Skip to main content

అక్టోబర్ 2018 ఎకానమీ

30 సార్లు సమావేశమైన జీఎస్టీ మండలి
Current Affairs కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) మండలి గత రెండేళ్లలో 30 సార్లు సమావేశమైందని కేంద్ర ఆర్థిక శాఖ అక్టోబర్ 28న తెలిపింది. ఈ కాలంలో జీఎస్టీకి సంబంధించి మొత్తం 918 నిర్ణయాలను జీఎస్టీ మండలి తీసుకుంది. ఇందులో జీఎస్టీ విధి విధానాలు, రేట్లు, పరిహారం వంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 96 శాతం నిర్ణయాలను అమలు చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ జీఎస్టీకి శ్రీకారం చుట్టగా 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 30 సార్లు సమావేశమైన జీఎస్టీ మండలి
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ

సులభతర వాణిజ్యంలో భారత్‌కు 77వ ర్యాంకు
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో భారత్‌కు 77వ ర్యాంకు లభించింది. ఈ మేరకు ‘డూయింగ్ బిజినెస్-2019’ నివేదిక ను ప్రపంచబ్యాంకు అక్టోబర్ 31న విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని పరిస్థితులను పది పరామితుల ఆధారంగా అంచనా వేసి ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులను ప్రకటించింది. 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్.. గత ఏడాది 100కి, ఈ ఏడాది 77కి చేరింది. దీంతో వరుసగా రెండేళ్లు అత్యధిక ర్యాంకులు అధిగమించిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. బ్రిక్స్, దక్షిణాసియా దేశాల్లో అత్యుత్తమ పురోగతి సాధించిన తొలి దేశంగా నిలిచింది. ర్యాంకుల పరంగా 2014లో దక్షిణాసియా దేశాల్లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒకటో స్థానానికి చేరింది.
డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలవగా సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా 8వ స్థానంలో చైనా 46వ స్థానంలో, పాకిస్థాన్ 136వ స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సలభతర వాణిజ్యంలో భారత్‌కు 77వ ర్యాంకు
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రపంచబ్యాంకు

భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువ : మూడీస్
Current Affairs బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అక్టోబర్ 22న వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని పేర్కొంది. మార్కెట్లో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత దెబ్బతింటోందని పేర్కొంది.
మరోవైపు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా బ్యాంకులు అసెట్స్‌పై అత్యధిక రాబడులు నమోదు చేస్తున్నాయని వివరించింది. బ్రిక్స్ కూటమిలో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
మొండిబాకీల్లో రెండో స్థానం...
మొండిబాకీల విషయంలో బ్రిక్స్ కూటమిలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు మూడీస్ వెల్లడించింది. 2017 ఆఖరు నాటికి నిరర్ధక రుణాల నిష్పత్తి (ఎన్‌పీఎల్) రష్యన్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఎస్‌బీఐ నిధుల సమీకరణ...
2018-19 ఆర్థికం సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.25,000 కోట్లు సమీకరించడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో రూ.5,000 కోట్లు బాండ్ల (బాసెల్ 3 టైర్ టూ బాండ్‌‌స) ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. క్యాపిటల్ అడిక్వెసీ (మూలధన) నిబంధనల ప్రమాణాలకు దీటుగా ఈ నిధులను సమీకరించనున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువ
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్
ఎక్కడ : బ్రిక్స్ కూటమిలోని దేశాలలో

హెంజ్ ఇండియాను కొనుగోలు చేయనున్న జైడస్
అమెరికాకి చెందిన క్రాఫ్ట్ హెంజ్ భారత విభాగమైన హెంజ్ ఇండియా సంస్థను కన్జ్యూమర్ ఉత్పత్తుల సంస్థ జైడస్ వెల్‌నెస్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు క్యాడిలా హెల్త్‌కేర్‌తో కలిసి ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అక్టోబర్ 24న జైడస్ ప్రకటించింది. సుమారు రూ. 4,595 కోట్ల విలువైన ఈ ఒప్పందం 2019 మార్చి నాటికి పూర్తవుతుందని జైడస్, క్యాడిలా హెల్త్‌కేర్ తెలియజేశాయి.
హెంజ్ ఇండియా కొనుగోలుతో ఎనర్జీ డ్రింక్ గ్లూకోన్-డీ, టాల్కం పౌడర్ బ్రాండ్ నైసిల్, నెయి్య బ్రాండ్ సంప్రీతి వంటి ఉత్పత్తులు జైడస్, క్యాడిలా సంస్థల పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నాయి. అలాగే భారత్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో కాంప్లాన్ ఉత్పత్తికి సంబంధించిన మేధో హక్కులు కూడా వీటికి లభిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెంజ్ ఇండియాను కొనుగోలు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : జైడస్ వెల్‌నెస్, క్యాడిలా హెల్త్‌కేర్

భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు కమిటీ
Current Affairs భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థను అధ్యయనం చేసి విప్లవాత్మక అభివృద్ధి ఎజెండాను రూపొందించేందుకు నీతిఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా ముందుకొచ్చారు. ‘ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి లోతైన పరిశోధన, అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశామ’ని పనగరియా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు
ఎవరు: ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా
ఎక్కడ: భారతదేశం
ఎందుకు : భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ప్రపంచబ్యాంకు
Current Affairs 2018-19 ఆర్థికం సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుంద ని ప్రపంచ బ్యాంకు అక్టోబర్ 7న అంచనా వేసింది. అలాగే 2019-20, 2020-21లో వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. ప్రైవేటు వ్యయాలు బలంగా ఉండడం, ఎగుమతుల్లో వృద్ధి భారత్‌కు అనుకూలమని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : 2018-19
ఎవరు : ప్రపంచ బ్యాంక్

భారత్‌లో పెరుగుతున్న వ్యక్తిగత సంపద
భారత్‌లో వ్యక్తుల సంపద ఏటా 13 శాతం చొప్పున పెరుగుతుందని, 2022 నాటికి ఇది 5లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబర్ 8న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2017లో భారతీయుల వ్యక్తిగత సంపద 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
మరోవైపు వ్యక్తుల మొత్తం వ్యక్తిగత సంపద విలువ ఆధారంగా చూస్తే... 2022 నాటికి ప్రపంచంలో 11వ సంపన్న దేశంగా భారత్ అవతరిస్తుందని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. ఈ విషయంలో 80 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా 2017 నాటికి అగ్ర స్థానంలో ఉండగా, 2022 నాటికి ఇది 100 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపింది. 21 లక్షల కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉందని వివరించింది. 2017 నాటికి భారత్‌లో 3,22,000 మంది అధిక ధనవంతులు ఉంటే, ఇందులో అధిక సంపద కలిగిన వారి సంఖ్య 87,000గా ఉంది. అలాగే 4,000 మంది అధిక సంపన్నులు కూడా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో వ్యక్తుల సంపద ఏటా 13 శాతం పెరుగుదల
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ)

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్
2018లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా, 2019లో 7.4 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఈ మేరకు ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ పేరుతో అక్టోబర్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తంగా 2018 ఏడాది ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను భారత్ కైవసం చేసుకుంటుందని ఐఎంఎఫ్ తన నివేదికలో వివరించింది.
2017లో భారత్ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదుకాగా 6.9 శాతంతో చైనా మొదటి స్థానంలో ఉంది. అయితే 2018లో చైనా వృద్ధి రేటు 6.6 శాతం, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ఐంఎంఎఫ్ అంచనా వేసింది.
మరోవైపు ప్రపంచ వృద్ధి రేటును 0.2 శాతం మేర ఐఎంఎఫ్ తగ్గించింది. వాణిజ్య యుద్ధం, క్రూడ్ ధరల పెరుగుదల వంటి పలు సమస్యలను ప్రపంచ ఆర్థిక వ్యవ స్థ ఎదుర్కొంటుండటంతో ఈ మేరకు తగ్గించింది. 2018, 2019లో ప్రపంచ వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంటుందని వెల్లడించింది. 2017లో కూడా ఇదే ప్రపంచ వృద్ధి రేటు నమోదైంది. అమెరికా 2018లో 2.9 శాతం వృద్ధి రేటును 2019లో 2.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : 2018
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)

ఎన్‌బీఐతో ఎస్‌బీఐ ఒప్పందం

ఖాట్మండు నేషనల్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌బీఐ)తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. మౌలిక, పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకునేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అక్టోబర్ 10న ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని
ఎస్‌బీఐ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖాట్మండు నేషనల్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్‌తో అవగాహన ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రబీ పంటలకు మద్దతు ధర పెంపు
Current Affairs 2018-19 వ్యవసాయ సంవత్సరానికి వర్తించేలా రబీ పంటల మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 3న పెంచింది. దీంతో గోధుమ, బార్లీ, శనగ, ఆవాలు, తెల్ల కుసుమలు, మసూర్ పంటల మద్దతు ధరలు 6 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. తాజా పెంపు వల్ల రూ.62,635 కోట్లు అదనంగా రైతులకు అందనున్నాయి.
గోధుమ ఎమ్మెస్పీని కేంద్రం రూ. 105 పెంచడంతో గోధుమ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,840కి చేరింది. అలాగే ప్రతి క్వింటాల్‌కు బార్లీకి రూ. 30 (పెంపు తర్వాత మద్దత ధర రూ. 1,440), శనగలకు రూ. 220 (రూ. 4,620), మసూర్‌కు రూ. 225(రూ. 4,475), ఆవాలకు రూ. 200(రూ. 4,200), తెల్ల కుసుమలకు రూ. 845(రూ. 4,945)ల మద్దతు ధరలను కేంద్రం పెంచింది. మద్దతు ధరల పెంపు, రుణమాఫీ కోరుతూ రైతులు ఢిల్లీలో అక్టోబర్ 2న నిరసన ర్యాలీ నిర్వహించారు.
2018 జూలైలో వివిధ ఖరీఫ్ పంటల మద్దతు ధరలను పెంచిన కేంద్రం అన్ని పంటలకూ పెట్టుబడి కన్నా మద్దతు ధర 50 శాతం ఎక్కువగా ఉండేలా చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రబీ పంటలకు మద్దతు ధర పెంపు
ఎప్పుడు : 2018-19 వ్యవసాయ సంవత్సరానికి
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 24 Oct 2018 03:40PM

Photo Stories