Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 8 కరెంట్‌ అఫైర్స్‌

SM Vaidya

World LPG Association: డబ్ల్యూఎల్‌పీజీఏ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన భారతీయుడు?

వరల్డ్‌ ఎల్‌పీజీ అసోసియేషన్‌ (డబ్ల్యూఎల్‌పీజీఏ) ప్రెసిడెంట్‌గా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) చైర్మన్‌ శ్రీకాంత్‌ మాదవ్‌ వైద్య(ఎస్‌ఎం వైద్య) ఎన్నికయ్యారు. ప్రస్తుతం యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎల్‌పీజీ ఫోరం తన ప్రెసిడెంట్‌గా వైద్యను ఎన్నుకుంది. ఈ మేరకు డిసెంబర్‌ 7న ఒక ప్రకటన విడుదలైంది. ఇండియన్‌ ఆయిల్‌కు డబ్ల్యూఎల్‌పీజీఏలో ‘ఏ’ కేటగిరీ హోదా ఉంది. ఏడు లక్షల టన్నులకుపైగా వార్షిక ఎల్‌పీజీ అమ్మకం పరిమాణం కలిగిన సంస్థకు  ఈ హోదా ఉంటుంది.

డబ్ల్యూఎల్‌పీజీఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ కేంద్రంగా డబ్ల్యూఎల్‌పీజీఏ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు 125 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 300 సభ్య సంస్థల గ్లోబల్‌ ఎల్‌పీజీ నెట్‌వర్క్‌కు డబ్ల్యూఎల్‌పీజీఏ నేతృత్వం వహిస్తోంది. ఈ రంగం పురోగతి అసోసియేషన్‌ ప్రధాన లక్ష్యం.

రోస్‌నెఫ్ట్‌తో ఒప్పందం కొనసాగింపు
రష్యా చమురు ఉత్పత్తి సంస్థ రోస్‌నెఫ్ట్‌ నుంచి క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఆ సంస్థలో ఐఓసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, 2022లో ఆ సంస్థ నుంచి ఐఓసీ 2 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటుంది. 2021లో రోస్‌నెఫ్ట్‌ నుంచి 1.7 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ దిగుమతులకు ఐఓసీ ఒప్పందం చేసుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వరల్డ్‌ ఎల్‌పీజీ అసోసియేషన్‌ (డబ్ల్యూఎల్‌పీజీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నిక 
ఎప్పుడు : డిసెంబర్‌ 7
ఎవరు    : ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) చైర్మన్‌ శ్రీకాంత్‌ మాదవ్‌ వైద్య(ఎస్‌ఎం వైద్య) 
ఎందుకు : వరల్డ్‌ ఎల్‌పీజీ ఫోరం నిర్ణయం మేరకు..

Formula One: సౌదీ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్‌ డ్రైవర్‌?

Saudi Grand Prix

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో తొలిసారి నిర్వహించిన సౌదీ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. సౌదీ అరేబియాలోని జెద్దాలో డిసెంబర్‌ 7న ముగిసిన 50 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్‌ అందరికంటే ముందుగా 2 గంటలా 6 నిమిషాల 15.118 సెకన్లలో రేసును ముగించి విజేతగా అవతరించాడు. 21.825 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని వాల్తేరి బొటాస్‌ (మెర్సిడెస్‌) పొందాడు.

శ్రీకృష్ణ సాయికుమార్‌ ఏ క్రీడకు చెందినవాడు?
బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రీడాకారులు శ్రీకృష్ణ సాయికుమార్‌ పొదిలె–బొక్కా నవనీత్‌ డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. డిసెంబర్‌ 7న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్‌–నవనీత్‌ ద్వయం 15–21, 9–21తో టాప్‌ సీడ్‌ సచిన్‌ డయాస్‌–బువనెక గుణతిలక (శ్రీలంక) జోడీ చేతిలో ఓడిపోయింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సౌదీ గ్రాండ్‌ప్రి–2021లో విజేతగా నిలిచిన మెర్సిడెస్‌ డ్రైవర్‌?
ఎప్పుడు : డిసెంబర్‌ 7
ఎవరు : మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌
ఎక్కడ : జెద్దా,  సౌదీ అరేబియా
ఎందుకు : 50 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్‌ అందరికంటే ముందుగా 2 గంటలా 6 నిమిషాల 15.118 సెకన్లలో రేసును ముగించినందున..

Elections: జర్మనీ నూతన చాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?

Olaf Scholz

జర్మనీ నూతన చాన్సెలర్‌గా సోషల్‌ డెమోక్రాట్‌ పార్టీ నేత ఒలాఫ్‌ షోల్జ్‌ ఎన్నికయ్యారు. దీంతో జర్మనీ చాన్సెలర్‌గా డిసెంబర్‌ 8న షోల్జ్‌ బాధ్యతలు చేప్టటారు. 2021, సెప్టెంబర్‌ నెలలో జరిగిన ఎన్నికల్లో ఒలాఫ్‌ షోల్జ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ‘ప్రోగ్రెసివ్‌’ కూటమి విజయం సాధించింaది. పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రోగ్రెసివ్‌ కూటమి నేతగా.. ఒలాఫ్‌ షోల్జ్‌ను ఎన్నుకున్నారు. దీంతో నూతన చాన్సెలర్‌గా షోల్జ్‌ ఎన్నికకు మార్గం సుగమమైంది. ప్రోగ్రెసివ్‌ కూటమిలో సోషల్‌ డెమోక్రాట్‌ పార్టీ, గ్రీన్‌ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్‌ పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి.

కాగా, ఇప్పటికే నాలుగు పర్యాయాలు, 16 ఏళ్లపాటు ప్రభుత్వాధినేతగా కొనసాగి చరిత్ర సృష్టించిన ఎంజెలా మెర్కెల్‌ ఐదో దఫా చాన్సెలర్‌ ఎన్నిక బరి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఆమెకు చెందిన యూనియన్‌ బ్లాక్‌ పార్టీ 2021, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జర్మనీ నూతన చాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు    : సోషల్‌ డెమోక్రాట్‌ పార్టీ నేత ఒలాఫ్‌ షోల్జ్‌ 
ఎందుకు : తాజా ఎన్నికల్లో షోల్జ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ‘ప్రోగ్రెసివ్‌’ కూటమి విజయం సాధించినందున..

Biden, Putin Talks: ఉక్రెయిన్‌ రాజధాని నగరం పేరు?

Biden-Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ అయ్యారు. డిసెంబర్‌ 7న వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌ నుంచి బైడెన్, నల్ల సముద్ర తీర పట్టణం సోచీలోని అధికార నివాసం నుంచి పుతిన్‌ వర్చువల్‌ విధానం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. బైడెన్‌ మాట్లాడుతూ... ఉక్రెయిన్‌ సారభౌమత్వం, సమగ్రతలను దెబ్బతీసే రష్యా దూకుడుకు అంతర్జాతీయ ఆంక్షలతో ధీటైన సమాధానం చెప్తామని పుతిన్‌కు స్పష్టంచేశారు. నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకోమని అమెరికా చట్టబద్ధ హామీ ఇవ్వాలని బైడెన్‌తో పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ తూర్పు సరిహద్దు వెంట లక్షా 75వేల మంది సైనికులను, యుద్ధ ట్యాంకులను రష్యా మోహరించిన విషయం విదితమే.

ఉక్రెయిన్‌..
రాజధాని:
కైవ్‌(Kyiv); కరెన్సీ: హ్రివ్నియా(Hryvnia)
ప్రస్తుత అధ్యక్షుడు: వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ
ప్రస్తుత ప్రధానమంత్రి: డెనిస్‌ ష్మిహాల్‌
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో వర్చువల్‌ విధానం ద్వారా సమావేశం
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు    : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌
ఎందుకు : ఉక్రెయిన్‌ అంశం సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపేందుకు..

Nanda Kishore Prusty: ప్రముఖ ఉపాధ్యాయుడు, పద్మశ్రీ అవార్డీ నంద కన్నుమూత

Nanda kishore Prusty

ప్రముఖ ఉపాధ్యాయుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నంద కిశోర్‌ పృష్టి(104) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో డిసెంబర్‌ 7న తుదిశ్వాస విడిచారు. ఒడిశాలోని జాజ్‌పుర్‌ జిల్లా కంత్రిగా గ్రామానికి చెందిన నంద... 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక విద్యాభ్యాసాన్ని ఆపేశారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించారు. ఎందరో పేద చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. 74 ఏళ్లపాటు ఉచితంగా పాఠాలు బోధించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ ఉపాధ్యాయుడు, పద్మశ్రీ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్‌ 8
ఎవరు    : నంద కిశోర్‌ పృష్టి(104)
ఎక్కడ    : భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : అనారోగ్యం కారణంగా...

NASA Future Missions: నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత సంతతి వైద్యుడు?

NASA-Anil Menon

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA – నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) వ్యోమగామిగా భారత సంతతికి చెందిన వైద్యుడు అనిల్‌ మేనన్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ఆయన భవిష్యత్‌లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రల్లో పాల్గొంటారు. నాసాకు చెందిన ఒరాయన్‌ వ్యోమనౌక, స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ రాకెట్‌లో చంద్రుడిపైకి, సుదూర అంతరిక్ష యాత్రలకు పయనమవుతారు.

మిన్నెసోటా రాష్ట్రం మినియాపొలిస్‌లో జన్మించిన మేనన్‌... గతంలో స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌకకు తొలి ఫ్లైట్‌ సర్జన్‌గా వ్యవహరించారు. అమెరికా వాయుసేనలో అత్యవసర వైద్య విభాగంలో ఫిజీషియన్‌గా సేవలందిస్తున్నారు. 2010లో హైతీ, 2015లో నేపాల్‌ భూకంపాల సమయంలో ఆయన వైద్య సేవలు అందించారు. మేనన్‌ తండ్రి అచన్‌ది కేరళలోని మలబార్‌ ప్రాంతం. తల్లి ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామిగా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్‌ 7
ఎవరు    : భారత సంతతికి చెందిన వైద్యుడు అనిల్‌ మేనన్‌
ఎందుకు : NASA– నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్ణయం మేరకు..

Skilling Programme: సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్న సంస్థ?

దేశీయంగా సైబర్‌ సెక్యూరిటీను కెరియర్‌గా ఎంచుకునే వారికోసం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రత్యేక శిక్షణా ప్రోగ్రాంను ఆవిష్కరించింది. క్లౌడ్‌హ్యాట్, కీనిగ్, ఆర్‌పీఎస్, సినర్జిటిక్స్‌ లెర్నింగ్‌ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందించనుంది. ఈ ప్రోగ్రాం కింద 2022 నాటికి లక్ష మందికి పైగా శిక్షణనివ్వాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది. సైబర్‌సెక్యూరిటీ నైపుణ్యాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంను రూపొందించారు.

సంసద్‌ టీవీలో మేరీ కహానీ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎంపీ?
పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తేసేదాకా తాను సంసద్‌ టీవీలో వ్యాఖ్యాతగా చేయబోనని డిసెంబర్‌ 6న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం సంసద్‌ టీవీలో ఆయన ‘ టు ది పాయింట్‌’ అనే టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మేరీ కహానీ టీవీ షోలో ఇకపై తాను యాంకరింగ్‌ చేయబోనని శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రకటిచించిన విషయం తెలిసిందే. సస్పెండ్‌ అయిన 12 మంది ఎంపీల్లో ప్రియాంక ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    
: సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణా ప్రోగ్రాంను ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్‌ 7
ఎవరు    : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : దేశీయంగా సైబర్‌ సెక్యూరిటీను కెరియర్‌గా ఎంచుకునే వారికోసం..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 7 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 08 Dec 2021 08:01PM

Photo Stories