Daily Current Affairs in Telugu: 2022, జూన్ 30th కరెంట్ అఫైర్స్
Flipkart తో తెలంగాణ సెర్ప్ ఒప్పందం
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా బృందాల) తయారు చేసే ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ (సెర్ప్) ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది రూ.500 కోట్ల వ్యాపారం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించేందుకు వీలుంటుంది.
Also read: GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?
అలాగే.. రాష్ట్రంలో 3,70,825 మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022–23 ఏడాదిలో రూ.15 వేల కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు 31,303 సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.1,600 కోట్లకు పైగా రుణాలు ఇచ్చారు. మిగతా లక్ష్యాన్ని 2023 మార్చిలోగా సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు. సెర్ప్ ద్వారా గత ఎనిమిదేళ్లలో (2014–15 నుంచి 2021–22 వరకు) డ్వాక్రా బృందాలకు రూ.56,004 కోట్ల బ్యాంకు రుణా లు కల్పించినట్లు పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
NATO: స్పెయిన్ లో నాటో వార్షిక సదస్సు - ఉక్రెయిన్ కు సాయంపై తీర్మానం
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గజేషన్ (నాటో) సభ్య దేశాల వార్షిక సదస్సు జూన్ 29న జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. నాటో సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్‌లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్‌పై దండెత్తిందని ధ్వజమెత్తాయి. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్‌లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్‌బెర్గ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: Flipkart తో తెలంగాణ సెర్ప్ ఒప్పందం
పోలండ్‌లో శాశ్వత సైనిక కేంద్రం
యూరప్‌కు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రాంతీయ భద్రత కోసం పోలండ్‌లో తొలి శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన లక్ష బలగాలు నిరంతరం యూరప్‌లో ఉండేలా చూస్తామన్నారు.
Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
పుతిన్ మహిళ అయ్యుంటే... యుద్ధం వచ్చేది కాదు: జాన్సన్
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం వచ్చి ఉండేది కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. జర్మనీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పుతిన్ పురుషాహంకారం కనిపిస్తోంది. ఆయన మహిళ అయ్యుంటే పురుషాహంభావంతో ఇలాంటి పిచ్చి యుద్ధానికి దిగేవారు కాదు’’ అన్నారు. ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలంటే అత్యధిక దేశాల్లో మహిళలు అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు.
Mission Olympic Cell: ‘మిషన్ ఒలింపిక్ సెల్’లో షూటర్ గగన్ నారంగ్
భారత షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కీలక బాధ్యతలు అప్పగించింది. ‘సాయ్’ ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ)లో సభ్యుడిగా నారంగ్‌ను ఎంపిక చేసింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా 2014 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పని చేస్తోంది. ‘టాప్స్’ కోసం ఆటగాళ్లను గుర్తించడం, వారి సన్నాహకాలకు ఆరి్ధకపరంగా సహకారం అందించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందించడం, ఫలితాలను పర్యవేక్షించడమే ‘మిషన్ ఒలింపిక్ సెల్’ బాధ్యత.
also read: GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?
2024 పారిస్, 2028 లాస్ ఎంజెలిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను ఎంపిక చేయడంలో తాను భాగస్వామిని కాబోతున్నట్లు హైదరాబాద్ షూటర్ గగన్ వెల్లడించాడు. ‘స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని డెవలప్‌మెంట్ గ్రూప్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎంఓసీ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఆయా ఆటగాళ్ల అవసరాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ కోసం నిధులు అందేలా చూడటంతో పాటు అత్యుత్తమ స్థాయి కోచింగ్ సౌకర్యం, ఫిట్‌నెస్ తదితర అంశాలపై కూడా ఎంఓసీ దృష్టి పెడుతుంది. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా’ అని గగన్ వెల్లడించాడు.
GAIL కొత్త చైర్మన్ సందీప్ కే గుప్తా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ గుప్తా, భారత్ అతిపెద్ద గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ (ఇండియా) చీఫ్‌గా ఎంపికయ్యారు. పది మంది అభ్యర్థుల ఇంటర్వ్యూ తర్వాత 56 సంవత్సరాల గుప్తాను గెయిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంపికచేసినట్లు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల ఎంపిక బోర్డ్ (పీఈఎస్‌బీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31వ తేదీన ప్రస్తుత సీఎండీ మనోజ్ జైన్ పదవీ విరమణ అనంతరం గుప్తా నూతన బాధ్యతలను చేపడతారు. అయితే అంతకుముందు ఆయన నియామకానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి అవినీతి నిరోధక సంస్థలు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
GST Council చంఢీగడ్ లో జీఎస్‌టీ మండలి సమావేశాలు - కీలక నిర్ణయాలు వాయిదా
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చండీగఢ్‌లో రెండు రోజుల పాటు జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి నిర్ణయక మండలి 47వ సమావేశం బుధవారం ముగిసింది. మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్‌టీ విధింపుసహా తొలి రోజు పలు నిర్ణయాలను తీసుకున్న మండలి సమావేశం రెండరోజు కీలక అంశాలపై తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. జీఎస్‌టీ స్లాబ్స్‌లో మార్పులు, రెవెన్యూ నష్టానికి సంబంధించి రాష్ట్రాలకు పరిహారం (జూన్‌లో ముగిసే ఐదేళ్ల కాలం తరువాత)సహా ఆన్‌లైన్ గేమింగ్, రేసింగ్‌లు, క్యాసినో, లాటరీలపై 28 శాతం పన్ను విధింపు వంటి కీలక అంశాలపై సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కీలక అంశాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులకోసం ఆయా అంశాలను వాయిదా వేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
Also read: Quiz of The Day (June 29, 2022): అమెజాన్ నది ఏ దేశంలో జన్మిస్తుంది?
Survey 2022 జీఎస్టీకి 5 ఏళ్లు - డెలాయిట్ జీఎస్టీ @ సర్వే 2022
పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా జీఎస్‌టీ విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే తెలిపింది. జీఎస్‌టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని ‘జీఎస్‌టీ @ 5 సర్వే 2022’పేరుతో తాము జరిపిన ఈ సర్వేలో వెల్లడైనట్లు వివరించింది. ప్రస్తుతం జీఎస్‌టీ కింద నాలుగు శ్లాబ్‌లు అమలు జరుగుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి.
Also read: GK Important Dates Quiz: 2022లో మదర్స్ డేను ఏ రోజున జరుపుకుంటారు?
Mahaveer Chakra కల్నల్ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారం
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ బి.సంతోష్ బాబు సతీమణి బి.సంతోషికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. సంతోష్‌బాబు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన ‘మహావీర్ చక్ర’ పురస్కారానికి ఎంపికైనందున .. నిబంధనల మేరకు ఈ నగదును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బి.సంతోషికి ఈ నగదును అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.
Also read: Survey 2022 జీఎస్టీకి 5 ఏళ్లు - డెలాయిట్ జీఎస్టీ @ సర్వే 2022