Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 3 కరెంట్‌ అఫైర్స్‌

Anju Bobby George

World Athletics: అథ్లెటిక్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైన మాజీ క్రీడాకారిణి?

ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత మాజీ క్రీడాకారిణి, లాంగ్‌జంపర్‌ అంజూ బాబీ జార్జ్‌కు సముచిత గౌరవం లభించింది. ‘వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2021’గా అంజు ఎంపికైంది. దేశంలో ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషికిగాను అంజూకు ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం కోచ్‌గా పని చేస్తున్న అంజూ క్రీడల్లో లింగసమానత్వం కోసం కూడా కృషి చేస్తోందని జ్యూరీ కొనియాడింది.

ఏకైక భారత క్రీడాకారిణిగా...
కేరళలోని కొట్టాయం జిల్లాలోని చంగనస్సేరిలో 1977, ఏప్రిల్‌ 19న అంజూ.. 2003 పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. దీంతో పపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2005 మొనాకోలో జరిగిన ఐఏఏఎఫ్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్స్‌లోనూ బంగారు పతకం సాధించిన అంజూ.. 2016లో యువ క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు అకాడమీని ప్రారంభించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ప్రకటించిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2021 ఎంపికైన క్రీడాకారిణి?
ఎప్పుడు  : డిసెంబర్‌ 2
ఎవరు    : భారత మాజీ క్రీడాకారిణి, లాంగ్‌జంపర్‌ అంజూ బాబీ జార్జ్‌ 
ఎందుకు : దేశంలో ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషికిగాను..

India's CAD: కరెంట్‌ అకౌంట్‌ లోటు అంటే?

Dollars

భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) 2021–22 ఆర్థిక సంవత్సరం 60 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని బ్రిటన్‌ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– బార్‌క్లేస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత 45 బిలియన్‌ డాలర్ల అంచనాలను ఎగువముఖంగా సవరించింది. బార్‌క్లేస్‌ తాజా అంచనాలు నిజమైతే, క్యాడ్‌ పరిమాణం 2021–22 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 2 శాతంగా ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి చమురు, బొగ్గు, మెటల్‌ వంటి కీలక దిగుమతి ఉత్పత్తుల ధరలు తీవ్రంకావడం వల్ల కరెంట్‌ అకౌంట్‌ను లోటు దిశగా నడిపిస్తున్నట్లు ఆర్థికవేత్తల విశ్లేషణ.

కరెంట్‌ అకౌంట్‌ అంటే..
ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే కరెంట్‌ అకౌంట్‌. వచ్చినదానికన్నా ఇతర దేశాలకు చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్‌ అకౌంట్‌ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్‌ అకౌంట్‌ మిగులు.

2020–21లో కరెంట్‌ అకౌంట్‌ మిగులు ఎంత?
కరోనా సవాళ్లు, దిగుమతులు భారీగా పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే కరెంట్‌ అకౌంట్‌ మిగుల్లోనే ఉంది. విలువలో 102.2 బిలియన్‌ డాలర్లుగా (జీడీపీలో 0.9 శాతం) నమోదయ్యింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) 2021–22 ఆర్థిక సంవత్సరం 60 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది
ఎప్పుడు : డిసెంబర్‌ 2
ఎవరు    : బ్రిటన్‌ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– బార్‌క్లేస్‌
ఎందుకు : అంతర్జాతీయంగా ముడి చమురు, బొగ్గు, మెటల్‌ వంటి కీలక దిగుమతి ఉత్పత్తుల ధరలు తీవ్రంకావడం వల్ల..

State of States 2021: సమ్మిళిత అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

Indiai Today Survey

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సమగ్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రపథంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానం సాధించిందని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే’ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 2021 ఏడాదికిగానూ ‘స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ సంస్థ తాజాగా ప్రకటించింది.

పనితీరులో ఆరో స్థానం..
ఇండియా టుడే సర్వే ప్రకారం... అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. 2020 ఏడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2021 ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. పనీతీరులో తమిళనాడు రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.

సర్వే ఇలా..
రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థకు చెందిన ‘మార్కెటింగ్‌– డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ (ఎండీఆర్‌ఏ)’ ద్వారా 2003 నుంచి ఏటా స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ సర్వేను నిర్వహిస్తోంది. 2021 ఏడాదిగాను ఈ ఏడాది జూలై నుంచి నవంబర్‌ వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టారు. సర్వే బృందంలో ప్రముఖ విధాన నిర్ణేతలు, నీతి ఆయోగ్‌ ప్రతినిధులు, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 123 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి సర్వే చేపట్టారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం
ఎప్పుడు : డిసెంబర్‌ 2
ఎవరు    : ఇండియా టుడే  ‘‘స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌’’ సర్వే 
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా..

UN World Tourism Awards: వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా ఎంపికైన గ్రామం?

ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ) అందించే ‘‘వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలేజ్‌’’ అవార్డుకు.. భారత్‌ నుంచి ఎంపికైన భూదాన్‌పోచంపల్లికి స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో అవార్డును ప్రదానం చేశారు. డిసెంబర్‌ 2న జరిగిన యూఎన్‌డబ్ల్యూటీఓ 24వ జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో భారత్‌ తరఫున స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయ రెండవ కార్యదర్శి సుమన్‌శేఖర్‌ ఈ అవార్డును స్వీకరించారు. యూఎన్‌డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఉంది.

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో భూదాన్‌పోచంపల్లి గ్రామం ఎంపికైన విషయం తెలిసిందే. రూరల్‌ టూరిజం, అక్కడి ప్రజల జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలను వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రతి ఏటా యూఎన్‌డబ్ల్యూటీఓ బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీలను నిర్వహిస్తోంది. ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున పోచంపల్లి ఈ అవార్డుకు ఎంపికైంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భూదాన్‌పోచంపల్లికి వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలేజ్‌ అవార్డు ప్రదానం
ఎప్పుడు  : డిసెంబర్‌ 2
ఎవరు    : ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ)
ఎక్కడ    : మాడ్రిడ్, స్పెయిన్‌
ఎందుకు : ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున..

Covid-19: దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?

Omicron Virus

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ ‘‘ఒమిక్రాన్‌’’ భారత్‌లోకి ప్రవేశించింది. తొలిసారిగా కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు పురుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు డిసెంబర్‌ 2న కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. వారిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారని,  వారిలో  లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. అగర్వాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమిక్రాన్‌ సోకిన వారిలో ఒకరు దక్షిణాఫ్రికా వాసి (66) కాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి (46). 66 ఏళ్ల వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకి రాగా, 46 ఏళ్ల వయసున్న వైద్యుడు ఎలాంటి విదేశీ ప్రయాణం చేయలేదు. వీరికి ఒమిక్రాన్‌ సోకినట్టుగా ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌ జన్యు విశ్లేషణలో తేలింది.

30 దేశాల్లో..
దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నవంబర్‌ 24న బయటపడిన ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తొమ్మిది రోజుల్లోనే భారత్‌సహా 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్‌ కేసుల్ని గుర్తించారు. డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్‌ వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్‌ ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు
ఎప్పుడు : డిసెంబర్‌ 2
ఎవరు    : కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ 
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక

Indian Army: ఆర్మీ నూతన యూనిఫామ్‌ను ఏ డిజైన్‌లో రూపొందించారు?

Indian Army

యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. 2022 ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నారని సంబంధిత వర్గాలు డిసెంబర్‌ 2న వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండే ఈ యూనిఫామ్‌ను ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్‌ డిస్ట్రర్బ్‌’ డిజైన్‌లో రూపొందించారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్‌ కోసం ఎంపికచేశారు. 2022, జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు.

చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఎవరు ఉన్నారు?
భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్‌ ఆర్మీ)లో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం సైనిక దళ ప్రధానాధికారి (చీఫ్స్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌) జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డిజిటల్‌ డిస్ట్రర్బ్‌ డిజైన్‌లో ఆర్మీ యూనిఫాం రూపకల్పన 
ఎప్పుడు : డిసెంబర్‌ 2
ఎవరు    : భారత ప్రభుత్వం
ఎందుకు : యుద్ధక్షేత్రాల్లోని సైనిక బలగాలకు... వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు..

Naval Exercise: 2022 మిలాన్‌ విన్యాసాలు ఎక్కడ జరగనున్నాయి?

Indian Navy

నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్‌ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదిక కానుంది. విశాఖలోని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్‌–2022 విన్యాసాలు నిర్వహించనున్నారు. 2022, ఫిబ్రవరిలో జరిగే విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం 46 దేశాలకు ఆహ్వానం పంపగా.. 30 దేశాలు పాల్గొంటున్నట్లు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. సీ ఫేజ్, హార్బర్‌ ఫేజ్‌లలో రెండు ఫేజ్‌లలో విన్యాసాలు నిర్వహించనున్నారు.

వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ విశాఖ కేంద్రంగా మిలాన్‌ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్‌ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు. అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ–2016కు విశాఖ నగరం వేదికగా నిలిచిన విషయం విదితమే.

సమావేశం అని అర్థం..
వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్‌ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలాన్‌ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం.

1995లో తొలిసారి..

  • 1995లో తొలిసారి జరిగిన మిలాన్‌ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. 
  • సాధారణంగా రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి. 
  • 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి. 
  • 2005లో సునామీ రావడం వల్ల మిలాన్‌ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లు నిర్వహించడం వల్ల మిలాన్‌ విన్యాసాలు జరగలేదు. 
  • మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్‌ విన్యాసాలు జరిగాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2022, ఫిబ్రవరిలో మిలాన్‌ విన్యాసాల నిర్వహణ
ఎప్పుడు : డిసెంబర్‌ 2
ఎవరు    : భారత నౌకాదళం
ఎక్కడ    : ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 2 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Dec 2021 07:38PM

Photo Stories