Skip to main content

కరోనా వైర‌స్‌ పుట్టుకపై సమగ్ర విచారణ

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్‌ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది.
Current Affairs

చైనాలోని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ఈ వైరస్‌ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 18న ప్రకటించారు.


వూహాన్‌ మార్కెట్‌లో ఆ గబ్బిలాలు లేవా ?

కరోనా వైరస్‌ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్‌ వెట్‌ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్‌ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్‌ సోకిన మొట్టమొదటి పేషెంట్‌ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది.

ల్యాబ్‌లో భద్రత కరువు?

వూహాన్‌లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్‌ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది.

ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు?

వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్‌. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్‌ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్‌ మార్కెట్‌ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్‌ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కరోనా వైర‌స్‌ పుట్టుకపై సమగ్ర విచారణ
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : అమెరికా
ఎందుకు : అమెరికా మీడియా కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి
Published date : 20 Apr 2020 06:46PM

Photo Stories