Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 15 కరెంట్‌ అఫైర్స్‌

Simone Biles

TIME Magazine: అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికైన క్రీడాకారిణి?

విఖ్యాత టైమ్‌ మేగజైన్‌ 2021కి గానూ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా అమెరికన్‌ స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 14న ప్రకటన చేసింది. నాలుగుసార్లు ఒలింపిక్‌ పతక విజేత అయిన బైల్స్‌ టోక్యో ఒలింపిక్స్‌–2020 సమయంలో తాను ‘ద ట్విస్టీస్‌’తో బాధ పడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుంది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్‌ టీమ్‌ మాజీ డాక్టర్‌ ల్యారీ నాసర్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సెనేట్‌ ముందు సాక్ష్యం చెప్పింది.

భారత చెస్‌ లీగ్‌ నిర్వహణ హక్కులను కైవసం చేసుకున్న సంస్థ?
భారత్‌ వేదికగా చదరంగ క్రీడలో కూడా ఫ్రాంచైజీ తరహా లీగ్‌ టోర్నీని నిర్వహించాలని అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) నిర్ణయించింది. 2022 ఏడాది జూన్‌లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. చెస్‌ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. రెండు వారాల పాటు డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో దేశంలోని రెండు నగరాల్లో టోర్నీని నిర్వహిస్తారు.  టోర్నీ నిర్వహణ, ప్రచారం, మార్కెటింగ్‌ కోసం ‘గేమ్‌ ప్లాన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థకు హక్కులు ఇచ్చామని  ఏఐసీఎఫ్‌ అధ్యక్షుడు సంజయ్‌ కపూర్‌  ప్రకటించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టైమ్‌ మ్యాగజైన్‌ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2021’గా ఎంపికైన క్రీడాకారిణి?
ఎప్పుడు : డిసెంబర్‌ 14
ఎవరు    : అమెరికన్‌ స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌
ఎక్కడ    : ప్రపంచంలో...
ఎందుకు : క్రీడారంగంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపుపొందినందున..

Asian Development Bank: ఏడీబీ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్‌ వృద్ధి రేటు?

2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదవుతుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదించింది. తొలుత 11 శాతం వృద్ధి అంచనాలను సెప్టెంబర్‌లో 10 శాతానికి తగ్గించిన ఏడీబీ... తాజాగా మరో 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) కుదించింది. పరిశ్రమలకు సంబంధించి సరఫరా సమస్యలు ఇందుకు ప్రధాన కారణమని తాజాగా విడుదల చేసిన నివేదికలో ఏడీబీ పేర్కొంది. దక్షిణాసియా వృద్ధి రేటును కూడా 8.8 శాతం నుంచి 8.6 శాతానికి సంస్థ తగ్గించింది.

కినారా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైన క్రికెటర్‌?
కినారా క్యాపిటల్‌ ప్రముఖ ఆల్‌రౌండర్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈలకు ఫిన్‌టెక్‌ సేవలను కినారా క్యాపిటల్‌ ఆఫర్‌ చేస్తుంటుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలు 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదింపు
ఎప్పుడు : డిసెంబర్‌ 14
ఎవరు    : ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ)
ఎందుకు : పరిశ్రమలకు సంబంధించిన సరఫరా సమస్యల కారణంగా...

Astronomy: జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు ప్రయోగాన్ని ఏ తేదీన నిర్వహించనున్నారు?

James Webb Space Telescope

ఇంతవరకు విశ్వరహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్‌ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు ప్రయోగం 2021, డిసెంబర్‌ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్‌ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, కెనడా స్పేస్‌ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యం ఉంది. ఏరియన్‌ 5 స్పేస్‌ రాకెట్‌లో ఫ్రెంచ్‌ గినియాలోని గినియాస్పేస్‌ సెంటర్‌ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు.

25 సంవత్సరాలు.. రూ. 76 వేల కోట్లు..
1996 ఏడాదిలో ఎన్‌జీఎస్‌టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్‌ వెబ్‌ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది.

లక్షల కిలోమీటర్ల దూరంలో..
డిసెంబర్‌ 22న ప్రయోగంతో జేమ్స్‌ వెబ్‌ను భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్‌2 లాంగ్రేజియన్‌ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్‌2 పాయింటుకు చేరుకుంటుంది. ఇక హబుల్‌ టెలిస్కోపు భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది.

1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి..
బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు.

జేమ్స్‌వెబ్‌ టెలిస్కోపు విశేషాలు..

  • సైజు: 72 x 39 అడుగులు
  • బరువు: 6 టన్నులు
  • వేగం: సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగానికి అంటే 67వేల ఎంపీహెచ్‌కు సమానం.
  • జీవిత కాలం: 10 ఏళ్లు
  • 458 జీబీ కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు.
  • తయారు చేసిన సంస్థలు: నార్త్‌రోప్‌ గ్రమ్మన్, బాల్‌ ఏరోస్సేస్‌ – టెక్నాలజీస్‌
  • దీనిలో అతిపెద్ద బంగారు పూత పూసిన 18 షట్కోణ ఫలకాల దర్పణం ఏర్పాటు చేశారు. ఈ దర్పణం వ్యాసం 6.5 మీటర్లు, హబుల్‌ దర్పణ వ్యాసం కన్నా ఇది దాదాపు రెండున్నర రెట్లు పెద్దది. 0.6– 28.3ఎం వరకు ఉన్న కాంతి కిరణాలను గమనించగలదు. అంటే ఇంతవరకు ఏ టెలిస్కోపు గమనించలేని వస్తువులను గుర్తిస్తుంది.
  • ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్‌ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్‌ సైన్స్‌(డిడి–ఇఆర్‌ఎస్‌) కార్యక్రమం, గ్యారెంటీడ్‌ టైమ్‌ అబ్జర్వేషన్స్‌(జిటిఓ) కార్యక్రమం, జనరల్‌ అబ్జర్వర్స్‌(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు.

Supreme Court: ఏ ఏడాది ఎస్‌ఈసీసీ డేటాలో లోపాలున్నాయని కేంద్రం తెలిపింది?

2011 ఏడాదిలో చేపట్టిన సామాజికార్థిక కులగణన(ఎస్‌ఈసీసీ–2011) గణాంకాల్లో లోపాలున్నాయని, ఓబీసీల డేటాకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టుకు వెల్లడించింది. లోపభూయిష్ట సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఈ నివేదికను బహిర్గతం చేయలేదని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లను తాము సమర్థిస్తామని పేర్కొంది. ఎస్‌ఈసీసీ 2011 వివరాలను తమకందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాము ఎన్నిమార్లడిగినా కేంద్రం ఈ గణాంకాలు అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానమిచ్చారు.

ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు: సిట్‌
లఖింపూర్‌ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌– ఎస్‌యూవీ) నడిపారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) స్పష్టం చేసింది. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిసెంబర్‌ 14న పేర్కొంది. సిట్‌ దర్యాప్తు పర్యవేక్షణకు పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ను నియమించిన విషయం తెలిసిందే.

చదవండి: లఖిమ్‌పూర్‌లో ఏం జరిగింది? ఏమిటీ కేసు? నిందితులు ఎవరు?

Venkaiah Naidu: ది మాస్టర్‌ ఎట్‌ వర్క్‌ పుస్తకాన్ని ఎవరు రచించారు?

Raj Kapoor- The Master at Work Book

సినీ దర్శకుడు రాహుల్‌ రావైల్‌ రచించిన ‘రాజ్‌ కపూర్‌– ది మాస్టర్‌ ఎట్‌ వర్క్‌’ పుస్తకాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. డిసెంబర్‌ 14న న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... చలనచిత్రాల్లో హింసాత్మక సన్నివేశాల చిత్రీకరణ, అసభ్యత యువత మనసులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయన్నారు. రాజ్‌ కపూర్‌ భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మార్చారని చెప్పారు. రాజ్‌ కపూర్‌ జీవితానికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలతో ది మాస్టర్‌ ఎట్‌ వర్క్‌ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

యోగా సంస్థాన్‌ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని..
డిసెంబర్‌ 14న వారణాసిలో సద్గురు సదాఫల్‌దేవ్‌ విహంగం యోగా సంస్థాన్‌ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. కాశీలోని ఉమ్రాహాలో ఉన్న స్వర్‌వేద్‌ మహామందిర్‌ ఆలయంలో సద్గురు సదాఫల్‌దేవ్, స్వతంత్రదేవ్‌ మహరాజ్, విజ్ఞాన్‌దేవ్‌ మహరాజ్‌లకు నివాళులర్పించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సినీ దర్శకుడు రాహుల్‌ రావైల్‌ రచించిన ‘రాజ్‌ కపూర్‌– ది మాస్టర్‌ ఎట్‌ వర్క్‌’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్‌ 14
ఎవరు    : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ    : న్యూఢిల్లీ

MK Stalin-KCR Meet: తమిళనాడు, తెలంగాణ సీఎంల భేటీ ఎక్కడ జరిగింది?

MK Stalin-KCR

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సమావేశమయ్యారు. డిసెంబర్‌ 14న తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో జరిగిన ఈ భేటీలో సుమారు గంటపాటు జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా నదీజలాలు వృ«థాగా సముద్రంలో కలుస్తున్నాయని, నీటిని సరిగా వినియోగించుకోలేనిస్థితి నెలకొందని కేసీఆర్‌ పేర్కొన్నారు. 2022, మార్చిలో జరిగే యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు.

స్పిన్నీ ప్రచారకర్తగా నియమితులైన క్రికెటర్‌?
ప్రీఓన్‌డ్‌(సెకండ్‌ హ్యాండ్‌) కార్ల రిటైలింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్పిన్నీతో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ చేతులు కలిపాడు. వ్యూహాత్మక పెట్టుబడిదారుగా, బ్రాండ్‌ ప్రచారకర్తగా కంపెనీతో జత కట్టినట్లు స్పిన్నీ పేర్కొంది. అయితే ఎంతమేర ఇన్వెస్ట్‌ చేసిందీ వెల్లడించలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశం
ఎప్పుడు : డిసెంబర్‌ 14
ఎవరు    : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపేందుకు..

వ్యవసాయ పథకాల లబ్ధిదారులకు యూనిక్‌ ఐడీలు
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల లబ్ధిదారులైన రైతులకు యూనిక్‌ ఐడీలను అందజేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తోమర్‌ డిసెంబర్‌ 14న పార్లమెంట్‌కు తెలిపారు. ఈ యూనిక్‌ ఐడీకి సదరు రైతు పొందిన అన్ని రకాల ప్రభుత్వ పథకాల వివరాలు జతపరిచి ఉంటాయని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఏకలవ్య ఎడ్యూటెక్‌ సంస్థ ప్రారంభం
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో అధునాతన మార్పులు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. పిల్లల సామర్థ్యాలు, నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘ఏకలవ్య ఎడ్యూటెక్‌’ సంస్థను డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 14 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Dec 2021 06:55PM

Photo Stories