Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 22 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu

Sikhism: సిక్కుల తొమ్మిదో గురువు ఎవరు?

PM Modi

తొమ్మిదో సిక్కు గురువు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 21న ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తేగ్‌ బహదూర్‌ స్మృత్యర్థం పోస్టుల్‌ స్టాంపు, నాణెం విడుదల చేశారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సహకారంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తేగ్‌ బహదూర్‌ సిక్కుల తొమ్మిదో గురువు. మత పరిరక్షణకు జీవితాన్నే త్యాగం చేశారు. తేగ్‌ బహదూర్‌కు మరణ శిక్ష విధించాలని మొగల్‌ పాదుషా ఔరంగజేబు 1675లో ఎర్రకోట నుంచే ఆదేశాలిచ్చేశారు. దానికి గుర్తుగా ఆయన సంస్మరణ సభకు మోదీ ఎర్రకోటను ఎంచుకున్నారు.

ప్రధాని ప్రసంగం–ముఖ్యాంశాలు..

  • భారత్‌ ఏ ఇతర దేశానికి, సమాజానికీ ఏనాడూ ముప్పుగా పరిణమించలేదు. మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌.
  • సిక్కు గురువుల ఆలోచనలను మన దేశం అనుసరిస్తోంది.
  • ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్‌గంజ్‌ సాహిబ్‌ గురు తేగ్‌ బహదూర్‌ చిరస్మరణీయ త్యాగానికి ప్రతీకగా నిలుస్తోంది.
  • మనదేశ గొప్ప సంస్కృతిని రక్షించేందుకు తేగ్‌ బహదూర్‌ చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పవిత్ర గురుద్వారా తెలియజేస్తోంది.
  • అప్పట్లో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లింది, మతం పేరిట సామాన్య ప్రజలపై హింసాకాండ సాగించారు. అలాంటి సమయంలో గురు తేగ్‌ బహదూర్‌ రూపంలో దేశానికి ఒక ఆలంబన దొరికింది.

15వ సివిల్‌ సర్వీసెస్‌ డే..
విధుల్లో భాగంగా తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికీ ‘నేషన్‌ ఫస్ట్‌–ఇండియా ఫస్ట్‌’ అనే వైఖరినే అనుసరించాలని సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 21న 15వ సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ఈ మేరకు ప్రసంగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగం
ఎప్పుడు: ఏప్రిల్‌ 21
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : తొమ్మిదో సిక్కు గురువు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా..

Gujarat: సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్‌ ప్రధాని?

Boris Johnson

ఇంగ్లండ్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన కోసం ఏప్రిల్‌ 21న భారత్‌కు వచ్చారు. ఇంగ్లండ్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టులో గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు సంప్రదాయ గుజరాతీ నృత్యాలు, సంగీతంతో బోరిస్‌కు స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని(గాంధీ ఆశ్రమం) బోరిస్‌ సందర్శించారు. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఇక్కడి హృదయ్‌కుంజ్‌లో బోరిస్‌ చరఖా తిప్పారు. ఆశ్రమం నిర్వాహకులు ఆయనకు చరఖాను బహూకరించారు. మహాత్మాగాంధీ అసాధారణ నాయకుడని బోరిస్‌ జాన్సన్‌ ఈ సందర్భంగా కొనియాడారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొట్టమొదటి బ్రిటిష్‌ ప్రధానమంత్రిగా బోరిస్‌ జాన్సన్‌ రికార్డుకెక్కారు.

జేసీబీ ఫ్యాక్టరీ ప్రారంభం

  • బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ 21న గుజరాత్‌లోని పంచమహల్స్‌ జిల్లా హలోల్‌లో నూతన జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు.
  • గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ సమీపంలో కొత్తగా నిర్మించిన గుజరాత్‌ బయోటెక్‌ యూనివర్సిటీ(జీబీయూ) క్యాంపస్‌ను ఆయన తిలకించారు.
  • గాంధీనగర్‌లో ప్రఖ్యాత అక్షరధామ్‌ ఆలయాన్ని బోరిస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ ఉన్నారు. 
  • అహ్మదాబాద్‌లో బోరిస్‌ జాన్సన్‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ సమావేశమయ్యారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్‌ ప్రధాని?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు    : ఇంగ్లండ్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ 
ఎక్కడ    : అహ్మదాబాద్, గుజరాత్‌
ఎందుకు : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా...​​​​​Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని ఏ కీలక నగరం రష్యా వశమైంది?

Vladimir Putin

ఉక్రెయిన్‌లోని కీలక నగరం మారియుపోల్‌ తమ వశమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏప్రిల్‌ 21న ప్రకటించారు. నగరంలో మిగిలిన ఉక్రెయిన్‌ బలగాలను వెతికే పని పెట్టుకోకుండా బయటనుంచి ఎలాంటి సాయం అందకుండా కట్టుదిట్టం చేయాలని తన సేనలకు సూచించారు. చాలారోజులుగా ఈ నగరాన్ని వశం చేసుకోవాలని రష్యా యత్నిస్తోంది. దీనివల్ల రష్యన్లకు క్రిమియాతో నేరుగా రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు దక్కిన తొలి పెద్ద విజయం ఇదే. అయితే నగరంలోని స్టీల్‌ ప్లాంట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు చెప్పారు.

ఇంకొన్ని విషయాలు..

  • రష్యా పౌర హననానికి పాల్పడుతుందంటూ లాట్వియా పార్లమెంట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రష్యా చమురు దిగుమతిని ఈయూ దేశాలు తక్షణం నిలిపివేయాలని కోరింది.
  • ఉక్రెయిన్‌ యుద్ధంలో సంధిని పాటించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ మరోమారు పిలుపునిచ్చారు. కాథలిక్‌ ఈస్టర్‌ సందర్భంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ పాటించాలన్న ఐరాస చీఫ్‌ విజ్ఞప్తితో ఏకీభవిస్తున్నానని తెలిపారు. 
  • రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్యదేశాలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని, అందువల్ల ఈయూలో చేరడంపై పునరాలోచిస్తామని సెర్బియా మంత్రి అలెక్సాండర్‌ చెప్పారు.  
  • ఆంక్షల భయంతో రష్యాలో బ్యాంకింగ్‌ సేవలకు చైనా క్రెడిట్‌ కార్డ్‌ సంస్థ యునియన్‌ పే వెనుకాడిందని వార్తలు వచ్చాయి. 
  • జెలెన్‌స్కీతో చర్చల కోసం స్పెయిన్, డెన్మార్క్‌ ప్రధానులు కీవ్‌కు వచ్చారు. 
  • లుహాన్స్‌క్‌ ప్రాంతంలో 80 శాతం ప్రస్తుతం రష్యా అధీనంలో ఉందని ఆ ప్రాంత గవర్నర్‌ వెల్లడించారు. రష్యా దాడికి ముందు ఇందులో 60 శాతం ఉక్రెయిన్‌ ఆధీనంలో, 40 శాతం తిరుగుబాటుదారుల అధీనంలో ఉండేది. 
  • ఉక్రెయిన్‌కు అదనపు మిలటరీ, ఆర్థిక సాయం అందించే ప్యాకేజీని జోబైడెన్‌ ప్రకటిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. 
  • యూఎస్‌కు చెందిన కెనడీ అవార్డుకు జెలెన్‌స్కీతో పాటు ఐదుగురిని ఎంపిక చేశారు.
  • ఉక్రెయిన్‌కు సాయాన్ని మరింత పెంచుతామని అమెరికా, వివిధ పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉక్రెయిన్‌లోని కీలక నగరం మారియుపోల్‌ తమ వశమైందని ప్రకటన
ఎప్పుడు  : ఏప్రిల్‌ 21
ఎవరు    : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 
ఎందుకు : రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో..

Wrestling: ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు గెలిచిన భారత అమ్మాయిలు?

Sarita Mor, Sushma Shokeen

మంగోలియా రాజధాని నగరం ఉలాన్‌బాటర్‌ వేదికగా జరగుతోన్న ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో ఏప్రిల్‌ 21న భారత అమ్మాయిలు రెండు కాంస్య పతకాలతో మెరిశారు. 59 కేజీల విభాగంలో సరిత మోర్, 55 కేజీల కేటగిరీలో సుష్మ షోకీన్‌ కంచు పతకాలు గెలిచారు. ఆరంభ బౌట్లలో ఓడినా తర్వాతి రెండు బౌట్‌లలో వరుసగా దిల్‌ఫుజా ఇంబెటొవా (ఉజ్బెకిస్తాన్‌)పై 11–0 తేడాతో (టెక్నికల్‌ సుపీరియార్టీ)...ఆ తర్వాత దియానా కయుమొవా (కజకిస్తాన్‌)పై 5–2తో సరిత గెలిచింది. సుష్మ కూడా ఇదే తరహాలో ఆల్టిన్‌ షగయెవా (కజకిస్తాన్‌)పై 5–0తో, ఆపై సర్బినాజ్‌ జెన్‌బెవా (ఉజ్బెకిస్తాన్‌)ను 12–0 తే డాతో ఓడించి కాంస్యం ఖాయం చేసుకుంది. ఈ వెంట్‌ పురుషుల విభాగంలో గ్రీకో రోమన్‌ రెజ్ల ర్లు ఇప్పటికే ఐదు కాంస్యాలు గెలవడంతో ఓవరాల్‌ గా భారత్‌ పతకాల సంఖ్య ఏడు కాంస్యాలకు చేరింది.

లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌గా ఎంపికైన ఆటగాడు?
ప్రతిష్టాత్మక ‘విజ్డెన్‌’ వార్షిక అత్యుత్తమ ఐదుగురు క్రికెటర్ల జాబితా–2022లో భారత ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు స్థానం లభించింది. ఇందులో రోహిత్, బుమ్రాలతో పాటు రాబిన్సన్, కాన్వే, డేన్‌ నికెర్క్‌ కూడా ఉన్నారు. 2021లో టెస్టుల్లో 1708 పరుగులు చేసిన జో రూట్‌ ‘లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌’గా ఎంపికయ్యాడు. ప్రధానంగా ఇంగ్లండ్‌ గడ్డపై చూపిన ప్రదర్శన ఆధారంగా ఈ ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో కాంస్య పతకాలు గెలిచిన భారత అమ్మాయిలు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు    : సరిత మోర్‌(59), సుష్మ షోకీన్‌(55)
ఎక్కడ    : ఉలాన్‌బాటర్, మంగోలియా

G20 Countries: ఏ దేశ అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది?

ఇండోనేషియా అధ్యక్షతన ఏప్రిల్‌ 21న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్ల సమావేశం జరిగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ భవిష్యత్‌ ఆర్థిక వృద్ధి తీరు, రిస్క్‌లు, అంతర్జాతీయ ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగిస్తూ.. ఆర్థిక వ్యవస్థలను కాపాడేందుకు చురుకైన, ఉమ్మడి చర్యల అవసరం ఉందన్నారు.

క్రిస్టలీనా జార్జీవాతో భేటీ
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఏప్రిల్‌ 18న వాషింగ్టన్‌కు నిర్మలా సీతారామన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలీనా జార్జీవాతో భేటీ అయ్యారు. అలాగే, అమెరికా వాణిజ్య మంత్రి గినారాయ్‌మోండోతో చర్చలు నిర్వహించారు. ఆర్థిక సహకార విస్తృతికి గల మార్గాలపై చర్చించారు. సెమీకండక్టర్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్, సీఈవో జాన్‌ నెఫర్‌ తోనూ సీతారామన్‌ సమావేశమయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండోనేషియా అధ్యక్షతన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్ల సమావేశం నిర్వహణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 21 
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అంతర్జాతీయ భవిష్యత్‌ ఆర్థిక వృద్ధి తీరు, రిస్క్‌లు, అంతర్జాతీయ ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు..

Ministry of Finance: ఏ కంపెనీలను పీఎస్‌ఈలు కొనుగోలు నిషిద్ధం?

Ministry of Finance

ప్రైవేటీకరణకు వచ్చే ప్రభుత్వరంగ కంపెనీలను మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు చేయకుండా కేంద్ర ఆర్థిక శాఖ నిషేధాన్ని విధించింది. యాజమాన్య నియంత్రణ ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అయితే, సహజసిద్ధంగా ఉన్న అసమమర్థతలన్నవి కొనసాగొచ్చని.. ఇది నూతన ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌ఈ) విధానానికి విరుద్ధమని పేర్కొంది. గతంలో ఆర్‌ఈసీలో తన వాటాలను పీఎఫ్‌సీకి విక్రయించడం తెలిసిందే. అలాగే, హెచ్‌పీసీఎల్‌లో వాటాలను ఓఎన్‌జీసీకి కట్టబెట్టింది.

ఈవీఎస్‌ఈల టెస్టింగ్‌ ముసాయిదా విధానం విడుదల
దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీల మార్పిడి వ్యాపారాలకు సంబంధించి ముసాయిదా విధానాన్ని నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. స్వాపింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అవసరమయ్యే పత్రాల దాఖలు, ట్రేడ్‌ లైసెన్సుల మంజూరు మొదలైన వాటి కోసం సింగిల్‌ విండో పోర్టల్‌ ఏర్పాటు చేయాలని ఇందులో ప్రతిపాదించింది. అలాగే, స్వాపింగ్‌ స్టేషన్లలో ఉపయోగించే ఎలక్ట్రిక్‌ వాహన సరఫరా పరికరాల (ఈవీఎస్‌ఈ) టెస్టింగ్‌ పటిష్టంగా ఉండాలని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రైవేటీకరణకు వచ్చే ప్రభుత్వరంగ కంపెనీలను మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు చేయకుండా నిషేధం విధింపు
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎక్కడ    : కేంద్ర ఆర్థిక శాఖ
ఎందుకు : యాజమాన్య నియంత్రణ ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అయితే, సహజసిద్ధంగా ఉన్న అసమమర్థతలన్నవి కొనసాగొచ్చని..

ISRO: న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?

OneWeb

భారతీ గ్రూపు ప్రధాన వాటాదారుగా ఉన్న ‘వన్‌ వెబ్‌’ ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’తో ఒప్పందం చేసుకుంది. దీంతో వన్‌వెబ్‌ తన శాటిలైట్ల విడుదల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. శాటిలైట్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధికి, సురక్షితమైన అనుసంధానాన్ని కల్పన కోసం పనిచేస్తున్నట్టు ఏప్రిల్‌ 21న వన్‌వెబ్‌ ప్రకటించింది. తక్కువ కక్ష్యలో పరిభ్రమించే శాటిలైట్ల సాయంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే సంస్థే వన్‌వెబ్‌. ఈ కంపెనీలో భారతీ గ్రూపు పెద్ద వాటాదారుగా ఉండగా, బ్రిటన్‌ ప్రభుత్వానికి సైతం వాటాలున్నాయి.

కజకిస్థాన్‌లో రష్యా నిర్వహించే బైకోనర్‌ కాస్మోడ్రోన్‌ నుంచి శాటిలైట్ల ఆవిష్కరణను నిలిపివేస్తున్నట్టు వన్‌వెబ్‌ 2022, మార్చిలో ప్రకటించిన నేపథ్యంలో తాజా ఒప్పందం కుదరడం గమనార్హం. శాటిలైట్లు, టెక్నాలజీని సైనిక అవసరాలకు వినియోగించబోమంటూ హామీ ఇవ్వాలని రష్యా స్పేస్‌ ఏజెన్సీ రాస్‌కాస్మోస్‌ కోరడమే ఈ నిర్ణయం వెనుక కారణం. న్యూ స్పేస్‌ ఇండియాతో కలసి వన్‌వెబ్‌ మొదటి శాటిలైట్‌ లాంచ్‌ కార్యక్రమం 2022లోనే శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భారత్‌లో వన్‌వెబ్‌కు లైసెన్స్‌
భారత్‌ మార్కెట్లో శాటిలైట్‌ సేవలు అందించేందుకు వన్‌వెబ్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ సంపాదించింది. గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్‌ (జీఎంపీసీఎస్‌) లైసెన్స్‌ను వన్‌వెబ్‌కు టెలికం శాఖ మంజూరు చేసింది. 2022 మధ్య నుంచి భారత్‌ మా ర్కెట్లో సేవలు అందించాలన్న వన్‌వెబ్‌ లక్ష్యం తాజా లైసెన్స్‌ రాకతో సాకారం కానుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’తో ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21 
ఎవరు    : బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే సంస్థ ‘వన్‌వెబ్‌’ 
ఎందుకు : శాటిలైట్ల ఆవిష్కరణ విషయంలో తాజా ఒప్పందం, వన్‌వెబ్‌ నెట్‌ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని..

Andhra Pradesh: ఆదిత్య బిర్లా కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ఎక్కడ ప్రారంభించారు?

Aditya Birla Group’s chlor-alkali unit

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ.2,470 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నెలకొల్పిన క్లోర్‌ ఆల్కాలిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ (కాస్టిక్‌ సోడా యూనిట్‌) ప్లాంట్‌ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 21న స్విచ్‌ ఆన్‌ చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘మొత్తం మూడు విడతల్లో  పూర్తయ్యే గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,470 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నెలకొల్పిన క్లోర్‌ ఆల్కాలిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ (కాస్టిక్‌ సోడా యూనిట్‌) ప్లాంట్‌ ప్రారంభం
ఎప్పుడు  : ఏప్రిల్‌ 21
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : బలభద్రపురం, బిక్కవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 21 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Apr 2022 07:03PM

Photo Stories