Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 13 కరెంట్‌ అఫైర్స్‌

Dr. Thota Chiranjeevi - GPEIA

Scientist: గోల్డెన్‌ పీకాక్‌ ఎకో ఇన్నోవేషన్‌–2021 అవార్డు విజేత?

గ్రేటర్‌ నొయిడాలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్‌ అండ్‌ డీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్‌ తోట చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ పీకాక్‌ ఎకో ఇన్నోవేషన్‌–2021 అవార్డు లభించింది. డిసెంబర్‌ 10న వర్చువల్‌ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ చిరంజీవికి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐఓడీ) ఈ అవార్డును ప్రదానం చేసింది. భారత్‌ జీఎస్సార్‌ క్యాట్‌ను అభివృద్ధి చేసినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్‌గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత్‌ జీఎస్సార్‌ క్యాట్‌ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్‌ చిరంజీవి, ఆయన బృందం అభివృద్ధి చేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్‌ సల్ఫర్‌ తగ్గింపు ఉత్ప్రేరకం (భారత్‌ జీఎస్సార్‌ క్యాట్‌) ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీస్థాయిలో ఉత్పత్తి చేసి, భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గోల్డెన్‌ పీకాక్‌ ఎకో ఇన్నోవేషన్‌–2021 అవార్డు విజేత?
ఎప్పుడు : డిసెంబర్‌ 10
ఎవరు    : శాస్త్రవేత్త డాక్టర్‌ తోట చిరంజీవి
ఎందుకు : భారత్‌ జీఎస్సార్‌ క్యాట్‌ను అభివృద్ధి చేసినందుకుగాను..

Former Minister: ప్రైడ్, ప్రిజుడీస్‌ అండ్‌ పండిట్రీ పుస్తక రచయిత?

Shashi Tharoor new book

నాన్‌ ఫిక్షన్‌ రచనలు చాలా సులువైనవని, వ్యక్తిగతంగా తనకు ఫిక్షన్‌ రచనలంటేనే ఇష్టమని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ రచయిత శశిథరూర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్‌ పార్క్‌హయత్‌లో ప్రభా ఖైతాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశిథరూర్‌ స్వయంగా రాసిన ‘ప్రైడ్, ప్రిజుడీస్‌ అండ్‌ పండిట్రీ’ అనే పుస్తకాన్ని డిసెంబర్‌ 11న ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... తన 23వ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. అలెఫ్‌ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ముందుగా ఢిల్లీలో ఆవిష్కరించారు.

సుప్రీంలో సీనియర్‌ హోదా పొందిన తొలి తెలంగాణ న్యాయవాది?
తెలంగాణకు చెందిన న్యాయవాది పి.నిరూప్‌ రెడ్డికి సుప్రీంకోర్టు ఫుల్‌కోర్టు సీనియర్‌ న్యాయవాది హోదా కల్పించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ హోదా పొందిన తొలి తెలంగాణ న్యాయవాదిగా నిరూప్‌ రెడ్డి గుర్తింపు పొందారు. మెదక్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ న్యాయవాది, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి కుమారుడైన నిరూప్‌రెడ్డి 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు చట్టాలపై మంచి పట్టును సాధించారు.

DRDO: సాంట్‌ మిస్సైల్‌ పరీక్ష ఎక్కడ నిర్వహించారు? 

SANT missile

దేశీయంగా అభివృద్ధి చేసిన సాంట్‌ (స్టాండ్‌ ఆఫ్‌ యాంటీ ట్యాంక్‌) మిస్సైల్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్‌ 11న రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ), భారత వాయుసేన సంయుక్తంగా ఈ ఫ్లైట్‌ టెస్టింగ్‌ను నిర్వహించాయి. మిస్సైల్‌ రిలీజ్‌ మెకానిజం, గైడెన్స్, ట్రాకింగ్, అంతర్గత సాఫ్ట్‌వేర్‌ అన్నీ బాగా పనిచేశాయని భారత రక్షణ శాఖ ప్రకటించింది. దేశీయ రక్షణ సామర్థ్యాలకు మరింత జోరునిచ్చేందుకు సాంట్‌ పరీక్ష విజయవంతం కావడం దోహదం చేస్తుందని డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి చెప్పారు.

స్టాండ్‌ ఆఫ్‌ యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌ పది కిలోమీటర్ల రేంజ్‌లో లక్ష్యాలను ఛేదించగలదు. హెలికాప్టర్‌ నుంచి లాంచ్‌ చేయగలగడం ఈ మిస్సైల్‌ ప్రత్యేకత. హైదరాబాద్‌లోని ఆర్‌సీఐ (ఇమారత్‌)లో దీన్ని డిజైన్‌ చేయడం జరిగింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సాంట్‌ (స్టాండ్‌ ఆఫ్‌ యాంటీ ట్యాంక్‌) మిస్సైల్‌ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్‌ 11
ఎవరు    : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ), భారత వాయుసేన
ఎక్కడ    : పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్,  రాజస్తాన్‌
ఎందుకు : దేశీయ రక్షణ సామర్థ్యాలకు మరింత మెరుగుపరిచేందుకు..

Tennis: ఐటీఎఫ్‌ మహిళల టోర్నిలో డబుల్స్‌ టైటిల్‌ సాధించిన జోడీ?

Sama Satvika-Ramya Natarajan

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సామ సాత్విక డబుల్స్‌ టైటిల్‌ సాధించింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో డిసెంబర్‌ 11న జరిగిన డబుల్స్‌ ఫైనల్లో సాత్విక–రమ్య నటరాజన్‌ (భారత్‌) ద్వయం 6–3, 1–6, 13–11తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ సౌజన్య బవిశెట్టి–షర్మదా (భారత్‌) జోడీపై విజయం సాధించింది. సాత్విక కెరీర్‌లో ఇది రెండో ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌. 2019లో మెహక్‌ జైన్‌తో కలిసి సాత్విక నైరోబి ఓపెన్‌లో తొలిసారి ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిచింది.

ఆసియా రోయింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు?
థాయ్‌లాండ్‌లోని బాన్‌ చాంగ్‌లో జరిగిన ఆసియా రోయింగ్‌ చాంపియన్‌షిప్‌లో డిసెంబర్‌ 11న భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. పురుషుల డబుల్స్‌ స్కల్స్‌ ఈవెంట్‌ రేసును అర్జున్‌ లాల్‌–రవి జంట అందరికంటే ముందుగా 6 నిమిషాల 57.883 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలిచింది. పురుషుల సింగిల్‌ స్కల్స్‌ విభాగంలో భారత రోయర్‌ పర్మీందర్‌ సింగ్‌ రజతాన్ని సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో డబుల్స్‌ టైటిల్‌ సాధించిన జోడీ?
ఎప్పుడు : డిసెంబర్‌ 11
ఎవరు    : సామ సాత్విక–రమ్య నటరాజన్‌ (భారత్‌) ద్వయం
ఎక్కడ    : సోలాపూర్, మహారాష్ట్ర
ఎందుకు : ఫైనల్లో సాత్విక–రమ్య నటరాజన్‌ (భారత్‌) ద్వయం.. టాప్‌ సీడ్‌ సౌజన్య బవిశెట్టి–షర్మదా (భారత్‌) జోడీపై విజయం సాధించినందున..

Students: స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ క్రైసిస్‌ నివేదికను రూపొందించిన సంస్థ?

School Students

కరోనా కారణంగా బడులు మూసివేత అనే అంశంపై యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి ప్రపంచబ్యాంకు ‘‘స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ క్రైసిస్‌’’ పేరుతో ఒక నివేదికను రూపొందించింది. కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉందని తాజాగా విడుదలైన ఈ నివేదిక హెచ్చరించింది. కరోనా కారణంగా పలు దేశాల్లో విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • ప్రస్తుత విలువ ప్రకారం లెక్కిస్తే ఒక తరం విద్యార్ధులు బడుల మూసివేతతో 17 లక్షల కోట్ల డాలర్ల జీవితకాల ఆర్జనను నష్టపోతారు. ఈ మొత్తం ప్రస్తుత ప్రపంచ జీడీపీలో 14 శాతానికి సమానం.  
  • గతంలో అనుకున్నదానికన్నా విద్యాసంస్థల మూసివేతతో వచ్చే నష్టం అధికం. (బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టమని 2020లో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.) 
  • గతంలో అల్పాదాయ దేశాల్లోని పిల్లల్లో 53 శాతం మంది పేదరికంతో జీవించడాన్ని నేర్చుకునేవారు. స్కూల్స్‌ మూసివేతతో వీరి సంఖ్య 70 శాతానికి చేరనుంది. 
  • కరోనాతో ప్రపంచ విద్యావ్యవస్థలు స్తంభించాయి. కరోనా బయటపడిన 21 నెలల తర్వాత కూడా కోట్లాదిమంది పిల్లల బడులు మూసివేసే ఉన్నాయి. వీరిలో చాలామందికి ఇకపై బడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు.  
  • జ్ఞానార్జనకు పిల్లలు దూరం కావడం నైతికంగా సహించరానిది.
  • ఒకతరం పిల్లలు పేదరికంలోకి జారడం భవిష్యత్‌ ఉత్పాదకతపై, ఆదాయాలపై పెను ప్రభావం చూపుతుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    
: కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉంది
ఎప్పుడు  : డిసెంబర్‌ 12
ఎవరు    : స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ క్రైసిస్‌ (ప్రపంచబ్యాంకు నివేదిక)
ఎక్కడ    : ప్రపంచవ్యాప్తంగా...

Red Bull Driver: ఎఫ్‌1లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారుడు?

Red Bull Driver Max Verstappen

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌  ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. డిసెంబర్‌ 12న యూఏఈ రాజధాని అబుదాబిలో జరిగిన 2021 ఏడాది సీజన్‌ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో 58 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ (నెదర్లాండ్స్‌) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 57వ ల్యాప్‌ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్‌లో వెనుకబడిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

మొత్తం 22 రేసుల్లో...
2021 ఏడాది సీజన్‌లో వెర్‌స్టాపెన్‌ గెలిచిన రేసుల సంఖ్య 10. మొత్తం 22 రేసులు జరగ్గా... హామిల్టన్‌ ఎనిమిది రేసుల్లో నెగ్గాడు. పెరెజ్‌ (రెడ్‌బుల్‌), ఒకాన్‌ (అల్పైన్‌ రెనౌ), రికియార్డో (మెక్‌లారెన్‌), బొటాస్‌ (మెర్సిడెస్‌) ఒక్కో రేసులో గెలిచారు.

వరుసగా ఎనిమిదోసారి...
ఎఫ్‌1 కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్‌ జట్టు వరుసగా ఎనిమిదో ఏడాది విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో మొత్తం 9 రేసుల్లో గెలిచిన మెర్సిడెస్‌ 613.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది.

ఎఫ్‌1కు కిమీ రైకొనెన్‌ గుడ్‌బై
అబుదాబి గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌కు ఫిన్లాండ్‌ డ్రైవర్‌ కిమీ రైకొనెన్‌ గుడ్‌బై చెప్పాడు. 2001లో సాబర్‌ జట్టు ద్వారా ఎఫ్‌1లో అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రైకొనెన్‌... మెక్‌లారెన్, ఫెరారీ, లోటస్, ఆల్ఫా రొమెయో జట్ల తరఫున రేసింగ్‌లో పాల్గొన్నాడు. ఫెరారీ డ్రైవర్‌గా 2007లో డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నెగ్గాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌–2021 విజేత?
ఎప్పుడు : డిసెంబర్‌ 12
ఎవరు    : రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 
ఎందుకు : సీజన్‌ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో విజయం సాధించి.. 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినందున..

Govt: ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు అందుబాటులోకి రానున్న హెల్ప్‌లైన్‌?

Helpline

షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు(వేధింపుల నిరోధక) చట్టం–1989 సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా టోల్‌–ఫ్రీ నంబర్‌ 14566 దేశవ్యాప్తంగా నిత్యం అందుబాటులో ఉంటుందని డిసెంబర్‌ 12న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ వెల్లడించింది. ప్రతి ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌గా రిజిస్టర్‌ చేస్తామని, బాధితులకు సాయం అందిస్తామని తెలియజేసింది.

ఇటీవల ఏ దేశ ప్రధాని ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది?
ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా డిసెంబర్‌ 12న కొద్ది సమయం హ్యాక్‌ అయింది. వెంటనే ట్విట్టర్‌ స్పందించి ఖాతాను పరిరక్షించిందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బిట్‌కాయిన్‌ను భారత్‌ లీగల్‌ టెండర్‌గా స్వీకరించిందని హ్యాకర్లు ప్రధాని ఖాతా నుంచి ట్వీట్‌ చేశారు.

పీపీఓ చీఫ్‌గా నియమితులైన భారతీయ అమెరికన్‌?
మరో భారతీయ అమెరికన్‌ను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కీలక పదవి వరించింది. రాజకీయ సలహాదారు అయిన గౌతమ్‌ రాఘవన్‌ను వైట్‌హౌస్‌లోని ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ ఆఫీస్‌(పీపీఓ) చీఫ్‌గా నియమిస్తూ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో పుట్టిన గౌతమ్‌ అమెరికాలోని సియాటెల్‌లో పెరిగి, స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.

అమెరికాలో టోర్నడోలు..
అమెరికాలోని ఆరు రాష్ట్రాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. కెంటకీ, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, మిస్సోరి, అర్కాన్సస్, మిస్సిసిపీ రాష్ట్రాల్లో టోర్నడోల ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. డిసెంబర్‌ 12వ తేదీ నాటికి మృతుల సంఖ్య 94కు చేరింది.

ఆపరేషన్‌ దేవి శక్తి అంటే?
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక మొదటిసారిగా భారత ప్రభుత్వం అక్కడి ప్రజలకు మానవతాసాయం అందించింది. డిసెంబర్‌ 11న 1.6 మెట్రిక్‌ టన్నుల ప్రాణాధార ఔషధాలతో కూడిన ఒక విమానం కాబూల్‌ వెళ్లింది. ‘ఆపరేషన్‌ దేవి శక్తి’ కింద ఈ విమానాన్ని పంపారు.

యోగాలో గిన్నిస్‌ రికార్డ్‌
విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్‌ గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగస్టు 4న అష్ట వక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్‌ భార్య జ్యోతి కూడా కొద్ది నెలల క్రితం గిన్నిస్‌బుక్‌లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

సెలవిక.. సైనికా!

Saiteja Army


తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ అంత్యక్రియలు డిసెంబర్‌ 12న పూర్తయ్యాయి. సాయితేజ స్వగ్రామం చిత్తూరు జిల్లా, కురబలకోట మండలం, ఎగువరేగడి గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 11 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Dec 2021 04:38PM

Photo Stories