Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 29 కరెంట్‌ అఫైర్స్‌

Parliament 650x400

Parliament: సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

వివాదస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు నవంబర్‌ 29న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. 2020 ఏడాది కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మూడు సాగు చట్టాలు–వివరాలు

  • 2020, జూన్‌ 5 : మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది.
  • 2020, సెప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది.
  • 2020, సెప్టెంబర్‌ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి.
  • 2021, జనవరి 12: ఈ చట్టాల రద్దు కోరుతూ అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ‘స్టే’ విధించింది.

1. ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌– ఎఫ్‌పీటీసీ) యాక్ట్‌
రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్‌ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది.

2. ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ యాక్ట్, 2020
ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్‌) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు.

3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020
నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్‌ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్‌సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు.

కొందరు ప్రముఖులు...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కొందరు ప్రముఖుల వివరాలు ఇలా..
1. రాకేశ్‌ తికాయత్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి. 52 ఏళ్ల వయసున్న ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.
2. దర్శన్‌పాల్‌: అఖిల భారత సంఘర్ష్‌ సమన్వయ కమిటీ సభ్యుడు. వృత్తిరీత్యా డాక్టర్‌.
3. జోగిందర్‌  సింగ్‌ ఉగ్రహాన్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు. ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు.
4. బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధ్యక్షుడు. వయసు 78 ఏళ్లు. మాజీ సైన్యధికారి.
5. సుఖ్‌దేవ్‌ సింగ్‌ కొక్రికలన్‌: బీకేయూ, ఉగ్రహాన్‌ ప్రధాన కార్యదర్శి. వయసు 71 సంవత్సరాలు. స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్‌ 29
ఎవరు    : లోక్‌సభ
ఎందుకు : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో..


WHO: కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?

దక్షిణాఫ్రికాలోని వెలుగుచూసిన కోవిడ్‌–19 కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ (బి.1.1.529) ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా కంటే శరవేగంగా విస్తరించే ఈ వేరియెంట్‌ ఒకటి వెలుగులోకి వచ్చిందని తెలుసుకునే లోపే ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా విస్తరించిందనే అనుమానాలున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నా డెల్టా కంటే 40శాతం అధికంగా ఒమిక్రాన్‌ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ పేరు ఎలా వచ్చింది?
కరోనా వైరస్‌లో కొత్త రకాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లనే పెడుతూ వస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ వరసగా పేర్లు పెట్టుకుంటూ వస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ హఠాత్తుగా కొన్ని అక్షరాలను వదిలేసి ఒమిక్రాన్‌ని ఎంపిక చేసుకుంది. వాస్తవానికి లాంబ్డా తర్వాత ‘‘న్యూ’’ అక్షరం రావాలి. ఆ తర్వాత గ్రీకు వర్ణమాల ప్రకారం ‘‘XI’’ వస్తుంది.  న్యూ అంటే ఆంగ్లంలో కొత్త అనే అర్థం ఉంది కాబట్టి గందరగోళానికి తావు లేకుండా దానిని విడిచిపెడితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేరులో xi (షి జిన్‌పింగ్‌) ఉండడంతో దానిని కూడా డబ్ల్యూహెచ్‌ఓ విడిచిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని వదిలేసి గ్రీకు వర్ణమాలలోని పదిహేనో అక్షరమైన ‘ఒమిక్రాన్‌’గా కొత్త వేరియెంట్‌కు నామకరణం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన కరోనా వేరియెంట్లు..

  • ఆల్ఫా: యూకేలోని కెంట్‌లో తొలిసారిగా 2020 సెప్టెంబర్‌లో గుర్తించారు. బ్రిటన్‌లో సెకండ్‌వేవ్‌ ఈ వేరియెంట్‌తోనే విజృంభించింది.  
  • బీటా: దక్షిణాఫ్రికాలో 2020 మేలో గుర్తించారు. ప్రపంచ దేశాల్లో 50 శాతం కేసుల్ని ఈ వేరియెంట్‌ పెంచింది.  
  • గామా: బ్రెజిల్‌లో నవంబర్‌ 2020లో గుర్తించారు. దక్షిణ అమెరికాలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది 
  • డెల్టా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో ఈ వైరస్‌ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆసియా, యూరప్‌లో విజృంభించింది. ఇప్పటివరకు వచ్చిన వేరియెంట్‌లలో ఇదే అత్యంత వేగంగా విస్తరించింది. ఆల్ఫా కంటే 60% వేగంగా వ్యాప్తి చెందింది.  
  • ఈటా: డిసెంబర్‌ 2020లో యూకేలో తొలిసారిగా బయటపడిన ఈ రకం 72 దేశాలకు విస్తరించింది.  
  • లోటా: న్యూయార్క్‌లో 2020లో బయటపడిన ఈ వేరియెంట్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు 
  • కప్పా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో వెలుగు చూసిన కప్పా వేరియెంట్‌ కేసులు 55 దేశాల్లో వెలుగులోకి వచ్చాయి.
  • లాంబ్డా: డిసెంబర్‌ 2020లో పెరూలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియెంట్‌ మూడు నెలల్లోనే 41 దేశాలకు విస్తరించింది.

 

Malaysian Open: భారత క్రీడాకారుడు సౌరవ్‌ గోషాల్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

Saurav Ghosal

భారత స్క్వాష్‌ స్టార్‌ ప్లేయర్‌ సౌరవ్‌ గోషాల్‌ మూడేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో నవంబర్‌ 27న ముగిసిన మలేసియన్‌ ఓపెన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్స్‌–2021లో సౌరవ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరవ్‌ 11–7, 11–8, 13–11తో టాప్‌ సీడ్‌ మిగెల్‌ రోడ్రిగెజ్‌ (కొలంబియా)పై విజయం సాధించాడు. సౌరవ్‌ చివరిసారి 2018లో కోల్‌కతా ఓపెన్‌ టైటిల్‌ను సాధించాడు.

సాకేత్‌ మైనేని ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో 24వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. హరియాణ రాష్ట్రం గురుగ్రామ్‌లో నవంబర్‌ 27న జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట 6–4, 7–6 (8/6)తో రిషి రెడ్డి–ప్రజ్వల్‌ దేవ్‌ (భారత్‌) జోడీపై గెలిచి టైటిల్‌ సాధించింది. టైటిల్‌ గెలిచే క్రమంలో సాకేత్‌ జంట ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మలేసియన్‌ ఓపెన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్స్‌–2021లో విజేతగా నిలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : నవంబర్‌ 27
ఎవరు    : భారత స్క్వాష్‌ స్టార్‌ ప్లేయర్‌ సౌరవ్‌ గోషాల్‌ 
ఎక్కడ    : కౌలాలంపూర్, మలేసియా
ఎందుకు : ఫైనల్లో సౌరవ్‌ 11–7, 11–8, 13–11తో టాప్‌ సీడ్‌ మిగెల్‌ రోడ్రిగెజ్‌ (కొలంబియా)పై విజయం సాధించినందున..


COVID-19: ప్రముఖ నృత్యదర్శకుడు శివ శంకర్‌ ఇక లేరు

Sivasankar

ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు శివ శంకర్‌ (72) మాస్టర్‌ ఇకలేరు. కరోనా వైరస్‌ సోకడంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, నవంబర్‌ 28న తుదిశ్వాస విడిచారు. కల్యాణ సుందరం, కోమళ అమ్మాళ్‌ దంపతులకు 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించిన శివ శంకర్‌ ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా నృత్యదర్శకుడిగా మారారు. తెలుగు, తమిళంతో సహా పది భాషల్లో సుమారు 800 చిత్రాల్లో 15వేలకు పైగా పాటలకు నృత్యదర్శకుడిగా చేశారు. మగధీర(2009) చిత్రానికి ఉత్తమ నృత్యదర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. నటుడిగా తెలుగు, తమిళ సినిమాల్లో–సీరియల్‌లలో తనదైన గుర్తింపు పొందారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్‌ 27
ఎవరు    : శివ శంకర్‌ (72) మాస్టర్‌
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : కరోనా వైరస్‌ కారణంగా..


Indian Navy: పశ్చిమ నౌకాదళాధిపతిగా నియమితులైన వ్యక్తి?

Vice Admiral Ajendra Bahadur Singh

తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహద్దూర్‌ సింగ్‌ బదిలీ అయ్యారు. పశ్చిమ నౌకాదళాధిపతిగా ఆయనను నియమిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు నౌకాదళం తాత్కాలిక అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ సింగ్‌ దాస్‌గుప్తా వ్యవహరించనున్నారు. అధికారిక చీఫ్‌ని నియమించే వరకూ బిస్వజిత్‌ తూర్పు నౌకాదళాధిపతి బాధ్యతలను నిర్వహిస్తారు. పశ్చిమ నౌకాదళ ప్రధాన స్థావరం ముంబైలో ఉంది.

అక్సెల్‌సన్‌ ఖాతాలో ఆరో టైటిల్‌...
ప్రపంచ రెండో ర్యాంకర్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) తన ఖాతాలో ఆరో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. నవంబర్‌ 28న ఇండోనేసియాలోని బాలిలో ముగిసిన ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో అక్సెల్‌సన్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో అక్సెల్‌సన్‌ 21–13, 9–21, 21–13తో లో కీన్‌ యె (సింగపూర్‌)పై గెలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పశ్చిమ నౌకాదళాధిపతిగా నియామకం
ఎప్పుడు : నవంబర్‌ 28
ఎవరు    : వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహద్దూర్‌ సింగ్‌ 
ఎందుకు  : ప్రభుత్వ నిర్ణయం మేరకు..


Industry 4.0: కల్పతరువు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఎక్కడ ఏర్పాటైంది?

Kalpataru Center of Excellence

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రెండు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) కేంద్రాలు విశాఖపట్నంలో సిద్ధమయ్యాయి.

కల్పతరువు పేరుతో..
దేశ పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్‌ను పెంచే విధంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కల్పతరువు పేరుతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ రూపుదిద్దుకుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు స్టీల్‌ ప్లాంట్‌ రూ.10 కోట్లు కేటాయించగా కేంద్రం రూ.30 కోట్లను మంజూరు చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఇండస్ట్రీ–4 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను 2021, జనవరిలో ప్రారంభించనున్నారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో..
ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మరో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్‌ నెలకొల్పింది. ఇందులో అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్, 3–డీ ప్రింటర్స్, పీసీబీ ప్రొటోటైప్‌ మెషీన్స్, సోల్డరింగ్‌ స్టేషన్లు, హైఎండ్‌ ఆసిలోస్కోప్స్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నారు. దీన్ని త్వరలో ప్రారంభించనున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కల్పతరువు పేరుతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్‌ 28
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ    : విశాఖ స్టీల్‌ ప్లాంట్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : దేశ పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్‌ను పెంచే విధంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా..


Covid-19: ఒమిక్రాన్‌ తొలి ఫోటోను విడుదల చేసిన సంస్థ?

Omicron First Photo

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘‘ఒమిక్రాన్‌’’ మొదటి ఫోటోను ఇటలీ రాజధాని రోమ్‌లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 29న విడుదలైన ఈ చిత్రం ఒక మ్యాప్‌లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్‌ ఒమిక్రాన్‌ అని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఒమిక్రాన్‌తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా లేదా వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్‌(బి.1.1.529) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా ప్రకటించింది. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అత్యంతవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తొలి ఫోటోను విడుదల చేసిన సంస్థ?
ఎప్పుడు : నవంబర్‌ 29
ఎవరు    : బాంబినో గెసో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ 
ఎక్కడ    : రోమ్, ఇటలీ
ఎందుకు : కోవిడ్‌–19 పరిశోధనల్లో భాగంగా..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 27 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Nov 2021 07:37PM

Photo Stories