Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 26 కరెంట్ అఫైర్స్
Jewar Airport: ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఆసియాలోనే అతి పెద్దదైన ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి’ భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25న శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ పట్టణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘సబ్‌కా సాత్– సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్– సబ్‌కా ప్రయాస్’ అన్నదే తమ ప్రభుత్వ మంత్రం అని స్పష్టం చేశారు.
నోయిడా విమానాశ్రయ ప్రత్యేకతలు..
- ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయం ఇది. 51 చదరపు కి.మీ. విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు.
- స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంపెనీ దీని నిర్మాణం చేస్తోంది. 2024 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
- 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో పనులు ప్రారంభిస్తున్నారు. విమానాశ్రయం పూర్తయ్యే సమయానికి రూ. 35 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి.
- ఈ విమానాశ్రయంతో లక్ష మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయమైన ఇందులో ఎకో ఫ్రెండ్లీ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. కర్బన ఉద్గారాలు జీరో శాతం లక్ష్యంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. పశ్చిమ యూపీ, ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్ ప్రయాణికులు వినియోగించుకోవచ్చు.
- ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని ఒక అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియాలోనే అతి పెద్దదైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జెవర్ పట్టణం, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
ఎందుకు : రాష్ట్రాభివృద్ధి కోసం...
Scorpene Class Submarine: ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామి ఎక్కడ జలప్రవేశం చేసింది?
ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామి నవంబర్ 25న నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ఈ సందర్భంగా అడ్మిరల్ కరమ్‌బీర్ మాట్లాడుతూ... ఐఎన్‌ఎస్ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్‌ఎస్ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు.
నాలుగవది...
2005లో భారత్, ఫ్రాన్స్ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఐఎన్‌ఎస్ వేలా నాలుగవది. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్‌ఎస్ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్ ఖండేరి, ఐఎన్‌ఎస్ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్‌ఎస్ వేలా మరింత ఆలస్యమైంది. 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు.
ఐఎన్‌ఎస్ వేలా ప్రత్యేకతలు..
- వేలా సబ్‌మెరైన్ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది.
- నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- సీ303 యాంటీ టార్పెడో కౌంటర్‌మెజర్ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్‌మెరైన్లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు.
- ఎనిమిది మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది.
- స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్
ఎక్కడ : ముంబై తీరం, మహారాష్ట్ర
ఎందుకు : భారతా నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు...
MLC Zakia Khanam: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తొలి మైనారిటీ మహిళ?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవంబర్ 26వ తేదీన ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి మైనారిటీ మహిళగా జకియా ఖానమ్ గుర్తింపు పొందారు.
జకియా ఖానమ్ నేపథ్యమిది..
పూర్తి పేరు: మయాన జకియా ఖానమ్
భర్త: దివంగత ఎం.అఫ్జల్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
చదువు: ఇంటర్మీడియెట్
పుట్టిన తేది: జనవరి 01, 1971
స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్ జిల్లా
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి).
ఢిల్లీ అసెంబ్లీ నుంచి సమన్లు అందుకున్న నటి?
ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. 2021, డిసెంబర్ 6న తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతల స్వీకరించిన తొలి మైనారిటీ మహిళ?
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్
ఎక్కడ : ఏపీ శాసనమండలి, అమరావతి, గుంటూరు జిల్లా
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందున...
National Law Day: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 26న జరుపుకుంటారు. భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ 2020 నవంబర్ 26న ఆమోదించింది. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవం(నేషనల్ లా డే) అని కూడా పిలుస్తారు. 2015 ఏడాదిలో తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
1949లో భారత రాజ్యాంగ కమిటి.. రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు. అది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26వ తేదిని జాతీయ న్యాయదినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవం నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు.
ప్రపంచంలో అతి పెద్దది..
భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్దది. ఇది లిఖిత రూపంలో ఉంది. 1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదిక దీనికి మూలాధారమైంది. 75 శాతానికి పైగా పాలనాంశాలను 1935 చట్టం నుంచి స్వీకరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు 395 నిబంధనలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు, 3 అనుబంధాలు, 403 పుటలతో ఉంది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్‌కు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. దీని రూపకల్పనకు మొత్తం రూ. 64 లక్షల వ్యయం అయ్యింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎప్పుడు : ప్రతి ఏటా నవంబర్ 26
ఎవరు : భారత ప్రజలు
ఎందుకు : భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ 2020 నవంబర్ 26న ఆమోదించిన సందర్భంగా...
Growth Rate: ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. గత ఏడేళ్లలో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి శాతం ఎంత?
తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకెళుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. పలు అంశాల్లో జాతీయ సగటుకు రెండింతలకుపైగా వృద్ధిని సాధించింది. ప్రస్తుత ధరల ప్రాతిపదికన.. 2013–14లో రూ.4,51,580.4 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ విలువ.. 2020–21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు తెలంగాణ రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచాయి. గత ఏడేళ్లలో రాష్ట్రం సొంత పన్నులు, పన్నేతర ఆదాయాన్ని సైతం భారీగా పెంచుకుంది. కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం భారీగా రుణాలు తీసుకుంటుండటంతో ఏటేటా అప్పులు కూడా పెరిగిపోయాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ మిగులును చూపుతున్నా.. భారీ ఆర్థికలోటు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఆర్‌బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు...
- పప్పుధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి దేశ సగటు 34.2 శాతంకాగా.. రాష్ట్రం 108.8 శాతం వృద్ధిని సాధించింది.
- వరి ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా సగటున 12.7 శాతం, రాష్ట్రం 67.3 శాతం వృద్ధి నమోదైంది.
- పత్తిసాగులో దేశవ్యాప్తంగా సగటున 3.6 శాతం, రాష్ట్రం 79.8 శాతం వృద్ధి సాధించాయి.
- మాంసం ఉత్పత్తిలో దేశ సగటు వృద్ధి 28.5 శాతంకాగా.. రాష్ట్రం 67.9 శాతం వృద్ధి నమోదు చేసింది.
- సాగునీటి సౌకర్యాలలో రాష్ట్రం 34.2 శాతం వృద్ధి సాధించగా.. దేశవ్యాప్తంగా సగటు వృద్ధి –11.1గా ఉంది.
- మొత్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సగటున 2.2 శాతం, రాష్ట్రం 22.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
రాష్ట్ర జీఎస్డీపీ విలువ (రూ.కోట్లలో)
2013–14లో 4,51,580.40
2020–21లో 9,80,407.01
రాష్ట్ర సొంత ఆదాయం తీరు (రూ. కోట్లలో)
పన్నుల ఆదాయం
2014–15లో 29,288
2020–21లో 85,300
రాష్ట్ర అప్పులు.. (రూ.కోట్లలో)
2015లో 72,658
2021 నాటికి 2,52,325
ఏడేళ్లలో రంగాల వారీగా రాష్ట్రంలో నమోదైన వృద్ధి.. (రూ.కోట్లలో)
అంశం |
2013–14 |
2020–21 |
వృద్ధిరేటు |
మొత్తం జీఎస్డీపీ విలువ |
4,51,580.40 |
9,80,407.01 |
117 |
వ్యవసాయ రంగంలో.. |
47,092.85 |
80,574.00 |
71 |
తయారీ రంగంలో.. |
57,148.39 |
94,020.80 |
64.5 |
నిర్మాణ రంగంలో.. |
24,582.42 |
37,029.76 |
50.6 |
పారిశ్రామిక రంగంలో.. |
1,02,825.74 |
1,79,884.62 |
74.9 |
సేవల రంగంలో.. |
2,42,272.96 |
5,33,230.87 |
120 |
బ్యాంకింగ్, బీమా రంగంలో |
26,595.53 |
53,145.22 |
99.8 |
జీఎస్డీపీ అంటే..?
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ/జీఎస్డీపీ) అంటారు. సదరు దేశ/రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటన్నది దీనితో అంచనా వేయవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు 117 శాతంగా నమోదైంది.
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక
ఎందుకు : ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు తెలంగాణ రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచినందున..
Hyderabad: ఫ్లో కెమిస్ట్రీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?
తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల పురోగతిని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనికోసం ఫార్మా దిగ్గజాలతో కలిసి ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ ఆవరణలో ఏర్పాటయ్యే ఈ కేంద్రం వల్ల ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. సీఓఈ ఏర్పాటుకు ముందుకొచ్చిన కన్సార్టియంతో ప్రభుత్వం నవంబర్ 25న ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్), డాక్టర్ సత్యనారాయణ చావా (లారస్ ల్యాబ్స్), శక్తి నాగప్పన్ (లైఫ్ సైన్సెస్ డైరెక్టర్)తోపాటు డాక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి (డాక్టర్ రెడ్డీస్ లైఫ్‌సైన్సెస్ ఇనిస్టిట్యూట్) సంతకాలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు.
మిథనాల్ నుంచి హైడ్రోజన్‌ను తయారు చేసే పరికరాన్ని రూపొందించిన ఐఐటీ?
సులువుగా, తక్కువ ఖర్చుతో అప్పటికప్పుడు మిథనాల్ నుంచి అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేసేందుకు ఐఐటీ వారణాసి పరిశోధకులు ఓ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని పెట్రోల్ బంకుల్లో స్థాపించి మెంబ్రేన్ టెక్నాలజీ ఆధారంగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు. లా ఉత్పత్తయ్యే వాయువుతో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు ఇంధనంగా వాడుకోవచ్చు. అలాగే దీని నుంచి తయారైన విద్యుత్‌ను ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేసుకునేందుకు, మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్, హైదరాబాద్
ఎందుకు : ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణల కోసం...
New Strain: బి.1.1.529 అనే కోవిడ్ వేరియెంట్ ఏ దేశంలో వెలుగుచూసింది?
దక్షిణాఫ్రికాలో ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియెంట్ వెలుగుచూసింది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా దేశాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించారు. ఇది పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) కనపడుతోందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్ టామ్ పీకాక్ వెల్లడించారు. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. హాంగ్‌కాంగ్‌లోనూ ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ వాణిజ్య ఎగుమతులు
కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను విదేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వద్ద సరిపడా టీకాలు ఉండడంతో పాటు తయారీ సంస్థల వద్ద కూడా నిల్వలు భారీగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రస్తుతం 22.72 కోట్లకు పైగా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి.
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం
కోవిడ్–19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం భారత్‌కు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని నవంబర్ 25న ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 23 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.
యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్