Daily Current Affairs in Telugu: 2021, డిసెంబర్ 6 కరెంట్ అఫైర్స్
PM Modi: ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్ కారిడార్‌కు ఎక్కడ శంకుస్థాపన చేశారు?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రూ.18వేల కోట్లకుపైగా విలువైన 11 మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 4న డెహ్రాడూన్‌లోఈ శంకుస్థాపనల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా తాము మౌలికసదుపాయాల అనుసంధాన మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని, ఇందులో భాగంగానే 11 మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. రూ.2,573 కోట్లతో పూర్తయిన ఏడు ప్రాజెక్టులను ఆయన ఇదే కార్యక్రమంలో ప్రారంభించారు.
అతిపెద్ద వైల్డ్‌లైఫ్ కారిడార్..
- ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో రూ.8,600 కోట్ల ఢిల్లీ–డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్, ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్ కారిడార్, బాలలకు అనువైన సిటీ ప్రాజెక్ట్, రిషీకేశ్‌లో కొత్త బ్రిడ్జి తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.
- ఢిల్లీ–డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్(ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే జంక్షన్ నుంచి డెహ్రాడూన్ వరకు) పూర్తయితే ఢిల్లీ–డెహ్రాడూన్ మధ్య ప్రయాణదూరం 180 కి.మీ.లకు తగ్గనుంది. ఈ కారిడార్‌లో 12 కిలో మీటర్ల మేర ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్ కారిడార్ ఉండనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.18వేల కోట్లకుపైగా విలువైన 11 మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరాఖండ్
ఎందుకు : మౌలికసదుపాయాల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా...
India-Russia: ఏకే–203 రైఫిళ్లను ఎక్కడ తయారు చేయనున్నారు?
అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీ పరిధిలోని కోర్వాలో తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మనిర్భర్ సాధించడానికి తాజా నిర్ణయం బాటలుపరుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5వేలకోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్లను అక్కడ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు. మూడు దశాబ్దాల క్రితం నుంచి భారత సాయుధ బలగాల కోసం వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ అధునాతన ఏకే–203 రైఫిళ్లను తెచ్చారు. ఈ తేలికైన 7.62 x 39 మిల్లీమీటర్ల కాలిబర్ రైఫిల్ 300 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించగలదు.
రష్యాతో ఒప్పందం..
- కోర్వాలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకే–203 అసల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో భారత్ ఒప్పందం చేసుకోనుంది.
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021, డిసెంబర్ ఆరో తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో ఏకే–203 రైఫిల్స్ తయారీకి సంబంధించి భారత్– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనుంది.
- భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే–203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను కోర్వాలో తయారు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : కోర్వా, అమేథీ జిల్లా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా..
Kuala Lumpur: ఆసియా స్క్వాష్ టీమ్ చాంపియన్‌షిప్-2021 విజేత?
ఆసియా స్క్వాష్ టీమ్ చాంపియన్‌షిప్–2021లో భారత పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. డిసెంబర్ 4న మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 1–2తో మలేసియా చేతిలో ఓడి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది. గతంలో భారత్ 1981, 2012లలో కూడా ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
మహేశ్ మంగావ్‌కర్ ఏ క్రీడకు చెందిన వాడు?
- ఆసియా స్క్వాష్ టీమ్ చాంపియన్‌షిప్–2021లో ఫైనల్లో.. తొలి మ్యాచ్‌లో సౌరవ్ ఘోషాల్ 10–12, 4–11, 8–11తో ఎన్గ్ ఎయిన్ యౌ (మలేసియా) చేతిలో ఓడాడు.
- రెండో మ్యాచ్‌లో రమిత్ టాండన్ 8–11, 11–8, 3–11, 1–11తో ఇవాన్ యెయున్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూడటంతో భారత టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి.
- నామమాత్రంగా జరిగిన మూడో మ్యాచ్‌లో మహేశ్ మంగావ్‌కర్ 11–9, 11–7, 11–8తో కమాల్ (మలేసియా)పై గెలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా స్క్వాష్ టీమ్ చాంపియన్‌షిప్–2021 విజేత?
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : మలేసియా పురుషుల జట్టు
ఎక్కడ : కౌలాలంపూర్, మలేసియా
ఎందుకు : ఫైనల్లో భారత్ 1–2తో మలేసియా చేతిలో ఓడినందున..
Army: కార్మికులపై సైనికులు కాల్పులు జరిపిన ఘటన ఏ రాష్ట్రంలో జరిగింది?
బొగ్గు గనిలో పనిచేసే కార్మికులపై సైనికులు కాల్పులు జరిపిన దారుణ ఘటన ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో మొత్తం 13 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
ఘటన వివరాలు ఇలా..
డిసెంబర్ 4వ తేదీన గనిలో పని పూర్తిచేసుకొని వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు కాల్పులు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు. జవాన్లు ఆత్మరక్షణ కోసం మరోసారి కాల్పులు జరిపారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు.
అందుకే కాల్పులు..
నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్‌ఎస్‌సీఎన్–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్ ఆంగ్ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్‌ఎస్‌సీఎన్–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరీ’ కోసం సైన్యం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
మయన్మార్‌తో సరిహద్దు..
మోన్ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్‌ఎస్‌సీఎన్–కేలోని యుంగ్ ఆంగ్ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది.
‘సిట్’ ఏర్పాటు
తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో ప్రకటించారు. ఈ బృందానికి నాగాలాండ్ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు.
హార్న్‌బిల్ ఫెస్టివల్ బహిష్కరణ..
పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీఓ) ఖండించింది. ఇందుకు నిరసనగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఫెస్టివల్‌లో పాల్గొనకుండా నల్లజెండాలు ఎగురవేయాలని గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకరషించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్‌బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బొగ్గు గనిలో పనిచేసే కార్మికులపై కాల్పులు జరపడంతో 13 మంది మృతి
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : సైన్యం
ఎక్కడ : ఓతింగ్ గ్రామం, తిరూ ఏరియా, మోన్ జిల్లా, నాగాలాండ్
ఎందుకు : కార్మికులను నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్‌ఎస్‌సీఎన్–కే) తీవ్రవాదులుగా భ్రమపడి..
Veteran Journalist: ఇటీవల కన్నుమూసిన పాత్రికేయుడు, పద్మశ్రీ అవార్డీ?
దూరదర్శన్ ద్వారా దేశవ్యాప్తంగా చిరపరిచితమైన ప్రముఖ పాత్రికేయులు వినోద్ దువా(67) అనారోగ్యంతో డిసెంబర్ 4న ఢిల్లీలో కన్నుమూశారు. తన 42ఏళ్ల పాత్రికేయ జీవితంలో ఎన్నో జనరంజక టెలివిజన్ కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహించారు. వినోద్‌ను కేంద్రప్రభుత్వం 2008లో పద్మశ్రీతో సత్కరించింది.
సంసద్ టీవీ షో నుంచి వైదొలిగిన ఎంపీ?
రాజ్యసభలో అనుచిత ప్రవర్తన ఆరోపణలపై తనతో సహా 12 మంది సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సంసద్ టీవీ షో ‘మేరీ కహానీ’యాంకర్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రకటించారు. ఈ మేరకు ఆమె రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.
లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాలతోపాటు ఇతర ప్రజా సంబంధ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సంసద్ టీవీ’చానెల్‌ను నిర్వహిస్తోంది. ఈ చానెల్‌లో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘టు ది పాయింట్’ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుండగా... ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : వినోద్ దువా(67)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా..
Amit Shah: బీఎస్‌ఎఫ్ 57వ అవతరణ దినోత్సవ వేడుకలను ఎక్కడ నిర్వహించారు?
సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్)57వ అవతరణ దినోత్సవాన్ని(BSF Raising Day) పురస్కరించుకుని డిసెంబర్ 5న రాజస్తాన్ రాష్ట్రం జైసల్మేర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ‘శత్రు డ్రోన్ల ముప్పును తిప్పికొట్టేందుకు బీఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ, డీఆర్‌డీవోలు కలిసి దేశీయంగా యాంటీ–డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ సాంకేతికత త్వరలోనే సైన్యానికి అందుబాటులోకి రానుంది’ అని తెలిపారు. బీఎస్‌ఎఫ్ ఆవిర్భావ ఉత్సవాలు మొదటిసారిగా ఢిల్లీ వెలుపల, సరిహద్దులకు సమీపంలో జరుపుతున్నామన్నారు. 1965, డిసెంబర్ 1న బీఎస్‌ఎఫ్ ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
స్టార్‌షిప్ రాకెట్ ఏ సంస్థకు చెందినది?
చంద్రుడు, అంగారక గ్రహం పైకి కార్గోను, మనుషులను పంపించే అధునాతన నవతరం రాకెట్ ‘‘స్టార్‌షిప్’’ ల్యాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో ఎలన్ మస్క్‌కు చెందిన అంతరిక్షయాన సంస్థ ’స్పేస్–ఎక్స్’ ప్రారంభించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 4న ఎలన్ మస్క్ తెలిపారు. పునర్వినియోగానికి వీలున్న ఈ స్టార్‌షిప్‌ను మానవరహితంగా 2024లో, మానవసహితంగా 2026లో అంగారకుడి పైకి పంపాలని స్పేస్–ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
Badminton: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్?
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. ఇండోనేసియాలోని బాలి నగరంలో డిసెంబర్ 5న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 16–21, 12–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో అత్యధికంగా మూడుసార్లు ఫైనల్ చేరిన క్రీడాకారిణి అయిన సింధు ఫైనల్లో ఆశించినస్థాయిలో ఆడలేకపోయింది.
విజయాన్ని ఖాయం చేసుకొని సీజన్ ముగింపు టోర్నీ టైటిల్ సాధించిన తొలి దక్షిణ కొరియా క్రీడాకారిణిగా ఆన్ సెయంగ్ గుర్తింపు పొందింది. గత రెండు వారాల్లో బాలిలోనే జరిగిన ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లలో కూడా ఆన్ సెయంగ్ విజేతగా నిలిచింది. సింధు తదుపరిగా 2021, డిసెంబర్ 12న స్పెయిన్‌లో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్?
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
ఎక్కడ : బాలి, ఇండోనేసియా
ఎందుకు : మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 16–21, 12–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైనందున..
Bhubaneswar: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్–2021 విజేత?
ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్–2021లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 5న జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4–2 తో జర్మనీ జట్టుపై విజయం సాధించింది. దీంతో అర్జెంటీనాకు స్వర్ణం, జర్మనీకి రజతం లభించాయి. జూనియర్ ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలవడం ఇది రెండోసారి. 2005లో తొలిసారి అర్జెంటీనా విజేతగా నిలిచింది.
భారత జట్టుకు నిరాశ..
సొంతగడ్డపై జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో కాంస్య పతకమైనా సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
కళింగ స్టేడియం వేదికగా..
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా 2021, నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్–2021 టోర్నీ జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఈ టోర్నీని నిర్వహించారు. టోర్నీలో భారత్‌తో సహా మరో 15 జట్లు (అర్జెంటీనా, బెల్జియం, కెనడా, చిలీ, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మలేసియా, పాకిస్తాన్, పోలాండ్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, నెదర్లాండ్స్, అమెరికా) పాల్గొన్నాయి. కరోనా వల్ల టోర్నీకి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు దూరంగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్–2021 విజేత?
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : అర్జెంటీనా జట్టు
ఎక్కడ : కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : ఫైనల్లో అర్జెంటీనా 4–2 తో జర్మనీ జట్టుపై విజయం సాధించినందున..
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబర్ 4 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్