్పత్తి ఖర్చు బాగా పెరగడంతో 1995లో రూపాయి డిజైన్‌ను ఉపసంహరించారు. 2016లో పునర్ ముద్రణను ఆర్‌బీఐ మొదలుపెట్టింది.
  • 2017లో కొత్త టెలిస్కోపిక్ సిరీస్‌తో రూపాయి నోటును ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : బ్రిటిష్ ప్రభుత్వం

జాతీయ పోషకాహార మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణమే లక్ష్యంగా జాతీయ పోషకాహార మిషన్ (ఎన్‌ఎన్‌ఎం)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా తక్కువ బరువుతో జన్మించడం, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను ఆరోగ్యవంతులను చేయడానికి పలు పథకాలను అమలు చేస్తారు. దీని కోసం బడ్జెట్‌లో రూ.9,046 కోట్లు కేటాయించారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38.4 శాతం మంది (పిల్లలు, మహిళలు) రకరకాల పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. దీనిని 2022 నాటికి 25 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న బాలికలు, మహిళల సంఖ్యను ఏటా 3 శాతం తగ్గిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పోషకాహార మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : పోషకాహార లోపంతో బాధ, తక్కువ బరువుతో జన్మిస్తున్న పిల్లల సంఖ్యను ఏటా రెండు శాతం తగ్గించేందుకు

భారతవృద్ధి రేటును 6.7 శాతానికి తగ్గించిన ఫిచ్
ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఇందుకు కారణం దేశంలో ఆర్థిక రికవరీ బాగా నెమ్మదిగా ఉందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో (జీఈఓ) పేర్కొంది.
మొదటి త్రైమాసికంలో వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోగా, రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) ఈ రేటు 6.3 శాతానికి పెరిగింది. ఇటీవల మూడీస్ భారత్ రేటింగ్‌ను ‘బీబీబీ మైనస్’ స్థాయి నుంచి ‘బీబీబీ 2’ స్థాయికి పెంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఫిచ్ రేటింగ్ సంస్థ
ఎందుకు : ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉండటం వల్ల

విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు
ఎగుమతుల బలోపేతమే లక్ష్యంగా విదేశీ వాణిజ్య విధానానికి (ఎఫ్‌టీపీ) కేంద్ర ప్రభుత్వం మరిన్ని పోత్సాహకాలను జతచేసింది. ఈ మేరకు 2015-20 వాణిజ్య విధానాన్ని మధ్యంతరంగా సమీక్షించిన కేంద్రం డిసెంబర్ 5న ఎఫ్‌టీపీని విడుదల చేసింది.
ఎఫ్‌టీపీ ప్రధానాంశాలు
  • సరుకుల ఎగుమతి పథకం (ఎంఈఐఎస్) ప్రోత్సాహకాలను రెడీమేడ్ గార్మెంట్స్‌పై 2 శాతం పెంచారు. దీంతో ఎంఈఐఎస్ వార్షిక బడ్జెట్ 34 శాతం పెరిగి రూ.8,450 కోట్లకు చేరింది.
  • సేవల ఎగుమతుల పథకం (ఎస్‌ఈఐఎస్) కింద ప్రోత్సాహకాలను 2 శాతం పెంచి బడ్జెట్ రూ.1,140 కోట్లు చేశారు.
  • సెజ్‌లకు సరఫరా చేసే వస్తు, సేవలను జీఎస్టీ కింద సున్నా రేటుగా పరిగణిస్తారు.
  • డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ చెల్లుబాటు కాలాన్ని 18 నెలల నుంచి 24 నెలలకు పెంచారు.
  • లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించేందుకు గాను నూతన విభాగం ఏర్పాటు
  • డేటా ఆధారిత విధాన చర్యలకు డీజీఎఫ్‌టీ పేరుతో అనలైటిక్స్ డివిజన్ ఏర్పాటు
  • విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు నూతన విధానం.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ఉపాధి కల్పన
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ వాణిజ్య విధానంలో మరిన్ని ప్రోత్సాహకాలు
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఎగుమతులను ప్రోత్సహించడానికి

ప్రభుత్వ రుణ భారం 65 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ రుణ భారం 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 2.53 శాతం పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.64,03,138 కోట్లున్న ప్రభుత్వ రుణం, సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి రూ.65,65,652 కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వ రుణ నిర్వహణ విభాగం ప్రకటించింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణ వాటా 93 శాతం. ఇందులో మార్కెట్ బాండ్ల వాటా 82.6 శాతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 65 లక్షల కోట్లు దాటిన ప్రభుత్వ రుణ భారం
ఎప్పుడు : డిసెంబర్ 5 (2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో)
ఎక్కడ : కేంద్రంలో

ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథం
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన డిసెంబర్ 6న జరిగిన ఎంపీసీ సమావేశం రెపో రేటును 6 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగా కొనసాగిస్తూ తాజా నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ద్రవ్యోల్బణం 4.3-4.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతం.
రివర్స్ రెపో రేటు 5.75 శాతం.
2017-18 జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతం
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ
Published date : 16 Dec 2017 03:27PM

Photo Stories