Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 14 కరెంట్‌ అఫైర్స్‌

Elon Musk, Times Magazine

Time Magazine: టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన వ్యక్తి?

టైమ్‌ మ్యాగజైన్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2021’గా టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్‌ ఎక్స్‌కు కూడా మస్క్‌ సీఈవోగా ఉన్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను అధిగమించి మస్క్‌ ఇటీవలే ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయన సంపద దాదాపు 300 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి. సోషల్‌ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టైమ్‌ మ్యాగజైన్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2021’గా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : డిసెంబర్‌ 13
ఎవరు    : టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌
ఎక్కడ    : ప్రపంచంలో...
ఎందుకు : అత్యంత ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపుపొందిన..

Covid-19: ప్రపంచంలో తొలి ‘ఒమిక్రాన్‌’ మరణం ఏ దేశంలో నమోదైంది?

ప్రపంచంలో తొలి ఒమిక్రాన్‌ మరణం బ్రిటన్‌లో నమోదైంది. ఈ విషయాన్ని దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ డిసెంబర్‌ 13న ప్రకటించారు. ‘‘వయోజనులకు రెండు డోస్‌ల సంరక్షణ ఏమాత్రం సరిపోదు.  డిసెంబర్‌ 31కల్లా అందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి’’ అని బోరిస్‌ స్పష్టంచేశారు. లండన్‌లో నమోదవుతున్న కేసుల్లో 40శాతం కేసులు ఒమిక్రాన్‌వేనని ఆయన వెల్లడించారు.

బ్రిటన్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కట్టడిచేసేలా కొత్త కఠిన చర్యలు తీసుకోకుంటే మరణాలు భారీగా పెరుగుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. 2022, జనవరిలో ఈ వేరియంట్‌ వ్యాప్తి పెరిగి ఏప్రిల్‌కల్లా 25వేల నుంచి 75 వేల మంది కోవిడ్‌తో మరణించే ప్రమాదముందని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ – ట్రోపికల్‌ మెడిసిన్‌ హెచ్చరించింది. బ్రిటన్‌లోని వైద్య గణాంకాలను తీసుకుని ఈ అధ్యయనం చేశారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్‌ పాజిటివ్‌...
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా(69) కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం డిసెంబర్‌ 13న వెల్లడించింది.

Soil Testing: భూ పరీక్షక్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐఐటీ?

Soil Testing Device

భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకొనేందుకు ప్రత్యేకమైన పోర్టబుల్, వైర్‌లెస్‌ సాయిల్‌ టెస్టింగ్‌ పరికరాన్ని(పోర్టబుల్‌ టెస్టింగ్ డివైజ్) ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ–కాన్పూర్‌ అభివృద్ధి చేసింది.  ఈ పరికరం ద్వారా కేవలం 90 సెకన్లలో భూసార ఫలితం తెలుసుకోవచ్చు. పరీక్ష కోసం ఐదు గ్రాముల మట్టి చాలు. ‘భూ పరీక్షక్‌’ యాప్‌ ద్వారా ఈ పరికరాన్ని ఉపయోగించి మట్టిలోని పోషకాలను కచ్చితంగా తెలుసుకోవచ్చని ఐఐటీ–కాన్పూర్‌ తెలిపింది. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని పేర్కొంది.

ఐఐటీ–కాన్పూర్‌లోని డిపార్ట్‌మెంట్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్‌ జయంత్‌కుమార్‌ సింగ్, పల్లవ్‌ ప్రిన్స్, అషర్‌ అహ్మద్, యశస్వి ఖేమాని, మొహమ్మద్‌ అమిర్‌ఖాన్‌తో కూడిన బృందం ఈ ర్యాపిడ్‌ సాయిల్‌ టెస్టింగ్‌ డివైజ్‌ను అభివృద్ధి చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భూ పరీక్షక్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐఐటీ?
ఎప్పుడు : డిసెంబర్‌ 13
ఎవరు    : ఐఐటీ–కాన్పూర్‌ 
ఎందుకు : పోర్టబుల్, వైర్‌లెస్‌ సాయిల్‌ టెస్టింగ్‌ పరికరాన్ని ఉపయోగించి భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకొనేందుకు..

Missile Test: స్మార్ట్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?

SMART System

చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గామిని సైతం అత్యంత కచ్చితత్వంతో పేల్చివేసే అధునాతన ఆయుధ వ్యవస్థ ''సూపర్‌ సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ టార్పెడో(SMART-స్మార్ట్‌)''ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్‌ 13న ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలామ్‌ ద్వీపం(భద్రక్‌ జిల్లా)లో ఈ పరీక్ష చేసినట్లు భారత రక్షణ పరిశోధన, అభిసంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. ప్రయోగంలో మిసైల్‌ ఫుల్‌రేంజ్‌ సామర్ధ్యం నిరూపితమైందని వివరించింది. సాంప్రదాయ టార్పెడో రేంజ్‌ కన్నా అధిక శక్తివంతమైన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ రూపకల్పనలో భాగంగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. మిసైల్‌ ప్రయాణ మార్గాన్ని ఎలక్ట్రో అప్టిక్‌ టెలిమెట్రీ వ్యవస్థతో పర్యవేక్షించామని, మిసైల్‌లో ఒక టార్పెడో, ఒక పారచూట్‌ విడుదల వ్యవస్థ ఉన్నాయని వివరించింది. భూమిపై కదిలే వాహనాల నుంచి కూడా దీన్ని లాంచ్‌ చేయవచ్చు. దేశీయ నావికా శక్తిని ఈ స్మార్ట్‌ మరింత బలోపేతం చేస్తుందని డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సూపర్‌ సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ టార్పెడో(SMART-స్మార్ట్‌) సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎప్పుడు : డిసెంబర్‌ 13
ఎవరు : భారత్‌
ఎక్కడ : అబ్దుల్‌ కలామ్‌ ద్వీపం, భద్రక్‌ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా..

PM Modi: కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం

Modi in Kashi

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌ 13న తన నియోజకవర్గం వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. రూ.399 కోట్లతో నిర్మించిన మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా యాత్రి సువిధా కేంద్రాలు, టూరిస్ట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్, వేదిక్‌ కేంద్ర, ముముక్షు భవన్, భోగ్‌శాల తదితర 23 భవనాలను మోదీ ప్రారంభించారు. నగరంలో పర్యాటకరంగానికి ఊపు తేవడమే లక్ష్యంగా కాశీ విశ్వనాథ్‌ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది.

ఎన్‌డీపీఎస్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ సవరణ చట్టం–2021(ఎన్‌డీపీఎస్‌)కు లోక్‌సభ డిసెంబర్‌ 13న ఆమోదం తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
శ్రీ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం
ఎప్పుడు  : డిసెంబర్‌ 13
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : వారణాసి, వారణాసి, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : నగరంలో పర్యాటకరంగానికి ఊపు తేవడమే లక్ష్యంగా..

Weightlifting: కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆటగాడు?

Ajay Singh, Weithlifter

ఉజ్బెకిస్తాన్‌ రాజధాని నగరం తాష్కెంట్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2021లో డిసెంబర్‌ 13న భారత వెయిట్‌లిఫ్టర్‌ అజయ్‌ సింగ్‌ 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అతను ఓవరాల్‌గా 322 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2022 ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించాడు.

కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు మూడు బంగారు పతకాలు లభించాయి. జెరెమీ లాల్‌రినుంగా (67 కేజీలు), అచింత షెయులి (73 కేజీలు) కూడా స్వర్ణ పతకాలు దక్కించుకొని బర్మింగ్‌హమ్‌ గేమ్స్‌కు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు.

శ్రీవేద్యకు మహిళల డబుల్స్‌ టైటిల్‌
మెక్సికో ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ అమ్మాయి గురజాడ శ్రీవేద్య డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించింది. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరిగిన ఈ టోర్నీ  మహిళల డబుల్స్‌ ఫైనల్లో శ్రీవేద్య (భారత్‌)–ఇషికా జైస్వాల్‌ (అమెరికా) జోడీ 20–22, 21–17, 21–16తో క్రిస్టల్‌ లాయ్‌–అలెగ్జాండ్రా మొకాను (కెనడా) జంటపై నెగ్గింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
 కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2021లో స్వర్ణం నెగ్గిన ఆటగాడు?
ఎప్పుడు : డిసెంబర్‌ 13
ఎవరు    : భారత వెయిట్‌లిఫ్టర్‌ అజయ్‌ సింగ్‌(81 కేజీల విభాగం)
ఎక్కడ    : తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌ 
ఎందుకు : ఓవరాల్‌గా 322 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచినందున..

Covid-19: ఒమిక్రాన్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించిన ఐఐటీ?

గంటన్నరలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని(రాపిడ్‌ స్క్రీనింగ్‌ పరీక్ష) ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం రూపొందించింది. ఆర్‌టీపీసీఆర్‌ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్‌ ఆఫ్‌ బయలాజికల్‌ సైన్సెస్‌... రాపిడ్‌ స్క్రీనింగ్‌ పరీక్షను అభివృద్ధి చేసింది. ఒమిక్రాన్‌లో వేరియంట్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్‌ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది.

వెల్త్‌బ్రీఫింగ్‌ పురస్కారాన్ని అందుకున్న సంస్థ?
‘అత్యుత్తమ ఈటీఎఫ్‌ ప్రొవైడర్‌’గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తాజాగా వెల్త్‌బ్రీఫింగ్‌ పురస్కారాన్ని దక్కించుకుంది. మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాలకు సంబంధించి (ఎంఈఎన్‌ఏ) యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన ఎనిమిదో వార్షిక వెల్త్‌బ్రీఫింగ్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. వివిధ ఆర్థిక సాధనాలకు సంబంధించిన వినూత్న స్కీములతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ స్థిరంగా రాణిస్తోందని వెల్త్‌బ్రీఫింగ్‌ పబ్లిషర్‌ స్టీఫెన్‌ హ్యారిస్‌ పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గంటన్నరలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని(రాపిడ్‌ స్క్రీనింగ్‌ పరీక్ష) రూపొందించిన ఐఐటీ?
ఎప్పుడు : డిసెంబర్‌ 13
ఎవరు    : ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం
ఎందుకు : జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ను ఉపయోగించి ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు 3 రోజులు పడుతున్న నేపథ్యంలో..

Telugu Writer: కువెంపు జాతీయ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?

Writer Satyavathi

ప్రతిష్టాత్మకమైన ‘కువెంపు జాతీయ అవార్డు–2021’కు ప్రఖ్యాత తెలుగు కథారచయిత్రి పి.సత్యవతి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, రజత పతకాన్ని అందుకోనున్నారు. కథలు, నవలలు, అనువాదాలతోసహా అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకుగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. 2021, డిసెంబర్‌ 29న ప్రముఖ కన్నడ కవి కువెంపు పుట్టిన రోజున కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా కుప్పలిలో సత్యవతికి అవార్డు ప్రదానం చేయనున్నారు. కన్నడ కవి కువెంపు అసలు పేరు కుప్పలి వెంకటప్ప పుట్టప్ప(కువెంపు అనేది ఆయన కలం పేరు).

స్త్రీవాద రచయిత్రిగా..
1940లో గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించిన పి.సత్యవతి... విజయవాడలోని ఎస్‌ఏఎస్‌ కళా శాలలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వందల కొద్దీ కథలు, 5 నవలలు రాశారు. దేశంలోనే ప్రముఖ స్త్రీవాద రచయిత్రిగా గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాలకుపైగా వివిధ మాధ్యమాల ద్వారా తన కథలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిష్టాత్మకమైన ‘కువెంపు జాతీయ అవార్డు–2021’కు ఎంపికైన రచయిత్రి?
ఎప్పుడు : డిసెంబర్‌ 13
ఎవరు : ప్రఖ్యాత తెలుగు కథారచయిత్రి పి.సత్యవతి
ఎందుకు : కథలు, నవలలు, అనువాదాలతోసహా అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకుగాను..

Miss Universe 2021: విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి?

భారతీయ యువతి హర్నాజ్‌ కౌర్‌ సంధు 2021 ఏడాది విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని గెలుచుకుంది. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌ నగరం వేదికగా డిసెంబర్‌ 12న(స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన 70వ విశ్వసుందరి పోటీల్లో 80 దేశాల నుంచి అందగత్తెలు పోటీపడ్డారు. తుది రౌండ్‌లో న్యాయ నిర్ణేతలు ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు అద్భుతమైన రీతిలో సమాధానం చెప్పిన 21 ఏళ్ల హర్నాజ్‌ విజేతగా నిలిచింది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కినట్లయింది. సుస్మితాసేన్‌(1994), లారా దత్తా(2000) తర్వాత మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారతీయ యువతిగా హర్నాజ్‌ గుర్తింపు పొందింది. హర్నాజ్‌ తర్వాత పరాగ్వే సుందరి నదియా ఫెరారియా(22) ద్వితీయ స్థానం, దక్షిణాఫ్రికా అందగత్తె లలేలా మ్సా్వనే (24) మూడో స్థానం దక్కించుకున్నారు.

యోగా ఔత్సాహికురాలు..
2000, మార్చి 3న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పంజాబీ కుటుంబంలో హర్నాజ్‌ జన్మించింది. తర్వాత కాలంలో ఆమె కుటుంబం చండీగఢ్‌లో స్థిరపడింది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేసిన హర్నాజ్‌... ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది. యోగా ఔత్సాహికురాలైన ఆమె గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌ని ఇష్టపడుతుంది. 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టి..  2017లో ‘మిస్‌ చండీగఢ్‌’ కిరీటాన్ని గెలుచుకుంది. 2019లో ‘మిస్‌ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్‌ దశకు చేరుకుంది. లివా మిస్‌ దివా యూనివర్స్‌–2021లోనూ విజేతగా నిలిచింది.

నటిగానూ..
హిందీ, పంజాబీ, ఇంగ్లిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్‌ మోడలింగ్‌ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్‌’ అనే పంజాబీ సినిమాలలో నటించింది. ప్రకృతి అంటే ఇష్టపడే ఆమె.. పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏడాది విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి?
ఎప్పుడు : డిసెంబర్‌ 12
ఎవరు    : హర్నాజ్‌ కౌర్‌ సంధు
ఎక్కడ    : ఐలాట్, ఇజ్రాయెల్‌చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 13 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Dec 2021 07:12PM

Photo Stories