Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 29 కరెంట్‌ అఫైర్స్‌

daily current affairs telugu

National Language: దేశ జనాభాలో ఎంత శాతం మందికి హిందీ మాతృభాష?

Hindi

హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్‌ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ప్రభుత్వం ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి.

హిందీ ఎంతమంది మాట్లాడతారు? తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉంది?
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6 శాతం మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86 శాతం మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70 శాతం మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది.

Languages


Men’s Club League Handball: ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?

Handball

ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌–2022కు హైదరాబాద్‌ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా 2022, జూన్‌ 23 నుంచి జూలై 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించారని... ఆసియా నుంచి 12 లేదా 15 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయని ఏప్రిల్‌ 28న భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు.

రంజీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించినది?
దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ నాకౌట్‌ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, వేదికను ప్రకటించారు. జూన్‌ 4 నుంచి 24 వరకు జరిగే రంజీ నాకౌట్‌ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం? 
ఎప్పుడు : ఏప్రిల్‌ 28
ఎవరు    : భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌ రావు
ఎక్కడ    : గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం, హైదరాబాద్‌
ఎందుకు : ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించడంతో..​​​​​​​

24th Deaflympics: బధిరుల ఒలింపిక్స్‌కు ఎంపికైన టెన్నిస్‌ క్రీడాకారిణి?

Bhavani Kedia

తెలంగాణ టెన్నిస్‌ క్రీడాకారిణి భవాని కేడియా బ్రెజిల్‌ వేదికగా జరిగే బధిరుల ఒలింపిక్స్‌–2021 క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 2010 నుంచి టెన్నిస్‌ ఆడుతున్న భవాని ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భవాని 2019లో చెన్నైలో జరిగిన బధిరుల జాతీయ క్రీడల్లో సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజత పతకాలను గెలుచుకుంది. బధిరుల ఒలింపిక్స్‌లో భవానితోపాటు షేక్‌ జాఫ్రీన్, పృథ్వీ శేఖర్, ధనంజయ్‌ దూబే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బధిరుల ఒలింపిక్స్‌–2021
24వ బధిరుల ఒలింపిక్స్‌–2021(24th Summer Deaflympics-2021)ను బ్రెజిల్‌లోని కాక్సియాస్‌ దో సుల్‌(Caxias do Sul) నగర వేదికగా నిర్వహించనున్నారు. 2022 మే 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. వాస్తవానికి ఈ క్రీడలను షేడ్యూలు ప్రకారం 2021 ఏడాదిలోని నిర్వహించాలి.. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2022 ఏడాదికి వాయిదా వేశారు.

బధిరుల ఒలింపిక్స్‌–2021 నినాదం(Motto) : స్పోర్ట్స్‌ కమ్స్‌ ఫ్రమ్‌ ద అవర్‌ హార్ట్స్‌(Sports comes from the our hearts)

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ గురువారం ప్రకటించారు. గత ఐదేళ్లుగా టెస్టు కెప్టెన్‌గా ఉన్న జో రూట్‌ ఇంగ్లండ్‌ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇటీవల రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ నియామకం జరిగింది.

Telangana: రాష్ట్రంలోని ఏ నగరంలో గూగుల్‌ క్యాంపస్‌ ఏర్పాటవుతోంది?

Google Campus in Hyderabad

టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ సొంత క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటవుతోంది. 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఏప్రిల్‌ 28న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన డిజైన్‌ను ఆయన ఆవిష్కరించారు. గూగుల్‌కు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్‌ కానుంది. గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలంలో ఈ క్యాంపస్‌ ఏర్పాటవుతోంది.

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని 2015లో కేటీఆర్‌ సందర్శించారు. సొంత క్యాంపస్‌ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌ మధ్య ఆ సందర్భంగా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే హైదరాబాద్‌లో గూగుల్‌ 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది.

ప్రభుత్వంతో ఒప్పందం..

  • వెనుకబడిన యువతకు గూగుల్‌ కెరీర్‌ సర్టిఫికెట్‌ స్కాలర్‌షిప్‌లను ఆఫర్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉపకార వేతనాలు అందించేందుకు, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్, నాలెడ్జ్‌తో కలిసి గూగుల్‌ పనిచేయనుంది.
  • వి–హబ్‌తో కలిసి విమెన్‌విల్‌ కార్యక్రమాన్ని సైతం గూగుల్‌ చేపట్టనుంది. మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తారు. విద్యార్థులకు డిజిటల్‌ విద్య చేరువయ్యేందుకు ప్రభుత్వ పాఠశాలలతో కలిసి గూగుల్‌ పని చేయనుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ సొంత క్యాంపస్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : ఏప్రిల్‌ 28
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ    : గచ్చిబౌలి, హైదరాబాద్‌
ఎందుకు : తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు..

Zero Defect Zero Effect: జెడ్‌ఈడీ సర్టిఫికేషన్‌ స్కీమ్‌ ప్రధాన లక్ష్యం?

Zero Defect Zero Effect

సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పురోగతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జెడ్‌ఈడీ (జీరో డిఫెక్ట్‌ జీరో ఎఫెక్ట్‌) సర్టిఫికేషన్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే ఏప్రిల్‌ 28న న్యూఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, లాభాలను పెంచడం, పర్యావరణంపై హానికరమైన పద్దతులను నియంత్రించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి తాజా పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం కాంస్య, వెండి, బంగారంతో సహా మూడు ధృవీకరణ స్థాయిలను కలిగి ఉంటుంది.

ఎంఎస్‌ఎంఈ ఛాంపియన్స్‌ పథకంలో  భాగమైన జెడ్‌ఈడీ ధృవీకరణ పథకం ద్వారా వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని,  పర్యావరణ స్పృహపై అవగాహన పెరుగుతుందని, సహజ వనరులను అత్యుఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని, మార్కెట్‌ విస్తరించుకోవచ్చని మంత్రి నారాయణ్‌ రాణే వెల్లడించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జెడ్‌ఈడీ (జీరో డిఫెక్ట్‌ జీరో ఎఫెక్ట్‌) సర్టిఫికేషన్‌ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 28
ఎవరు    : కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పురోగతి లక్ష్యంగా..

R&D Centre: థర్మో ఫిషర్‌ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?

Thermo fisher scientific R and D Center

శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్‌ సెంటర్‌’ను ఏప్రిల్‌ 28న హైదరాబాద్‌లోని నాలెడ్జి సిటీలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. «థర్మో ఫిషర్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. 2022, ఫిబ్రవరి నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ప్రతినిధులను కలిసినట్లు వివరించారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్‌ సెంటర్‌’ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 28
ఎవరు    : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ    : నాలెడ్జి సిటీ, హైదరాబాద్‌
ఎందుకు : శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో.. కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాల కోసం..

Human Skeletons: పంజాబ్‌ బావిలోని పుర్రెలు ఏ ప్రాంత ప్రజలవని తేలింది?

human skeletons

160 ఏళ్ల మిస్టరీ వీడిపోయింది. పంజాబ్‌ రాష్ట్రం, అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ 246 పుర్రెలు ఎవరివో తేలిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2014లో అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో పెద్ద ఎత్తున బయటపడ్డ మానవ కపాలాలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఈ పుర్రెలు పంజాబ్, పాకిస్తాన్‌ ప్రాంతాల ప్రజలకు చెందినవి కానే కాదని, వీటి డీఎన్‌ఏ.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ ప్రజల డీఎన్‌ఏతో సరిపోలుతోందని పరిశోధకులు వివరించారు.

డీఎన్‌ఏను పరిశీలించగా..

  • ఇప్పటివరకూ ఈ కపాలాలు 1857 నాటి తిరుగుబాటులో బ్రిటిషర్ల చేతిలో హతమైన సిపాయిలవని,  కొందరు చరిత్రకారులు చెబుతుండగా.. మరికొందరు 1947 నాటి దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారివి కావచ్చనని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు ఏదీ నిర్ధారణ కాలేదు. 
  • పంజాబ్‌ యూనివర్సిటీకి చెందిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ జేఎస్‌ సెహ్రావత్‌.. సీసీఎంబీ, లక్నోలోని బీర్బల్‌ సాహ్నీ ఇన్‌స్టిట్యూట్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీలతో కలిసి ఈ పుర్రెల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సీసీఎంబీ పుర్రెల నుంచి డీఎన్‌ఏను వెలికితీసి పరిశీలించగా.. మరణించిన వారు గంగా నదీ ప్రాంతానికి చెందిన వారని స్పష్టమైంది. ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ జెనిటిక్స్‌ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

బెంగాల్‌ నేటివ్‌ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌ సైనికులవి!

  • తాజా పరిశోధన ఫలితాలు చారిత్రక ఆధారాలతోనూ సరిపోతున్నాయి. ఎందుకంటే.. 26వ బెంగాల్‌ నేటివ్‌ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో బెంగాల్‌ తూర్పు ప్రాంతపు ప్రజలతో పాటు ఒడిశా, బిహార్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన వారూ ఉండేవారని చరిత్ర చెబుతోంది.
  • చారిత్రక ఆధారాల ప్రకారం.. ఆ బెటాలియన్‌కు చెందిన సైనికులను ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రాంతంలోని మియాన్‌ మీర్‌ ప్రాంతంలో నియమించారు. బ్రిటిష్‌ అధికారులపై తిరుగుబాటు చేసిన వీరు కొందరిని హతమార్చారు కూడా. అయితే ఆ తరువాతి కాలంలో బ్రిటిష్‌ అధికారులు వీరిని అజ్‌నాలా సమీపంలో బంధించి చంపివేసినట్లు చరిత్ర చెబుతోంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ 246 పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవి 
ఎప్పుడు  : ఏప్రిల్‌ 28
ఎవరు    : సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)
ఎక్కడ    : అజ్‌నాలా, అమృత్‌సర్‌ జిల్లా, పంజాబ్‌ రాష్ట్రం  
ఎందుకు : వీటి డీఎన్‌ఏ.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ ప్రజల డీఎన్‌ఏతో సరిపోలుతోందని..

Judicial Conference: హైకోర్టు సీజేల న్యాయ సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?

దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత 2022, మే 30న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్‌వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు ప్రసంగిస్తారు.

దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.

2016 ఏప్రిల్‌ 24న చివరిసారిగా..
సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్‌(రిటైర్డ్‌) మధుకర్‌ హీరాలాల్‌ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్‌ 24న చివరిసారిగా సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్‌ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్‌ మిషన్‌ ఫర్‌     జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్‌ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, మే 30న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు నిర్వహణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 28
ఎక్కడ    : విజ్ఞాన్‌ భవన్, న్యూ ఢిల్లీ
ఎందుకు : దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం..

ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత

Sundara Naidu

ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్‌ సంస్థ అధినేత డాక్టర్‌ ఉప్పలపాటి సుందరనాయుడు(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 28న తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం కంపలపల్లెలో జన్మించిన సుందరనాయుడు పశు వైద్యుడిగా వృత్తిజీవితం ప్రారంభించారు. 1967లో కోళ్ల పరిశ్రమ ప్రారంభించారు. 1972లో బాలాజీ హేచరీస్‌ను స్థాపించి పౌల్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. సుందరనాయుడి కుమార్తే మార్గదర్శి సంస్థ ఎండీ శైలజాకిరణ్‌.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్‌ సంస్థ అధినేత కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 28
ఎవరు    : డాక్టర్‌ ఉప్పలపాటి సుందరనాయుడు(86)
ఎక్కడ    : ఏఐజీ ఆస్పత్రి, గచ్చిబౌలి, హైదరాబాద్‌
ఎందుకు : అనారోగ్యం కారణంగా..

​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 28 కరెంట్‌ అఫైర్స్‌

​​​​​​​డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Apr 2022 07:19PM

Photo Stories