Daily Current Affairs in Telugu: 2021, డిసెంబర్ 10 కరెంట్ అఫైర్స్
Parliament: ఎన్‌ఎంపీ కింద ఎన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నారు?
బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్–ఎన్‌ఎంపీ) కార్యక్రమం కింద వచ్చే మూడేళ్లలో దాదాపు 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని(మానిటైజ్ చేయాలని) కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 9న కేంద్ర రహదారులు, పౌర విమానయాన సహాయ మంత్రి వీకే సింగ్ లోక్‌సభకు తెలిపారు. ఎంపీ మిమీ చక్రవర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వీకే సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తిరుపతి ఎయిర్‌పోర్ట్ కూడా..
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించనున్న 25 విమానాశ్రయాలలో... భువనేశ్వర్, వారణాసి, అమృతసర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్‌పూర్, కాలికట్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, పాట్నా, మధురై, సూరత్, రాంచీ, జోధ్‌పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి(రేణిగుంట), హుబ్లి, ఇంఫాల్, అగర్తల, ఉదయపూర్, డెహ్రాడూన్, రాజమండ్రి విమానశ్రయాలు ఉన్నాయి.
2025 ఏడాదిలోపు..
దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను మానిటైజ్ చేయడం ద్వారా 2025 ఏడాది నాటికి సుమారు రూ. 20,782 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2021, ఆగస్టులో కేంద్రం ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 137 విమానాశ్రయాలలో నాలుగు విమానాశ్రయాలు మినహా అన్నీ కోవిడ్–19 మహమ్మారి కారణంగా నష్టాలను చవిచూశాయి. నాలుగు ఎయిర్‌పోర్ట్‌లలో కందాలా (0.11 కోట్లు), కాన్పూర్ చకేరీ (6.07 కోట్లు), బరేలీ (0.68 కోట్లు), పోర్ బందర్ (1.54 కోట్లు) ఉన్నాయి.
ఎన్‌ఎంపీ అంటే ఏమిటీ?
ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్–ఎన్‌ఎంపీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) కార్యక్రమం కింద తలపెట్టిన ఎన్‌ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తులను మానిటైజేషన్ చేసి రూ. 6 లక్షల కోట్ల విలువను కేంద్రం రాబట్టనుంది.
ఎన్‌ఎమ్‌పీ–ముఖ్యాంశాలు..
- ఎన్‌ఎమ్‌పీ ద్వారా ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ప్రభుత్వం ‘మానిటైజ్’ చేయనుంది.
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు పలు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి.
- 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది.
వీటికే పరిమితం..
ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రా అసెట్స్‌కి మాత్రమే ఎన్‌ఎంపీ పరిమితమని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఆయా అసెట్స్ యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వాటిని తప్పనిసరిగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది’’ అని నిర్మల తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వచ్చే మూడేళ్లలో దాదాపు 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : కేంద్ర రహదారులు, పౌర విమానయాన సహాయ మంత్రి వీకే సింగ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : ఎన్‌ఎంపీ కింద.. ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు..
Chopper Crash: ఎంఐ–17వీ5 ప్రమాదంపై ఎవరి నేతృత్వంలో దర్యాప్తు జరగనుంది?
ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 9న పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటించారు. ఐఏఎఫ్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం తమిళనాడులోని వెల్లింగ్టన్‌కు చేరుకుందని పేర్కొన్నారు. తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ, రాజ్యసభలో ఎంపీలు నివాళులర్పించారు.
బ్లాక్ బాక్స్ లభ్యం
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్ డేటా రికార్డర్(బ్లాక్ బాక్స్)ను గురువారం వెలికితీశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్‌లోని సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి..
Activist: ఎల్గార్ పరిషత్ కేసులో జైలు నుంచి విడుదలైన మహిళా న్యాయవాది?
ఎల్గార్ పరిషత్–మావోయిస్టుల సంబంధాల కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ–ఉపా) సెక్షన్ల కింద అరెస్టయి మూడేళ్లుగా జైలులో మగ్గిపోయిన సామాజిక కార్యకర్త, ప్రముఖ మహిళా న్యాయవాది సుధా భరద్వాజ్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమెకు డీఫాల్ట్ బెయిల్ మంజూరుచేస్తూ 2021, డిసెంబర్ 1న బాంబే హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. బెయిల్‌కు షరతులేవైనా విధించాలంటే నిర్ణయించుకోమని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) స్పెషల్ కోర్టుకు హైకోర్టు సూచించింది. దీంతో రూ.50వేల పూచీకత్తుపై విడుదలచేయాలని ఎన్‌ఐఏ కోర్టు డిసెంబర్ 8న ఆదేశాలివ్వడంతో ఆమెను ముంబైలోని బైకుల్లా జైలు నుంచి డిసెంబర్ 9న విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్గార్ పరిషత్–మావోయిస్టుల సంబంధాల కేసులో జైలు నుంచి విడుదలైన ప్రముఖ మహిళా న్యాయవాది?
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : సుధా భరద్వాజ్
ఎందుకు : బాంబే హైకోర్టు ఉత్తర్వుల మేరకు..
Telecom Company: భారత్ నుంచి లీడర్‌షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక సంస్థ?
అంతర్జాతీయంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల జాబితాలో దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు అత్యుత్తమ ’ఎ–’ లీడర్‌షిప్ రేటింగ్ దక్కింది. లాభాపేక్ష రహిత సంస్థ సీడీపీ... 2021 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 9న విడుదల చేసిన ఈ జాబితాలో, భారత్ నుంచి లీడర్‌షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్ సంస్థ జియోనే. మరో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ’సి’ రేటింగ్ లభించింది.
ముఖ్యాంశాలు..
- ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ గల 272 కంపెనీలపై అధ్యయనం చేసి 2021 ఏడాది జాబితాను సీడీపీ రూపొందించింది.
- వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా కంపెనీల పనితీరు, వాటి పారదర్శకత స్థాయి ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చారు.
- 2020 ఏడాది ’బి’ రేటింగ్ నుంచి జియో 2021 ఏడాది మరో అంచె ఎదిగింది. భారతి ఎయిర్‌టెల్ రేటింగ్ 2020లో ’డి–’ నుంచి ఈసారి ’సి’ స్థాయికి మెరుగుపడింది.
సీడీపీ గురించి..
సీడీపీ అనేది అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ. ఇది కంపెనీలు, నగరాలు తమ పర్యావరణ ప్రభావాన్ని వెల్లడించడంలో సహాయపడుతుంది. 2002 నుండి 8,400 కంపెనీలు సీడీపీ ద్వారా పర్యావరణ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించాయి. సీడీపీ సంస్థను గతంలో కార్బన్ డిస్‌క్లోజర్ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 సంవత్సరానికి సంబంధించి సీడీపీ విడుదల చేసిన జాబితాలో భారత్ నుంచి లీడర్‌షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్ సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో
ఎందుకు : వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా ఉత్తమ పనితీరు కనబరిచినందున..
Reserve Bank of India: ఇటీవల షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా పొందిన బ్యాంక్?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా లభించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిసెంబర్ 9న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల ఆర్‌బీఐ, 1934కు సంబంధించి సెకండ్ షెడ్యూల్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చేరుతుంది. వినియోగదారులకు మరిన్ని ఫైనాన్షియల్ సేవలు అందించగలుగుతంది. అలాగే బ్యాంక్ కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు. ప్రభుత్వం, పెద్ద సంస్థల బాండ్లు, వేలం, రెపో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఆపరేషన్స్‌లో పాల్గొనడం వంటి సౌలభ్యతలు కూడా ఒనగూరుతాయి. ప్రభుత్వ స్కీమ్ నిర్వహణలో భాగం పంచుకోవచ్చు.
దిగుమతుల వాటానే 86 శాతం వరకూ..
భారత్ తన బంగారం అవసరాలకు దిగుమతుల మీదే ప్రధానంగా ఆధారపడుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ‘భారత్‌లో బులియన్ ట్రెండ్’ నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలో 2016–2020 మధ్య జరిగిన మొత్తం సరఫరాల్లో దిగుమతుల వాటానే 86 శాతం వరకూ ఉందని వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా పొందిన బ్యాంక్?
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
ఎందుకు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం మేరకు..
Rani Rampal: కేర్ 4 హాకీ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సంస్థ?
దేశీయంగా హాకీ క్రీడకు తోడ్పాటు అందించేందుకు ప్రైవేట్ రంగ బీమా దిగ్గజం బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం భారతీయ మహిళల హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, వన్ థౌజండ్ హాకీ లెగ్స్(హాకీ సిటిజన్ గ్రూప్)తో కలిసి ‘కేర్4హాకీ(#Care4Hockey)’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో హాకీ నేర్చుకునే బడుగు వర్గాల పిల్లలకు శిక్షణ, పరికరాలు, పౌష్టికాహారం వంటి అవసరాలను తీర్చేందుకు తోడ్పాటు అందిస్తామని బజాజ్ అలయంజ్ తెలిపింది.
వన్డే క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని వన్డే క్రికెట్ టీమ్ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ రోహిత్ శర్మను ఆ స్థానంలో నియమిస్తున్నట్లు డిసెంబర్ 9న బీసీసీఐ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేర్4హాకీ(#Care4Hockey) పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ప్రైవేట్ రంగ బీమా దిగ్గజం బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్
ఎందుకు : దేశీయంగా హాకీ క్రీడకు తోడ్పాటు అందించేందుకు..
Telecom Sector: 5జీ టెస్ట్‌బెడ్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు?
చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర టెలికం రంగ సంస్థలు 5జీ టెక్నాలజీకి సంబంధించి తమ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడే ‘టెస్ట్‌బెడ్’ను 2022, జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్ 9న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్–2021లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ (డాట్) కార్యదర్శి కె. రాజారామన్ ఈ విషయం వెల్లడించారు. న్యూఢిల్లీ వేదికగా డిసెంబర్ 8న ప్రారంభమైన మొబైల్ కాంగ్రెస్ డిసెంబర్ 10న ముగియనుంది.
రూ. 224 కోట్లతో..
సుమారు రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్‌బెడ్‌ను రూపొందించే ప్రతిపాదనకు 2018 మార్చిలో కేంద్ర టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని ఐఐటీ విద్యా సంస్థలు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ దీని రూపకల్పనలో పాలుపంచుకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ సంస్థలకే..
ప్రస్తుతం 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్‌ఎల్ సంస్థలకు టెలికం శాఖ స్పెక్ట్రం కేటాయించింది. ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు గడువును 2021, మే 26 దాకా లేదా వేలం తర్వాత వ్యాపార అవసరాల కోసం స్పెక్ట్రంను కేటాయించే దాకా పొడిగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 5జీ టెస్ట్‌బెడ్‌ను 2022, జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : కేంద్ర టెలికం శాఖ (డాట్) కార్యదర్శి కె. రాజారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర టెలికం రంగ సంస్థలు 5జీ టెక్నాలజీకి సంబంధించి తమ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు..
India GDP: క్రెడిట్ సూసీ అంచనా ప్రకారం.. 2021–22 దేశ వృద్ధి రేటు?
2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతం వరకూ నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– క్రెడిట్ సూసీ అంచనా వేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఢోకా ఉండబోదని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ సానుకూలతలోనే కొనసాగుతుందని వివరించింది. ఈ మేరకు డిసెంబర్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. 2021–22లో 9.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనాకాగా, అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ విషయంలో ఈ అంచనా 8.4 శాతంగా ఉంది.
సీవీసీ సవరణ బిల్లు–2021కు ఆమోదం
సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధిపతుల పదవీ కాలపరిమితిని రెండేళ్ల నుంచి గరిష్ఠంగా ఐదేళ్లకు పొడిగించేందుకు వీలు కల్పించే బిల్లులకు లోక్‌సభ డిసెంబర్ 9న ఆమోదం తెలిపింది. సీవీసీ సవరణ బిల్లు–2021, డిఎస్‌పీఈ సవరణ బిల్లు–2021ను కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. మూజువాణి ఓటుతో ఇవి సభ ఆమోదం పొందాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతం వరకూ నమోదయ్యే అవకాశం ఉంది
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– క్రెడిట్ సూసీ
ఎందుకు : భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలతలోనే కొనసాగుతున్నందున..
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబర్ 9 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్