Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 4 కరెంట్‌ అఫైర్స్‌

Gita Gopinath 650x400

International Monetary Fund: ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీగా నియమితులైన తొలి మహిళ?

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌(డీఎండీ)గా ఇండియన్‌ అమెరికన్‌ గీతా గోపీనాథ్‌ (49) నియమితులయ్యారు. దీంతో ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీగా నియమితులైన తొలి మహిళగా గీత గుర్తింపు పొందారు. ఇప్పటి వరకూ ఆమె ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకమిస్ట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రస్తుతం జాఫ్రీ ఒకామోటో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022 ఏడాది మొదట్లో ఆయన తన బాధ్యతలను విరమించనున్నారు. అటు తర్వాత గీతా గోపీనాథ్‌ కొత్త బాధ్యతలు చేపడతారు.

తొలి మహిళా చీఫ్‌ ఎకానమిస్ట్‌గానూ..
హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ అయిన గీత.. ఐఎంఎఫ్‌ తొలి మహిళా చీఫ్‌ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్‌ వర్సిటీ పొడిగించడంతో ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా మూడేళ్ల పాటు కొనసాగారు. 2022 ఏడాది తన బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంది. ఐఎంఎఫ్‌లో బాధ్యతల అనంతరం.. హార్వర్డ్‌ వర్సిటీకే తిరిగి వెళ్లాలని గీత నిర్ణయించుకున్నారు. అయితే అనూహ్యంగా ఐఎంఎఫ్‌ రెండవ స్థానంలో ఆమె నియామకం వార్త వెలువడింది.

ఎండీగా క్రిస్టాలినా..
ప్రస్తుతం ఐఎంఎఫ్‌ ఎండీగా క్రిస్టాలినా జార్జివా ఉన్నారు. 2024, సెప్టెంబర్‌ వరకు ఆమె పదవిలో కొనసాగనున్నారు. తాజాగా ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీగా గీత నియామకం జరగడంతో... ఐఎంఎఫ్‌ తొలి రెండు అత్యున్నత స్థానాల్లో ఒకేసారి మహిళలు ఉండనున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్‌ ప్రధాన కార్యాలయం ఉంది.

గీతా గోపీనాథ్‌ నేపథ్యం..

  • 1971, డిసెంబర్‌ 8న పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జన్మించారు.
  • మలయాళీ కుటుంబ నేపథ్యం గల గీత ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. 
  • ఆ తర్వాత ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లోను, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో మాస్టర్స్‌ చేశారు.
  • 2001లో ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన గీతా గోపీనాథ్‌.. 2005లో హార్వర్డ్‌కు మారారు. 
  • 2010లో టెన్యూర్డ్‌ ప్రొఫెసర్‌ (దాదాపు పర్మనెంట్‌ స్థాయి)గా పదోన్నతి పొందారు. హార్వర్డ్‌ చరిత్రలో ఈ గౌరవం దక్కించుకున్న మూడో మహిళగాను, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ తర్వాత తొలి భారతీయురాలిగాను ఆమె ఘనత సాధించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌(డీఎండీ)గా నియమితులైన ఇండియన్‌ అమెరికన్‌?
ఎప్పుడు : డిసెంబర్‌ 3
ఎవరు    : గీతా గోపీనాథ్‌
ఎందుకు : ఐఎంఎఫ్‌ బోర్డ్‌ నిర్ణయం మేరకు..

Belt and Road Initiative: ఏ రెండు ఆసియా దేశాల మధ్య రైల్వే సేవలు ప్రారంభమయ్యయి?

China-Laos

చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ)లో భాగమైన చైనా-లావోస్‌ రైల్వే సేవలు డిసెంబర్‌ 4న ప్రారంభమయ్యాయి. లావోస్‌ రాజధాని వియంటియన్‌ నుంచి చైనాలోని యున్నాన్‌ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌కు ప్రారంభమైన మొట్టమొదటి రైలు సర్వీసును రెండు దేశాల అధ్యక్షులు సిసౌలిత్, షి జిన్‌పింగ్‌ వీడియో లింకేజీ ద్వారా తిలకించారు. దాదాపు 6 బిలియన్ల డాలర్ల వ్యయంతో ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు.

లావోస్‌...
రాజధాని:
వియంటియన్‌; కరెన్సీ: లావో కిప్‌
ప్రస్తుత జనరల్‌ సెక్రటరీ, అధ్యక్షుడు: తొంగ్లౌన్‌ సిసౌలిత్‌
ప్రస్తుత ప్రధానమంత్రి: ఫంఖం విపవన్హ్‌

పాకిస్తాన్‌లోనూ..
బీఆర్‌ఐలో భాగంగా చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ పోర్టును చైనాలోని జిన్‌జియాంగ్‌తో కలిపేందుకు 60 బిలియన్‌ డాలర్లతో రైలు మార్గం నిర్మిస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా ఈ మార్గాన్ని నిర్మించడాన్ని భారత్‌ వ్యతిరేకిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చైనా-లావోస్‌ మధ్య రైల్వే సేవలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్‌ 4
ఎవరు    : లావోస్‌ అధ్యక్షుడు తొంగ్లౌన్‌ సిసౌలిత్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ 
ఎక్కడ    : లావోస్‌ రాజధాని వియంటియన్‌ నుంచి చైనాలోని యున్నాన్‌ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌కు..
ఎందుకు : చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ)లో భాగంగా..

C-DAC: దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్‌ పేరు?

Rudra Server

దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్‌ ‘రుద్ర’ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ డిసెంబర్‌ 3న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనిని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌) అభివృద్ధి చేసింది. ‘‘రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం, దేశ కంప్యూటింగ్‌ అవసరాలకు తగినట్టు అందించడంలో భారత్‌ సామర్థ్యాలను ఇది తెలియజేస్తుంది’’ అని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

శిక్షోదయ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ?
ఆన్‌లైన్‌ విద్య అందిస్తున్న అన్‌అకాడమీ శిక్షోదయ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 5 లక్షల మంది బాలికలకు విద్యాబోధన అందిస్తారు. ఉద్యోగాలు పొందడంలో సహాయపడటమే కాకుండా చదువు మానేసిన బాలికలకు సొంతంగా జీవనోపాధిని పొందేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్‌ ‘రుద్ర’ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్‌ 4
ఎవరు    : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : దేశ కంప్యూటింగ్‌ అవసరాల కోసం..

Storm: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకి ఏ పేరు పెట్టారు?

Cyclone

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం డిసెంబర్‌ 3న తుపానుగా మారింది. దీనికి జవాద్‌ అని పేరు పెట్టారు. అధికారులు డిసెంబర్‌ 3న తెలిపిన వివరాల ప్రకారం.. జవాద్‌ తుపాను విశాఖకు ఆగ్నేయంగా 280 కి.మీల దూరంలో.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 400 కి.మీ.లు, పూరీకి 460 కి.మీ, పారాదీప్‌కి 540 కి.మీ.ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుంది.

ముఖ్యమంత్రి పర్యటన..
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రెండవ రోజు డిసెంబర్‌ 3న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. వరదల్లో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. నెల్లూరు నగరానికి శాశ్వత ముంపు పరిష్కారంగా పెన్నా నది కరకట్ట బండ్‌ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్‌ అఫ్రాన్‌ నిర్మాణం కోసం రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

ఆస్ట్రేలియాలో తుపానులను ఏ పేరుతో పిలుస్తారు?
చక్రవాతాలు లేదా తుపానులను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి.. 
కరేబియన్‌ సముద్రం – హరికేన్లు
దక్షిణ చైనా సముద్రం – టైఫూన్లు
ఆస్ట్రేలియా తీరం – విల్లీ విల్లీ
ఫిలిప్పైన్‌ సముద్రం – బాగీలు
జపాన్‌ సముద్రం – కైఫూలు
బంగ్లాదేశ్‌ తీరం – గురింద్‌లు
భారత తీరం – తుపానులు/చక్రవాతాలు

Aircraft Carrier: ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌక ఎక్కడ పని చేయనుంది?

ENC Chief Vice-Admiral Biswajit Dasgupta

స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిలో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ బేస్, సీ ట్రయల్స్‌ పూర్తయ్యాయని తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా వెల్లడించారు. త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో ఇది పని చేస్తుందని తెలిపారు. నేవీ డే(డిసెంబర్‌ 4) సందర్భంగా డిసెంబర్‌ 3న మీడియా సమావేశం నిర్వహించిన బిస్వజిత్‌ ఈ విషయాలను తెలిపారు. వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ తెలిపిన వివరాల ప్రకారం..

  • విశాఖపట్నం తీరంలో తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో 2021 ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్, రాష్ట్రపతి నౌకాదళ పరిశీలన) జరుగుతుంది.
  • 2021, ఫిబ్రవరి 25 తర్వాత 45 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, నౌకా దళాధికారులు, సిబ్బందితో మిలన్‌–2021 విన్యాసాలు జరుగుతాయి.
  • కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఆపరేషన్‌ సముద్ర సేతులో భాగంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న 4 వేల మంది భారతీయులను నౌకాదళం సురక్షితంగా స్వదేశానికి తెచ్చింది.

నేవీ డే కథ..
బంగ్లాదేశ్‌ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్‌–పాక్‌ మధ్య 1971 డిసెంబర్‌ 3న మొదలైన యుద్ధం డిసెంబర్‌ 16న పాకిస్తాన్‌ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్‌ 4 పాకిస్తాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్‌ 4న ‘భారత నౌకాదళ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
త్వరలో విశాఖపట్నం కేంద్రంగా యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పని చేస్తుంది.
ఎప్పుడు : డిసెంబర్‌ 3
ఎవరు    : తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా  
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా..

IFSCA: ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021 ప్రారంభం

ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 3న ప్రారంభించారు. డిసెంబర్‌ 4వ తేదీ వరకు వర్చువల్‌ విధానం ద్వారా జరగనున్న ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజానీకానికి ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఫిన్‌టెక్‌ విప్లవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సును భారత ప్రభుత్వ ఆధ్యర్యంలో గిఫ్ట్‌ సిటీ, బ్లూమ్‌బెర్గ్‌ల భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) నిర్వహిçస్తుంది. ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లు కూడా సదస్సులో భాగస్వాములుగా ఉన్నాయి. ఫిన్‌టెక్‌ విప్లవం, ఇండస్ట్రీ 4.0 అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

ప్రతిపాదిత డేటా గోప్యత, క్రిప్టోకరెన్సీ బిల్లుల విషయంలో భారత్‌ సరైన విధానాలే పాటిస్తోందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సదస్సులో వ్యాఖ్యానించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021 ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్‌ 3
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ఫిన్‌టెక్‌ విప్లవం, ఇండస్ట్రీ 4.0 అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు..

Booster Dose: ఇన్సాకాగ్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు?

దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బూస్టర్‌ డోసు ఇవ్వొచ్చా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సార్స్‌–కోవ్‌–2 జినోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సోర్టియమ్‌ (ఇన్సాకాగ్‌) చెందిన శాస్త్రవేత్తల బృందం సిఫారసు చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు రంగాల్లో వ్యక్తులకు తొలుత బూస్టర్‌ డోసు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్‌లోని జన్యుక్రమాలను పరీక్షించడానికి ఇన్సాకాగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వేరియెంట్‌ కేసులు దేశంలోకి ప్రవేశించాయన్న విషయాన్ని త్వరితగతిన తెలుసుకోవడం కష్టసాధ్యమని, అందుకే కరోనా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలని చెప్పింది.

ఇన్సాకాగ్‌(INSACOG)ను విపులీకరించండి?
ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 కన్సోర్టియమ్‌ ఆన్‌ జినోమిక్స్‌ లేదా ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనెటిక్స్‌ కన్సోర్టియమ్‌

దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్‌వో బృందం
కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బృందం ఆ దేశానికి వెళ్లింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌కి కేంద్రమైన గౌటాంగ్‌ ప్రావిన్స్‌లో కేసుల్ని పర్యవేక్షించడానికి డబ్ల్యూహెచ్‌ఒ తన బృందాన్ని పంపించింది. ఈ విషయాలను డబ్ల్యూహెచ్‌వో రీజనల్‌ డైరెక్టర్‌ ఫర్‌ ఆఫ్రికా డాక్టర్‌ సలామ్‌ గూయె తెలిపారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 3 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 Dec 2021 07:26PM

Photo Stories