Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 9 కరెంట్‌ అఫైర్స్‌

CDS General Bipin Rawat

Chopper Crash: హెలికాప్టర్‌ కూలి తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడిని హెలికాప్టర్‌ ప్రమాదం కబళించింది. డిసెంబర్‌ 8న తమిళనాడు రాష్ట్రం కూనూర్‌ సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్(63), ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. రావత్‌ మరణాన్ని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని ఐఏఎఫ్‌ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మాత్రమే బతికి బయటçపడగా, ఆయన వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు హెలికాప్టర్‌ సిబ్బంది ఉన్నారు.

మరణించిన వారిలో...
ప్రమాదం కారణంగా మరిణించిన వారిలో జనరల్‌ రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్, వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్, స్క్వాడ్రన్‌ లీడర్‌ కే సింగ్, నాయక్‌ గురుసేవక్‌సింగ్, నాయక్‌ జితేందర్‌ కుమార్, లాన్స్‌నాయక్‌ వివేక్, లాన్స్‌ నాయక్‌ బీ సాయితేజ, హవల్దార్‌ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్‌ ఉన్నారు. వీరిలో సాయితేజ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. రావత్‌కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు.

కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో...
తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ప్రసంగించేందుకు రావత్‌ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్‌ గతంలో విద్యాభ్యాసం చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలుత సూలూర్‌ ఎయిర్‌బేస్‌(తమిళనాడు)కు రావత్‌ బృందం చేరింది. అక్కడి నుంచి వెల్లింగ్టన్‌ స్టాఫ్‌ కాలేజీకి ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌లో వారు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతం(కూనూర్‌ సమీపం)లో ఛాపర్‌ కూలిపోయింది. ప్రమాదం వల్ల చాఫర్‌లో మంటలు చేలరేగాయి. గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు.

సీసీఎస్‌ అత్యవసర సమావేశం
రావత్‌ ప్రయాణిస్తున్న ఛాపర్‌ క్రాష్‌ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ(సీసీఎస్‌) సమావేశమైంది. ఇందులో రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్‌ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పాల్గొన్నారు. రావత్‌ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్‌గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Chief of Defense Staff: జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఏ రాష్ట్రంలో జన్మించారు?

Bipin Rawat

భారతదేశ తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ లక్షణ్‌ సింగ్‌ రావత్‌(63) డిసెంబర్‌ 8న తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కూనూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. దేశ భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఆయన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడంలో సమర్థంగా పనిచేశారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి దాయాది దేశం పాకిస్తాన్‌ గుండెల్లో దడ పుట్టించారు. సైనికుడిగా 40 ఏళ్లు నిర్విరామంగా దేశానికి సేవలందించారు.

జనరల్‌ రావత్‌ నేపథ్యం...

 • బిపిన్‌ రావత్‌ కుటుంబం తరతరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తోంది. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా పనిచేశారు. 
 • రావత్‌ 1958 మార్చి 16న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం పౌరీ గర్వాల్‌ జిల్లాలో జన్మించారు. 
 • డెహ్రాడూన్‌లోని కాంబ్రియన్‌ హాల్‌ స్కూల్, షిమ్లాలోని సెయింట్‌ ఎడ్వర్డ్స్‌ స్కూల్‌లో చదివారు. 
 • తమిళనాడు రాష్ట్రం వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ(డీఎస్‌ఎస్‌సీ)లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 
 • అమెరికాలో కాన్సాస్‌లోని ఫోర్ట్‌ లీవెన్‌వర్త్‌లో ఉన్న యూఎస్‌ ఆర్మీ కమాండ్, జనరల్‌ స్టాఫ్‌ కాలేజీలో హయ్యర్‌ కమాండ్‌ కోర్సు అభ్యసించారు. దేవీ అహల్యా యూనివర్సిటీలో ఎంఫిల్‌ పూర్తిచేశారు. 
 • 1978 డిసెంబర్‌ 16న 11వ గూర్ఖా రైఫిల్స్‌ దళానికి చెందిన 5వ బెటాలియన్‌లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా చేరారు. సైనికుడిగా జీవితాన్ని ఆరంభించారు. తూర్పు సెక్టార్‌లో భారత్‌–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద విధులు నిర్వర్తించారు. తర్వాత బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. 
 • సోపోర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ 5వ సెక్టార్‌ అధికారిగా పనిచేశారు. 
 • ఐక్యరాజ్యసమితి మిషన్‌ కింద కాంగో దేశంలో మల్టీనేషనల్‌ బ్రిగేడ్‌లో సేవలందించారు.
 • మేజర్‌ జనరల్‌గా పదోన్నతి పొందాక యూరీలోని 19వ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ జనరల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. 
 • లెఫ్టినెంట్‌ జనరల్‌గా దిమాపూర్, పుణేలో పనిచేశారు. 
 • 2016లో దక్షిణ కమాండ్‌లో కమాండింగ్‌–ఇన్‌–చీఫ్‌ జనరల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కొన్ని నెలలకే ఆర్మీ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌గా పదోన్నతి పొందారు. 
 • 2016 డిసెంబర్‌లో భారత సైన్యానికి 27వ అధినేతగా(ఆర్మీ చీఫ్‌) బాధ్యతలు నియమితులయ్యారు.

సర్జికల్‌ దాడులకు ప్రణాళిక రూపకల్పన...

 • ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే వ్యక్తిగా రావత్‌కు పేరుంది.
 • 2016 నుంచి 2019 దాకా ఆర్మీ చీఫ్‌గా జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. భారత్‌కు చైనా నుంచే అసలు ముప్పు పొంచి ఉందని, డ్రాగన్‌ను దీటుగా ఎదిరించడానికి మన సైనిక దళాలను బలోపేతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఒప్పించారు.
 • 2017లో డోక్లామ్‌ ఘటన కంటే ముందు ఆయన చైనా కుతంత్రాన్ని గుర్తించారు. నాగా మిలిటెంట్లను అణచివేయడానికి 2015లో భారత సైన్యం మయన్మార్‌ భూభాగంలోకి అడుగుపెట్టి మరీ దాడులు చేయడంలో రావత్‌దే ముఖ్యపాత్ర.
 • పాకిస్తాన్‌పై సర్జికల్‌ దాడులకు స్వయంగా ప్రణాళిక రూపొందించారు. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్‌ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫైటర్‌ జెట్లతో బాంబుల వర్షం కురిపించారు.
 • 40 ఏళ్ల కెరీర్‌లో ఎక్కువ కాలం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లోనే జనరల్‌ రావత్‌ విధులు నిర్వర్తించారు.
 • 2019లో పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

సైన్యంలో రావత్‌ ఎదిగిన తీరు ఇలా..

 • సెకండ్‌ లెఫ్టినెంట్‌: 1978 డిసెంబర్‌ 16
 • లెఫ్టినెంట్‌: 1980 డిసెంబర్‌ 16
 • కెప్టెన్‌: 1984 జూలై 31
 • మేజర్‌: 1989 డిసెంబర్‌ 16
 • లెఫ్టినెంట్‌ కల్నల్‌: 1998 జూన్‌ 1
 • కల్నల్‌: 2003 ఆగస్టు 1
 • బ్రిగేడియర్‌: 2007 అక్టోబర్‌ 1
 • మేజర్‌ జనరల్‌: 2011 అక్టోబర్‌ 20
 • లెఫ్టినెంట్‌ జనరల్‌: 2014 జూన్‌ 1
 •  జనరల్‌(సీఓఏఎస్‌): 2017 జనవరి 1
 • జనరల్‌(సీడీఎస్‌): 2019 డిసెంబర్‌ 31

జనరల్‌ రావత్‌ను వరించిన అవార్డులు...

 • పరమ్‌ విశిష్ట సేవా మెడల్
 • ఉత్తమ యుద్ధ సేవా మెడల్
 • అతి విశిష్ట సేవా మెడల్‌
 • యుద్ధ సేవా మెడల్‌ 
 • సేనా మెడల్‌ 
 • విశిష్ట సేవా మెడల్‌
 • వూండ్‌ మెడల్‌
 • సామాన్య సేవా మెడల్‌
 • స్పెషల్‌ సర్వీస్‌ సేవా మెడల్‌ 
 • ఆపరేషన్‌ పరాక్రమ మెడల్‌
 • సైన్య సేవా మెడల్‌ 
 • హై ఆల్టిట్యూడ్‌ సర్వీస్‌ మెడల్‌
 • విదేశ్‌ సేవా మెడల్‌ 
 • 50th Anniversary of Independence Medal(50వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా)
 • 30 ఏళ్ల లాంగ్‌ సర్వీస్‌ మెడల్‌
 • 20 ఏళ్ల లాంగ్‌ సర్వీస్‌ మెడల్‌
 • 9 ఏళ్ల లాంగ్‌ సర్వీస్‌ మెడల్‌ 
 • ఐక్యరాజ్యసమితి మెడల్‌

General Bipin Rawat: ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను రూపొందించిన సంస్థ?

Mi-17 V5 helicopter

 

భారతదేశ తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ లక్షణ్‌ సింగ్‌ రావత్‌(63) డిసెంబర్‌ 8న తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కూనూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారు. సాంకేతికంగా అడ్వాన్స్‌డ్‌ హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్‌ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్‌ ఫ్రేమ్‌పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌లో ఉపయోగిస్తున్నారు.

ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌..

 • ఎయిర్‌క్రాఫ్ట్‌ రకం: సైనిక రవాణా హెలికాప్టర్‌. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు. 
 • డిజైన్‌ చేసిందెవరు?: రష్యాలోని మిల్‌ మాస్కో హెలికాప్టర్‌ ప్లాంట్‌ 
 • రూపొందించింది?: రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్‌ 

ఉత్పత్తి నుంచి భారత్‌కు చేరిందిలా..

 • 1975లో తొలి ఎంఐ–17 హెలికాప్టర్‌ తయారీ ఎగుమతికి ఉద్దేశించిన హెలికాప్టర్లను ఎంఐ–17గా వ్యవహరిస్తారు. రష్యా సైనిక దళాలు మాత్రం వీటిని ఎంఐ–8ఎంటీ హెలికాప్టర్లుగా పిలుస్తాయి.
 • ఎంఐ–17వీ5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2008లో రష్యాతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 
 • 2011 ఏడాదిలో భారత వైమానిక దళానికి అందజేత ప్రారంభం. 2012 నుంచి సేవలు ప్రారంభం.

ముఖ్యాంశాలు..

 • ఎంఐ–17వీ5.. ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్‌. సరుకులు, ఆయుధాల రవాణా కోసం డిజైన్‌ చేశారు.  
 • సైనికులను కూడా చేరవేయవచ్చు. అగ్ని మాపక సిబ్బందికి సాయపడుతుంది. కాన్వాయ్‌ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్‌కు, గాలింపునకు, సహాయక చర్యల్లోనూ సేవలందిస్తాయి. 
 • ప్రపంచవ్యాప్తంగా ఈ హెలికాప్టర్లను 60 దేశాలు వినియోగిస్తున్నాయి.

మరిన్ని విశేషాలు..

 • ఎంఐ–17వీ5 మధ్యశ్రేణి హెలికాప్టర్‌లో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించే రాడార్, రాత్రిపూట సైతం వీక్షించే పరికరాలు ఉన్నాయి. 
 • గరిష్టంగా 13,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆగకుండా 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 
 • 36 మంది సైనికులను లేదా 4,000 కిలోల పేలోడును తరలించగలదు. 
 • రాత్రి, పగలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా ల్యాండింగ్‌ చేయొచ్చు. 
 • గత పదేళ్లలో ఐఎం–17వీ5 హెలికాప్టర్లు కొన్ని ప్రమాదాలకు గురయ్యాయి.

International Space Station: రోదసీ యాత్ర చేపట్టిన జపాన్‌ కుబేరుడు ఎవరు?

Yusaku Meazawa

జపాన్‌ బిలియనీర్, ఫ్యాషన్‌ వ్యాపారాధిపతి యుసాకు మెజావా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు పయనమయ్యారు. సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన యుసాకుతో పాటు ప్రముఖ నిర్మాత యోజో హిరానో ఉన్నారు. యుసాకు యాత్రను హిరానో డాక్యమెంటరీగా చిత్రీకరించనున్నారు. రష్యాకు చెందిన సోయుజ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో రష్యా కాస్మొనాట్‌ అలెగ్జాండర్‌ మిస్రుకిన్‌తో కలిసి వీరిరువురు రోదసీలోకి వెళ్లారు. కజకిస్తాన్‌లోని బైకనుర్‌ లాంచింగ్‌ స్టేషన్‌ నుంచి డిసెంబర్‌ 8న ఈ నౌక బయలుదేరింది. 12 రోజుల పాటు యుసాకు, హిరానో ఐఎస్‌ఎస్‌లో గడుపుతారు.

జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్‌ మాల్‌ జోజోటవున్‌కు యుసాకు అధిపతి. ఆయన ఆస్తుల మొత్తం సుమారు 200 కోట్ల డాలర్లని అంచనా. 2023లో ఎలాన్‌ మస్క్‌ నిర్వహించే చంద్రయాత్రలో కూడా యుసాకు పాలుపంచుకోనున్నారు. రోదసీ నుంచి భూమిని వీక్షించడాన్ని ఇష్టపడతానని, భార రహిత స్థితిని అనుభవించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని యాత్రకు ముందు యుసాకు చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ నిర్మాత యోజో హిరానో, రష్యా కాస్మొనాట్‌ అలెగ్జాండర్‌ మిస్రుకిన్‌తో కలిసి సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన జపాన్‌ కుబేరుడు?
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు    : జోజోటవున్‌ అధిపతి యుసాకు మెజావా
ఎక్కడ    : బైకనుర్‌ లాంచింగ్‌ స్టేషన్, కజకిస్తాన్‌
ఎందుకు : రోదసీ నుంచి భూమిని వీక్షించేందుకు..

River Linking Project: ఏ రెండు నదుల అనుసంధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

Betwa River

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని పది లక్షలకుపైగా హెక్టార్ల పంట పొలాలకు నీటి లభ్యత సాధ్యమయ్యే కెన్‌–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ డిసెంబర్‌ 8న నిర్ణయించింది. రూ.44,605 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.36,290 కోట్లు గ్రాంట్‌గా అందివ్వనుంది. రుణంగా మరో రూ.3,027 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకరించింది.

ప్రాజెక్ట్‌ వివరాలు ఇలా..

 • దౌధాన్‌ ఆనకట్ట, కోథా వంతెనలను నిర్మించి తద్వారా కెన్‌ నదీజలాలను బెత్వా నదిలోకి మళ్లిస్తారు.
 • ఈ అనుసంధానం పూర్తయితే ఏటా 10.62 లక్షల హెక్టార్ల పంటభూములకు సాగు నీరు, 62 లక్షల జనాభాకు తాగునీరు అవసరాలు తీరుతాయని అంచనా. 
 • ఈ ప్రాజెక్టులో భాగంగా 103 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రం, 27 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమని అంచనా. 
 •  ఎనిమిదేళ్లలో మొత్తం ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. 
 • ప్రాజెక్టు పూర్తయితే మధ్యప్రదేశ్‌లోని తొమ్మిది, యూపీలోని నాలుగు జిల్లాల ప్రజలకు నీటి సమస్యలు తగ్గుతాయి.

కెన్‌ నది..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, కట్ని జిల్లా, అహిర్‌గవాన్‌ గ్రామం సమీపంలో(కైమూర్‌ పర్వత శ్రేణిలో) కెన్‌ నది జన్మిస్తుంది.  27 కి.మీ దూరం ప్రయాణించి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం, బండా జిల్లా, చిల్లా గ్రామం వద్ద యమునా నదిలో కలుస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.

బెత్వా నది..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, రెయ్‌జెన్‌ జిల్లా, కుమ్రాగావ్‌ గ్రామం వద్ద(వింద్య పర్వత శ్రేణిలో) బెత్వా నది ఉద్భవిస్తుంది. 590 కి.మీ దూరం ప్రయాణించి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం, హమీర్‌పూర్‌ జిల్లా, హమీర్‌పూర్‌ సమీపంలో యమునా నదిలో కలుస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కెన్‌–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వాలని నిర్ణయం
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు    : కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు : మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని పది లక్షలకుపైగా హెక్టార్ల పంట పొలాలకు నీటిని అందించేందుకు..

Pradhan Mantri Awas Yojana: పీఎంఏవై–జీను ఎప్పటి వరకు పొడిగించారు?

PMAY-G

ఇంకా 155.75 లక్షల గృహాలను నిర్మించాల్సి ఉన్నందున ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–గ్రామీణ(పీఎంఏవై–జీ)ను మరో మూడు సంవత్సరాలు అంటే  2024 మార్చి 31దాకా పొడిగిస్తూ తాజాగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా గ్రామీణప్రాంతాల్లో 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాలని గతంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంకా నిర్మించాల్సిన ఇళ్ల కోసం రూ.2,17,257 కోట్లు ఖర్చుకానుంది. కేంద్రం రూ.1,25,106 కోట్లు, రాష్ట్రాలు రూ.73,475 కోట్ల ఆర్థికసాయం చేయనున్నాయి.

ఆనకట్టల భద్రత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం
దేశంలో నిర్దేశించిన ఆనకట్టల భద్రత కోసం జాతీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కొన్ని సవరణలతో రాజ్యసభ డిసెంబర్‌ 2న ఆమోదించిన ఈ బిల్లుకు డిసెంబర్‌ 8న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆకస్మిక విపత్తులను నివారించేలా ఆనకట్టలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణకు అవసరమైన నిబంధనలతో రూపొందించిన ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత చట్టంగా మారుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–గ్రామీణ(పీఎంఏవై–జీ)ను 2024 మార్చి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఆమోదం 
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు    : కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు : ఇంకా 155.75 లక్షల గృహాలను నిర్మించాల్సి ఉన్నందున..

RBI Monetary Policy Highlights: ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో ముంబైలో డిసెంబర్‌ 6 నుంచి 8 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. వృద్ధే లక్ష్యంగా సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరించింది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.

ముఖ్యాంశాలు..

 • 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.5 శాతంగా నమోదవుతుందని అంచనా.
 • 2021–22 ఆర్థిక ఏడాదిలో సగటున రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని అంచనా.
 • ఆర్‌బీఐ ముందస్తు అనుమతి లేకుండా విదేశీ శాఖలలో మూలధనం పెంపునకు, అలాగే లాభాలను స్వదేశానికి తరలించడానికి బ్యాంకింగ్‌  నిబంధనల సరళతరం.
 • 2022 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ తదుపరి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం.

9 సమావేశాల నుంచి యథాతథం
రెపో రేటును ఆర్‌బీఐ ఎంపీసీ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2019 ప్రారంభం నుంచి 135 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1  శాతం) రుణ రేటును తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్టకాలం నేపథ్యంలో 2020 మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో 2020 ఆగస్టునాటికి రెపో రేటు రికార్డు కనిష్టం 4 శాతానికి దిగివచ్చింది.

ఫీచర్‌ ఫోన్లపైనా యూపీఐ చెల్లింపులు..
కోట్లాదిమంది ఫీచర్‌ ఫోన్‌ హోల్డర్లు కూడా ఇకపై యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్లు జరిపేలా చర్యలకు కూడా శ్రీకారం చుడుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సూచించారు. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మోసాలు సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) వ్యవస్థలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లుగా ఉంటాయన్నారు. 2022 ఏడాది కొంత మేర పైలెట్‌ ప్రాతిపదికన డిజిటల్‌ కరెన్సీ వ్యవస్థ ప్రారంభానికి ఆర్‌బీఐ కసరత్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.

రెపో, రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ రెపో రేటు(4.00 శాతం), రివర్స్‌ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కొనసాగింపు
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని..

Facebook: ఆసియాలోనే అతిపెద్ద కార్యాలయాన్ని మెటా ఎక్కడ ప్రారంభించింది?

Meta

దిగ్గజ సంస్థ మెటా (గతంలో ఫేస్‌బుక్‌) డిసెంబర్‌ 8న ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతం(గురుగ్రామ్, హరియాణ)లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆసియాలోనే అతిపెద్ద కార్యాలయంగా పరిగణిస్తున్న ఈ కేంద్రం 1.3 లక్షల చదరపు అడుగులతో ఉంది. అమెరికాలోని మెలానో పార్క్‌లో సంస్థ ప్రధాన కార్యాలయంను ఇది పోలి ఉంది. మెటా 2010లో హైదరాబాద్‌లో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. సామాజిక మాధ్యమాలు– ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లు మెటా సంస్థకు చెందినవే.

కోటి మందికి శిక్షణ...
భారత్‌లో వచ్చే మూడేళ్లలో కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది ఆవిష్కర్తలకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తాజాగా మెటా ప్రకటించింది.

2020–21లో భారత్‌ ఎకానమీ ఎంత శాతం క్షీణించింది?
భారత్‌ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ 8.7 శాతం నుంచి 8.4 శాతానికి కుదించింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత ఎకానమీ రికవరీ స్పీడ్‌ ఊహించినంత వేగంగా లేకపోవడమే తమ తాజా అంచనాలకు కారణమని పేర్కొంది. 2022–23 ఆర్థిక ఏడాది ఎకానమీ వృద్ధి అంచనాలను మాత్రం 10 శాతం నుంచి 10.3 శాతానికి పెంచింది. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020–21లో భారత్‌ ఎకానమీ వృద్ధిలేకపోగా 7.3 శాతం(–7.3) క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు  : డిసెంబర్‌ 8
ఎవరు    : దిగ్గజ సంస్థ మెటా (గతంలో ఫేస్‌బుక్‌)
ఎక్కడ    : ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతం(గురుగ్రామ్, హరియాణ)
ఎందుకు : భారత్‌లో కార్యాకలాపాల నిర్వహణ కోసం..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 8 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Dec 2021 07:54PM

Photo Stories