Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 25 కరెంట్‌ అఫైర్స్‌

current-affairs-in-telugu

Wrestling: ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయుడు?

Ravi Kumar Dahiya

మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌ వేదికగా జరుగుతున్న ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022 పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగం పోటీల్లో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. ఏప్రిల్‌ 23న ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో 24 ఏళ్ల రవి ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్‌ కల్జాన్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్‌గా రవి రికార్డు నెలకొల్పాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు.

బజరంగ్‌ పూనియాకు రజతం
ఏప్రిల్‌ 23న ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓవరాల్‌గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా (65 కేజీలు), గౌరవ్‌ బలియాన్‌ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్‌ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్‌ కాంస్య పతకాలు గెలిచారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 23
ఎవరు    : రవి కుమార్‌ దహియా
ఎక్కడ    : ఉలాన్‌బాటర్, మంగోలియా
ఎందుకు : 57 కేజీల విభాగం ఫైనల్లో రవి ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో 12–2తో రఖత్‌ కల్జాన్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందడంతో..

Turkey: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీలో స్వర్ణం గెలిచిన జట్టు?

India Team - Archery

టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌–2022లో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఏప్రిల్‌ 23న జరిగిన పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో రజత్‌ చౌహాన్, అమన్‌ సైనీ, అభిషేక్‌ వర్మలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. జీన్‌ ఫిలిప్, బేరర్, అడ్రియన్‌లతో కూడిన ఫ్రాన్స్‌ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్‌ 232–231తో విజయం సాధించింది.

ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు రజతం
ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌–2022లో భారత్‌కు తొలి పతకం లభించింది. ఇటలీ వేదికగా ఏప్రిల్‌ 23న జరిగిన పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్, వివాన్‌ కపూర్, పృథ్వీరాజ్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో భారత్‌ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌–2022లో స్వర్ణం గెలిచిన జట్టు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 23
ఎవరు    : రజత్‌ చౌహాన్, అమన్‌ సైనీ, అభిషేక్‌ వర్మలతో కూడిన భారత జట్టు
ఎక్కడ    : అంటాల్యా, టర్కీ
ఎందుకు : పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టు 232–231తో జీన్‌ ఫిలిప్, బేరర్, అడ్రియన్‌లతో కూడిన ఫ్రాన్స్‌ జట్టుపై గెలిచినందున..​​​​​​​

Carbon Neutral Panchayat: దేశంలోనే తొలి కార్బన్‌ రహిత పంచాయతీ ఏది?

Modi

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం(ఏప్రిల్‌ 24) సందర్భంగా ఏప్రిల్‌ 24న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని పల్లి గ్రామాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇక్కడ 500 కిలోవాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఆరంభించి జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోనే తొలి కార్బన్‌ రహిత(కార్బన్‌ న్యూట్రల్‌) పంచాయతీగా పల్లి గ్రామ పంచాయతీ చరిత్రకెక్కింది. ఈ సోలార్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులో భాగంగా 6,408 మీటర్ల ప్రాంతంలో 1,500 సోలార్‌ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. దీనివల్ల 340 గృహాలకు పర్యావరణ హితమైన విద్యుత్‌ లభిస్తుంది. గ్రామ్‌ ఊర్జా స్వరాజ్‌ ప్రోగ్రాం కింద రూ. 2.75 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు.

రూ. 20వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
పల్లి గ్రామం నుంచే దేశవ్యాప్తంగా గ్రామసభలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశానికి కార్బన్‌ రహిత మార్గాన్ని పల్లి చూపుతుందని ఆయన చెప్పారు. స్థానిక ప్రజల సహకారంతోనే ఈ సోలార్‌ ప్రాజెక్టు సాకారమైందన్నారు. 370వ అధికరణ రద్దు తర్వాత ప్రధాని మోదీ కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పల్లి గ్రామం నుంచే.. దాదాపు రూ. 20వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు వర్చువల్‌ విధానం ద్వారా మోదీ శంకుస్థాపన చేశారు. వీటిలో బనిహాల్‌– ఖాజీగుండ్‌ రోడ్‌ టన్నెల్‌ కూడా ఉంది. దీనివల్ల ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీకి ఇబ్బంది ఉండదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలోనే తొలి కార్బన్‌ రహిత(కార్బన్‌ న్యూట్రల్‌) పంచాయతీగా అవతరించిన గ్రామ పంచాయతీ
ఎప్పుడు : ఏప్రిల్‌ 23
ఎవరు    : పల్లి గ్రామ పంచాయతీ
ఎక్కడ    : పల్లి గ్రామ పంచాయతీ, సాంబా జిల్లా, జమ్మూ,కశ్మీర్‌
ఎందుకు : పల్లి గ్రామంలో.. 500 కిలోవాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఆరంభించిన నేపథ్యంలో..

Lata Mangeshkar: లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు తొలి గ్రహీత ఎవరు?

PM Modi

ప్రముఖ నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ స్మృత్యర్థం ఏర్పాటైన ‘‘లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు’’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. దీంతో లత మరణానంతరం ఆమె పేరిట నెలకొల్పిన ఈ అవార్డు తొలిగ్రహీతగా మోదీ నిలిచారు. ఏప్రిల్‌ 24న లత తండ్రి వర్ధంతి సందర్భంగా అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ముంబైలో ఈ కార్యక్రమం జరిగింది. ఇకపై ప్రతి ఏటా దేశానికి ఎనలేని సేవలనందించినవారికి ఈ అవార్డు నందిస్తామని దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ స్మృతి ప్రతిష్ఠాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రకటించింది.

డిజిటల్‌ లావాదేవీలు.. రోజుకు రూ. 20వేల కోట్లు 
దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్‌ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఏప్రిల్‌ 24న ఆయన మన్‌ కీ బాత్‌లో ఈ మేరకు ప్రసంగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు తొలి అవార్డు ప్రదానం
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ స్మృతి ప్రతిష్ఠాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశానికి సేవలనందించినందున..

HIV/AIDS: ఎయిడ్స్‌ బాధితుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?​​​​​​​

HIV-AIDS

దేశంలో గత పదేళ్లలో 17,08,777 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ(ఎన్‌ఏసీఓ) సంస్థ వెల్లడించింది. అరక్షిత శృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్‌ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని ఏప్రిల్‌ 24న తెలిపింది. ఎన్‌ఏసీఓ తెలిపిన వివరాల ప్రకారం..

  • ఎయిడ్స్‌ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్‌లో 87,440 హెచ్‌ఐవీ కేసులు బయటపడ్డాయి.
  • 2011–12 నుంచి 2020–21 మధ్య రక్తం ద్వారా 15,782 మందికి హెచ్‌ఐవీ సోకింది.
  • తల్లి నుంచి బిడ్డకు సోకిన కేసులు గత పదేళ్లలో 4,423 బయటపడ్డాయి.
  • 2020 నాటికి 23,18,737 హెచ్‌ఐవీ బాధితులున్నారు. వీరిలో 81,430 మంది పిల్లలు.

హెచ్‌ఐవీ వైరస్‌ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎయిడ్స్‌కు దారితీస్తుంది. ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేసే ప్రామాణికమైన చికిత్స ఇప్పటిదాకా అందుబాటులో లేదు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిడ్స్‌ బాధితుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : అరక్షిత శృంగారం కారణంగా..

Russia-Ukraine war: ఉక్రెయిన్‌కు జావెలిన్‌ క్షిపణులను సరఫరా చేసిన దేశం?

javelin missiles

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్‌ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అంతేగాక రష్యాకు కనీవినీ ఎరగని స్థాయిలో నష్టాలు కలిగించింది. అగ్రరాజ్యం అమెరికా పుష్కలంగా అందిస్తున్న అండదండలే ఇందుకు చాలావరకు కారణం. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకున్నా ఉక్రెయిన్‌కు భారీగా సాయుధ సాయం చేస్తోంది.

ప్రధానంగా యూఎస్‌ నుంచి వస్తున్న ఆయుధాలతోనే రష్యా దాడులను ఉక్రెయిన్‌ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది. ఈ రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు అమెరికా ఏకంగా 340 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేసింది. ఎనిమిదో విడత సాయంగా తాజాగా మరో 80 లక్షల డాలర్ల ఆర్థిక సాయం కూడా అందించింది. వాటికి తోడు ఇంకా భారీగా ఆయుధాలను పంపుతోంది.

  • రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్‌ సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అమెరికా పంపిన జావెలిన్‌ క్షిపణులు. సులువుగా భుజం మీద మోసుకెళ్లగలిగే ఈ పోర్టబుల్‌ క్షిపణుల సాయంతో పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించవచ్చు. ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 6,000 జావెలిన్‌ యాంటీ ట్యాంక్‌ మిస్సైళ్లను సరఫరా చేసింది. ఇవే రష్యా సైన్యానికి పెను సవాలుగా మారాయి.
  • 1,44,000 రౌండ్లను కాల్చే సామర్థ్యమున్న డజన్ల కొద్దీ అత్యాధునిక శతఘ్నులను కూడా అమెరికా అందజేసింది. 
  • అఫ్గానిస్తాన్‌ యుద్ధంలో వాడిన మరెన్నో అత్యాధునిక రైఫిల్స్, 3 వేలకుపైగా బాడీ ఆర్మర్‌ సెట్స్, హెలికాఫ్టర్లు, రాడార్‌ వ్యవస్థలు, సాయుధ వాహనాలను కూడా భారీగా పంపింది. 
  • వందల సంఖ్యలో 200 ఎం113 సాయుధ వాహనాలను సమకూర్చింది. 90 శతఘ్ని విధ్వంసక వ్యవస్థలను కూడా ఇచ్చింది. దాంతో ఉక్రెయిన్‌కు రష్యా హెలికాప్టర్లను కూల్చే సామర్థ్యం సమకూరింది. 
  • రష్యా శతఘ్నల్ని ఎదుర్కోనేలా 10 రాడార్‌ వ్యవస్థలను కూడా పంపింది. 
  • అత్యాధునిక ఎంఐ–17 హెలికాప్టర్లను పంపేందుకు కూడా అమెరికా సన్నాహాలు చేస్తోంది. 
  • 4 కోట్ల రౌండ్ల చిన్న మారణాయుధాలు, భారీగా అత్యాధునిక రైఫిల్స్, పిస్టల్స్, మిషన్‌ గన్లు, షాట్‌ గన్స్, 10 లక్షలకు పైగా గ్రెనేడ్లు ఈ 2 నెలల్లో యూఎస్‌ నుంచి అందాయి. 
  • తూర్పున డోన్బాస్‌లో రష్యా దాడుల్ని ముమ్మరం చేస్తూండటంతో ఉక్రెయిన్‌ అవసరాలకు తగ్గట్టుగా అమెరికా వాయుసేన ప్రత్యేకంగా తయారు చేసిన 121 డ్రోన్లను తాజాగా పంపింది. మరో 300 స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లు కూడా ఇప్పటికే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ చేరుకున్నాయి.

Archery: ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత జోడీ?

Tarundeep Rai, Ridhi

టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌–2022లో చివరి రోజు ఏప్రిల్‌ 24న భారత్‌కు రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో పసిడి పతకం లభించింది. ఫైనల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌–రిధి (భారత్‌) ద్వయం 5–4తో ‘షూట్‌ ఆఫ్‌’లో బ్రయని పిట్మాన్‌–అలెక్స్‌ వైజ్‌ (బ్రిటన్‌) జోడీపై గెలిచి.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రి విజేత?
ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ రెండో విజయం సాధించాడు. ఇటలీలోని ఇమోలా నగరం వేదికగా ఏప్రిల్‌ 24న జరిగిన ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 63 ల్యాప్‌ల రేసును పోల్‌ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 32 నిమిషాల 07.986 సెకన్లలో ముగించి కెరీర్‌లో 22వ విజయాన్ని అందుకున్నాడు. రెడ్‌బుల్‌కే చెందిన  పెరెజ్‌ రెండో స్థానంలో నిలిచాడు. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌)కు మూడో స్థానం దక్కింది. సీజన్‌లోని తదుపరి రేసు మయామి గ్రాండ్‌ప్రి మే 6న జరుగుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌–2022లో స్వర్ణం గెలిచిన భారత జోడీ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : తరుణ్‌దీప్‌ రాయ్‌–రిధి ద్వయం
ఎక్కడ    : అంటాల్యా, టర్కీ
ఎందుకు : ఫైనల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌–రిధి (భారత్‌) ద్వయం 5–4తో ‘షూట్‌ ఆఫ్‌’లో బ్రయని పిట్మాన్‌–అలెక్స్‌ వైజ్‌ (బ్రిటన్‌) జోడీపై గెలిచినందున..

Wrestling: ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన ఆటగాడు?

Deepak Punia

ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో భారత యువ రెజ్లర్‌ దీపక్‌ పూనియాకు రజత పతకం లభించింది. మంగోలియా రాజధాని నగరం ఉలాన్‌బాటర్‌ వేదికగా ఏప్రిల్‌ 24న ముగిసిన ఈ టోర్నీ 86 కేజీల విభాగం ఫైనలో 23 ఏళ్ల దీపక్‌ 1–6తో అజామత్‌ దౌలత్‌బెకోవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయి.. రజతంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో దీపక్‌కిది నాలుగో పతకం. 2021లోనూ రజతం నెగ్గిన దీపక్, 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు.

మరోవైపు 92 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన విక్కీ కాంస్య పతకం గెలిచాడు. 61 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మంగళ్‌ (భారత్‌) 4–6తో ఉలుక్‌బెక్‌ (కిర్గిజిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత్‌కు మొత్తం 17 పతకాలు లభించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో రజతం గెలిచిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : భారత యువ రెజ్లర్‌ దీపక్‌ పూనియా
ఎక్కడ    : ఉలాన్‌బాటర్, మంగోలియా
ఎందుకు : 86 కేజీల విభాగం ఫైనలో 23 ఏళ్ల దీపక్‌ 1–6తో అజామత్‌ దౌలత్‌బెకోవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయినందున..

Chess: మెనోర్కా ఓపెన్‌ టోర్నీలో టైటిల్‌ సాధించిన ఆటగాడు?

D Gukesh

భారత చెస్‌ యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ స్పెయిన్‌లోని మెనోర్కా వేదికగా జరిగిన మెనోర్కా ఓపెన్‌ టోర్నెమెంట్‌–2022లో టైటిల్‌ సాధించాడు. నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన మెనోర్కా ఓపెన్‌లో గుకేశ్‌ ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించగా... భారత్‌కే చెందిన నిహాల్‌ సరీన్‌ ఐదో ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ ఆరో ర్యాంక్‌లో నిలిచారు. తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల గుకేశ్‌  2022, ఏప్రిల్‌ 17న లా రోడా ఓపెన్‌లోనూ విజేతగా నిలిచాడు.

ఏ దేశ వర్సిటీల్లో కో–ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించారు?
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలపై ఆంక్షలను మరింత పెంచుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినీ విద్యార్థులు కలిసి చదువుకోవడంపై తాజాగా నిషేధం విధించారు. వర్సిటీల్లో కో–ఎడ్యుకేషన్‌కు ఇక అనుమతి లేదన్నారు. వారంలో వారంలో మొదటి మూడు రోజులు అమ్మాయిలకు, తర్వాతి మూడు రోజులు అబ్బాయిలకు పాఠాలు బోధించాలని ఆదేశించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మెనోర్కా ఓపెన్‌ టోర్నెమెంట్‌–2022లో టైటిల్‌ సాధించిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : దొమ్మరాజు గుకేశ్‌
ఎక్కడ    : మెనోర్కా, స్పెయిన్‌
ఎందుకు : నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన మెనోర్కా ఓపెన్‌లో గుకేశ్‌ ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించినందున..​​​​​​​​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 23 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Apr 2022 07:39PM

Photo Stories