Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 20 కరెంట్‌ అఫైర్స్‌

PM Modi

Farm Laws: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్‌ జయంతి(నవంబర్‌ 19) సందర్భంగా ఆయన నవంబర్‌ 19న దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త చట్టాలపై దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.  సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను 2021 ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. 

మూడు సాగు చట్టాలు–వివరాలు

  • 2020, జూన్‌ 5 : మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది.
  • 2020, సెప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది.
  • 2020, సెప్టెంబర్‌ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి.
  • 2021, జనవరి 12: ఈ చట్టాల రద్దు కోరుతూ అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ‘స్టే’ విధించింది.

1. ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌– ఎఫ్‌పీటీసీ) యాక్ట్‌
రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్‌ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది.

2. ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ యాక్ట్, 2020
ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్‌) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు.

3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020
నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్‌ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్‌సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు.

కొందరు ప్రముఖులు...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కొందరు ప్రముఖుల వివరాలు ఇలా..
1. రాకేశ్‌ తికాయత్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి. 52 ఏళ్ల వయసున్న ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.
2. దర్శన్‌పాల్‌: అఖిల భారత సంఘర్ష్‌ సమన్వయ కమిటీ సభ్యుడు. వృత్తిరీత్యా డాక్టర్‌.
3. జోగిందర్‌  సింగ్‌ ఉగ్రహాన్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు. ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు.
4. బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధ్యక్షుడు. వయసు 78 ఏళ్లు. మాజీ సైన్యధికారి.
5. సుఖ్‌దేవ్‌ సింగ్‌ కొక్రికలన్‌: బీకేయూ, ఉగ్రహాన్‌ ప్రధాన కార్యదర్శి. వయసు 71 సంవత్సరాలు. స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటన
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో..

Grandmaster: టాటా ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గి క్రీడాకారుడు?

Arjun Erigaisi

టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) ఎరిగైసి అర్జున్‌ చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని విజేతగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో నవంబర్‌ 19న ఈ టోర్నీ ముగిసింది.

భారత్‌కి చెందిన ప్రవీణ్‌ జాదవ్‌ ఏ క్రీడకు చెందినవాడు?
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో నవంబర్‌ 19న ముగిసిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆఖరి రోజు రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు రెండు రజతాలు లభించాయి. కపిల్, ప్రవీణ్‌ జాదవ్, పార్థ్‌ సాలుంకేలతో కూడిన భారత పురుషుల జట్టు 2–6తో దక్షిణ కొరియా జట్టు... అంకిత, మధు, రిధిలతో కూడిన భారత మహిళల జట్టు 0–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయి రజత పతకాలకు దక్కించుకున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)?
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : ఎరిగైసి అర్జున్‌
ఎక్కడ    : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ 
ఎందుకు : ఈ టోర్నీలో అర్జున్‌ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొన్నందున..

Saheli Program: నాలుగు ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం ఈ–కామర్స్‌ సంస్థ?

Amazon

మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించే దిశగా అమెజాన్‌ సహేలీ ప్రోగ్రాం కింద నాలుగు ప్రభుత్వ సంస్థలతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా తెలిపింది. జార్ఖండ్‌ స్టేట్‌ లైవ్‌లీహుడ్‌ ప్రమోషన్‌ సొసైటీ (జెఎస్‌ఎల్‌పీఎస్‌), ఉత్తర్‌ప్రదేశ్‌ స్టేట్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ (యూపీఎస్‌ఆర్‌ఎల్‌ఎం), ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (సీజీ ఫారెస్ట్‌) అస్సామ్‌ రూరల్‌ ఇన్‌ఫ్రా అండ్‌ అగ్రి సర్వీసెస్‌ (ఏఆర్‌ఐఏఎస్‌)లతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు నవంబర్‌ 19న తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో సదరు సంస్థల పరిధిలోని మహిళా వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలను అమెజాన్‌ ఇండియాలో నమోదు చేసుకునేందుకు, మరింత విస్తృతంగా మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేలా చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడతాయని పేర్కొంది.

ఉమెన్స్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డే ఎప్పుడు?
ఉత్పత్తుల లిస్టింగ్, ప్యాకేజింగ్, షిప్పింగ్‌ తదితర అంశాలకు సంబంధించి మహిళలు అమెజాన్‌ సహేలీ ప్రోగ్రాం కింద శిక్షణ కల్పిస్తామని అమెజాన్‌ తెలిపింది. ఉమెన్స్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డే(నవంబర్‌ 19) సందర్భంగా మహిళా వ్యాపారవేత్తలు రూపొందించిన ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టోర్‌ ఆవిష్కరించినట్లు వివరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నాలుగు ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా  
ఎందుకు : అమెజాన్‌ సహేలీ ప్రోగ్రాం కింద మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు..

Andhra Pradesh: రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి?

Koyye Moshen Raju

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవంబర్‌ 19న ఆయన అభ్యర్థిత్వాన్ని గంగుల ప్రభాకర్‌ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కల్యాణ చక్రవర్తి బలపర్చారు. రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాజును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు తోడ్కొనివచ్చి చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో పెద్దల సభగా పిలుచుకునే మండలి చైర్మన్‌గా పదవిని చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా రాజు గుర్తింపు పొందారు. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 సీట్లు ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి?
ఎప్పుడు  : నవంబర్‌ 19
ఎవరు    : కొయ్యే మోషేన్‌ రాజు

AP Cabinet: విజయనగరం జేఎన్టీయూకు ఎవరి పేరును పెట్టనున్నారు?

AP Cabinet

2021, నవంబర్‌ 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్‌ 19న సచివాలయంలో సమావేశమైన పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా..

  • ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలుకు 432 కొత్త 104 వాహనాలు కొనడానికి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌కు పాలనాపరమైన అనుమతులు మంజూరు. ఇందుకోసం రూ. 107.16 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.
  • విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమి... గిరిజన మ్యూజియం, బొటానికల్‌ గార్డెన్, టూరిజం డెవలప్‌మెంట్‌కు కేటాయింపు.
  • ఏపీ హైకోర్టులో మీడియేషన్‌ సెంటర్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
  • ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్టంలో సవరణలకు ఆమోదం. కేటాయించిన ఇంటి çస్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతి.
  • శ్రీ వేంకటేశ్వర మెడికల్‌ కాలేజీని మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లుకు ఆమోదం
  • రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్‌ గుడ్‌ ఫండ్‌ ఏర్పాటుకు, ఈఏఎఫ్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌. దీనికి సంబంధించి చట్టంలో సవరణల బిల్లుకు ఆమోదం. 
  • ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటుకు దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం
  • జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీ యాక్ట్‌కు సంబం«ధించిన సవరణ బిల్లుకు ఆమోదం. విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరు విజయనగరం జేఎన్టీయూ జీవీ (గురజాడ విజయనగరం)గా మార్పు.
  • ఆంధ్రప్రదేశ్‌ సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1955 చట్టంలో సవరణలకు ఆమోదం.
  • వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్ట్‌ 1971లో సవరణల బిల్లుకు ఆమోదం

 

United States: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ?

Kamala Harris

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌(57)కు నవంబర్‌ 19న కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్‌ రికార్డుకెక్కారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు.

తొలి మహిళగా...
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్‌కు నవంబర్‌ 19న మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్‌ వైట్‌హౌస్‌ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమల గుర్తింపు పొందారు. పరీక్షల అనంతరం బైడెన్‌ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అమెరికా అధ్యక్షురాలిగా కొద్దిసేపు బాధ్యతలు చేçపట్టిన భారత సంతతి మహిళ? 
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌
ఎందుకు : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు... సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు మత్తు మందు (అనస్తీషియా) ఇచ్చిన నేపథ్యంలో...

Indira Gandhi Peace Prize-2021: ఇందిరా గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన సంస్థ?

Pratham

వ్యక్తులు, సంస్థలకు అందించే ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం–2021కి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ ఎంపికైంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీ.ఎస్‌.ఠాకుర్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డుకు ప్రథమ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ నవంబర్‌ 19న తెలిపింది. పురస్కారం కింద రూ. 25 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.

నాణ్యమైన విద్యను అందించేందుకు...
1995 ఏడాదిలో ముంబైలో మాధవ్‌ చవాన్, ఫరీదా లాంబేలు ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ప్రతి చిన్నారీ బడిలో ఉండాలని, నాణ్యమైన విద్యను అభ్యసించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తోంది. తొలుత ముంబైలో మురికివాడల్లో బాల్వాడీలు, ప్రీ–స్కూళ్లను ఏర్పాటు చేసి అనంతరం తన సేవలను విస్తరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం–2021కి ఎంపికైన సంస్థ?
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌
ఎందుకు : పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నందున...

NCRA Astronomers: ఏ దేశ శాస్త్రవేత్తలు ఎంఆర్‌పీ ఎమిటర్స్‌ నక్షత్రాలను కనుగొన్నారు?

NCRA Pune

అరుదైన ‘మెయిన్‌ సీక్వెన్స్‌ రేడియో పల్స్‌’ (ఎంఆర్‌పీ) ఎమిటర్స్‌ తరగతికి చెందిన 8 నక్షత్రాలను భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మహారాష్ట్రలోని పూణెకు సమీపంలో ఉన్న జయంట్‌ మీటర్‌వేవ్‌ రేడియో టెలిస్కోపు (జీఎంఆర్‌టీ)ను ఉపయోగించి... పూణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఎన్‌సీఆర్‌ఏ) శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం... ఎంఆర్‌పీ ఎమిటర్స్‌ సూర్యుడి కన్నా చాలా వేడిగా ఉంటాయి. వాటిలో అసాధారణ స్థాయిలో బలమైన అయస్కాంత క్షేత్రాలు, తీవ్రస్థాయి జ్వాలలు వెలువడుతున్నాయి. లైట్‌హౌస్‌ తరహాలో ఇవి ప్రకాశవంతమైన రేడియో ప్రకంపనలను నలుమూలలకు వెదజల్లుతున్నాయి.

ఎన్‌సీఆర్‌ఏ శాస్త్రవేత్తలు గతంలో మూడు ఎంఆర్‌పీ నక్షత్రాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు వెలుగు చూసిన 15 ఎంఆర్‌పీల్లో 11 తారలను జీఎంఆర్‌టీతోనే గుర్తించినట్లయింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అరుదైన ‘మెయిన్‌ సీక్వెన్స్‌ రేడియో పల్స్‌’ (ఎంఆర్‌పీ) ఎమిటర్స్‌ తరగతికి చెందిన 8 నక్షత్రాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : పూణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఎన్‌సీఆర్‌ఏ) శాస్త్రవేత్తలు
ఎందుకు : విశ్వం, నక్షత్రాలపై పరిశోధనల్లో భాగంగా...

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్యాట్స్‌మన్‌?

AB de Villiers


దక్షిణాఫ్రికా క్రీడాకారుడు ఏబీ డివిలియర్స్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు నవంబర్‌ 19న అతను ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి 2018లోనే తప్పుకున్న డివిలియర్స్‌ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. ఓవరాల్‌గా డివిలియర్స్‌ 320 టి20 మ్యాచ్‌లలో 37.24 సగటు, 150.13 స్ట్రయిక్‌రేట్‌తో 9,424 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 69 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

కెప్టెన్సీకి పైన్‌ రాజీనామా
ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్సీకి టిమ్‌ పైన్‌ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని నవంబర్‌ 19న పైన్‌ ప్రకటించాడు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 19 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Nov 2021 06:44PM

Photo Stories