Skip to main content

Lakhimpur Kheri violence: లఖిమ్‌పూర్‌ ఘటనపై ఎవరి నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తు చేయనుంది?

Supreme Court

లఖిమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటన కేసుల దర్యాప్తు ఇకపై మాజీ జడ్జి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ నేత్వత్వంలో కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాబితాలోని ఐజీ ర్యాంక్‌ అధికారి పద్మజ చౌహాన్‌సహా... యూపీ మాతృరాష్ట్రం కాని ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ఇకపై రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)లో భాగస్వాములుగా ఉంటారని సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం నవంబర్‌ 17న వెల్లడించింది.

తొలుత ఏకసభ్య కమిషన్‌..

లఖిమ్‌పూర్‌ ఖేరి ఘటనపై తొలుత అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాస్తవతో కూడిన ఏక సభ్య న్యాయ కమిషన్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏకసభ్య న్యాయ కమిషన్‌ పనితీరుపై సంతృప్తిగా లేమని... యూపీ కాకుండా వేరే రాష్ట్రానికి చెందిన జడ్జి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తామని భారత సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించడంతో... కేసుల దర్యాప్తుకు కొత్త పర్యవేక్షకుడిని సుప్రీంకోర్టు నవంబర్‌ 17న నియమించింది.

 

మాజీ జడ్జి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ గురించి..

పంజాబ్, హరియాణా హైకోర్టులో గతంలో జడ్జిగా సేవలందించిన జస్టిస్‌ జైన్‌.. హరియాణాలోని హిస్సార్‌లో 1958 అక్టోబర్‌ 1న జన్మించారు. బీకాం ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆయన పంజాబ్, హరియాణా హైకోర్టు బార్‌లో 1982లో పేరు నమోదు చేయించుకున్నారు. తర్వాత హిస్సార్‌ జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1983 నుంచి హైకోర్టులో కేసులు వాదించారు.

 

లఖిమ్‌పూర్‌లో ఏం జరిగింది? ఏమిటీ కేసు?

  • 2021, అక్టోబర్‌ 3వ తేదీన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖిమ్‌పూర్‌ ఖేరి జిల్లాలో... యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాల పర్యటన సందర్భంగా లఖీమ్‌పూర్‌ జిల్లాలోని టికునియాలో మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన జరిగింది.
  • ఆందోళన చేస్తున్న రైతుల మీదుగా కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు చెందిన కాన్వాయ్‌ దూసుకుపోవడంతో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం జరిగిన ప్రతీకార హింసలో మరో నలుగురు హత్యకు గురయ్యారు. దీనిపై వచ్చిన లేఖనే ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు స్వీకరించింది.
  • ఈ కేసులో మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ నిందితుడిగా ఉన్నారు. ఘటనలో రైతుల హత్య, జర్నలిస్టు హత్య, రాజకీయ కార్యకర్తల హత్య ఇలా మూడు ఉన్నాయి.

చ‌ద‌వండి: రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌ ఏ నగరంలో ఉంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మాజీ జడ్జి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ నేత్వత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు
ఎప్పుడు  : నవంబర్‌ 17
ఎవరు    : భారత సుప్రీంకోర్టు 
ఎందుకు : లఖిమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటన కేసుల దర్యాప్తు కోసం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Nov 2021 03:33PM

Photo Stories