Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 23 కరెంట్ అఫైర్స్
Wrestling: భారత క్రీడాకారిణి అన్షు మలిక్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
మంగోలియా రాజధాని నగరం ఉలాన్‌బాటర్ వేదికగా జరుగుతోన్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్–2022 మహిళల విభాగంలో ఏప్రిల్ 22న భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ అన్షు మలిక్ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... మనీషా (62 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సుగుమి సకురాయ్ (జపాన్)తో జరిగిన ఫైనల్లో అన్షు 0–4తో ఓడిపోయింది.
ఐదుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో 65 కేజీల విభాగంలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్‌లు నిర్వహించారు. భారత రెజ్లర్ రాధిక మూడు బౌట్‌లలో గెలిచి, ఒక బౌట్‌లో ఓడిపోయి రెండో స్థానంతో రజతం నెగ్గింది. 62 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మనీషా 4–2తో హన్‌బిట్ లీ (కొరియా)పై గెలిచింది.
ఫైనల్లో తరుణ్‌దీప్–రిధి జోడీ
టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్–2022లో రికర్వ్ మిక్స్‌డ్ విభాగంలో తరుణ్‌దీప్ రాయ్–రిధి (భారత్) జంట ఫైనల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్ 22న జరిగిన సెమీఫైనల్లో తరుణ్‌దీప్–రిధి ద్వయం 5–3తో అల్వరినో గార్సియా–ఇలియా కానాలెస్ (స్పెయిన్) జోడీపై గెలిచింది. ఏప్రిల్ 24న స్వర్ణ–రజత పతకం కోసం జరిగే ఫైనల్లో బ్రయని పిట్మాన్–అలెక్స్ వైజ్ (బ్రిటన్) జంట తో భారత్ జోడీ తలపడుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్–2022 మహిళల విభాగంలో భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : అన్షు మలిక్ (57 కేజీలు–రజతం), రాధిక (65 కేజీలు–రజతం), మనీషా (62 కేజీలు–కాంస్యం)
ఎక్కడ : ఉలాన్‌బాటర్, మంగోలియా
Omega Seiki Mobility: ఓఎస్‌ఎం త్రీవీలర్ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సైకీ మొబిలిటీ (ఓఎస్‌ఎం) తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాంటును కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. దాదాపు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,900 కోట్లు)తో 250 ఎకరాల స్థలంలో 10 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంటును మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఏప్రిల్ 22న ఒమేగా సైకీ మొబిలిటీ వ్యవస్థాపక చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. రేజ్‌ప్లస్ ఫ్రాస్ట్, రేజ్‌ప్లస్ తదితర త్రీ వీలర్లను కొత్త ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆగ్నేయాసియా దేశాలు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య మార్కెట్ల కోసం వాహనాలను మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఒమేగా సైకీ మొబిలిటీ (ఓఎస్‌ఎం)
ఎక్కడ : కర్ణాటక
ఎందుకు : రేజ్‌ప్లస్ ఫ్రాస్ట్, రేజ్‌ప్లస్ తదితర త్రీ వీలర్ల ఉత్పత్తి కోసం..
Cement Supply: దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా ప్రారంభించిన సంస్థ?
సిమెంట్ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్ గ్రూప్ నాంది పలికాయి. దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రారంభించాయి. ఇందుకోసం కాంకర్ గ్రూప్ రూపొందించిన 20 అడుగుల కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్ కంటైనర్స్‌ను భారతి సిమెంట్ వినియోగించింది. వికా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది. ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్ సిమెంట్‌తో కూడిన రైలు ఏప్రిల్ 22న ప్రారంభమైంది.
కర్బన్ ఉద్గారాల తగ్గుదల..
ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ‘బల్క్’ విధానంలో సిమెంట్ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్ టెర్మినల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : భారతి సిమెంట్
ఎక్కడ : ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్)– కోయంబత్తూరు(కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు)
ఎందుకు : రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని..
Niti Aayog: నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్‌కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో కొత్త వైస్ చైర్మన్‌గా సుమన్ కే బెరీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022, మే 1వ తేదీన బెరీ నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. సుమన్ కే బెరీ గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగానూ పనిచేశారు.
ప్రముఖ ఆర్థికవేత్త అయిన రాజీవ్ కుమార్ 2017 ఆగస్ట్‌లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వరకు అరవింద్ పనగరియా ఈ బాధ్యతలు చూశారు. ఆయన తిరిగి అధ్యాపక వృత్తి వైపు వెళ్లిపోవడంతో రాజీవ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలు కట్టబెట్టింది. వాస్తవానికి రాజీవ్‌కుమార్ పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. దీనికి కేవలం కొన్ని రోజులు ముందు ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : సుమన్ కే బెరీ
ఎందుకు : నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేసిన నేపథ్యంలో..
India-Britain: ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ ఎక్కడ సమావేశమయ్యారు?
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఏప్రిల్ 22న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సమావేశమయ్యారు. న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రత, అఫ్గాన్‌లో శాంతి స్థాపన, ఉక్రెయిన్–రష్యా యుద్ధం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
మోదీ, బోరిస్ భేటీ–ముఖ్యాంశాలు
- రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకారం.
- వచ్చే దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయం.
- భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయం.
- విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి.
మరికొన్ని అంశాలు..
- 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు.
- ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు.
- ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్‌పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. అలాగే నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు.
- ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని మోదీ స్వాగతించారు.
ఆర్థిక నేరాగాళ్ల అప్పగింత..
తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు.
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ జాన్సన్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
ఎక్కడ : న్యూ ఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రత, అఫ్గాన్‌లో శాంతి స్థాపన, ఉక్రెయిన్–రష్యా యుద్ధం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు..
Andhra Pradesh: వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన ‘‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’’ కింద మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని ఏప్రిల్ 22న ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కంప్యూటర్‌లో బటన్ నొక్కి కోటి 2 లక్షల 16 వేల 410 మంది మహిళల ఖాతాల్లో రూ.1,261 కోట్లు జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకం కింద ఈ మూడు సంవత్సరాల్లో రూ.3,615 కోట్లు అందజేశామని చెప్పారు. కేవలం ఈ 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు నేరుగా ప్రజల చేతుల్లో పెట్టామని సగర్వంగా చెబుతున్నానన్నారు.
పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం తొలుత 2020, ఏప్రిల్ 24న ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్నంతటినీ ఇకపై ప్రభుత్వమే భరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఎందుకు : పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు..
Journalist: ప్రముఖ రచయిత దేవులపల్లి ప్రభాకర్‌రావు కన్నుమూత
ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు(84) ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించిన ప్రభాకర్‌రావు ‘ప్రజాతంత్ర’వ్యవస్థాపకుల్లో ఒకరు. 2016 నుంచి తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ప్రజాసమితిలో కీలక భూమికను పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
యునెస్కో అవార్డు..
కవి, రచయిత అయిన ప్రభాకర్‌రావు ప్రజాతంత్రలో 10ఏళ్లపాటు గాంధీశకం శీర్షికతో గాంధీజీ జీవిత విశేషాలపైన వరుస కథనాలు రాశారు. ఆయన రచనా వ్యాసాంగానికి గుర్తింపుగా యునెస్కో అవార్డు లభించింది. ఉద్యమ ప్రస్థానంపై ఆయన రాసిన వ్యాససంపుటి ‘ఉస్మానియా నుంచి మానుకోట వరకు’తెలంగాణ ఉద్యమ చరిత్రను కళ్లకుకట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ ఉద్యమకారుడు కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : దేవులపల్లి ప్రభాకర్‌రావు(84)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా..
Nano Satellite: లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన సంస్థ?
వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్’ పేరుతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య తయారు చేసిన 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. 2022, మార్చి 15న లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి బీ2 స్పేస్ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణంలోకి పంపారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. లక్ష్య శాట్‌లోని అన్ని విభాగాలు ఎలాంటి లోపం లేకుండా పనిచేయటంతో ప్రయోగం విజయ వంతమైందని సాయి దివ్వ తెలిపారు. అక్కడ తొమ్మిది రకాల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహంతో సేకరించినట్లు తాజాగా వివరించారు.
ఎన్–స్పేస్ టెక్ సంస్థను ప్రారంభించి..
- బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయి దివ్య కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు.
- తన పీహెచ్‌డీ థీసిస్‌లో భాగంగా తెనాలిలోని తన నివాసంలోనే ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థను ప్రారంభించి.. ఉపగ్రహ తయారీని ఆరంభించారు. ఈ క్రమంలో లక్ష్య శాట్ పేరుతో ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు.
- ఉపగ్రహానికి సంబంధించిన పేలోడ్, ప్రోగ్రాం కోడింగ్, విద్యుత్ వినియోగం అంచనా, సమాచార సేకరణ వంటి అంశాలన్నింటిపైన పట్టు సాధించిన సాయి దివ్య వాటి ఆధారంగా 400 గ్రాముల లక్ష్య శాట్‌ను తయారు చేశారు. లక్ష్య శాట్‌కు రూ.2 లక్షల వరకు ఖర్చయిందని ఆమె తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 400 గ్రాముల లక్ష్య శాట్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : మార్చి 15, 2022
ఎవరు : ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థ స్థాపకురాలు కూరపాటి సాయి దివ్య
ఎక్కడ : యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి..చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 22 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్