Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 30 కరెంట్ అఫైర్స్
First Woman Prime Minister: స్వీడన్ ప్రధానిగా ఎన్నికైన మహిళా నేత?
స్వీడన్ ప్రధాని పీఠంపై మహిళా నేత, సోషల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాగ్డలీనా ఆండర్సన్ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసీనులయ్యారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరించడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె నవంబర్ 29న మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్‌లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో మాగ్డలీనాకు మద్దతు లభించింది.
స్వీడన్..
రాజధాని: స్టాక్‌హోమ్; కరెన్సీ; స్వీడిష్ క్రోనా
దేశ తొలి మహిళా ప్రధానిగా రికార్డు..
2021, నవంబర్ 24న గ్రీన్ పార్టీతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్ డెమొక్రాట్స్ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వీడన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన మహిళా నేత?
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : మాగ్డలీనా ఆండర్సన్
ఎందుకు : 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్‌లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో మాగ్డలీనాకు మద్దతు లభించడంతో..
Chief Executive Officer: ట్విట్టర్ సీఈవోగా నియమితులైన భారతీయ అమెరికన్?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌డార్సే నవంబర్ 29న రాజీనామా చేశారు. దీంతో జాక్‌డార్సే స్థానంలో పరాగ్‌ని నియమించినట్లు కంపెనీ తెలిపింది. 2022లో డార్సే పదవీకాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్ బోర్డులో కొనసాగుతారని పేర్కొంది. ఫైనాన్షియల్ పేమెంట్స్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం డార్సే చీఫ్‌గా ఉన్నారు. పరాగ్ అగర్వాల్ ఇప్పటి వరకు ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా పనిచేశారు.
11 ఏళ్లలోనే కీలక స్థానానికి..
పరాగ్ అగర్వాల్ ఐఐటీ బోంబేలో బీటెక్ విద్య పూర్తయిన తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. పదేళ్ల క్రితం 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరారు. ఆ సమయంలో సంస్థ ఉద్యోగులు 1,000 మందే ఉండడం గమనార్హం. 2018లో సీటీవో అయ్యారు.
అడోబ్ సీఈవోగా ఎవరు ఉన్నారు?
భారతీయుల అపార ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను జన్మతః భారతీయులైన వారు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ జాబితాలోకి పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, అడోబ్ సీఈవో శంతను నారాయణన్, మాస్టర్‌కార్డ్ సీఈవోగా అజయ్‌పాల్ సింగ్ బంగా తదితరులు తమ ప్రతిభను చాటుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ సీఈవోగా నియమితులైన భారతీయ అమెరికన్?
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : పరాగ్ అగర్వాల్
ఎందుకు : ట్విట్టర్ ప్రస్తుత సీఈవో జాక్‌డార్సే తన పదవికి రాజీనామా చేయడంతో..
Disinvestment: ప్రభుత్వ రంగ సంస్థ సీఈఎల్‌ను ఏ కంపెనీకి విక్రయించనున్నారు?
నందల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ సంస్థకు ప్రభుత్వ రంగ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ను విక్రయించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ. 210 కోట్ల విలువైన ఈ ఒప్పంద ప్రక్రియ.. 2022 మార్చి నాటికి పూర్తి కానుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కింద 1974లో సీఈఎల్ ఏర్పాటైంది. సోలార్ ఫొటోవోల్టెయిక్ (ఎస్‌పీవీ) విభాగంలో దిగ్గజంగా ఎదిగింది. సొంతంగా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు కూడా ఉన్నాయి. రైళ్లు సురక్షితంగా నడిచేందుకు రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్‌లో ఉపయోగించే యాక్సిల్ కౌంటర్ సిస్టమ్‌లు వంటివి అభివృద్ధి చేసింది.
ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
సహ రుణాలు ఇచ్చేందుకు కాప్రి గ్లోబల్ క్యాపిటల్‌తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు వ్యూహాత్మక, అనుకూల రుణ పరిష్కారాలను ఆఫర్ చేస్తారు. ఈ భాగస్వామ్యం ద్వారా సరైన వ్యక్తులకు నాణ్యమైన రుణాలు చేరతాయని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నందల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ సంస్థకు ప్రభుత్వ రంగ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ను విక్రయించే ప్రతిపాదనకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా..
Tennis: మనామా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఎక్కడ జరిగింది?
భారత టెన్నిస్ స్టార్ రామ్‌కుమార్ రామనాథన్ ఏడో ప్రయత్నంలో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. నవంబర్ 29న బహ్రెయిన్ రాజధాని మనామాలో జరిగిన మనామా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ–2021లో రామ్‌కుమార్ టైటిల్ గెలిచాడు. సింగిల్స్ విభాగం ఫైనల్లో రామ్‌కుమార్ 6–1, 6–4తో ఎవ్‌గెనీ కార్లొవ్‌స్కీ (రష్యా)పై నెగ్గాడు.
సాత్విక్ సాయిరాజ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్ స్టార్‌జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి అర్హత సాధించింది. తద్వారా ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీకి అర్హత పొందిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. 2021, డిసెంబర్ 1న ఇండోనేసియాలోని బాలిలో మొదలయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మనామా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ–2021లో టైటిల్ గెలిచిన భారతీయుడు?
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : భారత టెన్నిస్ స్టార్ రామ్‌కుమార్
ఎక్కడ : మనామా, బహ్రెయిన్
ఎందుకు : సింగిల్స్ విభాగం ఫైనల్లో రామ్‌కుమార్ 6–1, 6–4తో ఎవ్‌గెనీ కార్లొవ్‌స్కీ (రష్యా)పై నెగ్గడంతో..
TTD: తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
తిరుమల తిరుపతి ఆలయ ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) డాలర్ శేషాద్రి(73) విశాఖపట్నంలో నవంబర్ 29న హఠాన్మరణం చెందారు. గుండెపోటు కారణంగా విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైరైనా.. శేషాద్రి సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్డీగా టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానములు) కొనసాగించింది. 1978 ఏడాదిలో టీటీడీలో గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగారు. 2007 జూలైలో పార్ పత్తేదార్‌గా రిటైరయ్యారు. తిరుపతిలో 1948 జులై 15న జన్మించిన డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి, మెడలో పొడవైన డాలర్ ధరించి ఉండడంతో ఆ పేరుతో డాలర్ శేషాద్రిగా ప్రసిద్ధిగాంచారు. శేషాద్రి పూర్వీకులది తమిళనాడు రాష్ట్రంలోని కంచి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తిరుమల తిరుపతి ఆలయ ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : డాలర్ శేషాద్రి(73)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : గుండెపోటు కారణంగా..
25th Chief of the Naval Staff: భారత నావికాదళ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
భారత నావికాదళ 25వ అధిపతి(చీఫ్ ఆఫ్ నావెల్ స్టాప్)గా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 30న న్యూఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి హరికుమార్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేరళ రాష్ట్రం నుంచి నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. కేరళలోని తిరువనంతపురంలో 1962, ఏప్రిల్ 12న జన్మించిన రాధాకృష్ణన్ హరికుమార్(ఆర్.హరికుమార్) 1983లో ఎన్‌డీఏలో శిక్షణ పూర్తి చేసుకొన్నారు. ఇప్పటివరకు(నేవీ చీఫ్ కాకముందు) వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్‌గా ఉన్నారు. కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రక్షనల్ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత నావికాదళ 25వ అధిపతి(చీఫ్ ఆఫ్ నావెల్ స్టాప్)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు నేవీ అధిపతిగా ఉన్న అడ్మిరల్ కరంబీర్ సింగ్ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..
Parliament: ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
2021 ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ పన్నెండు మందిని శీతాకాల సమావేశాలు మొత్తానికి (నవంబరు 29– డిసెంబరు 23 వరకు) సభ నుంచి సస్పెండ్ చేయాలని నవంబర్ 29న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాజ్యసభ దీన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది.
సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు..
ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్), డోలా సేన్, శాంతా చెత్రి (తృణమూల్ కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్ (శివసేన), ఎలమారమ్ కరీమ్ (సీపీఎం), బినయ్ విశ్వం (సీపీఐ).
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
మూడు వివాదాస్పద సాగు చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘కు పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. నవంబర్ 29న లోక్‌సభ, రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే.. నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి.
బీఎఫ్‌ఐఎల్ ఏ సంస్థలో భాగం?
ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్‌ఐఎల్) ఎండీ, సీఈవో శలభ్ సక్సేనా తన పదవికి రాజీనామా చేశారు. సక్సేనాతోపాటు ఈడీ, సీఎఫ్‌వో ఆశీష్ దమానీ కూడా నవంబర్ 25న తన పదవికి రాజీనామా చేసినట్లు బీఎఫ్‌ఐఎల్ తెలిపింది.
Omicron: డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
కొత్త కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ వ్యాధి తీవ్రత ఎంతటి స్థాయిలో ఉంటుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని నవంబర్ 29న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్’ వేరియంట్‌గా గుర్తిస్తున్నామని పేర్కొంది. స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవా నగరంలో డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయం ఉంది.
డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌గా ఎవరు ఉన్నారు?
ఒమిక్రాన్ వంటి కొత్తకొత్త వైరస్ వేరియంట్లు ఉద్భవిస్తున్న ఈ తరుణంలో ‘అంతర్జాతీయ వేదిక’గా ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌పై ఉమ్మడి పోరుకు సిద్ధంకావాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసిస్ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న ‘వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’లో మాట్లాడిన ఆయన కోవిడ్‌పై ఉమ్మడి పోరాటానికి దేశాలన్నీ ఒక చట్టబద్ధ ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
పీఎల్‌ఏ అధ్యక్షుడు ఎవరు?
భవిష్యత్ యుద్ధాల్లో విజయం సాధించేందుకు సైన్యం(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ–పీఎల్‌ఏ)లో యువ రక్తం అవసరం ఎంతో ఉందని, ఆ దిశగా నియామకాలను వేగవంతం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సైన్యంలో ప్రతిభకు సంబంధించిన విధానాలపై నవంబర్ 26 నుంచి 28 వరకు చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన సదస్సులో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్, సర్వసైన్యాధ్యక్షుడు అయిన జిన్‌పింగ్ ప్రసంగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్’ వేరియంట్‌గా
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : ఒమిక్రాన్ గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు..
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 29 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్