INS Kirpan: వియత్నాంకు ఐఎన్‌ఎస్ కిర్పాన్
చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్‌దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది.
☛ Daily Current Affairs in Telugu: 1 జులై 2023 కరెంట్ అఫైర్స్
ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఐఎన్‌ఎస్‌కిర్పాన్ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలను ఇచ్చింది. మయన్మార్‌కు ఒక జలాంతర్గామిని ఇచ్చింది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది.
ఐఎన్‌ఎస్ కృపాణ్ ప్రత్యేకతలివే:
► ఐఎన్‌ఎస్ కిర్పాన్ ఖుక్రీ క్లాస్‌కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది.
► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది.
► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు.
► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు.
► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది.
☛ Daily Current Affairs in Telugu: 30 జూన్ 2023 కరెంట్ అఫైర్స్