Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 26 కరెంట్‌ అఫైర్స్‌

daily-current-affairs-PDF

Military Budget: రక్షణ వ్యయంలో రెండో స్థానంలో ఉన్న దేశం ఏది?

ప్రపంచదేశాలు సైనికపరంగా చేస్తున్న వ్యయం మొట్టమొదటిసారిగా ఏకంగా 2 ట్రిలియన్‌ డాలర్లను(2 లక్షల కోట్ల డాలర్లు) మించిపోయింది. స్వీడన్‌కు చెందిన సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి–ఎస్‌ఐపీఆర్‌ఐ) ఈ మేరకు వెల్లడించింది. ఎస్‌ఐపీఆర్‌ఐ వెల్లడించిన వివరాల ప్రకారం..

  • సైనికపరంగా చేస్తున్న ఖర్చులో అమెరికా, చైనా, భారత్‌ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • 2021లో ప్రపంచ సైనిక వ్యయం 0.7 శాతం పెరిగి 2,113 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇందులో 62 శాతం వాటా అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యాలదే. అమెరికా, చైనా వాటాయే ఏకంగా 52 శాతం.
  • 2021లో అమెరికా 801 బిలియన్‌ డాలర్లు, చైనా 293 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 76.6 బిలియన్‌ డాలర్లు రక్షణపై వెచ్చించాయి.
  • ఆసియా–ఓసియానియా ప్రాంత దేశాల సైనిక వ్యయం 586 బిలియన్‌ డాలర్లు. ఇందులో భారత్‌–చైనాల వాటాయే ఏకంగా 63 శాతం. అయితే ఇది 2020 కంటే 1.4 శాతం తక్కువ.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సైనికపరంగా చేస్తున్న ఖర్చులో అమెరికా, చైనా, భారత్‌ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఎప్పుడు : ఏప్రిల్‌ 25
ఎవరు    : స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి–ఎస్‌ఐపీఆర్‌ఐ)
ఎక్కడ    : ప్రపంచంలో..​​​​​​​French Presidential Election: ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా వరుసగా రెండోసారి ఎన్నికైన నేత?

ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఏప్రిల్‌ 24న జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్‌ బ్రాండ్‌ నాయకురాలు మరీన్‌ లీ పెన్‌ (53)పై మాక్రాన్‌ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్‌ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో మాక్రాన్‌ 66 శాతం ఓట్లు సాధించారు.

ఫ్రాన్స్‌..
రాజధాని:
పారిస్‌; కరెన్సీ: యూరో, సీఎఫ్‌పీ ఫ్రాంక్‌
అధికార భాష: ఫ్రెంచ్‌
ప్రస్తుత అధ్యక్షుడు: ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌
ప్రస్తుత ప్రధానమంత్రి: జీన్‌ కాస్టెక్స్‌
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా వరుసగా రెండోసారి ఎన్నికైన నేత?
ఎప్పుడు : ఏప్రిల్‌ 25
ఎవరు    : ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ 
ఎందుకు : ఏప్రిల్‌ 24న జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్‌ బ్రాండ్‌ నాయకురాలు మరీన్‌ లీ పెన్‌పై మాక్రాన్‌ విజయం సాధించడంతో..

Tourist Visa: ఏ దేశ పర్యాటక వీసాలను భారత్‌ సస్పెండ్‌ చేసింది?

చైనీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్‌ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ (ఐఏటీఏ) ఏప్రిల్‌ 24న ఈ మేరకు వెల్లడించింది. చైనీయులకు జారీ చేసిన పదేళ్ల కాల పరిమితితో కూడిన పర్యాటక వీసాలు కూడా చెల్లబోవని పేర్కొంది. చైనా వర్సిటీల్లో 22 వేల దాకా భారత స్టూడెంట్లు చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో 2020లో తిరిగొచ్చిన వాళ్లను నేటికీ చైనా తిరిగి తమ దేశంలో అడుగు పెట్టనివ్వడం లేదు. వారి భవిష్యత్తు దృష్ట్యా సానుభూతితో ఆలోచించాలని చైనాకు భారత్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రి జై శంకర్‌ కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో దీన్ని ప్రస్తావించారు. అయినా లాభం లేకపోవడంతో భారత్‌ తాజాగా వీసాల సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకుంది.

16 యూట్యూబ్‌ చానెళ్లపై కేంద్రం నిషేధం
దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు, శాంతిభద్రతలకు భంగకరంగా మారాయం టూ భారత్, పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే 16 యూట్యూబ్‌ చానెళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిలో ఎంఆర్‌ఎఫ్‌ టీవీ లైవ్, సైని ఎడ్యుకేషన్‌ రీసెర్చ్, తహఫ్ఫుజ్‌–ఇ–డీన్‌ ఇండియా, ఎస్‌బీబీ న్యూస్, పాక్‌ నుంచి పనిచేసే ఆజ్‌తక్‌ పాకిస్తాన్, డిస్కవరీ పాయింట్, ది వాయిస్‌ ఆఫ్‌ ఆసియా తదితరాలున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చైనీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం  
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : భారత్‌
ఎందుకు : చైనా వర్సిటీల్లో చదువుతున్న భారత స్టూడెంట్ల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో..

European Commission: ప్రధాని మోదీతో ఈసీ చీఫ్‌ ఉర్సులా ఎక్కడ భేటీ అయ్యారు?

PM Modi - Ursula von der Leyen

యూరోపియన్‌ యూనియన్‌–ఇండియా ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్‌ కమిషన్‌(ఈసీ) అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ అంగీకారం తెలిపారు. భారత్‌లో పర్యటిస్తున్న ఉర్సులా ఏప్రిల్‌ 25న న్యూఢిల్లీలో మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకొనేందుకు ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించారు.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో కూడా ఉర్సులా సమావేశమయ్యారు. భారత్, ఈయూ సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తర్వాత రైసినా డైలాగ్‌ కార్యక్రమంలో ఉర్సులా మాట్లాడారు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యంగా మారుతుందన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 25
ఎవరు    : యూరోపియన్‌ కమిషన్‌(ఈసీ) అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : యూరోపియన్‌ యూనియన్‌–ఇండియా ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఏర్పాటు విషయమై చర్చించేందుకు..

Table Tennis: టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌?

Sreeja Akula

83వ జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌–2022 మహిళల సింగిల్స్‌లో తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. ఏప్రిల్‌ 25న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ వేదికగా మహిళల జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్‌ స్టార్‌ ప్లేయర్, మౌమా దాస్‌పై విజయం సాధించింది. దీంతో గత ఏడాది సింగిల్స్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ 23 ఏళ్ల శ్రీజ ఈసారి చాంపియన్‌గా అవతరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హైదరాబాద్‌ బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీజ ఈ మెగా ఈవెంట్‌లో ఆర్‌బీఐ తరఫున బరిలోకి దిగింది.

బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల మౌమా దాస్‌ ఐదుసార్లు జాతీయ సింగిల్స్‌ చాంపియన్‌గా నిలువడంతోపాటు అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ భారత, ఆసియా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.

మహిళల డబుల్స్‌లోనూ..
మహిళల డబుల్స్‌ విభాగంలోనూ శ్రీజ విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–అహిక ముఖర్జీ (ఆర్‌బీఐ) ద్వయం 3–11, 11–9, 11–5, 12–10తో రైల్వేస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ)కు చెందిన టకేమి సర్కార్‌–ప్రాప్తి సేన్‌ జోడీపై గెలిచింది.

తొలి తెలంగాణ ప్లేయర్‌గా..

  • తాజా విజయంతో శ్రీజ జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌(మహిళల సింగిల్స్‌ విభాగంలో)గా ఘనత వహించింది.
  • గతంలో హైదరాబాద్‌కు చెందిన సయీద్‌ సుల్తానా ఆరుసార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) జాతీయ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. అయితే సుల్తానా కుటుంబం 1956లో హైదరాబాద్‌ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిర పడింది.
  • పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన మీర్‌ ఖాసిమ్‌ అలీ రెండుసార్లు (1968, 1969) చాంపియన్‌గా నిలిచారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌(మహిళల సింగిల్స్‌ విభాగంలో)గా గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్‌ 25
ఎవరు    : ఆకుల శ్రీజ
ఎక్కడ    : షిల్లాంగ్, మేఘాలయ
ఎందుకు : 83వ జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌–2022 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్‌ స్టార్‌ ప్లేయర్, మౌమా దాస్‌పై విజయం సాధించడంతో..

Social Network Company: ట్విటర్‌ను కొనుగొలు చేసిన కుబేరుడు ఎవరు?

Twitter - Elon Musk

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. ఈ మేరకు తాజాగా ఒప్పందం కుదిరింది. టేకోవర్‌ విలువ దాదాపు 44 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడైన మస్క్‌ సంపద విలువ ప్రస్తుతం 279 బిలియన్‌ డాలర్ల పైమాటే. టెస్లాలో అయనకు 17 శాతం వాటాలు ఉన్నాయి. ఇటీవలే  ట్విటర్‌లో 9.2 శాతం వాటాలను 2.9 బిలియన్‌ డాలర్లకు మస్క్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.

ట్విటర్‌ కథ ఇదీ.. 

  • అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సర్వీస్‌ ట్విటర్‌ను జాక్‌ డోర్సీ, బిజ్‌ స్టోన్, ఎవాన్‌ విలియమ్స్, నోవా గ్లాస్‌ కలిసి 2006లో ఏర్పాటు చేశారు.
  • కొన్ని పదాల్లో క్లుప్తంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడేలా దీన్ని ఉద్దేశించారు. 
  • ప్రస్తుతం దీనికి ప్రవాస భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
  • ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే ట్విటర్‌ యూజర్ల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ సెలబ్రిటీలు, ప్రపంచ నేతలు, జర్నలిస్టులు, మేధావులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  • స్వయంగా మస్క్‌కు 8.1 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
  • గతేడాది రెండో త్రైమాసికం గణాంకాల ప్రకారం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 7.7 కోట్ల పైచిలుకు ఉండగా.. భారత్‌లో వీరి సంఖ్య 2.36 కోట్ల స్థాయిలో ఉంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 25
ఎవరు    : ఎలాన్‌ మస్క్‌
ఎందుకు : ట్విటర్‌ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం మేరకు..

Insurance Industry: శాపియన్స్‌ ఇంటర్నేషనల్‌తో చేతులు కలిపిన సంస్థ?

Mindtree

బీమా రంగ సొల్యూషన్స్‌ అందించేందుకు ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ, విదేశీ సంస్థ శాపియన్స్‌ ఇంటర్నేషనల్‌ చేతులు కలిపాయి. ప్రాథమికంగా ఇన్సూరెన్స్‌ వ్యవస్థల(సిస్టమ్స్‌) అభివృద్ధికి డిజైన్‌ను అందించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. భాగస్వామ్యం ద్వారా తొలుత ఉత్తర అమెరికాపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశాయి. తదుపరి యూరప్, ఆసియాలలో విస్తరించే ప్రణాళికలున్నట్లు వెల్లడించాయి.

సైయంట్‌ చేతికి సైటెక్‌
గ్లోబల్‌ ప్లాంట్, ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ సర్వీసుల సంస్థ సైటెక్‌ను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల హైదరాబాద్‌ కంపెనీ సైయంట్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా సుమారు రూ. 800 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా బిజినెస్‌ ఆఫరింగ్స్‌ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. 1984లో ఏర్పాటైన సైటెక్‌ అంతర్జాతీయ ప్లాంట్, ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ సర్వీసులను అందిస్తోంది.

ఇన్వెస్టర్లలో చైతన్యానికి యాంఫీ టీవీ కార్యక్రమాలు
ఇన్వెస్టర్లకు మార్కెట్లలో అస్థిరతలు, పెట్టుబడులపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి).. మూడు టెలివిజన్‌ వాణిజ్య చిత్రాలను రూపొందించింది. సచిన్‌ టెండుల్కర్, మిథాలీరాజ్‌ ఇందులో నటించారు. మోసపూరిత పథకాలు, నూతనతరం ధోరణలపై పెట్టుబడులతో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో అవగాహన కల్పించడం.. మ్యూచువల్‌ ఫండ్స్‌ మాదిరి నియంత్రణ మార్గాల్లోకి పెట్టుబడులు మళ్లించుకునేలా వారిని ప్రోత్సహించే సమాచారంతో వీటిని రూపొందించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
విదేశీ సంస్థ శాపియన్స్‌ ఇంటర్నేషనల్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు  : ఏప్రిల్‌ 25
ఎవరు    : ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ 
ఎందుకు : బీమా రంగ సొల్యూషన్స్‌ అందించేందుకు..

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నూతన అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు కానుంది?

MIDHANI - NALCO

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్‌ (మిధానీ)లు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూ మినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ కర్మాగారం ఏర్పాటు కానుంది.  రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్‌ టన్నులు.

నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్‌ కుమార్‌ ఝా ఏప్రిల్‌ 25న సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. రెండున్నరేళ్ల లోగా పరిశ్రమ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ కర్మాగారం ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 25
ఎవరు    : నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్‌ (మిధానీ)
ఎక్కడ    : బొడ్డువారిపాలెం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 25 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Apr 2022 06:26PM

Photo Stories