Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 27 కరెంట్ అఫైర్స్
World Health Organization: కొత్త రకం కరోనా వేరియంట్ బి.1.1.529కు ఏ పేరు పెట్టారు?
ఇటీవల ఆఫ్రికా ఖండంలో బయటపడిన కొత్త రకం కరోనా వేరియంట్ బి.1.1.529 దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వ్యాప్తి వల్ల నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో... ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ముడి చమురు ధరలు పెరిగాయి.
ఒమీక్రాన్‌గా నామకరణం
బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహాదారుల బృందం నవంబర్ 27న ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 వేరియంట్‌కు ‘ఒమీక్రాన్’గా నామకరణం చేసింది. దీనిని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా నిర్ధారించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్త రకం కరోనా వేరియంట్ బి.1.1.529కు ‘ఒమీక్రాన్’గా నామకరణం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహాదారుల బృందం
ఎందుకు : బి.1.1.529 వేరియంట్‌ను సులభంగా గుర్తించుకునేందుకు...
NITI Aayog: దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు?
భారత్‌లో అత్యంత పేద రాష్ట్రాలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు తన తొలి జాతీయ బహుముఖీన పేదరిక సూచిక(ఎంపీఐ)-2021 నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బిహార్ జనాభాలో సగానికి పైగా.. అంటే 51.91 శాతం మంది నిరుపేదలే ఉన్నారు. జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.79 శాతం మంది దారిద్య్రం అనుభవిస్తున్నారు. జనాభాలో 36.65 శాతం మంది పేదలతో నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, 32.67 శాతం మంది పేదలతో ఐదో స్థానంలో మేఘాలయ ఉన్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం..
- అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ(0.71 శాతం), గోవా(3.76 శాతం), సిక్కిం(3.82 శాతం), తమిళనాడు(4.89 శాతం), పంజాబ్(5.59 శాతం) ముందు వరుసలో నిలిచాయి.
- కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలిలో 27.36 శాతం, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో 12.58 శాతం, డయ్యూ డామన్‌లో 6.82 శాతం, చండీగఢ్‌లో 5.97 శాతం మంది పేదలు ఉన్నారు. అతి తక్కువగా పుదుచ్చేరిలో 1.72 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. లక్షద్వీప్‌లో 1.82 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 4.30 శాతం, ఢిల్లీలో 4.79 శాతం మంది పేదలు ఉన్నట్లు తేలింది.
- పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్యలోనూ బిహార్‌దే అగ్రస్థానం.
2015–16 నాటి గణాంకాలను ఆధారంగా...
దేశంలో బహుముఖీన పేదరిక సూచికను తయారు చేయడానికి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి చేసిన మెథడాలజీని ఉపయోగించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత పేద రాష్ట్రాలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : జాతీయ బహుముఖీన పేదరిక సూచిక(ఎంపీఐ)-2021 నివేదిక
ఎక్కడ : దేశంలో..
Pat Cummins: యాషెస్ సిరీస్ అనేది ఏ క్రీడకు సంబంధించినది?
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో జరిగే యాషెస్ సిరీస్‌లో బరిలోకి దిగే ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్, వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ నియమితులయ్యారు. పేస్ బౌలర్‌కు పూర్తి స్థాయి సారథ్యం కట్టబెట్టడం ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఇదే తొలిసారి. 1956లో ఫాస్ట్ బౌలర్ రే లిండ్‌వాల్ ఒక టెస్టు కోసం అది కూడా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు కమిన్స్ ఆసీస్ 47వ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 28 ఏళ్ల కమిన్స్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున 34 టెస్టులు ఆడి 164 వికెట్లు పడగొట్టాడు.
కాంటార్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ?
తాజాగా విడుదలైన కాంటార్ బ్రాండ్జ్ ఇండియా ర్యాంకింగ్స్‌లో టెక్నాలజీ విభాగంలో అమెజాన్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. 2020–21 సంవత్సరానికిగాను అత్యంత ప్రయోజనకరమైన బ్రాండ్స్‌గా జొమాటో, యూట్యూబ్ తర్వాత నాల్గవ స్థానంలో గూగుల్, స్విగ్గీ స్థానం సంపాదించాయి. ఎఫ్‌ఎంసీజీయేతర విభాగంలో మొదటి స్థానంలో ఏషియన్ పెయింట్స్, రెండవ స్థానంలో శామ్‌సంగ్, జియోల తర్వాత ఎంఆర్‌ఎఫ్, టాటా హౌజింగ్, ఎయిర్‌టెల్ చోటు దక్కించుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీలో టాటా టీ, సర్ఫ్ ఎక్సెల్, తాజ్ మహల్ తర్వాత నాల్గవ స్థానంలో ప్యారాష్యూట్, మ్యాగీ, అయిదవ స్థానంలో బ్రిటానియా ఉంది. వాటాదారుల పట్ల నిబద్ధత, నాయకత్వం, నైతిక విధానాన్ని ఆధారంగా చేసుకుని 30 విభాగాల్లో 418 బ్రాండ్లను విశ్లేషించి ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు.
CAG Report: కాగ్ లెక్కల ప్రకారం.. 2019–20లో రాష్ట్ర వృద్ధి రేటు?
2019–20 ఆర్ధిక ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను ప్రభుత్వం నవంబర్ 26న అసెంబ్లీకి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్ర రెవెన్యూ వ్యయం 6.93 శాతం మేర పెరిగింది. తప్పనిసరి ఖర్చులైన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, వడ్డీ చెల్లింపుల వ్యయం అంతకు ముందు ఆర్ధిక ఏడాదితో పోలిస్తే పెరిగాయి. అమ్మఒడి, వైఎస్సార్ ఉచిత విద్యుత్, వైఎస్సార్ భరోసా వంటి పథకాల అమలుతోపాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో రెవెన్యూ వ్యయం పెరిగింది.
కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ...
- 2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 8.80 శాతం ఉండగా 2019–20లో 12.73 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ వృద్ధి రేటు 7.21 శాతం కన్నా ఇది ఎక్కువ.
- 2018–19లో 149.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2019–20లో 171.37 లక్షల టన్నులకు పెరగడంతో వ్యవసాయ రంగంలో 16.03 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఉద్యాన, పశు, మత్స్యశాఖల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది.
- రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రూ.97,123.93 కోట్ల మేర రుణభారం ఉంది. 2020 మార్చి నాటికి ఆ రుణం పెరిగి రూ.2,15,617 కోట్లకు చేరింది.
- అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2019–20లో రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర సొంత రాబడులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా బదిలీ రాబడులు తగ్గడం.
- కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో 2019–20లో రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం మేర పెరిగాయి. రెవెన్యూ లోటు 90.24 శాతం పెరిగింది.
- సాధారణ కేటగిరీ రాష్ట్రాల సగటుతో పోలిస్తే తప్పనిసరి ఖర్చులైన వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, పరిపాలన ఖర్చులు ఏపీలో ఎక్కువ.
- రాష్ట్ర సొంత పన్నుల రాబడి 0.74 శాతం తగ్గింది. సొంత పన్నేతర రాబడి 24.59 శాతం తగ్గింది
- కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటా 13.86 శాతం తగ్గింది
- కేంద్రం నుంచి పొందే గ్రాంట్లు త12.43 శాతం పెరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019–20లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యయం 6.93 శాతం మేర పెరిగింది.
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక
ఎందుకు : అమ్మఒడి, వైఎస్సార్ భరోసా వంటి పథకాల అమలుతోపాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో..
NITI Aayog Report: పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం?
పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 13.74 శాతం ప్రజలు విభిన్న కోణాల్లో (మల్టీడైమెన్షనల్లీ పూర్) పేదరికం అనుభవిస్తున్నట్లు 2015–16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–4)లో తేలింది. ఈ సర్వే వివరాలను నీతి ఆయోగ్ నవంబర్ 26న వెల్లడించింది. దేశవ్యాప్తంగా విభిన్న కోణాల్లో దారిద్య్రానికి దిగువన ఉన్న జిల్లాల జాబితాను కూడా విడుదల చేసింది. సర్వే వివరాల ప్రకారం.. దేశంలో నిరుపేదలు అతితక్కువగా 0.71 శాతమే ఉన్న రాష్ట్రంగా కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరువాత 11వ స్థానంలో తెలంగాణ ఉంది. నిరుపేదలు అధికంగా ఉన్న రాష్ట్రంగా (51.91 శాతం) బిహార్ నిలిచింది. సమతుల ఆహారం అందించే విషయంలో తెలంగాణ 13వ స్థానంలో నిలవగా, చిన్నారులు, కౌమార దశలో ఉన్నవారి ఆరోగ్యం విషయంలో ఏడోస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 11వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశంలో..
Bilateral Summit: భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడు ఏ దేశంలో సమావేశం కానున్నారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021, డిసెంబర్ 6వ తేదీన భారత్‌కు రానున్నారు. అదే రోజు ఆయన ప్రధాని నరేద్ర మోదీతో సమావేశం అవుతారని నవంబర్ 26న భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇద్దరు నేతలు ఏడాదికోసారి సమావేశమై రెండు దేశాల నడుమ కొనసాగుతున్న అన్ని రకాల సంబంధాలపై సమీక్ష జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య 21వ వార్షిక శిఖరాగ్ర భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. కొవిడ్-19 కారణంగా 2020 ఏడాది భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు వాయిదా పడింది. ఇంతవరకు ఇలాంటివి 20 సదస్సులు జరిగాయి. ఒకసారి భారత్‌లోను, మరోసారి రష్యాలోనూ వీటిని నిర్వహిస్తున్నారు.
2+2 చర్చలు కూడా...
డిసెంబర్ 6వ తేదీనే రెండు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య 2+2 చర్చలు కూడా జరగనున్నాయి. భారత్ ఇలాంటి ‘2+2’ మంత్రుల భేటీలను అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా అతికొద్ది దేశాలతోనే నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, డిసెంబర్ 6న భారత ప్రధాని నరేద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2
ఎక్కడ : భారత్
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపేందుకు...
Praveen Sinha: ఇంటర్‌పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఇంటర్‌పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా ప్రతినిధిగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా ఎన్నికయ్యారు. ఇంటర్‌పోల్‌కు చెందిన ఈ ఉన్నత కమిటీకి సంబంధించిన వివిధ పదవులకు.. టర్కీలోని ఇస్తాంబుల్‌లో నిర్వహించిన 89వ జనరల్ అసెంబ్లీలో భాగంగా ఎన్నికలు జరిగినట్లు నవంబర్ 25న అధికార వర్గాలు తెలిపాయి. 2022 ఏడాదిలో జరిగే ఇంటర్‌పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 195 సభ్య దేశాలు గల ఇంటర్‌పోల్‌లో 1949లో భారత్ చేరింది. అంతర్జాతీయ నేరాలు, నేరస్థుల సమాచారాన్ని పంచుకోవడానికి సభ్య దేశాల్లోని పోలీసులకు ఇంటర్‌పోల్ సాయపడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లోని లియోన్ లో ఉంది. పాలకమండలి నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరానికోసారి ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశమవుతుంది. భారత్ 1997లో మాత్రమే ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది.
అశోక్ లేలాండ్ ఎండీ రాజీనామా
హిందూజా గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో విపిన్ సోంధి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన తెలిపారు. ధీరజ్ హిందూజా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్, నాన్–ఇండిపెండెంట్ డైరెక్టర్–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తదుపరి ఎండీ, సీఈవో ఎంపిక కోసం బోర్డు త్వరలో సమావేశం కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్‌పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా ప్రతినిధిగా ఎన్నికైన అధికారి?
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా
ఎందుకు : ఇంటర్‌పోల్ 89వ జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించినందున..
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 26 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్‌ప్లేస్టోర్