Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 23 కరెంట్ అఫైర్స్
Parliament: జేపీసీ ఆమోదం తెలిపిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రధాన ఉద్దేశం?
పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) నవంబర్ 10న ఆమోదం తెలిపింది. 2021 ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్‌లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ)
ఎందుకు : ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం కోసం...
Cricket: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీ టైటిల్ సొంతం చేసుకున్న జట్టు?
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్-2021లో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు జట్టు విజేతగా అవతరించింది. న్యూఢిల్లీలో నవంబర్ 22న జరిగిన ఫైనల్లో తమిళనాడు జట్టు నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది.
మూడుసార్లు గెలిచిన జట్టుగా…
తాజా విజయంతో... ముస్తాక్ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్‌లో, 2020– 2021 సీజన్‌లోనూ తమిళనాడు చాంపియన్‌గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాయి.
టీమ్ ఆఫ్ ద టోర్నీలో హర్మన్‌కు చోటు..
భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు దక్కింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) 2021 ఏడాది సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్న ఆమెకు లీగ్ అధికారిక ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ జాబితాలో చోటు దక్కింది. డబ్ల్యూబీబీఎల్ అధికారిక టీమ్ ఆఫ్ ద టోర్నీలో ఒక్క హర్మన్ మినహా మరే భారత ప్లేయర్‌కు అవకాశం దక్కలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్-2021లో టైటిల్ విజేత?
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : తమిళనాడు జట్టు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఫైనల్లో తమిళనాడు జట్టు నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించడంతో...
Spirit of Innovation: అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించిన సంస్థ?
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని రోల్స్‌రాయ్స్ సంస్థ రూపొందించింది. ఈ సంస్థ తయారు చేసిన ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ ఆల్–ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన బోస్కోంబ్ డౌన్ టెస్టింగ్ సైట్‌లో దీనిని పరీక్షించారు. టెస్ట్ ఫ్లైట్‌ను రోల్స్‌రాయ్స్ కంపెనీ... ఫ్లైట్ ఆపరేషన్ డైరెక్టర్ ఫిల్ ఓడెల్ నడిపారు. డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ మరియు ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సగం నిధులను బ్రిటిష్ ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ అందించింది. ‘రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్‌ను రూపొందించినట్లు రోల్స్‌రాయ్స్ సీఈఓ వారెన్ ఈస్ట్ తెలిపారు.
స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ - ప్రత్యేకతలు
- ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం.
- గంటకు 387.4 మైళ్ల (గంటకు 623 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం పాత రికార్డుకంటే... 132 మైళ్లు (212.5 కిలోమీటర్లు) ఎక్కువ.
- 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం ప్రత్యేకత.
- 400 కిలోవాట్ల పవర్ బ్యాటరీ దీని సొంతం. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్‌ఫోన్లు పూర్తిగా చార్జ్ చేసేంత.
రికార్డులు..
గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 345 మైళ్లు (555.9 కిలోమీటర్ల),
15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 331 మైళ్లు (531.1 కిలోమీటర్లు), 202 సెకన్లలో మూడువేలమీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’బ్రేక్ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ను రూపొందించిన సంస్థ
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రోల్స్‌రాయ్స్ సంస్థ
ఎక్కడ : యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా…
Tennis: ఐటీఎఫ్ న్యూఢిల్లీ ఓపెన్ టోర్నీలో టైటిల్ సొంతం చేసుకున్న జంట?
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) న్యూఢిల్లీ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్‌తో కలిసి భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 21న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్–విష్ణువర్ధన్ ద్వయం 6–3, 3–6, 13–11తో ‘సూపర్ టైబ్రేక్’లో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–సోంబోర్ వెల్జ్ (హంగేరి) జోడీపై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2021 ఏడాది సాకేత్ గెలిచిన మూడో డబుల్స్ టైటిల్ ఇది. గత మార్చిలో లక్నో ఓపెన్‌లో యూకీ బాంబ్రీతో కలిసి... ఏప్రిల్‌లో అర్జున్ ఖడేతో కలిసి న్యూఢిల్లీ ఓపెన్‌లో సాకేత్ డబుల్స్ విభాగంలో టైటిల్స్ గెలిచాడు. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్‌లో ఇది 23వ డబుల్స్ టైటిల్.
అలెగ్జాండర్ జ్వెరెవ్ ఏ క్రీడలో ప్రసిద్ది చెందాడు?
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) విజేతగా నిలిచాడు. ఇటలీలో నవంబర్ 21న జరిగిన ఫైనల్లో మూడో ర్యాంకర్ జ్వెరెవ్ 6–4, 6–4తో రెండో ర్యాంకర్, గత ఏడాది విజేత మెద్వెదేవ్ (రష్యా)పై గెలిచాడు. చాంపియన్‌గా నిలిచిన జ్వెరెవ్‌కు 21,43,000 డాలర్ల (రూ. 15 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) న్యూఢిల్లీ ఓపెన్ టోర్నీ-2021లో విజేతగా నిలిచిన జంట?
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : సాకేత్ మైనేని-విష్ణువర్ధన్ ద్వయం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఫైనల్లో సాకేత్–విష్ణువర్ధన్ ద్వయం.. జూలియన్ క్యాష్ (బ్రిటన్)–సోంబోర్ వెల్జ్ (హంగేరి) జోడీపై విజయం సాధించినందున..
President Ram Nath Kovind: ఇటీవల వీర్ చక్ర పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు?
ఘర్షణల సమయంలో పాకిస్తాన్ యుద్ధవిమానాన్ని కూల్చి, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ (అప్పట్లో వింగ్ కమాండర్) అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం లభించింది. నవంబర్ 22న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అభినందన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. 2019, ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాక్ దాడులకు యత్నించగా భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో 2019, ఫిబ్రవరి 27న పాకిస్తాన్ కి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన అభినందన్, అనంతరం తాను నడుపుతున్న మిగ్-21 బైసన్ దాడికి గురై పాక్ భూభాగంలో కూలడంతో ఆ దేశంలో మూడు రోజులపాటు బందీగా ఉన్న సంగతి తెలిసిందే.
మేజర్ భురేకు శౌర్య చక్ర..
మేజర్ మహేశ్‌కుమార్ భురేను భారత ప్రభుత్వం శౌర్య చక్ర పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా భురే అవార్డును స్వీకరించారు. 2018లో కశ్మీర్‌లో ఒక ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించి ఆరుగురు టాప్ ఉగ్ర కమాండర్‌లను మట్టుబెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం ప్రదానం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : 2019, ఫిబ్రవరి 27న జరిగిన ఘర్షణల సమయంలో పాకిస్తాన్ యుద్ధవిమానాన్ని కూల్చి, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించినందున...
China-ASEAN Dialogue: ప్రస్తుతం ఫిలిప్పైన్స్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్(ఆసియాన్), చైనా మధ్య సంబంధాలకు 30 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ 22న వర్చువల్ సదస్సు నిర్వహించారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ... ఆగ్నేయ ఆసియాపై ఆధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. డ్రాగన్ దేశం నియంతృత్వ పోకడలపై అసియాన్ సభ్యదేశాలైన మలేషియా, వియత్నాం, బ్రూనై, ఫిలిప్పైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
చట్టాలను చైనా గౌరవించాలి: రోడ్రిగో డుటెర్టీ
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో విధుల్లో ఉన్న జవాన్లకు సరుకులు తీసుకెళ్తున్న ఫిలిప్పైన్స్ పడవలను ఇటీవలే చైనా నౌకలు అడ్డగించాయి. శక్తివంతమైన యంత్రాలతో నీటిని విరజిమ్మడంతో ఫిలిప్పైన్స్ పడవలు వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనను ఆసియాన్ సదస్సులో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ లేవనెత్తారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవించాలని చైనాకు హితవు పలికారు.
ఆసియాన్ గురించి..
ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ - ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య) 1967 ఆగస్టు 8న ‘‘వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ’’ అనే నినాదంతో ఏర్పడింది. పరస్పర సహకారంతో ప్రాంతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడమే సమాఖ్య ముఖ్య ఉద్దేశం. ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఇందులో పది సభ్యదేశాలున్నాయి.
ఆసియాన్ సభ్యదేశాలు
ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా
PM Modi: 56వ డీజీపీల సదస్సును ఏ నగరంలో నిర్వహించారు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీల, కేంద్ర పోలీసు దళాల డీజీల సదస్సు-2021 జరిగింది. నవంబర్ 19న ప్రారంభమైన ఈ సదస్సు నవంబర్ 21న ముగిసింది. సదస్సులో రెండో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని, ప్రసంగించారు. సదస్సులో మావోయిస్టుల హింస, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదుల ఏరివేత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చలు జరిపారు. డీజీపీల సదస్సుపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతిఏటా సదస్సులో స్వయంగా పాల్గొంటున్నారు.
టాటా స్టీల్ ఇండియా బ్లిట్జ్ టోర్నీ ఎక్కడ జరిగింది?
పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాలో ముగిసిన టాటా స్టీల్ ఇండియా బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్... రన్నరప్‌గా నిలవగా, ప్రపంచ మాజీ బ్లిట్జ్ చాంపియన్ లెవాన్ అరోనియన్ (అర్మేనియా) విజేతగా అవతరించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 56వ డీజీపీల, డీజీల సదస్సు(2021) నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 19-21
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్
ఎందుకు : మావోయిస్టుల హింస, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదుల ఏరివేత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపేందుకు...
Minister Piyush Goyal: దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ఎక్కడ ఏర్పాటైంది?
తమిళనాడు రాష్ట్రం తంజావూరులో దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ఏర్పాటైంది. తంజావూరులోని ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయం పక్కన రూ. 1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మ్యూజియాన్ని నవంబర్ 15న కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నలాజికల్ మ్యూజియంతో కలిసి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) దీనిని ఏర్పాటు చేసింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా ఉన్నాయి. దేశంలో రైతు నుంచి ఎఫ్‌సీఐ గోదాముల వరకు జరిగే ఆహార సేకరణ ప్రక్రియను వర్చువల్ రియాలిటీ ద్వారా వీక్షించే సదుపాయం కల్పించారు. కాలానుగుణంగా మారుతూ వచ్చిన నిర్మాణ, వ్యవసాయ పద్ధతుల గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆహార నిల్వలపై ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు వీలుగా ‘క్విజ్ జోన్’ ఏర్పాటు చేశారు. ఆహారం కోసం వేట నుంచి వ్యవసాయం వైపు మొగ్గుచూపిన తీరును తెలుసుకోవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : తంజావూరు, తంజావూరు జిల్లా తమిళనాడు
ఎందుకు : ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేందుకు..
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 20 కరెంట్ అఫైర్స్
ప్రాక్టీస్ చేయండి: జీకే / కరెంట్ అఫైర్స్ క్విజ్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్