Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 5 కరెంట్‌ అఫైర్స్‌

Pegasus spyware

NSO Group: పెగాసస్‌ స్పైవేర్‌పై ఆంక్షలు విధించిన దేశం?

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తయారు చేసిన పెగాసస్‌ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో పాటు నిఘా పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్‌కే చెందిన మరో సంస్థ ‘కాండిరూ’ను నియంత్రిత సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు అమెరికా వాణిజ్యశాఖ నవంబర్‌ 3న ప్రకటించింది. ఈ సంస్థల ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని జో బైడెన్‌ సర్కారు పేర్కొంది. నియంత్రిత సంస్థల జాబితాలో చేరిస్తే... ఈ సంస్థలకు అమెరికా కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానం, విడిభాగాలు, పరికరాలు లభించడం కష్టతరమవుతుంది. ఈ సంస్థలకు ఎగుమతులు చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనసరి కానుంది.

పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై భారత్‌తోసహా దాదాపు 50 దేశాల్లో నిఘా పెట్టారని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం బయటపెట్టిన విషయం తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తయారు చేసిన పెగాసస్‌ స్పైవేర్‌పై ఆంక్షలు విధించిన దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 3
ఎవరు    : అమెరికా
ఎక్కడ    : అమెరికా
ఎందుకు : ఎన్‌ఎస్‌ఓ గ్రూపు ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని...


Former Indian Cricketer: టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్‌?

Rahul Dravid

భారత క్రికెట్‌ జట్టు తదుపరి హెడ్‌ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికయ్యాడు. రవిశాస్త్రి అనంతరం టీమ్‌ హెడ్‌ కోచ్‌ బాధ్యతలను ద్రవిడ్‌కు అప్పగిస్తూ సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్‌లతో కూడిన బీసీసీఐ సలహా కమిటీ నవంబర్‌ 3న నిర్ణయం తీసుకుంది. 2021, నవంబర్‌ 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే టి20 సిరీస్‌ నుంచి ద్రవిడ్‌ కోచ్‌ హోదాలో కొనసాగనున్నాడు. భారత్‌లో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ వరకు ద్రవిడ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవిలో ఉంటాడు. గతంలో ద్రవిడ్‌ శిక్షణలో భారత అండర్‌–19 జట్టు రెండుసార్లు అండర్‌–19 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత క్రికెట్‌ జట్టు తదుపరి హెడ్‌ కోచ్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్‌? 
ఎప్పుడు  : నవంబర్‌ 3
ఎవరు    : భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌
ఎందుకు : టి20 ప్రపంచకప్‌–2021 ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో...


Corona Virus: డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందిన తొలి భారతీయ కోవిడ్‌ టీకా?

హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా ‘కోవాగ్జిన్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్‌ను ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌(ఈయూఎల్‌)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌ఓ నవంబర్‌ 3న ప్రకటించింది. ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ కోవిడ్‌ టీకా ఇదే. డబ్ల్యూహెచ్‌ఓ తాజా నిర్ణయంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం...

  • 18 ఏళ్లు దాటిన వారంతా కోవాగ్జిన్‌ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. నాలుగు వారాల వ్యవధితో రెండు డోసులు తీసుకోవాలి.
  • గర్భిణులకు కోవాగ్జిన్‌ ఇవ్వొచ్చా లేదా అనేది చెప్పడానికి మరింత అధ్యయనం జరగాల్సి ఉంది.
  • రెండు డోసులు తీసుకున్న 14 రోజుల తర్వాత కోవాగ్జిన్‌ టీకా కరోనాపై దాదాపు 78 శాతం సమర్థతను ప్రదర్శిస్తుంది.
  • కోవాగ్జిన్‌ను నిల్వ చేయడం చాలా తేలిక. అందుకే తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలకు ఈ టీకా చక్కగా సరిపోతుంది.
  • లక్షణాలు కనిపించే కరోనాపై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం కోవాగ్జిన్‌ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.

కోవాగ్జిన్‌ షెల్ఫ్‌ లైఫ్‌ ఎన్ని నెలలు?
కోవాగ్జిన్‌ టీకా షెల్ఫ్‌ లైఫ్‌ను తయారీ తేదీ నుంచి 12 నెలల దాకా పొడిగించేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)  అంగీకరించినట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ నవంబర్‌ 3న వెల్లడించింది. కోవాగ్జిన్‌ షెల్ఫ్‌లైఫ్‌ అనుమతి తొలుత ఆరు నెలలకే లభించింది. తర్వాత దీన్ని తొమ్మిది నెలలు పొడిగించారు. తాజాగా ఒక సంవత్సరం(12 నెలల) పొడిగించడం విశేషం. అంటే టీకాను తయారు చేసిన తర్వాత 12 నెలల్లోగా ఉపయోగించవచ్చు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ‘కోవాగ్జిన్‌’కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు 
ఎప్పుడు : నవంబర్‌ 3
ఎవరు    : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు : కరోనా వైరస్‌ కట్టడి కోసం...


Go First: తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దని తెలిపిన దేశం?

Flight

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ను, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జా నగరాన్ని కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్‌’ పౌర విమానాలను తమ గగనతలం మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్‌ నవంబర్‌ 2న స్పష్టంచేసింది. గతంలో గోఎయిర్‌గా పిలవబడిన గో ఫస్ట్‌ పౌర విమానయాన సంస్థ 2021, అక్టోబర్‌ 23 నుంచి శ్రీనగర్‌–షార్జా నగరాల మధ్య డైరెక్ట్‌ విమానసర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలిపే విమానాలు పాకిస్తాన్‌ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే తాజాగా తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్‌ కరాఖండీగా చెప్పేసింది. దీంతో నవంబర్‌ 2న శ్రీనగర్‌ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. హఠాత్తుగా తమ నిర్ణయం మార్చుకున్నందుకు సరైన కారణాలను పాకిస్తాన్‌ ఇంతవరకు భారత్‌కు తెలియజేయలేదు.


Glasgow: కాప్‌–26 సదస్సులో ప్రసగించిన భారతీయ బాలిక ఎవరు?

Vinisha Umashankar

వాతావరణ మార్పులపై గ్లాస్గోలోని కాప్‌–26 సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల వయసున్న టీనేజ్‌ బాలిక వినీశా ఉమాశంకర్‌ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేసింది. ఎకో ఆస్కార్‌ అవార్డులుగా భావించే ఎర్త్‌ షాట్‌ ప్రైజ్‌ ఫైనలిస్ట్‌ అయిన వినీశ కాప్‌ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్‌ విలియమ్‌ విజ్ఞప్తి మేరకు నవంబర్‌ 3న సదస్సులో మాట్లాడింది. ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ల సమక్షంలో తమిళనాడుకి చెందిన వినీశ  ధైర్యంగా మాట్లాడింది. ‘‘భూమి ఉష్ణోగ్రతలు తగ్గించే అంశంపై ఇక మీరు మాటలు ఆపాలి. చేతలు మొదలు పెట్టాలి’’ తన ప్రసగంలో పేర్కొంది.

అభినందన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ ర్యాంక్‌
దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు ‘గ్రూప్‌ కెప్టెన్‌’ ర్యాంక్‌ దక్కనుంది. ఆయనకు ఆ ర్యాంక్‌ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు నవంబర్‌ 3న వెల్లడించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కాప్‌–26 సదస్సులో ప్రసగించిన భారతీయ బాలిక?
ఎప్పుడు : నవంబర్‌ 3
ఎవరు    : వినీశా ఉమాశంకర్‌
ఎక్కడ    : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : భూమి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని...


Mahatma Gandhi: గాంధీ స్మారక నాణెన్ని విడుదల చేసిన దేశం?

Gandhi Coin

దీపావళి పర్వదినం పురస్కరించుకుని మహాత్మా గాంధీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణెన్ని బ్రిటన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ నవంబర్‌ 4న ఈ నాణెన్ని ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన ప్రభావవంతమైన నాయకుడికి ఇది ఘనమైన నివాళి అని మంత్రి రిషి సునక్‌ పేర్కొన్నారు. భారత్‌ ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ జరుపుకొంటున్న ప్రత్యేక సందర్భంలో.. ఈ స్మారక నాణెం ఇరు దేశాల మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.

మై లైఫ్‌ ఇజ్‌ మై మెసేజ్‌...
హీనా గ్లోవర్‌ అందించిన ఆకృతిలో రూపొందించిన ఈ స్మారక నాణెంలో భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీ ప్రముఖ సూక్తుల్లో ఒకటైన ‘మై లైఫ్‌ ఇజ్‌ మై మెసేజ్‌’ను పొందుపరిచారు. బంగారం, వెండితోపాటు ఇతర రకాల్లోనూ ఇది అందుబాటులో ఉంది. బ్రిటన్‌ రాయల్‌ మింట్‌ వెబ్‌సైట్‌లో వీటిని అమ్మకానికి పెట్టారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మహాత్మా గాంధీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. ఐదు పౌండ్ల స్మారక నాణెన్ని విడుదల చేసిన దేశం? 
ఎప్పుడు : నవంబర్‌ 4
ఎవరు    : బ్రిటన్‌ 
ఎందుకు : భారత్, బ్రిటన్‌ మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని...

 

Electricity: భారత్‌కు విద్యుత్‌ను విక్రయించనున్న దక్షిణాసియా దేశం?

తమ దేశంలోని మిగులు విద్యుత్తును భారత్‌కు విక్రయించాలని నేపాల్‌ నిర్ణయించింది. నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ చేసిన  ప్రయత్నాల మేరకు తాజాగా భారత్‌ విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఈ కొనుగోళ్లకు అనుమతి మంజూరు చేసింది. భారత్‌ సాయంతో నిర్మించిన రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి తొలివిడతగా విక్రయాలు జరుగుతాయి. విద్యుదుత్పత్తిలో మిగులు సాధించిన దేశంగా నేపాల్‌ ఉంది.

నేపాల్‌ రాజధాని: ఖాట్మండు; కరెన్సీ: నేపాలిస్‌ రుపీ
నేపాల్‌ ప్రస్తుత అధ్యక్షురాలు: విద్యాదేవి భండారీ
నేపాల్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: షేర్‌ బహదూర్‌ దేవ్‌బా

సరయూ నదీ ఏ రాష్ట్రంలో ఉంది?
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ నదీతీరంలో నిర్వహించిన దీపోత్సవ్‌లో లక్షలాది ప్రమిదలను వెలిగించారు. తొమ్మిది లక్షల ప్రమిదలు వెలిగించడంతో కొత్త గిన్నిస్‌ రికార్డు నమోదైంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌కు విద్యుత్‌ను విక్రయించనున్న దక్షిణాసియా దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 4
ఎవరు    : నేపాల్‌
ఎందుకు : తమ దేశంలో మిగులు విద్యుత్తు ఉన్నందున...


రూ.7,965 కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఆమోదం

Ministry of Defence


రూ.7,965 కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నవంబర్‌ 2న ఆమోదముద్ర వేసింది. సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ నుంచి లైనెక్స్‌ నావల్‌ గన్‌ఫైర్‌ నియంత్రణ వ్యవస్థను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఇంటింటికీ టీకా...
కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. నవంబర్‌ 3న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మందకొడిగా సాగుతున్న 40కి పైగా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ‘హర్‌ ఘర్‌ టీకా, ఘర్‌–ఘర్‌ టీకా’ అనే నినాదం స్ఫూర్తితో ప్రతి ఇంటికీ వెళ్లాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 3 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Nov 2021 07:13PM

Photo Stories