Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 2 కరెంట్‌ అఫైర్స్‌

Xiomara Castro

First Female President: హోండూరస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?

సెంట్రల్‌ అమెరికా దేశమైన హోండూరస్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్‌ పార్టీ ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్ష లిబర్టీ అండ్‌ రీఫౌండేషన్‌ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి 62 ఏళ్ళ షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు.

హోండూరస్‌ అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 28న జరిగాయి. నవంబర్‌ 30 వరకూ 52 శాతం ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53 శాతం ఓట్లు సాధించగా, అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురాకు 34 శాతం ఓట్లే వచ్చాయి. అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది.

హోండూరస్‌..
రాజధాని:
తెగూసిగల్పా; కరెన్సీ: లెంపిరా(హెచ్‌ఎన్‌ఎల్‌);
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హోండూరస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?
ఎప్పుడు : డిసెంబర్‌ 1
ఎవరు    : షియోమరా క్యాస్ట్రో
ఎందుకు : ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లిబర్టీ అండ్‌ రీఫౌండేషన్‌ పార్టీ విజయం సాధించడంతో..

PKL 2021: ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌ ఎక్కడ జరగనుంది?

PKL

కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా డిసెంబర్‌ 22న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిదో సీజన్‌ ప్రారంభం కానుంది. ఎనిమిదో సీజన్‌ మొత్తానికి బెంగళూరు నగరమే వేదిక కానుంది. కరోనా కొత్త వేరియంట్ల కలకలం నేపథ్యంలో మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. తొలి మ్యాచ్‌లో  యు ముంబాతో బెంగళూరు బుల్స్‌ తలపడనుంది. కరోనా మహమ్మారి పడగ విప్పటంతో 2020 ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌ రద్దయింది.

ఐఎఫ్‌ఏఎఫ్‌  చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
అమెరికన్‌ ఫుట్‌బాల్‌ (రగ్బీ తరహా ఆట) అంతర్జాతీయ సమాఖ్య (ఐఎఫ్‌ఏఎఫ్‌) ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన సందీప్‌ రెడ్డి పోతిరెడ్డి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇజ్రాయెల్‌ వేదికగా 2021, డిసెంబర్‌ 6 నుంచి 8 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.

Eastern Naval Command: తూర్పు నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వైస్‌ అడ్మిరల్‌?

Vice Admiral Biswajit Dasgupta

తూర్పు నౌకాదళానికి 29వ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌గుప్తా డిసెంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తూర్పు నౌకాదళాధిపతిగా ఉన్న వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహద్దూర్‌సింగ్‌ పశ్చిమ నౌకాదళాధిపతిగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో బిస్వజిత్‌ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన బిస్వజిత్‌కు ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌.. సెరమోనియల్‌ పరేడ్‌తో ఘన స్వాగతం పలికింది. బిశ్వజిత్‌ దాస్‌గుప్తా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పూర్వ విద్యార్థి. 1985లో భారత నౌకాదళంలోకి ప్రవేశించిన ఆయన.. నావిగేషన్‌ డైరెక్షన్‌లో నిపుణుడు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తూర్పు నౌకాదళానికి 29వ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్‌ 1
ఎవరు    : వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌గుప్తా
ఎక్కడ    : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఇప్పటివరకు తూర్పు నౌకాదళాధిపతిగా ఉన్న వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహద్దూర్‌సింగ్‌ పశ్చిమ నౌకాదళాధిపతిగా బదిలీ కావడంతో..

Economist Intelligence Unit: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది?

Tel Aviv

ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవీవ్‌ నగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయు) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా–2021(వరల్డ్‌ వైడ్‌ సిటీ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌)ను రూపొందించింది. తాజాగా విడుదలైన ఈ జాబితాలో ఇజ్రాయిల్‌ నగరం టెల్‌ అవీవ్‌ తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచింది. టెల్‌ అవీవ్‌ తర్వాత పారిస్, సింగపూర్‌ నగరాలు ఉమ్మడిగా రెండవ స్థానంలో ఉన్నాయి.

173 నగరాల్లో..
2021 ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లో నిత్యావసర సరుకుల ధరలు, అద్దె, రవాణా వంటి ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకొని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించారు. రవాణా, కిరాణా సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ జాబితాలో టెల్‌ అవీవ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2020 ఏడాది జాబితాలో పారిస్, జ్యూరిచ్, హాంగ్‌కాంగ్‌ ఉమ్మడిగా ప్రథమ స్థానంలో ఉన్నాయి.

వరల్డ్‌ వైడ్‌ సిటీ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌–2021

ర్యాంకు

నగరం

దేశం

1

టెల్‌ అవీవ్‌

ఇజ్రాయిల్‌

2

పారిస్‌

ఫ్రాన్స్‌

2

సింగపూర్‌

సింగపూర్‌

4

జ్యూరిచ్‌

స్విట్జర్‌ల్యాండ్‌

5

హాంగ్‌ కాంగ్‌    

హాంగ్‌ కాంగ్‌

6

న్యూయార్క్‌

అమెరికా

7

జెనీవా

స్విట్జర్‌ల్యాండ్‌

8

కోపెన్‌ హాగన్‌

డెన్మార్క్‌

9

లాస్‌ ఏంజిల్స్‌

అమెరికా

10

ఒసాకా

జపాన్‌

క్విక్‌ రివ్యూ :
ఏమిటి    :
అత్యంత ఖరీదైన నగరంగా టెల్‌ అవీవ్‌    
ఎప్పుడు : డిసెంబర్‌ 1
ఎవరు    : ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయు)  
ఎక్కడ : ప్రపంచంలోనే 
ఎందుకు : జీవన వ్యయం ఆధారంగా..

Lok Sabha: సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ బిల్లు ఉద్దేశం?

సంతాన సాఫల్య కేంద్రాలు; మహిళల అండాలు, పురుషుల వీర్యాన్ని భద్రపరిచే కేంద్రాల నియంత్రణ, పర్యవేక్షణతో పాటు సంబంధిత సాంకేతికతల దుర్వినియోగాన్ని అడ్డుకొనే లక్ష్యంతో రూపొందించిన ‘‘సంతాన సాఫల్య సహాయక సాంకేతికత (అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ–ఏఆర్‌టీ) నియంత్రణ బిల్లు–2020’’కు లోక్‌సభ డిసెంబర్‌ 1న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. దేశంలోని సంతాన సాఫల్య కేంద్రాలు, ఈ రంగంలో సేవలందించే వైద్య నిపుణుల పేర్ల నమోదు కోసం జాతీయ పట్టిక(నేషనల్‌ రిజిస్ట్రీ), నమోదు యంత్రాంగం(రిజిస్ట్రేషన్‌ అథారిటీ) ఏర్పాటు చేయనున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలనూ నియంత్రించనున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సంతాన సాఫల్య సహాయక సాంకేతికత (అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ–ఏఆర్‌టీ) నియంత్రణ బిల్లు–2020కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్‌ 1
ఎవరు    : లోక్‌సభ
ఎందుకు : సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ, పర్యవేక్షణతో పాటు సంబంధిత సాంకేతికతల దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు..

Dr Rajiv Kumar: నీతి ఆయోగ్‌ ఏ తేదీన ఏర్పాటైంది?

CM Jagan-Rajiv Kumar

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో రెండు రోజుల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్‌ బృందం డిసెంబర్‌ 1న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమైంది. నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ కె.రాజేశ్వరరావు (స్పెషల్‌ సెక్రటరీ), డాక్టర్‌ నీలం పటేల్‌ (సీనియర్‌ అడ్వైజర్‌), సీహెచ్‌.పి.సారధి రెడ్డి (అడ్వైజర్‌), అవినాష్‌మిశ్రా (అడ్వైజర్‌) తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

అన్ని రాష్ట్రాలకు వెళ్లి..
సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా తాము అన్ని రాష్ట్రాలకు వెళ్లి విజన్, అభివృద్ధిపై పరస్పరం ఆలోచనలు పంచుకుంటున్నట్లు డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ సమావేశంలో తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని సీఎం జగన్‌ను ప్రశంసించారు.

నీతి ఆయోగ్‌...

  • కాలానుగుణంగా సంభవించిన మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆశలను, అవసరాలను తీర్చేందుకు ప్రణాళిక సంఘం స్థానంలో 2015, జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్‌(NITI Aayog) ఏర్పాటైంది. 
  • నీతి (NITI –నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) ఆయోగ్‌ అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. 
  • నిర్దేశిత విధులను నిర్వర్తించే క్రమంలో సమ్మిళిత, సమానత్వం, సుస్థిరత వంటి లక్ష్యాలతో కూడిన అభివృద్ధి విజన్‌ను నీతి ఆయోగ్‌ పాటిస్తుంది.
  • పేద, లక్షిత వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అవలంబించాల్సిన కార్యక్రమాలను రూపొందిస్తుంది.  
  • సహకార సమాఖ్య భావనను పెంపొందించడం నీతి ఆయోగ్‌ ప్రధాన విధి. జాతీయ విధానాలను రూపొందించే క్రమంలో రాష్ట్రాలను భాగస్వామ్యులను చేస్తుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశం 
ఎప్పుడు : డిసెంబర్‌ 1
ఎవరు    : నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, అమరావతి, గుంటూరు జిల్లా
ఎందుకు : రాష్ట్రాభివృద్ధిపై పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు..

Smallest Camera: ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరాను తయారు చేసిన సంస్థలు?

Smallest Camera

అమెరికాలో ఉన్న ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ శాస్త్రవేత్తలు... ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరాను తయారు చేశారు.  సాధారణ కెమెరాలు తీస్తే ఫొటోలు కలర్‌ఫుల్‌గా, స్పష్టంగా ఎలా వస్తాయో ఆ స్థాయిలో తీసేలా ఈ అర మిల్లీమీటర్‌ కెమెరాను రూపొందించారు. ఈ కెమెరా తయారీకి అర మిల్లీమీటర్‌ పరిమాణంలోని గ్లాస్‌ లాంటి ‘ ఆప్టికల్‌ మెటాసర్ఫేస్‌’ను వాడారు. తన సైజుకన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను ఇది ఫొటోలు తీసేస్తుంది. చిన్న సైజు రోబోల్లో ఈ కెమెరాలను వాడొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాధులను గుర్తించడానికి, చికిత్స చేయడానికి వైద్యులు కూడా ఉపయోగించవచ్చని వివరించారు. ఇప్పటివరకు తయారు చేసిన ‘కలర్‌ మెటా సర్ఫేస్‌’ రకం కెమెరాల్లో స్పష్టమైన ఫొటోలు తీసేది ఇదే అని తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరాను తయారు చేసిన సంస్థలు?
ఎప్పుడు : డిసెంబర్‌ 1
ఎవరు    : అమెరికాలో ఉన్న ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ శాస్త్రవేత్తలు
ఎందుకు : చిన్న సైజు రోబోల్లో ఉపయోగించేందుకు..


International Space Station: చెత్త కారణంగా స్పేస్‌వాక్‌ను నిలిపేసిన సంస్థ?

Space Walk

అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA - నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) తన స్పేస్‌వాక్‌ కార్యక్రమాన్ని వాయిదావేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు సమీపంగా వేగంగా పరిభ్రమిస్తున్న శకలాలు స్పేస్‌వాక్‌ సమయంలో వ్యోమగాముల సూట్‌కు తూట్లు పెట్టే ప్రమాదముందని స్పేస్‌వాక్‌ను ఆపేశారు. ఐఎస్‌ఎస్‌కూ నష్టం వాటిల్లవచ్చని భావించారు. ఐఎస్‌ఎస్‌ బయటి యాంటీనాను మార్చేందుకు వ్యోమగాములు  సిద్ధమయ్యారు. అయితే, డిసెంబర్‌ 6న ఒక శకలం ఐఎస్‌ఎస్‌కు దగ్గరగా దూసుకెళ్లవచ్చని అంచనాకొచ్చారు. దీంతో యాంటీనా పునరుద్ధరణ కార్యక్రమం ఆగింది.

దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్‌..
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ 2021, అక్టోబర్‌లో బయటపడింది. ఈ వేరియెంట్‌పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని నైజీరియా ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఇది బయటపడిందని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్పేస్‌వాక్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్‌ 1
ఎవరు    : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA - నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌)
ఎందుకు : అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 1 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Dec 2021 07:36PM

Photo Stories