Daily Current Affairs in Telugu: 2021, డిసెంబర్ 1 కరెంట్ అఫైర్స్
World's Newest Republic: గణతంత్ర దేశంగా అవతరించిన దేశం?
కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్ నవంబర్ 30న గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించింది. వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్ రాణి ఎలిజెబెత్–2ని తొలగించింది.
1966లో స్వాతంత్య్రం..
దాదాపు 300 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1966లో బార్బడోస్‌కు స్వాతంత్య్రం వచ్చింది. రిపబ్లిక్‌గా ప్రకటించుకునే దిశగా బార్బడోస్ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఇటీవల దేశానికి మొట్టమొదటి అధినేతని పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్నుకుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 55 ఏళ్లవుతున్న సందర్భంగా బార్బడోస్ గవర్నర్ జనరల్ డామే సాండ్రా మాసన్(72) నవంబర్ 30న దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా విషయాల్లో ఆమె ప్రధానమంత్రి మియా మోట్లేకు సహకరిస్తారు.
కామన్‌వెల్త్ కూటమిలో..
ఎలిజెబెత్–2ను రాణిగా గుర్తించకున్నా కామన్‌వెల్త్ కూటమిలో బార్బడోస్ కొనసాగనుంది. లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్ బదులు ఇకపై ట్రినిడాడ్ కేంద్రంగా పనిచేసే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ను అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించనుంది.
ఆఫ్రికా సంతతి వారే..
సుమారు 3 లక్షల జనాభా ఉన్న బార్బడోస్‌లో అత్యధికులు బ్రిటిష్ పాలకులు చెరకు తోటల్లో పనిచేసేందుకు బానిసలుగా తీసుకువచ్చిన ఆఫ్రికా సంతతి వారే. కరీబియన్ దీవుల్లో భాగమైన గుయానా, డొమినికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1970లలోనే రిపబ్లిక్‌లుగా మారినా బార్బడోస్ మాత్రం ఆ హోదా తాజాగా పొందింది. బార్బడోస్ ప్రధాన ఆదాయవనరు పర్యాటక రంగం.
బార్బడోస్..
రాజధాని: బ్రిడ్జిటౌన్; కరెన్సీ: బార్బాడియన్ డాలర్
ప్రస్తుత అధ్యక్షురాలు: డామే సాండ్రా మాసన్
ప్రస్తుత ప్రధానమంత్రి: మియా మోట్లే
క్విక్ రివ్యూ :
ఏమిటి : గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించిన దేశం?
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్
ఎందుకు : వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో..
Uttarakhand: చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు ఏయే ఆలయాలను సందర్శిస్తారు?
ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం నుంచి విధులు నిర్వర్తిస్తున్న చార్‌ధామ్ దేవస్థానం బోర్డును రద్దుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నవంబర్ 30న ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో 2019లో ఈ బోర్డును ఏర్పాటుచేశారు. ప్రఖ్యాత ఆలయాలు కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిసహా 51 ప్రముఖ ఆలయాల పాలనా వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటోంది.
ధ్యాని కమిటీ సిఫార్సుల మేరకు..
తమ సంప్రదాయ హక్కులను చార్‌ధామ్ దేవస్థానం బోర్డు ఉల్లంఘిస్తోందని, పూజారులు మొదట్నుంచీ బోర్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాజాగా మనోహర్ కంత్ ధ్యాని(రాజకీయ నాయకుడు) నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఈ సమస్యలపై అధ్యయనం చేసి నివేదికను సీఎం పుష్కర్ ధామికి నవంబర్ 28న అందజేసింది. కమిటీ సిఫార్సుల మేరకు బోర్డును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
నాలుగు ఆలయాల సందర్శన..
చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఈ నాలుగు ఆలయాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చార్‌ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేస్తామని ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
ఎందుకు : పూజారుల సంప్రదాయ హక్కులను చార్‌ధామ్ దేవస్థానం బోర్డు ఉల్లంఘిస్తోందని..
GDP Growth: ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం?
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని నవంబర్ 30న వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
2021–22పై అంచనాలు ఇలా..
- 2020–21 ఆర్థిక సంవత్సరం కరోనా సవాళ్లతో భారత ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి 9.3 శాతం–9.6 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.
- అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) నవంబర్ 30న ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనావేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8 శాతం ఉంటుందని విశ్లేషించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వేగంగా వృద్ధి చెందుతున్న దేశం?
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచంలో..
ఎందుకు : భారత్.. 2021–22 ఏడాది రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకున్నందున..
CAG Report: ఏ శాఖల విభాగాల అకౌంట్లలో అవకతవకలు ఉన్నట్లు కాగ్ తెలిపింది?
కేంద్ర సమాచార సాంకేతికత (ఐటీ), టెలికం మంత్రిత్వశాఖల కింద పనిచేసే విభాగాల అకౌంట్లలో తీవ్ర అవకతవకలు ఉన్నట్లు కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఒకటి పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఐసీఎస్‌ఐ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటల్ సర్వీస్) ద్వారా రూ. 890 కోట్ల విలువైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కొనుగోళ్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికలను నవంబర్ 29న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
సైఫ్లిక్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సంస్థ?
శ్వాసకోశ సమస్యలపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వైద్య విద్యార్థుల కోసం ఫార్మా దిగ్గజం లుపిన్ ఉచిత ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సైఫ్లిక్స్ పేరిట ప్రారంభించిన ఈ వెబ్‌సైట్ ద్వారా కొత్త అధ్యయనాలు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు మొదలైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అగ్రివైజ్ జట్టు
వ్యవసాయం రంగం అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అగ్రివైస్ నవంబర్ 30న ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ‘కో–లెండింగ్’ ఒప్పందం కుదుర్చుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి వ్యవసాయ రంగానికి రుణాలను అందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
2021 Ballon d'Or: గోల్డెన్ బాల్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆటగాడు?
ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి ప్రతి యేటా అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే ‘బలాన్ డోర్’(గోల్డెన్ బాల్) అవార్డును 2021 ఏడాదికిగాను అర్జెంటీనా స్టార్ లయెనెల్ మెస్సీ సొంతం చేసుకున్నాడు. దీంతో మెస్సీ ఏడోసారి ఈ అవార్డును గెలుచుకున్నట్లయింది. గతంలో 2009, 2010, 2011, 2012, 2015, 2019లలో మెస్సీని ఈ అవార్డు వరించింది. కరోనా నేపథ్యంలో.. గోల్డెన్ బాల్–2020 అవార్డును ప్రదానం చేయలేదు. 34 ఏళ్ల మెస్సీకి అందరికంటే ఎక్కువగా 613 పాయింట్లు లభించాయి. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ‘ల లీగా ’ 2020–21 సీజన్‌లో బార్సిలోనా తరఫున మెస్సీ 30 గోల్స్‌తో టాపర్‌గా నిలిచాడు. మెస్సీ కెప్టెన్సీలోనే కోపా అమెరికా కప్–2021ను అర్జెంటీనా గెలిచింది. మహిళల విభాగంలో అలెక్సియా పుటెల్లాస్ (స్పెయిన్) బలాన్ డోర్–2021 అవార్డును సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాదికి గాను ‘బలాన్ డోర్’(గోల్డెన్ బాల్) అవార్డును సొంతం చేసుకున్న ఆటగాడు?
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అర్జెంటీనా స్టార్ లయెనెల్ మెస్సీ
ఎందుకు : మెస్సీకి అందరికంటే ఎక్కువగా 613 పాయింట్లు లభించినందున..
Telugu Lyricist: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) ఇకలేరు. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ నవంబర్ 30న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల... కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో మెడిసిన్ (బీడీఎస్)లో చేరారు. తండ్రి చనిపోవడంతో మెడిసిన్‌ను మధ్యలోనే ఆపేశారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’చిత్రానికి సీతారామశాస్త్రి అన్ని పాటలూ రాశారు. ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది. సీతారామశాస్త్రి ఇప్పటివరకు సుమారు 800 సినిమాలకు దాదాపు 3,000 పాటలు రాశారు. పద్మశ్రీతో పాటు 11 నంది అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సినీ గేయ రచయిత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : సిరివెన్నెల సీతారామశాస్త్రి (66)
ఎక్కడ : కిమ్స్ ఆస్పత్రి, సికింద్రాబాద్
ఎందుకు : న్యుమోనియా కారణంగా..
Unemployment: ఎన్‌ఎస్‌వో లెక్కల ప్రకారం.. పట్టణ నిరుద్యోగ రేటు శాతం?
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2021, జనవరి–మార్చి త్రైమాసికంలో 9.3 శాతానికి పెరిగినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. ఈ సంస్థ కాలానుగుణంగా సర్వే నిర్వహిస్తూ ఈ వివరాలను విడుదల చేస్తుంటుంది. పనిచేసే అర్హత ఉండీ, అవకాశాల్లేని వారు ఎంత మంది ఉన్నారనేది ఈ గణాంకాలు తెలియజేస్తాయి. ఈ గణాంకాల ప్రకారం... పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైన వయసులోని వారికి సంబంధించి నిరుద్యోగ రేటు 2020 జనవరి–మార్చిలో 9.1 శాతంగా ఉంది. 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 10.3 శాతంగా ఉంది.
కోవిషీల్డ్ 63 శాతం ప్రభావవంతం
భారత్‌లో 2021 ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 63 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు ఒక అధ్యయనంలో తేలింది. ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(టీహెచ్‌ఎస్‌టీఐ) ఆధ్వర్యంలో వివిధ సంస్థలకు చెందిన భారతీయ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయన వివరాలను ‘లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్ ప్రచురించింది. కోవిషీల్డ్ టీకాను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, జనవరి–మార్చి త్రైమాసికంలో నిరుద్యోగ రేటు 9.3 శాతంగా నమోదైంది.
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో)
ఎక్కడ : దేశంలోని పట్టణ ప్రాంతాల్లో..చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 30 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్