Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 7 కరెంట్‌ అఫైర్స్‌

Modi-Putin

Modi-Putin Talks Highlights: 21వ భారత్‌–రష్యా శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది?

21వ భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిసెంబర్‌ 6న ఢిల్లీకి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ద్వెపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం, అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం, మధ్య ఆసియా ప్రాంతంలో పెను సవాళ్లపైనా అగ్రనేతలు సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ.. ‘‘అజేయ శక్తిగా ఆవిర్భవించిన భారత్‌.. మాకు స్నేహహస్తం అందించే ఆత్మీయ నేస్తం. కాల పరీక్షను తట్టుకుని నిలబడిన చెలిమి మాది’’ అని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడులు 38 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇంధనం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యం పెరగాలన్నారు.

2+2 చర్చలు..
పుతిన్‌–మోదీ చర్చలకు కొద్ది గంటలకు ముందే భారత్‌ – రష్యా రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 చర్చలు జరిగాయి. చర్చల్లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి జై శంకర్‌ – రష్యా రక్షణ మంత్రి జనరల్‌ సెర్గీ షోయిగు, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లు పాల్గొన్నారు.

నాలుగు రక్షణ ఒప్పందాలు..
రాజ్‌నాథ్, సెర్గీ షోయిగు ఆధ్వర్యంలో ఇండియా–రష్యా ఇంటర్‌–గవర్నమెంటల్‌ కమిషన్‌ ఆన్‌ మిలిటరీ అండ్‌ మిలిటరీ–టెక్నికల్‌ కోఆపరేషన్‌(ఐఆర్‌ఐజీసీ–ఎం–ఎంటీసీ) 20వ సమావేశం జరిగింది. సైనిక పరికరాల ఉమ్మడి ఉత్పత్తిని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకోవడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందాల వివరాలు ఇలా..

  • భారత సైనిక దళాల కోసం రూ.5వేల కోట్ల విలువైన ఆరు లక్షలకుపైగా 7.63x39 మిల్లీమీటర్ల ఏకే–203 రకం రైఫిళ్లను.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ దగ్గర్లోని ఇండో–రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో సంయుక్తంగా ఉత్పత్తి చేయడం.
  • సైనిక సహకార ఒప్పందాలను మరో పదేళ్లు రెన్యువల్‌ చేయడం.
  • కలష్నికోవ్‌ సిరీస్‌ చిన్న ఆయుధాల తయారీలో సహకారంపై 2019 ఒప్పందంలో సవరణలకు ఆమోదం.
  • ఐఆర్‌ఐజీసీ–ఎం–ఎంటీసీ ప్రోటోకాల్‌కు సంబంధించిన నియమ నిబంధనలకు అంగీకారం.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
21వ భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు
ఎప్పుడు : డిసెంబర్‌ 6
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌
ఎక్కడ    : ఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు..

Special Court: జైలు శిక్ష విధింపబడిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత?

Aung San Suu Kyi

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, మయన్మార్‌ పదవీచ్యుత నేత అంగ్‌సాన్‌ సూకీ(76)కి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ దేశ రాజధాని నేపియతౌలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం, కోవిడ్‌ ఆంక్షల ఉల్లంఘన నేరాల కింద ఆమెను కోర్టు దోషిగా తేల్చిందని డిసెంబర్‌ 6న న్యాయశాఖ అధికారులు తెలిపారు.

100 ఏళ్లకు పైగానే..
సూకీ సారథ్యంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఐదేళ్ల కాలానికి రెండో విడత గెలవగానే ఫిబ్రవరిలో సైనిక నేతలు తిరుగుబాటు చేశారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని సూకీతోపాటు పలువురు కీలక నేతలపై ఆరోపణలు చేస్తూ వారిని పదవుల నుంచి తొలగించి, నిర్బంధంలో ఉంచారు. అనంతరం సూకీతోపాటు ఇతరులపై న్యాయస్థానాల్లో విచారణ ప్రారంభించారు. సూకీ ఎదుర్కొంటున్న మరికొన్ని ఆరోపణలకు సంబంధించి త్వరలో కోర్టు తీర్పు వెలువడనుంది. ఇవికాకుండా, మిగతా ఆరోపణలు కూడా రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగానే జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జైలు శిక్ష విధింపబడిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత?
ఎప్పుడు : డిసెంబర్‌ 6
ఎవరు    : మయన్మార్‌ పదవీచ్యుత నేత అంగ్‌సాన్‌ సూకీ(76)
ఎక్కడ    : నేపియతౌ, మయన్మార్‌
ఎందుకు : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం, కోవిడ్‌ ఆంక్షల ఉల్లంఘన నేరాల కింద..

Amitabh Kant: స్టార్టప్‌ల కోసం నీతి ఆయోగ్‌ ఆవిష్కరించిన రియాలిటీ షో?

Amitabh Kant

వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చేందుకు రూపొందించిన ప్రత్యేక రియాలిటీ షో ‘హార్సెస్‌ స్టేబుల్‌ – జో జీతా వహీ సికందర్‌’ ను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ఆవిష్కరించారు. డిసెంబర్‌ 6న న్యూఢిల్లీలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ... స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలు తమ ఐడియాలను వివరించి, పెట్టుబడులను అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. హెచ్‌పీపీఎల్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ అగర్వాల్, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కలిసి ఈ షోను రూపొందించారు. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (మిషన్‌ డైరెక్టర్‌) చింతన్‌ వైష్ణవ్, సునీల్‌ శెట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హార్సెస్‌ స్టేబుల్‌ – జో జీతా వహీ సికందర్‌ పేరిట ప్రత్యేక రియాలిటీ షో ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్‌ 6
ఎవరు    : నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చేందుకు..

PMJDY: జన్‌ ధన్‌ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య ఎంత శాతం?

Jan Dhan Yojana

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీఐ)లో భాగంగా దేశంలో తెరచిన  దాదాపు 44 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాల్లో 24.42 కోట్ల ఖాతాలు మహిళలకి చెందినవి. అంటే మొత్తం ఖాతాల్లో వీరి వాటా దాదాపు 55 శాతంగా ఉంది. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాద్‌ డిసెంబర్‌ 6న లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి తెలిపిన అంశాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

  • 2021 నవంబర్‌ 17వ తేదీ నాటికి దేశంలో ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన కింద లబ్దిదారుల సంఖ్య 43.90 కోట్లు. వీరిలో 24.42 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
  • జన్‌ ధన్‌ స్కీమ్‌ కింద లబ్ది పొందిన వారిలో అత్యధికులు గుజరాతీయులు ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 1.65 కోట్లు. అయితే వీరిలో 0.84 కోట్ల మంది (51 శాతం) మహిళా ఖాతాదారులు.

పీఎంజేడీఐను ఎప్పుడు ప్రారంభించారు?
దేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆర్థిక చట్రంలో వారిని భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజనను ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది 2014, ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. జన్‌ ధన్‌ అకౌంట్లలో ఎటువంటి కనీస నగదు నిల్వనూ నిర్వహించాల్సిన అవసరం లేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జన్‌ ధన్‌ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య దాదాపు 55 శాతంగా ఉంది
ఎప్పుడు : డిసెంబర్‌ 6
ఎవరు    : కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాద్‌
ఎక్కడ    : దేశవ్యాప్తంగా..

Andhra Pradesh: రాష్ట్ర హైకోర్టు ఆర్‌జీగా నియమితులైన తొలి మహిళ?

AP High Court

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ డాక్టర్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రం వీరి నియామకాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. త్వరలో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది.

న్యాయమూర్తుల నేపథ్యం ఇది..
జస్టిస్‌ కుంభజడల మన్మధరావు

జననం: 1966, జూన్‌ 30
ఊరు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ
విద్యాభ్యాసం: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డాక్టరేట్‌
ప్రస్థానం: 

  • 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఒంగోలులో నాగిశెట్టి రంగారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 
  • 1999లో హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. 
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వంటి కీలక సంస్థలకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు.
  • పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు.

జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి(బీఎస్‌ భానుమతి)
స్వగ్రామం:
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు
విద్యాభ్యాసం: రాజమహేంద్రవరంలో ‘లా’ అభ్యసించారు.
ప్రస్థానం: 

  • న్యాయాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. 
  • 2020 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)గా నియమితులయ్యారు. అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ పోస్టులో ఓ మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్‌ 6
ఎవరు : జస్టిస్‌ డాక్టర్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి  
ఎందుకు : సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేయడంతో..

Germany: లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?

Light Auto GmbH and Telangana

ఇండో జర్మన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6న హైదరాబాద్‌లో సంయుక్తంగా నిర్వహించిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జర్మనీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌తో ఒప్పందం
సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జర్మనీకి చెందిన ‘లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌’తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జె.లిండ్నర్, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఎంవోయూ కుదిరింది. ఒప్పందం ప్రకారం తెలంగాణలో జీఎంబీహెచ్‌ సంస్థ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఆధునిక డిజైనింగ్, తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఎలక్ట్రిక్, ఐసీఈ వాహన రంగంలో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహనాలకు అవసరమైన మెగ్నీషియం ఉత్పత్తులను తయారు చేస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌తో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
ఎప్పుడు  : డిసెంబర్‌ 6
ఎవరు    : తెలంగాణ
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో ఆధునిక డిజైనింగ్, తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం...

Andhra Pradesh: రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏ నగరంలో ఏర్పాటైంది?

కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌ చట్టం–1995లోని సెక్షన్‌ 83 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న వక్ఫ్‌ ట్రిబ్యునల్‌నే ఏపీ కేసుల విచారణకు వినియోగించుకుంటున్నారు. దీని వల్ల విచారణలో జాప్యం జరుగుతోంది.

చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు..
వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ 6న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. 

  • బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అన్నదాతలకు అవగాహన కల్పించాలి
  • వరి పండిస్తే వచ్చే ఆదాయం చిరుధాన్యాల (మిల్లెట్స్‌) సాగు రైతులకు కూడా దక్కేలా చూడాలని, ఇందుకోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
  • మిల్లెట్స్‌ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయాలి.

జవాద్‌ తుపాను ఏ సముద్రం ఏర్పడింది?
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగుతున్న జవాద్‌ తుపాను డిసెంబర్‌ 6న మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌ తీరంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.

Lok Sabha: నైపర్‌(సవరణ) బిల్లు–2021 ప్రధాన ఉద్దేశం?

హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌(నైపర్‌)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన ‘నైపర్‌(సవరణ) బిల్లు–2021’కు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఈ బిల్లును డిసెంబర్‌ 6న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే నైపర్‌లకు ఒకేరకమైన జాతీయ హోదా లభిస్తుంది.

సైనికులపై హత్య కేసు
నాగాలాండ్‌లో సైనిక దళాల కాల్పుల్లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తిస్తూ 21వ పారా స్పెషల్‌ ఫోర్స్‌ జవాన్లపై డిసెంబర్‌ 6న సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోన్‌ జిల్లాలోని తిజిత్‌ పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా, హత్యాయత్నం, నేరపూరిత చర్య అభియోగాల కింద ఈ కేసు నమోదయ్యింది.

హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌ ఒక్కరోజు నిలిపివేత
సైనికుల కాల్పుల్లో కూలీల మరణానికి సంతాప సూచకంగా నాగాలాండ్‌ ప్రభుత్వం హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌ను ఒక్కరోజు(డిసెంబర్‌ 6న) నిలిపివేసింది. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా ఈ వేడుకను ప్రతి ఏటా 10 రోజులపాటు నాగాలాండ్‌ రాజధాని కోహిమా సమీపంలోని కిసామా గ్రామంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.

పొరపాటు వల్లే కాల్పులు
నాగాలాండ్‌లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటు పడడం వల్లే కార్మికులపై కాల్పులు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై సిట్‌ నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. ఈ మేరకు షా డిసెంబర్‌ 6న లోక్‌సభలో ప్రకటన చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నైపర్‌(సవరణ) బిల్లు–2021కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్‌ 6
ఎవరు    : లోక్‌సభ
ఎందుకు : హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌(నైపర్‌)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 6 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Dec 2021 07:33PM

Photo Stories