Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 28 కరెంట్‌ అఫైర్స్‌

Current-Affairs-Telugu-pdf

Gas Supply: ఏ దేశాలకు గ్యాస్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది?

Gas Supply

నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ఏప్రిల్‌ 27న ప్రకటించింది. త్వరలో ఇతర దేశాలకు కూడా సరఫరా ఆపేస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని యూఎస్, యూరప్‌ దేశాలు నిర్ణయించిన మర్నాడే రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా ప్రకటనతో యూరప్‌లో గ్యాస్‌ ధరలు భగ్గుమన్నాయి. మరోవైపు ఈ చర్య రష్యా ఆదాయంపై ప్రభావం చూపుతుందని, దీనివల్ల యుద్ధానికి నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు.

ఉక్రెయిన్‌కు పాశ్చాత్యదేశాలు పోలాండ్‌ ద్వారానే ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. బల్గేరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రష్యాతో సంబంధాలను తెంచుకుంది. పైగా బల్గేరియా తీరప్రాంతంలోని నాటో అవుట్‌పోస్టులో పలు జెట్‌ విమానాలు మోహరించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని రష్యా గ్యాస్‌ సరఫరా నిలిపివేసింది. రష్యా రూబుల్స్‌లో చెల్లింపులకు అంగీకరించనందుకే ఈ చర్య తీసుకున్నట్లు రష్యా చమురు సంస్థ గాజ్‌ప్రామ్‌ ప్రకటించింది. మరోవైపు ‘‘సర్మాత్‌ 2’’ అణు క్షిపణిని రష్యా విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను ఈ క్షిపణి కవర్‌ చేస్తుందని రష్యా తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు    : రష్యా 
ఎందుకు : రష్యా రూబుల్స్‌లో చెల్లింపులకు అంగీకరించనందుకే..

USOF: యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం?

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ మొబైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న 2జీ మొబైల్‌ సేవలను 4జీకి అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఉద్దేశించిన యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌(యూఎస్‌ఓఎఫ్‌) ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 27న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ఓఎఫ్‌ ప్రాజెక్టు కింద 2,343 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 2జీ నుండి 4జీ మొబైల్‌ సేవలను రూ.2,426 కోట్ల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్‌గ్రేడ్‌ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఈ– గవర్నెన్స్, బ్యాంకింగ్, టెలి–మెడిసిన్‌ డెలివరీ, మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా టెలి ఎడ్యుకేషన్‌ మొదలైన సేవలు సులువుగా అందుతాయి.

వీధి వ్యాపారుల నిధి పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించారు?
డీఏపీ సహా ఫాస్పాటిక్‌ అండ్‌ పొటాలిక్‌ ఎరువులకు రూ.60,939 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో ఫాస్ఫాటిక్‌ అండ్‌ పొటాసిక్‌ (పీ అండ్‌ కే) ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనలను ఏప్రిల్‌ 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. 2022 ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ కోసం అంటే ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఈ సబ్బిడీని కేటాయించారు. ఇక ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి పథకాన్ని 2024 డిసెంబర్‌ వరకు విస్తరిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌(యూఎస్‌ఓఎఫ్‌) ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు    : కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు : వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో.. ఇప్పుడున్న 2జీ మొబైల్‌ సేవలను 4జీకి అప్‌గ్రేడ్‌ చేసేందుకు..​​​​​​​NCSC Chairman: ఎన్‌సీఎస్సీ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన నేత?

Vijay Sampla

జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌(ఎన్‌సీఎస్సీ) చైర్మన్‌గా బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏప్రిల్‌ 27న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌ సాంప్లా ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్‌సీఎస్సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన గతంలో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్‌సీఎస్సీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

పాక్‌ విదేశాంగ మంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు?
పాకిస్తాన్‌  విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) నేత బిలావల్‌ భుట్టో జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్‌ 27న ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బిలావల్‌తో పాకిస్తాన్‌ అధ్యక్షుడు అరీఫ్‌ అల్వీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి షెహజాద్‌ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ హాజరయ్యారు. అంతర్జాతీయంగా ఇప్పుడు పాకిస్తాన్‌ ఒంటరవుతోందన్న వాదనల నేపథ్యంలో విదేశాంగ మంత్రిగా ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌(ఎన్‌సీఎస్సీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు    : బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా 
ఎక్కడ    : న్యూఢిల్లీ 

Cricket: కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీని గెలుచుకున్న జట్టు?

CK Nayudu Trophy 2022
ట్రోఫీని అందుకుంటున్న ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ తమోరే   

బీసీసీఐ దేశవాళీ అండర్‌–25 టోర్నీ (కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ)ను ముంబై జట్టు సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా ముగిసిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై 75 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేయగా విదర్భ 385 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన విదర్భ 121 పరుగులకే ఆలౌటైంది.

యూఏఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ ఒప్పందం
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని రువాయిస్‌ కెమికల్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అబుధాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ (త’జీజ్‌) ఏప్రిల్‌ 26న వాటాదారుల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుపై 2 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్‌ తదితర రసాయనాలను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బీసీసీఐ దేశవాళీ అండర్‌–25 టోర్నీ (కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ) విజేత?
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు    : ముంబై జట్టు 
ఎక్కడ    : అహ్మదాబాద్, గుజరాత్‌ 

Market Capitalization: రూ. 19 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ సంస్థ?

Reliance Industries

ప్రైవేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మార్కెట్‌ ఒడిదుడుకుల్లోనూ జోరు చూపుతోంది. తాజాగా ఏప్రిల్‌ 27న ట్రేడింగ్‌లో తొలుత 1.9 శాతం పుంజుకుంది. కొత్త గరిష్టం రూ. 2,827ను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) తొలిసారి రూ. 19 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి రూ. 19,12,814 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజంగా ఆర్‌ఐఎల్‌ చరిత్ర సృష్టించింది. చివరికి రూ. 2,778 వద్ద షేరు ముగియడంతో మార్కెట్‌ విలువ రూ. 18,79,237 కోట్ల వద్ద స్థిరపడింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రూ. 19,12,814 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజం?
ఎప్పుడు    : ఏప్రిల్‌ 27
ఎవరు    : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
ఎందుకు : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విలువ తాజాగా 1.9 శాతం పెరిగిన నేపథ్యంలో..

Digital India: డీఐఆర్‌–వీ ప్రోగ్రామ్‌ ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశం?

Digital India RISC-V  (DIR-V) Program

తొలిసారిగా దేశీయంగా తయారు చేసే సెమీకండక్టర్లను (చిప్‌ సెట్‌లు) 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. డిజిటల్‌ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ–వీ (డీఐఆర్‌–వీ) ప్రోగ్రామ్‌ను ఏప్రిల్‌ 27న న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రధానంగా మొబిలిటీ, కంప్యూటింగ్, డిజిటైజేషన్‌కు అవసరమైన మైక్రోప్రాసెసర్ల ఆవిష్కరణకు ఊతమివ్వడానికి డీఐఆర్‌–వీ ప్రోగ్రామ్‌ దోహదపడగలదని మంత్రి వివరించారు. డీఐఆర్‌–వీకి చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి కామకోటి, ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా సీడాక్‌ త్రివేండ్రం శాస్త్రవేత్త కృష్ణకుమార్‌ రావు నియమితులైనట్లు తెలిపారు. దేశంలో సెమీకండక్టర్‌ తయారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకు రూ.76,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా డీఐఆర్‌–వీని రూపొందించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డిజిటల్‌ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ–వీ (డీఐఆర్‌–వీ) ప్రోగ్రామ్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు    : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : మొబిలిటీ, కంప్యూటింగ్, డిజిటైజేషన్‌కు అవసరమైన మైక్రోప్రాసెసర్ల ఆవిష్కరణకు ఊతమివ్వడానికి..

India Post Payments Bank: ఐపీపీబీకు ఎన్ని కోట్ల అదనపు నిధులను కేటాయించారు?

India Post Payments Bank

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఏప్రిల్‌ 27న ఆమోదముద్ర వేసింది. దేశంలోని అన్ని పోస్టాఫీసులకు తన సేవలను విస్తరించేందుకు ఐపీపీబీ ఈ నిధులను వినియోగించుకుంటుంది. 1.56 లక్షల పోస్టాఫీసులలో ఐపీపీబీ ప్రస్తుతం 1.3 లక్షల పోస్టాఫీసుల నుంచి పనిచేస్తోంది. రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతిక అప్‌గ్రేడేషన్‌ల కోసం ఐపీపీబీకి మరో రూ.500 కోట్ల కేటాయింపులకు కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ)ని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో 2018, సెప్టెంబర్‌ 1న ప్రారంభించారు. బ్యాంకింగ్‌ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌లతో ఐపీపీబీ ని ప్రారంభించారు. ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి      :
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు     : కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు : దేశంలోని అన్ని పోస్టాఫీసులకు ఐపీపీబీ సేవలను విస్తరించేందుకు..

All India Radio FM Station: ఆలిండియా రేడియో నూతన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?

Venkaiah Naidu - all india radio

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఏప్రిల్‌ 27న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్‌ఎం స్టేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. నాడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి హోదాలో నెల్లూరు ఎఫ్‌ఎంకు శంకుస్థాపన చేశామని, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు కాలువ వద్ద ఏర్పాటు చేసిన దేవిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ను కూడా వెంకయ్య ప్రారంభించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు     : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ    : నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌​​​​​​​​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 27 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Apr 2022 06:20PM

Photo Stories