Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 11 కరెంట్‌ అఫైర్స్‌

Saudi Arabia Flag
సౌదీ అరేబియా జెండా

Terrorism: తబ్లిగీ జమాత్‌పై నిషేధం విధించిన దేశం?

సున్నీ ఇస్లాం సంస్థ తబ్లిగీ జమాత్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాద ద్వారాల్లో ఒకటని విమర్శించింది. ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఉగ్రవాదానికి మార్గంగా మారిందని, సమాజానికి ప్రమాదకారిగా మారిందని పేర్కొంది. ద తబ్లిగి, దవా గ్రూప్‌ వంటి వాటితో ప్రజలు సంబంధం పెట్టుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు డిసెంబర్‌ 10న తెలిపింది. వచ్చే శుక్రవారం జరిపే ప్రార్థనల్లో తబ్లిగీపై నిషేధం గురించి ప్రజలను హెచ్చరించాలని మసీదుల్లో ప్రార్థనలు చేసే ముల్లాలను ఆదేశించింది.

ఏమిటీ సంస్థ?
బ్రిటిష్‌ ఇండియాలో 1926లో తబ్లిగీ జమాత్‌ సంస్థను మౌలానా మహ్మద్‌ కాందల్వి స్థాపించారు. ముస్లింలు ఇస్లాం ఆచార వ్యవహారాలను కట్టుదిట్టంగా పాటించేందుకు సంస్థ కృషి చేసేది. ఈ సంస్థకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35–40 కోట్లమంది సభ్యులున్నట్లు అంచనా. తాము కేవలం మతానికే పరిమితమని, రాజకీయ కార్యకలాపాలకు దూరమని సభ్యులు చెబుతుంటారు. అయితే యూకే, ఫ్రాన్స్, అమెరికాల్లో జరిగిన ఉగ్రకార్యకలాపాల దర్యాప్తుల్లో ఈ సంస్థ పేరు వినిపించిందని యూఎస్‌ఐఓపీ(యూనైటెడ్‌స్టేట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌) తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సున్నీ ఇస్లాం సంస్థ తబ్లిగీ జమాత్‌పై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : డిసెంబర్‌ 10
ఎవరు    : సౌదీ అరేబియా
ఎక్కడ    : సౌదీ అరేబియా
ఎందుకు : ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఉగ్రవాదానికి మార్గంగా మారిందని, సమాజానికి ప్రమాదకారిగా మారిందని..

CDS: జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు తుది వీడ్కోలు

17-gun salute

 

తమిళనాడులో జ‌రిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. రావత్‌ దంపతుల పార్థివ దేహాలకు ఢిల్లీలోని కంటోన్మెంట్‌ బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో డిసెంబర్‌ 10న దహన సంస్కారాలు నిర్వహించారు. రావత్‌కు సైనికులు 17 శతఘ్నులతో గన్‌ సెల్యూట్‌ సమర్పించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ రావత్‌ దంపతులతోపాటు మృతిచెందిన బ్రిగేడియర్‌ లిడ్డర్‌ అంత్యక్రియలను కూడా బ్రార్‌ స్క్వేర్‌ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు.

17 గన్‌ సెల్యూట్‌ ఎవరికి?
రాష్ట్రపతి, అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుల అంతిమ వీడ్కోలు సందర్భంగా 21 గన్‌ సెల్యూట్‌ సమర్పిస్తుంటారు. నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ మరణిస్తే 17 గన్‌ సెల్యూట్‌ సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. భారత తొలి డీసీఎస్‌ జనరల్‌ రావత్‌ ర్యాంక్‌.. ఆర్మీ చీఫ్, వాయుసేనాధిపతి, నావికా దళాధిపతిల ర్యాంక్‌లతో సమానం. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌లతో సమానంగా అంత్యక్రియల్లో 17 గన్‌ సెల్యూట్‌ సమర్పించారు. ‘2233 ఫీల్డ్‌ రెజిమెంట్‌’కు చెందిన 17 శతఘ్నులతో రావత్‌కు గన్‌ సెల్యూట్‌ చేయించారు. ఇతర దేశాల అధినేతలు, అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు 19 గన్‌ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించడం ఆనవాయితీ.

Dubai: ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌–2021 విజేత?

Magnus Carlsen

యూఏఈలోని దుబాయ్‌ వేదికగా 2021, నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 10 వరకు జరిగిన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌–2021(క్లాసికల్‌ ఫార్మాట్‌)లో నార్వే దిగ్గజ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ విజేతగా అవతరించాడు. రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఇయాన్‌ నిపోమ్‌నిషితో జరిగిన చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో కార్ల్‌సన్‌ విజయం సాధించాడు. దీంతో కార్ల్‌సన్‌ ఐదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలుచుకున్నట్లయింది. విజేత కార్ల్‌సన్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 28 లక్షలు)... రన్నరప్‌ నిపోమ్‌నిషికి 8 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. క్లాసికల్‌ ఫార్మాట్‌లోనే కాకుండా ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లలోనూ కార్ల్‌సన్‌ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌–2021(క్లాసికల్‌ ఫార్మాట్‌) విజేత?
ఎప్పుడు : డిసెంబర్‌ 10
ఎవరు    : నార్వే దిగ్గజ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌
ఎక్కడ    : దుబాయ్, యూఏఈ
ఎందుకు : రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఇయాన్‌ నిపోమ్‌నిషితో జరిగిన చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో కార్ల్‌సన్‌ విజయం సాధించినందున..

PM Modi: సరయు నహర్‌ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మించారు?

Sarayu Nahar Project

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బలరాంపూర్‌ జిల్లాలో రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయు నహర్‌ జాతీయ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్‌ 11న జాతికి అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్, శ్రావస్తి, బలరాంపూర్, గోండా, సిద్ధార్థనగర్, బస్తి, సంత్‌కబీర్‌ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లోని 6,200 గ్రామాలకు చెందిన 29 లక్షల రైతుల 14 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఘఘర, సరయు, రప్తి, బన్‌గంగా, రోహిణి నదులను అనుసంధానం చేశారు.

వాస్తవానికి ఈ ప్రాజెక్టు 1978లో ప్రారంభమైనా, అనేక అవాంతరాల కారణంగా నాలుగు దశాబ్దాలయినా అసంపూర్తిగానే మిగిలిపోయింది. చివరికి, 2016లో ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనలో చేర్చి సుమారు రూ.4,600 కోట్లను ఖర్చు చేసి ఎట్టకేలకు పూర్తి చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సరయు నహర్‌ జాతీయ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్‌ 11
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : బలరాంపూర్‌ జిల్లా,  ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని 14 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు..

London High Court: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు ఎవరు?

Julian Assange

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేను యూకే నుంచి యూఎస్‌కు అప్పగించడానికి లండన్‌ హైకోర్టు డిసెంబర్‌ 10న అనుమతినిచ్చింది. 2010–11 కాలంలో పలు రహస్య మిలటరీ, ద్వైపాక్షిక డాక్యుమెంట్లను బహిర్గతం చేసినందుకు అమెరికా అసాంజేను వెంటాడుతోంది. దీంతో అమెరికా నుంచి తప్పించుకున్న అసాంజే 2012 నుంచి యూకేలోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో శరణార్థ్ధిగా గడుపుతున్నారు. బెయిల్‌ కండీషన్లను ఉల్లంఘించారన్న ఆరోపణలపై 2019లో రాయబార కార్యాలయం నుంచి అసాంజేను అరెస్టు చేసి లండన్‌లోని బెల‌మార్ష్ జైల్లో ఉంచారు.

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు వందల మందికిపైగా వలసదారులతో పయనిస్తున్న ట్రక్కు బోల్తాపడి మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని చియాపాస్‌ రాష్ట్రంలో డిసెంబర్‌ 9న జరిగిన ఈ ప్రమాదంలో 53 మంది మరణించగా, 54 మందికి గాయాలయ్యాయి. పాదచారుల కోసం నిర్మించిన బ్రిడ్జిని ట్రక్కు ఢీకొని బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిలో అత్యధికులు గ్యాటిమాలా, హోండూరస్‌ నుంచి మెక్సికోకు వచ్చినవారున్నారు. వీరంతా మెక్సికో నుంచి యూఎస్‌ వెళ్లేందుకు ప్రయాణిస్తున్నారు.

మెక్సికో..
రాజధాని:
మెక్సికో సిటీ; కరెన్సీ: మెక్సికన్‌ పెసో
ప్రస్తుత అధ్యక్షుడు: ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌

BRICS Countries: సీఆర్‌ఏ రీసెర్చ్‌ గ్రూప్‌ ఏర్పాటు ఉద్దేశం?

Brics Countries

కోవిడ్‌ మహమ్మారి బ్రిక్స్‌ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని బ్రిక్స్‌ కంటింజెంట్‌ రిజర్వ్‌ అరేంజ్‌మెంట్‌ (సీఆర్‌ఏ) రీసెర్చ్‌ గ్రూప్‌ రూపొందించిన బ్రిక్స్‌ ఎకనమిక్‌ బులిటన్‌ పేర్కొంది. నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని వివరించింది. బ్రిక్స్‌ సెంట్రల్‌ బ్యాంకుల సభ్యులతో కలిసి సీఆర్‌ఏ రూపొందించిన ఈ బులిటిన్‌ను తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. బ్రిక్స్‌ పరిశోధన, ఆర్థిక విశ్లేషణ, నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడానికి సీఆర్‌ఏ రీసెర్చ్‌ గ్రూప్‌ ఏర్పాటయ్యింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్‌కు ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉంది.

రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్‌ డోసు: ఐసీఎంఆర్‌
కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ రెండు డోసులు పూర్తి చేసుకున్న 9 నెలల అనంతరం కరోనా టీకా బూస్టర్‌ డోసును ఇవ్వవచ్చని పార్లమెంటరీ కమిటీకి ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌) సూచించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి దేశంలో 86 శాతం మందికి కనీసం ఒక్కడోసు పూర్తైందని ఐసీఎంఆర్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు 32కు చేరుకున్నట్లు కేంద్రం డిసెంబర్‌ 10న తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కోవిడ్‌ మహమ్మారి బ్రిక్స్‌ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది
ఎప్పుడు : డిసెంబర్‌ 11
ఎవరు    : బ్రిక్స్‌ కంటింజెంట్‌ రిజర్వ్‌ అరేంజ్‌మెంట్‌ (సీఆర్‌ఏ) రీసెర్చ్‌ గ్రూప్‌
ఎక్కడ    : బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా
ఎందుకు : నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని..

Tashkent: కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన వెయిట్‌లిఫ్టర్‌?

Jeremy Lalrinnunga

ఉజ్బెకిస్తాన్‌ రాజధాని నగరం తాష్కెంట్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2021లో డిసెంబర్‌ 10న భారత యువ లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రినుంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మిజోరం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల జెరెమీ 67 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. జెరెమీ స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 164 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 305 కేజీలతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.

ఎన్‌. ముకేశ్‌ కుమార్‌కు ఏ క్రీడతో సంబంధం ఉంది?
కొత్త తరంలో హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు భారత హాకీ మాజీ ఆటగాడు, ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ ఎన్‌. ముకేశ్‌ కుమార్‌ సన్నద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ‘ముకేశ్‌ హాకీ అకాడమీ’ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నాదర్‌గుల్‌లోని  ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌)లో ఏర్పాటు చేసిన ఈ అకాడమీని డిసెంబర్‌ 10న భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రారంభించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 
కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2021లో స్వర్ణం గెలుచుకున్న భారత వెయిట్‌లిఫ్టర్‌?
ఎప్పుడు : డిసెంబర్‌ 11
ఎవరు    : జెరెమీ లాల్‌రినుంగా(67 కేజీల విభాగం)
ఎక్కడ    : తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌

Indian-origin: పెన్‌స్టేట్‌ వర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ?

Neeli Bendapudi

అమెరికాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఏయూ పూర్వవిద్యార్థిని నీలి బెండపూడి నియమితులయ్యారు. డిసెంబర్‌ 9న జరిగిన పెన్సిల్వేనియా (పెన్‌స్టేట్‌) యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో ఏకగ్రీవంగా నీలి బెండపూడిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. దీంతో 2022, జనవరిలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నీలి బెండపూడి యూనివర్సిటీ ఆఫ్‌ లూయిన్‌ విల్లీ కెంటగీ అధ్యక్షురాలిగా, మార్కెటింగ్‌ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నీలి బెండపూడి విశాఖ నగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా స్వీకరించారు. అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

ప్రజాస్వామ్యంపై సదస్సు..
ప్రజాస్వామ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సులో డిసెంబర్‌ 11న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. క్రిప్టోకరెన్సీ, సోషల్‌ మీడియా లాంటి వర్ధమాన సాంకేతికతల నియంత్రణకు అంతర్జాతీయ నిబంధనలు తీసుకువచ్చేందుకు అన్ని దేశాలూ సంయుక్తంగా కృíషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్‌ 9
ఎవరు    : ఏయూ పూర్వవిద్యార్థిని నీలి బెండపూడి
ఎక్కడ    : పెన్సిల్వేనియా, అమెరికా
ఎందుకు : పెన్సిల్వేనియా (పెన్‌స్టేట్‌) యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 10 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Dec 2021 12:59PM

Photo Stories