Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 26th కరెంట్ అఫైర్స్
Azim Premji:అజీం ప్రేమ్‌జీకి యశ్వంత్‌రావ్ చవాన్ అవార్డు
విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ ప్రతిష్టాత్మక యశ్వంత్‌రావ్ చవాన్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తూ సమాజానికి విలువైన సేవలందించిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు.
చవాన్ రాష్ట్ర స్థాయి అవార్డును మరాఠీ సాహితీవేత్త మంగేష్ కార్నిక్‌కు ప్రకటించారు. ఒకప్పటి బాంబే రాష్ట్రానికి, మహారాష్ట్రకు మొట్టమొదటి సీఎంగా పనిచేసిన యశ్వంత్‌రావ్ చవాన్ వర్థంతిని పురస్కరించుకుని నవంబర్ 25న ఈ అవార్డులను ప్రకటించారు.
Amitabh Bachchan: అనుమతి లేకుండా 'అమితాబ్' పేరు వాడొద్దు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు, స్వరం, ఫొటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్‌లను ఎవరూ అనధికారికంగా వాడరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రముఖుడిగా తన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ ‘కేబీసీ లాటరీ’ నిర్వాహకుడు సహా పలువురు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ వేసిన పిటిషన్‌పై విచారణ మేరకు నవంబర్ 26న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పేరుప్రఖ్యాతులున్న బచ్చన్‌కు ఈ దశలో ఉపశమనం కల్పించకపోతే తీవ్ర నష్టాన్ని, చెడ్డపేరును చవిచూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు.
Indian Railways: 2025–26 నాటికి వందేభారత్ రైళ్ల ఎగుమతి!
దేశీయంగా రూపొందించిన అత్యాధునిక వందేభారత్ రైళ్లను 2025–26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు ఓ రైల్వే శాఖ సీనియర్ అధికారి నవంబర్ 25న తెలిపారు. ‘‘స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లు 2024 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయి. వచ్చే మూడేళ్లలో 475 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వివరించారు.
ISRO PSLV-C54 Mission : పీఎస్‌ఎల్వీ సీ54 ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.
ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు..
ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్‌ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం.
First Indian Private Rocket : ఇస్రో చరిత్రలో తొలిసారిగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్.. మిషన్ సక్సెస్..
ఎన్నో ఏళ్ల కృషికి..
పీఎస్‌ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూవాతవరణంపై పీఎస్‌ఎల్వీ సీ54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
Swachh Survekshan: తెలంగాణకు మరో 7 ‘స్వచ్ఛ’ అవార్డులు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఏడు పట్టణాలకు చోటు దక్కింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో 16 అవార్డులు రాగా, ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్‌ఎల్) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది. తాజాగా కాగజ్‌నగర్, జనగామ, ఆమన్‌గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్ వరంగల్ పురపాలికలకు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్ (వేగంగా ఎదుగుతున్న నగరాలు) కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో తెలంగాణ మొత్తం 26 అవార్డులను సాధించినట్లయింది.
4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే..
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుధ్యం, మున్సిపల్ ఘన..ద్రవ వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశ వ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ఉమ్మి రహిత వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు.. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, ద్రవ..వ్యర్ధాల నిర్వహణ, ప్రజల అవగాహన, సిటిజెన్స్ ఎంగేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్ తదితర అంశాలు పరిశీలించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచి్చన పట్టణాలకు ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించారు.
Inspiring Success Story : ఒకే జిల్లా. ఒకే బ్యాచ్.. ఎస్సై జాబులు కొట్టారిలా.. సొంత ఊరు కోసం..
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ ఎస్టేట్ అధికారిగా సునీశ్
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ అధికారిగా ఎస్.సునీశ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదలచేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. దీంతో పాటు ఈ అధికారి ఢిల్లీలోని రాష్ట్రపతి ఎస్టేట్, సిమ్లాలోని రాష్ట్రపతి భవన్ కార్యాలయాల బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.
Youth World Boxing Championships: యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథ్‌కు స్వర్ణం
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. నవంబర్ 25న జరిగిన పురుషుల 48 కేజీల విభాగంలో విశ్వనాథ్ సురేశ్ విజేతగా నిలిచాడు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్లో తమిళనాడుకు చెందిన విశ్వనాథ్ 4–1తో సుయోమ్ రోనెల్ (ఫిలిప్పీన్స్)పై గెలిచాడు. మరోవైపు మహిళల 48 కేజీల విభాగంలో భావన శర్మ రజత పతకం సాధించింది. ఫైనల్లో భావన 0–5తో జనియెవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది.
చదవండి: లోక్‌సభ స్పీకర్ల సమాచారం
Jaya Prada : నటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది అవార్డు
సీనియర్ నటి జయప్రదకు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారానికి ఎంపికైంది. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల సందర్భంగా అవార్డ్ అందకోనున్నారు.
నవంబర్ 27వ తేదీన ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ప్రముఖ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత అవార్డును ప్రఖ్యాత సినీ నటి జయప్రద అందుకోనున్నారు.ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆమెకు పురస్కారాన్ని అందించబోతున్నారు.
Garuda Shakti 2022: భారత్-ఇండోనేషియా సంయుక్త సైనిక విన్యాసాలు
భారత-ఇండోనేషియా ప్రత్యేక సైనిక దళాలు ఇండోనేషియాలోని కరవాంగ్‌లోని సంగ్గ బువాన శిక్షణ కేంద్రంలో జరిగే శిక్షణ విన్యాసాల కార్యక్రమం 'గరుడ శక్తి'లో పాల్గొన్నాయి. 'గరుడ శక్తి' పేరిట జరుగుతున్న ఉమ్మడి శిక్షణ విన్యాసాల పరంపరలో ఇది ఎనిమిదవది.
రెండు సైన్యాల ప్రత్యేక బలగాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో 2022 నవంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక దళాల నైపుణ్యాలను పెంచడం, ఆయుధాలు, పరికరాలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, విధానాలు, వివిధ ఆపరేషన్ల నుంచి నేర్చుకున్న పాఠాల సమాచారాన్ని పంచుకోవడం, అడవుల్లో ప్రత్యేక దళ ఆపరేషన్లు, ఉగ్రవాద శిబిరాలపై దాడులు, రెండు దేశాల జీవనశైలి, సంస్కృతి గురించి అవగాహన పెంచడం ఈ సంయుక్త శిక్షణ విన్యాసాల్లో భాగం. ఈ శిక్షణ కార్యక్రమం 13 రోజుల పాటు సాగుతుంది.
ఇరు సైన్యాలు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడానికి, ఉగ్రవాద కార్యకలాపాల మీద ఎదురుదాడులు, అంతర్జాతీయ వాతావరణంలో ప్రాంతీయ భద్రత కార్యకలాపాలు & శాంతి పరిరక్షణలో తమ విస్తృత అనుభవాలను పంచుకోవడానికి ఈ ఉమ్మడి విన్యాసాలు రెండు సైన్యాలకు వీలు కల్పిస్తుంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను, ప్రాంతీయ భద్రతను పెంచడంలో ఈ కార్యక్రమంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
Demonetization: నోట్ల రద్దు నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దు..
సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని నవంబర్ 25న కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది.
‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలబించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు. మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.
➤ నాన్న నిర్లక్ష్యం.. అన్న త్యాగం.. ఇవే నన్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్.. కానీ
నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు. ‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్‌బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు.
జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్‌దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్‌బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు. కానీ ఆర్‌బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్‌బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్‌బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు.
Top-5 Football Legends : అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన.. టాప్–5 స్టార్స్ వీరే..!