Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 27 కరెంట్ అఫైర్స్
United Nations: ఐరాస అంచనాల ప్రకారం... ఏడాదికి 560 విపత్తులు సంభవించనున్నాయి?
పర్యావరణంపై మనిషి అకృత్యాలు మితిమీరిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే ప్రకృతి విలయతాండవాన్ని చవిచూడాల్సివస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. ప్రస్తుత ధోరణులే కొనసాగితే 2030 నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సి వస్తుందని తెలిపింది. ఈ మేరకు తాజగా ఒక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా..
ఒకటిన్నర విపత్తు..
- 2015లో అత్యధికంగా 400 విపత్తులు ఎదురైతేనే మనిషి అల్లకల్లోలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఏడాదికి 560 అంటే రోజుకు దాదాపు ఒకటిన్నర విపత్తు ఏదోరూపంలో మనిషిని ఇబ్బందిపెట్టనుంది.
- వరదలు, తుపానులు, భూకంపాలు, కొత్త వ్యాధులు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు.. ఇలా అనేక రూపాల్లో ఇవి ఎదురవుతాయి.
- 1970– 2000 సంవత్సరం వరకు ప్రపంచంలో ఏదోఒక చోట ఏడాదికి 90– 100 వరకు విపత్తులు వచ్చేవి, కానీ పర్యావరణ విధ్వంసం వేగవంతం కావడంతో విపత్తుల వేగం కూడా పెరిగింది.
మూడురెట్ల వేడి..
- 2030లో ప్రపంచాన్ని వేడిగాలులు చుట్టుముడతాయి. వీటి తీవ్రత 2001 కన్నా మూడురెట్లు అధికంగా ఉంటుంది. అదేవిధంగా కరువులు 30 శాతం మేర పెరుగుతాయి.
- కేవలం ప్రకృతి విధ్వంసాలు మాత్రమే కాకుండా ఆర్థిక మాంద్యాలు, వ్యాధులు, ఆహారకొరత వంటివి కూడా శీతోష్ణస్థితి మార్పుతో సంభవిస్తాయి.
- 1990ల్లో విపత్తుల కారణంగా సంవత్సరానికి దాదాపు 7వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది, ఇప్పుడీ నష్టం 17వేల కోట్ల డాలర్లకు పెరిగింది.
- విపత్తుల ప్రభావం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుంది.
- ప్రదేశాలవారీగా ఆసియాపసిఫిక్ ప్రాంతంలో విపత్తుల వల్ల ఏడాదికి జీడీపీలో 1.6 శాతం మేర నష్టపోతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2030 నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సి వస్తుంది
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : ఐక్యరాజ్యసమితి
ఎందుకు : పర్యావరణంపై మనిషి అకృత్యాలు మితిమీరిపోతున్నందు వల్ల..
Covid-19: కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంస్థ ఏది?
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో టీకాను మరింతగా వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోద ముద్ర వేసింది. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకి ఇవ్వడానికి, బయోలాజికల్–ఇ కంపెనీ తయారు చేసిన కార్బెవ్యాక్స్‌ను 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకి వేయడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 26న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
ఇక 12 ఏళ్లపైబడిన వారికి(పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా..) క్యాడిలా ఫార్మా సంస్థ తయారు చేసిన ‘‘జైకోవ్–డి’’ వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ టీకాను 3 ఎంజీ చొప్పున 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇవ్వడానికి ఆమోదించింది. ప్రస్తుతం జైకోవ్–డిని 2 ఎంజీ చొప్పున మూడు డోసులుగా ఇస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకి ఇవ్వడానికి, బయోలాజికల్–ఇ కంపెనీ తయారు చేసిన కార్బెవ్యాక్స్‌ను 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకి వేయడానికి డీసీజీఐ అనుమతి
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
ఎందుకు : దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో..
Nuclear Weapons: ప్రపంచంలో అత్యధిక అణు వార్‌హెడ్లు కలిగిన దేశం?
ఉక్రెయిన్‌పై రెండు నెలలుగా భీకరమైన దాడులకు పాల్పడుతున్నా ఆ చిన్న దేశాన్ని స్వాధీనం చేసుకోలేక అసహనంతో ఊగిపోతున్న రష్యా బహిరంగంగానే మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతోంది. అణు దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహార శైలి, దూకుడు మనస్తత్వంతో ఎంతకైనా తెగిస్తారన్న అనుమానాలున్నాయి.
టాక్టికల్ అణ్వాయుధాలు అంటే ఏమిటీ?
రష్యా అధ్యక్షుడు పుతిన్ టాక్టికల్ అణ్వాయుధాలను (తక్కువ ప్రాంతంలో విధ్వంసం సృష్టించే అణు బాంబులు) ఉక్రెయిన్‌పై ప్రయోగించడానికి ఆదేశాలిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యా దగ్గరున్న క్షిపణి వ్యవస్థల్లో రెండు స్వల్ప దూరంలో లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను మోసుకుపోగలవు.
1. కల్బీర్ క్షిపణి (ఎస్‌ఎస్–ఎన్–30)
దీనిని ఉపరితలం నుంచి, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు. 1500 నుంచి 2500 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది.
2. ఇస్కందర్ ఎం క్షిపణి లాంఛర్
ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి 400 నుంచి 500 కి.మీ.దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది.
టాక్టికల్ అణ్వాయుధాలు ఎంత శక్తిమంతమైనవి ?
- ఈ టాక్టికల్ అణుబాంబుల్లో అతి చిన్నది ఒక కిలో టన్ను పేలుడు పదార్థంతో సమానం. అదే పెద్దదైతే 100 కిలోటన్నుల పేలుడు పదార్థంతో సమానమైన శక్తి కలిగి ఉంటుంది. దీని వల్ల జరిగే విధ్వంసం అణువార్ హెడ్, అది వేసే ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది.
- రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు 15 కిలోటన్నుల శక్తి కలిగినది. ఈ బాంబు లక్ష 46 వేల మంది ప్రాణాలను తీసింది. ప్రస్తుతం రష్యా దగ్గరున్న అతి పెద్ద అణుబాంబు 800 కిలోటన్నుల శక్తి కలిగి ఉంది.
Women's Hockey: మహిళల హాకీ మాజీ కెప్టెన్ ఎల్వెరా బ్రిటో కన్నుమూత
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్, పాతతరం క్రీడాకారిణి ఎల్వెరా బ్రిటో కన్నుమూశారు. 81 ఏళ్ల ఎల్వెరా బ్రిటో వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో ఏప్రిల్ 26న తుదిశ్వాస విడిచారు. ‘బ్రిటో సిస్టర్స్’గా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎల్వెరా, రీటా, మయె భారత మహిళల హాకీ జట్టుకు చిరపరిచితులు. జాతీయ టోర్నీలో 1960 నుంచి 1967 వరకు కర్ణాటక జట్టుకు ఏడు టైటిళ్లు అందించిన ఘనత బ్రిటో సిస్టర్స్‌ది! ఎల్వెరా బ్రిటో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు 1965లో ‘అర్జున అవార్డు’ను అందజేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అర్జున అవార్డీ, మహిళల హాకీ మాజీ కెప్టెన్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : ఎల్వెరా బ్రిటో
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : వృద్ధాప్య సమస్యల కారణంగా..
Asian Games 2022: ఆసియా క్రీడలను తొలిసారి ఎక్కడ నిర్వహించారు?
పోటీతత్వం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. ఈ రెండు దేశాల కోసం 300 అథ్లెట్ల కోటా కింద ఒక్కో దేశానికి 150 మంది చొప్పున పంపాలని ఓసీఏ కోరింది. అయితే ఓసీఏ ఆహ్వానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీలు తిరస్కరించాయి. ఆసియా క్రీడల్లో తమ దేశాల క్రీడాకారులను పంపించలేమని తెలిపాయి.
ఆసియా క్రీడలు–2022..
ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో(న్యూఢిల్లీ) జరిగాయి. 19వ ఆసియా క్రీడలు–2022 చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా.. 2022 ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి.
టీకా తప్పనిసరి కాదు..
ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌లాంటి స్టార్ ప్లేయర్లు కోవిడ్ టీకా తీసుకోకపోయినా 2022 ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడనిస్తామని ‘ఆల్ ఇంగ్లండ్ క్లబ్’ స్పష్టం చేసింది. అలాగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ కోర్టు నుంచి ‘కోవిడ్ ప్రొటోకాల్’ కూడా అవుట్ అయింది. దీంతో క్వారంటైన్, నిర్బంధ టెస్టులు, నిబంధనలు ఈసారి ఉండబోవు. ప్రేక్షకులు రెండేళ్ల తర్వాత తమకెంతో ఇష్టమైన వింబుల్డన్ టోర్నీలో మ్యాచ్‌లను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు. కరోనాతో 2020 వింబుల్డన్ టోర్నీ రద్దవగా, గతేడాది టోర్నీని ప్రేక్షకుల్లేకుండా నిర్వహించారు.
NASSCOM: నాస్కామ్ చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్‌పర్సన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ కృష్ణన్ రామానుజం నియమితులయ్యారు. 2022–23 సంవత్సరానికిగాను ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన నాస్కామ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. టీసీఎస్ ఎంటర్‌ప్రైస్ గ్రోత్ గ్రూప్‌నకు కృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. నాస్కామ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
చంద్రశేఖరన్‌కు మళ్లీ బాధ్యతలు
ప్రయివేట్ రంగ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్‌కు మరో ఐదేళ్లపాటు ఎన్.చంద్రశేఖరన్ బాధ్యతలు నిర్వహించనున్నారు. చైర్మన్‌గా 2027 ఫిబ్రవరివరకూ కొనసాగేందుకు తాజాగా వాటాదారులు ఆమోదముద్ర వేశారు. టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ, ప్రమోటర్ టాటా సన్స్‌కు ఇప్పటికే చంద్రశేఖరన్ నేతృత్వం వహిస్తున్నారు.
2016 నుంచీ కీలక బాధ్యతల్లో..
చంద్రశేఖరన్ 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ బోర్డులో చేరారు. 2017 జనవరిలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది ఫిబ్రవరి నుంచీ అధికారికంగా నేతృత్వం వహిస్తున్నారు. గ్రూప్‌లోని దిగ్గజాలు టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్ బోర్డులకు సైతం అధ్యక్షత వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్‌పర్సన్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ కృష్ణన్ రామానుజం
ఎక్కడ : న్యూఢిల్లీ
Saansad Adarsh Gram Yojana: ఆదర్శ గ్రామాల్లో మొదటి పది గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవి?
జాతీయస్థాయిలో గ్రామీణాభివృద్ధి రంగంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పదికి పది ఆదర్శ గ్రామాలు రాష్ట్రానికి చెందినవే. టాప్–10 ఆదర్శ గ్రామాలతోపాటు టాప్–20లో 19 గ్రామాలు రాష్ట్రానికి చెందినవే. ఈ మేరకు తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇప్పటికే స్వచ్ఛ ఈ–పంచాయతీ, ఈ–ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిత వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
ఇదీ పథకం..: పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల్లోని లేదా దేశంలోని ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసేలా రూపొందించిన పథకమే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన. ఆ గ్రామాల అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది.
దేశంలో టాప్–10 ఆదర్శ గ్రామాలివే.. |
||
సంఖ్య |
గ్రామం |
మొత్తం వంద మార్కులకు వచ్చిన స్కోరు |
1 |
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని వడపర్తి |
92.17 |
2 |
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ |
91.7 |
3 |
నిజామాబాద్ జిల్లాలోని పల్డా |
90.95 |
4 |
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ |
90.94 |
5 |
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక |
90.57 |
6 |
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ |
90.49 |
7 |
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ |
90.47 |
8 |
నిజామాబాద్ జిల్లాలోని తానాకుర్దు |
90.3 |
9 |
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్‌నూర్ |
90.28 |
10 |
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి |
90.25 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆదర్శ గ్రామాల్లో మొదటి పది గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందున..
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు జెపార్డ్ గన్స్ పంపుతామని ప్రకటించిన దేశం?
ఉక్రెయిన్‌తో సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉందని రష్యా అభిప్రాయపడింది. ఉక్రెయినే తన తీరుతో ఆ దిశగా రెచ్చగొడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అణు యుద్ధ ముప్పును అస్సలు కొట్టిపారేయలేమని ఏప్రిల్ 26న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఘాటు హెచ్చరికలు చేశారు.
40 దేశాల మంత్రుల భేటీ
ఉక్రెయిన్‌కు కావాల్సినంత సైనిక సాయం అందిస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు. 40 దేశాలరక్షణ మంత్రులు, అధికారులతో జర్మనీలో ఆయన సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్‌కు 500 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు పంపేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. అత్యాధునిక జెపార్డ్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ పంపుతామని జర్మనీ ప్రకటించింది.
శాంతియుత పరిష్కారమే కోరుతున్నాం: గుటెరస్‌తో పుతిన్
సంక్షోభానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో ఆయన రష్యా రాజధాని మాస్కోలో భేటీ అయ్యారు. ఇప్పటికైనా క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని డోన్బాస్‌కు స్వాతంత్య్రాన్ని ఉక్రెయిన్ గుర్తించాలని పుతిన్ పేర్కొన్నారు. గుటెరస్ అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కూడా భేటీ అయ్యారు. యుద్ధాన్ని తక్షణం విరమించాలని సూచించారు.
ఉక్రెయిన్‌లో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ ఏప్రిల్ 24న ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై సంఘీభావం ప్రకటించారు. రష్యాతో యుద్ధంలో విజయం సాధించాలన్న ఉక్రెయిన్ లక్ష్యసాధనకు పూర్తిగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఫారిన్ మిలిటరీ ఫైనాన్సింగ్ కింద ఉక్రెయిన్‌కు మరో 32.2 కోట్ల డాలర్లు అందజేస్తామని తెలిపారు. 16.5 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయిస్తామని వెల్లడించారు.
రెజినా డైలాగ్ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన నగరం?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని భారత రాజధాని నగరం న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘రైజినా డైలాగ్–2022’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్ విదేశాంగ మంత్రులు, స్వీడన్ మాజీ ప్రధాని ప్రశ్నలకు ఈ మేరకు సమాధానమిచ్చారు.చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 26 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్