National Youth Day 2023: వివేకానందుడి రచనలు చదవడంతో.. వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది
‘ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహ నీయుని చిత్తరువు ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు ఓ రష్యన్ చింతనాశీలి. జీవితంలో సమస్యలనేవి ప్రతీ వ్యక్తికీ ఉండేవే. ఆ వ్యక్తి విద్యార్థి కావచ్చు, కార్మికుడు కావచ్చు, రైతు కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, గృహిణి కావచ్చు, మరెవరైనా కావచ్చు. సమస్యలనేవి సర్వసాధారణమైతే, సమ స్యను అవగాహన చేసుకొనే ప్రయత్నం చేయడానికి కావలసిన సామర్థ్యం పెంచుకుంటే సమస్యలు పరిష్కరించడం పెద్ద విశేషం కాదని వివేకానందుడు అన్న మాటలు సదా స్మరణీయం. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చెప్పిన వాక్యాలు విన్నా ఆలోచింపజేస్తాయి. కాని స్వామి వివేకానందుడు చెప్పిన అమృత వాక్యాలు మాత్రం యువతను ప్రేరేపించి, ఆచరింపజేస్తున్నాయి.
ఇద్దరు వ్యక్తుల ఆదర్శాలు ఒకేలా ఉండకపోవచ్చు. కాని ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తి ఆదర్శాన్ని స్వీకరించి గొప్ప నేతలుగా ఎదగవచ్చనేది మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌లు నిరూపించారు. ఆ ఒక్క వ్యక్తి వివేకానందుడే నని వేరే చెప్పనవసరం లేదు. గాంధీజీ, బోస్‌బాబులు విభిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆదర్శాలు కలిగి ఉన్నవారని చరిత్రకారుల వాదనల సారాంశం.
వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది
‘నేను స్వామి వివేకానందుడి రచనలు చదవడం ద్వారా నాలో వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’ అని గాంధీజీ అంటే.. సుభాష్ చంద్రబోస్ ‘స్వామి వివేకానందుని రచనలు చదువుతుంటే నా ఒంట్లో రక్తం ఉప్పొంగుతుంది కదా! ఆయనను విన్నవారు ఇంక ఎంత అనుభూతిని పొంది ఉంటారో? ఆయన బ్రతికి ఉన్నట్లయితే పాదాల చెంత కూర్చొని ఆయన ఏమి చెబితే అది చేసేవాణ్ణి’ అన్నారు. ఈ మహానేతలు వివేకానందుని మాటలకు ఎంతగా ప్రభావితులు అయ్యారో ఈ మాటలే తెలియజేస్తాయి. ఇవ్వాళ దేశానికి కావలసింది ఇలాంటి ప్రభావ వంతమైన స్ఫూర్తి ప్రదాతలే.
విద్య పట్ల వివేకానందుని అభిప్రాయాలు అత్యున్నతమైనవి. విద్యా వ్యవస్థను ఆయన భావాలకు అనుగుణంగా రూపొందించగలిగితే కాబోయే భారత పౌరులందరూ జాతి రత్నాలుగానే భాసిస్తారు. అప్పుడు తాము పుట్టిన ఊరినే కాదు, దేశాన్నీ, ప్రపంచాన్నీ ఉద్దరించగల మహానుభావులు ప్రపంచానికి అందుతారు.